అక్బర్ పాదుషా ఆస్థానంలో చేరిన అనతి కాలంలోనే బీర్బల్ ఆయనకు తలలో నాలుకలా మారాడు. బీర్బల్ చమత్కారాలను అక్బర్ పాదుషా అమితంగా ఇష్టపడేవాడు. తన తెలివితేటలతో బీర్బల్ ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి, మొఘల్ సామ్రాజ్యంలోనే అమిత మేధావిగా గుర్తింపు పొందాడు.బీర్బల్ తెలివి తేటలను అక్బర్ పాదుషా గుర్తించి, అతడిని తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. మిగిలిన మంత్రులు చెప్పే మాటల కంటే బీర్బల్ మాటకు అక్బర్ పాదుషావారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇదంతా ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ఇతర ఉన్నత రాజోద్యోగులకు కంటగింపుగా ఉండేది. అదను చూసి బీర్బల్‌ను దెబ్బతీయడానికి ఎప్పటికప్పుడు విఫలయత్నాలు చేస్తుండేవారు.
అసూయపరుల ప్రయత్నాలు ఎలా ఉన్నా, బీర్బల్ పేరు ప్రతిష్ఠలు మాత్రం అంతకంతకు పెరగసాగాయి. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, బీర్బల్ ప్రఖ్యాతి పొరుగు దేశాలకూ పాకింది. బీర్బల్ ప్రఖ్యాతి ఆ నోటా ఈ నోటా పర్షియా రాజు వరకు చేరింది. బీర్బల్ తెలివితేటలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన బీర్బల్‌కు తమ దేశానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం పంపాడు. అక్బర్ పాదుషా అనుమతితో బీర్బల్ పర్షియాకు ప్రయాణమయ్యాడు. పర్షియా రాజ్యంలో అడుగుపెడుతూనే బీర్బల్‌కు ఘనస్వాగతం లభించింది. పర్షియా రాజు బీర్బల్‌కు ఘనంగా అతిథి మర్యాదలు చేశాడు. అడుగడుగునా చక్కని విడిది వసతులు, రుచికరమైన విందులు ఏర్పాటు చేశాడు.
పర్షియా రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలుకొని, పర్షియా రాజభటులు, ఉద్యోగులు బీర్బల్‌ను అంటిపెట్టుకుని ఉంటూ ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. దగ్గర ఉండి మరీ వారు బీర్బల్‌ను రాజధానికి తీసుకువచ్చారు. రాజధానికి చేరుకున్న రోజు బీర్బల్ విశ్రాంతికి విలాసవంతమైన అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. మరునాడు బీర్బల్ రాజోద్యోగులు వెంటరాగా పర్షియా రాజు దర్బార్‌లోకి అడుగుపెట్టాడు. బీర్బల్‌ను పర్షియా రాజు తన పక్కనే ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని, కుశల ప్రశ్నలు వేశాడు.‘బీర్బల్‌గారు! మీ వంటి మేధావి మా మిత్రుడైన అక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉండటం మాకూ గర్వకారణమే! మీకు నచ్చినన్ని రోజులు మా రాజ్యంలో అతిథిగా ఉండండి. రాజ్యం నలుమూలలా మీకు నచ్చినట్లు సంచారం చేయవచ్చు.
అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను. మా రాజ్యంలోని పరిస్థితులను గమనించి, మెరుగు పరచుకోవలసిన అంశాలేమైనా ఉంటే సలహాలు ఇవ్వండి’ అని అన్నాడు.పర్షియా రాజ్యంలో కొన్నాళ్లు గడిపాక, బీర్బల్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన రాజ్యానికి తిరిగి బయలుదేరాలనుకుంటున్నానని పర్షియా రాజుకు తెలియజేశాడు. బీర్బల్ తిరుగు ప్రయాణానికి ముందురోజు అతడి గౌరవార్థం పర్షియా రాజు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ దర్బారులోని మంత్రులు, సేనానాయకులు, ఉన్నతోద్యోగులు, రాజ్యంలోని కులీనులు, పెద్ద పెద్ద వర్తకులు ఆ విందులో పాల్గొన్నారు.
విందులో కబుర్లాడుకుంటుండగా, పర్షియా మంత్రుల్లో ఒకరు వచ్చి బీర్బల్‌తో మాటలు కలిపాడు. ‘బీర్బల్ మహాశయా! మా రాజుగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.‘మీ రాజావారికేం? ఆయన పున్నమి చంద్రుడు’ అని బదులిచ్చాడు బీర్బల్.‘మరి మీ రాజావారి గురించి ఏమంటారు?’ అడిగాడా మంత్రి.‘మా రాజావారు చవితి చంద్రుడు’ అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషాను చవితి చంద్రుడితోను, తనను పున్నమి చంద్రుడితోను పోలుస్తూ బీర్బల్ అన్న మాటలకు పర్షియా రాజు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సాగనంపేటప్పుడు బీర్బల్‌కు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. అక్బర్ పాదుషాకు అందజేయమంటూ మరిన్ని కానుకలనిచ్చాడు. వాటిని మోసుకుపోవడానికి గుర్రబ్బగ్గీలను, సేవకులను ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.బీర్బల్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్బర్ పాదుషా దర్బారులోకి అడుగుపెట్టాడు. అక్బర్ పాదుషా చిర్రుబుర్రులాడుతూ కనిపించాడు. బీర్బల్‌కు ఏమీ అర్థంకాలేదు.
పర్షియా రాజు వద్ద బీర్బల్ అన్న మాటలు వేగుల ద్వారా అప్పటికే అక్బర్ పాదుషా చెవికి చేరాయి.అక్బర్ పాదుషా ఇక ఉక్రోషాన్ని అణచుకోలేక నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘మా గురించి ఏమనుకుంటున్నావు బీర్బల్? పొరుగు రాజు వద్ద పరువు తీస్తావా?’ అన్నాడు కోపంగా.‘పొరుగు రాజు వద్ద నేను మిమ్మల్ని పొగిడాను జహాపనా!’ అన్నాడు బీర్బల్.‘చాలు, చాలు! ఇక బొంకకు. అక్కడ నువ్వన్న మాటలన్నీ నాకు తెలుసు. పర్షియా రాజు పున్నమి చంద్రుడా? నేను చవితి చంద్రుణ్ణా? ఇదేనా నన్ను పొగడటం?’ మరింత కోపంగా అన్నాడు అక్బర్ పాదుషా.‘జహాపనా! నిజమే, ఆయన పున్నమి చంద్రుడు. పున్నమి తర్వాత చంద్రుడు క్షీణించడం ప్రారంభిస్తాడు. తమరు చవితి చంద్రుడు. భవిష్యత్తులో తమరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. అందుకే అలా పొగిడాను. నా అదృష్టం బాగులేదు కనుక నన్ను తమరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు బీర్బల్.బీర్బల్ వివరణతో అక్బర్ సంతోషించాడు. తన మెడలోని హారాన్ని బహూకరించి సత్కరించాడు.
Comments
Please login to add a commentAdd a comment