ముక్కామల అనే గ్రామంలో మల్లయ్య, పుల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. పుల్లయ్య పిసినారి వాడు. ఉచితంగా వస్తుందంటే ఉరుక్కుంటూ వెళ్లి తెచ్చుకునే రకం. కానీ పుల్లయ్య భార్య ఎల్లమ్మ ఇంటి ముందుకు వచ్చిన భిక్షకులకు.. ఉన్నంతలో ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది. అది చూసిన పుల్లయ్య ఎప్పడూ భార్యతో గొడవకు దిగేవాడు. నేను రేయనక, పగలనక కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో దానధర్మాలు చేస్తూ ఇంటిని సత్రంగా మారుస్తున్నావు’ అంటూ! ‘ఎందుకండీ.. ఇలా మాట్లాడుతారు. దానధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చేసిన ధర్మాలే మనల్ని కాపాడుతాయి’ అని బదులిచ్చేది ఎల్లమ్మ. ఒకసారి అలా ఎల్లమ్మ జవాబు విని, ‘ఎంత చెప్పినా అంతే! దాని మంకు దానిదే.. నా మాట ఎప్పుడు విన్నది గనుక’ అని విసుక్కుంటూ దొడ్లో ఉన్న పశువులను తీసుకుని చేనుకు వెళ్లాడు పుల్లయ్య.. వాటిని మేపడానికి.
అక్కడే ఉన్న మల్లయ్య ‘ఏరా పుల్లయ్యా.. ఇంత పొద్దు పోయింది?’ అని అడిగాడు. ‘ఏముందిరా.. ఊళ్లో వాళ్లందరికీ నా ఇల్లే కనిపిస్తుంది. నా ఇల్లొక సత్రం అయింది. ఎంత చెప్పినా ఎల్లి వినిపించుకోదు. నేనేమో కష్టపడి పైసా పైసా పోగు చేస్తుంటే.. అదేమో దాన ధర్మాలకు ధారపోస్తోంది’ అని ఇంట్లో జరిగిన సంగతి అంతా చెప్పాడు పుల్లయ్య.‘సరే గానీ, ఎండాకాలం వస్తోంది. పక్కనే ఉన్న చెరుకుపల్లి అంగడిలో నాణ్యమైన కుండలు దొరుకుతున్నాయి అని విన్నాను. నేను రేపు వెళ్తున్నాను. నువ్వు కూడా రా.. వెళ్లి కుండలు తెచ్చుకుందాం’ అన్నాడు మల్లయ్య. ‘ఇప్పుడు కుండలకు ధరలు బాగా పెరిగాయి. పొలంలో, ఇంట్లో ఉన్న సిమెంటు గాబుల్లో నీళ్లు చల్లగానే ఉంటున్నాయి కదా? కుండలు అవసరమా! డబ్బులు దండగ కాకపోతే’ అని బదులిచ్చాడు పుల్లయ్య.
‘సరే రా.. నీ ఇష్టం! నేనైతే రేపు పొద్దున బయలుదేరుతాను’ అన్నాడు మల్లయ్య. ఇంటికి వెళ్లాక పుల్లయ్య భార్య కూడా కుండ తెమ్మని పోరు బెట్టడంతో మరుసటి రోజే మల్లయ్యతో కలిసి కుండలు కొనడానికి అంగడికి బయలుదేరాడు పుల్లయ్య.
ఇద్దరూ అంగడిలో రకరకాల కుండలను చూశారు. మల్లయ్య ఒక కుండను కొన్నాడు. పుల్లయ్య మాత్రం ‘అమ్మో! ఈ కుండకు ఇంత ధరా! ఇంకా ముందుకు వెళ్తే తక్కువకు దొరుకుతాయి’ అన్నాడు మల్లయ్యతో. ‘నాకు ఓపిక లేదు. నువ్వు వెళ్లు. నేను ఇక్కడే కూర్చుంటాను’ అంటూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు మల్లయ్య.
పుల్లయ్య ఇంకాస్త ముందుకు వెళ్లాడు. అక్కడ కుండల వ్యాపారితో బేరం చేశాడు. బేరం కుదరలేదు. సంతలోనే ఉన్న ఒక వ్యక్తి ‘ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్లండి. అక్కడ తక్కువకు దొరుకుతాయి’ అని చెప్పాడు. వెంటనే ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడ కుండలయ్యతో బేరం సాగించాడు. ‘లేదండీ .. ఆ ధరకు మాకే రాలేదు’ అని అన్నాడు కుండలయ్య. అయినా సరే, పట్టువిడవకుండా అతనితో బేరం చేయసాగాడు. పుల్లయ్య పోరుబట్టలేక తక్కువ ధరకే కుండను ఇచ్చేశాడు ఆ వ్యాపారి. సంతోషంగా కుండను నెత్తిన పెట్టుకొని నడక సాగించాడు పుల్లయ్య. అప్పటికే ఎండ నెత్తిమీదకి ఎక్కడంతో కళ్లు తిరిగి, స్పృహ తప్పి పడిపోయాడు పుల్లయ్య. అందరూ గుమిగూడారు.
చెట్టు కింద కూర్చున్న మల్లయ్య వెళ్లి చూడగా.. పుల్లయ్య కిందపడి ఉన్నాడు. వెంటనే ముఖంపై నీళ్లు చల్లి, మజ్జిగ తాగించాడు. స్పృహలోకొచ్చాడు పుల్లయ్య. కుండ పుటుక్కుమనడం చూసి, భోరున విలపించాడు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే, భార్య తిడుతుందేమోనని భయపడి పక్కనే ఉన్న కుండల వ్యాపారి వద్ద చెప్పిన ధరకే మరో కుండను కొన్నాడు. ‘మల్లయ్య మాట వినుంటే బాగుండేది. అనవసరంగా రెండు కుండలు కొనాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు’ అనుకుంటూ నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. విషయం తెలుసుకున్న పుల్లయ్య భార్య పొరకతో తరిమింది.
Comments
Please login to add a commentAdd a comment