Telugu stories
-
పిసినారి పుల్లయ్య
ముక్కామల అనే గ్రామంలో మల్లయ్య, పుల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. పుల్లయ్య పిసినారి వాడు. ఉచితంగా వస్తుందంటే ఉరుక్కుంటూ వెళ్లి తెచ్చుకునే రకం. కానీ పుల్లయ్య భార్య ఎల్లమ్మ ఇంటి ముందుకు వచ్చిన భిక్షకులకు.. ఉన్నంతలో ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది. అది చూసిన పుల్లయ్య ఎప్పడూ భార్యతో గొడవకు దిగేవాడు. నేను రేయనక, పగలనక కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో దానధర్మాలు చేస్తూ ఇంటిని సత్రంగా మారుస్తున్నావు’ అంటూ! ‘ఎందుకండీ.. ఇలా మాట్లాడుతారు. దానధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చేసిన ధర్మాలే మనల్ని కాపాడుతాయి’ అని బదులిచ్చేది ఎల్లమ్మ. ఒకసారి అలా ఎల్లమ్మ జవాబు విని, ‘ఎంత చెప్పినా అంతే! దాని మంకు దానిదే.. నా మాట ఎప్పుడు విన్నది గనుక’ అని విసుక్కుంటూ దొడ్లో ఉన్న పశువులను తీసుకుని చేనుకు వెళ్లాడు పుల్లయ్య.. వాటిని మేపడానికి. అక్కడే ఉన్న మల్లయ్య ‘ఏరా పుల్లయ్యా.. ఇంత పొద్దు పోయింది?’ అని అడిగాడు. ‘ఏముందిరా.. ఊళ్లో వాళ్లందరికీ నా ఇల్లే కనిపిస్తుంది. నా ఇల్లొక సత్రం అయింది. ఎంత చెప్పినా ఎల్లి వినిపించుకోదు. నేనేమో కష్టపడి పైసా పైసా పోగు చేస్తుంటే.. అదేమో దాన ధర్మాలకు ధారపోస్తోంది’ అని ఇంట్లో జరిగిన సంగతి అంతా చెప్పాడు పుల్లయ్య.‘సరే గానీ, ఎండాకాలం వస్తోంది. పక్కనే ఉన్న చెరుకుపల్లి అంగడిలో నాణ్యమైన కుండలు దొరుకుతున్నాయి అని విన్నాను. నేను రేపు వెళ్తున్నాను. నువ్వు కూడా రా.. వెళ్లి కుండలు తెచ్చుకుందాం’ అన్నాడు మల్లయ్య. ‘ఇప్పుడు కుండలకు ధరలు బాగా పెరిగాయి. పొలంలో, ఇంట్లో ఉన్న సిమెంటు గాబుల్లో నీళ్లు చల్లగానే ఉంటున్నాయి కదా? కుండలు అవసరమా! డబ్బులు దండగ కాకపోతే’ అని బదులిచ్చాడు పుల్లయ్య. ‘సరే రా.. నీ ఇష్టం! నేనైతే రేపు పొద్దున బయలుదేరుతాను’ అన్నాడు మల్లయ్య. ఇంటికి వెళ్లాక పుల్లయ్య భార్య కూడా కుండ తెమ్మని పోరు బెట్టడంతో మరుసటి రోజే మల్లయ్యతో కలిసి కుండలు కొనడానికి అంగడికి బయలుదేరాడు పుల్లయ్య. ఇద్దరూ అంగడిలో రకరకాల కుండలను చూశారు. మల్లయ్య ఒక కుండను కొన్నాడు. పుల్లయ్య మాత్రం ‘అమ్మో! ఈ కుండకు ఇంత ధరా! ఇంకా ముందుకు వెళ్తే తక్కువకు దొరుకుతాయి’ అన్నాడు మల్లయ్యతో. ‘నాకు ఓపిక లేదు. నువ్వు వెళ్లు. నేను ఇక్కడే కూర్చుంటాను’ అంటూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు మల్లయ్య. పుల్లయ్య ఇంకాస్త ముందుకు వెళ్లాడు. అక్కడ కుండల వ్యాపారితో బేరం చేశాడు. బేరం కుదరలేదు. సంతలోనే ఉన్న ఒక వ్యక్తి ‘ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్లండి. అక్కడ తక్కువకు దొరుకుతాయి’ అని చెప్పాడు. వెంటనే ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడ కుండలయ్యతో బేరం సాగించాడు. ‘లేదండీ .. ఆ ధరకు మాకే రాలేదు’ అని అన్నాడు కుండలయ్య. అయినా సరే, పట్టువిడవకుండా అతనితో బేరం చేయసాగాడు. పుల్లయ్య పోరుబట్టలేక తక్కువ ధరకే కుండను ఇచ్చేశాడు ఆ వ్యాపారి. సంతోషంగా కుండను నెత్తిన పెట్టుకొని నడక సాగించాడు పుల్లయ్య. అప్పటికే ఎండ నెత్తిమీదకి ఎక్కడంతో కళ్లు తిరిగి, స్పృహ తప్పి పడిపోయాడు పుల్లయ్య. అందరూ గుమిగూడారు. చెట్టు కింద కూర్చున్న మల్లయ్య వెళ్లి చూడగా.. పుల్లయ్య కిందపడి ఉన్నాడు. వెంటనే ముఖంపై నీళ్లు చల్లి, మజ్జిగ తాగించాడు. స్పృహలోకొచ్చాడు పుల్లయ్య. కుండ పుటుక్కుమనడం చూసి, భోరున విలపించాడు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే, భార్య తిడుతుందేమోనని భయపడి పక్కనే ఉన్న కుండల వ్యాపారి వద్ద చెప్పిన ధరకే మరో కుండను కొన్నాడు. ‘మల్లయ్య మాట వినుంటే బాగుండేది. అనవసరంగా రెండు కుండలు కొనాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు’ అనుకుంటూ నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. విషయం తెలుసుకున్న పుల్లయ్య భార్య పొరకతో తరిమింది. -
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్‌లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
రాజుగారి మూడు ప్రశ్నలు
పూర్వకాలంలో విజయపురి అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు మంచివాడే కానీ అహంకారం మెండు. సభలో ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వాడు. రాజుగారి ధోరణి మంత్రి కట్టప్పకి నచ్చేది కాదు. ఎలాగైనా రాజులోని ఆ చెడు లక్షణాన్ని దూరం చేయాలనుకున్నాడు మంత్రి. ఒకరోజు ఆస్థానంలో సభ జరుగుతుండగా మళ్ళీ రాజుగారు సొంత డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే మంత్రి ‘మహా ప్రభూ..! మీ తెలివితేటల గురించి సభలోని వాళ్లందరికీ బాగా తెలుసు. కానీ మన రాజ్యం పొలిమేరలో ఉన్న అవంతిపురంలో అందరూ తెలివైన వారేనని ఒక ప్రచారం ఉంది. వారి ముందు మీ తెలివితేటలను ప్రదర్శిస్తే మీ ప్రతిభ పొరుగు రాజ్యాలకు కూడా విస్తరిస్తుంది’ అని సూచించాడు. సరేనంటూ మరునాడే మారువేషంలో మంత్రిని వెంటబెట్టుకొని అవంతిపురం బయల్దేరాడు రాజు. ఆ ఊరు చేరగానే ఒక పశువులకాపరి కనిపించాడు. తన తెలివితో ముందుగా అతడిని ఓడించాలని అనుకున్నాడు రాజు. వెంటనే అతని దగ్గరికి వెళ్లి ‘నేను మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెబుతావా?’ అన్నాడు. వెంటనే ఆ పశువుల కాపరి సరే అన్నట్టు తలూపాడు. మొదటి ప్రశ్నగా ‘సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది ఏది?’ అని అడిగాడు. ‘గాలి’ అంటూ సమాధానం వచ్చింది. ‘పవిత్రమైన జలము ఏది?’ అని ప్రశ్నించాడు. ‘గంగా జలం’ అని టక్కున సమాధానం చెప్పాడు. ముచ్చటగా మూడో ప్రశ్న... ‘అన్నింటికన్నా ఉత్తమమైన పాన్పు ఏది?’ అనగానే ‘మంచి చందనంతో చేసిన పాన్పు’ అని పశువులకాపరి జవాబిచ్చాడు. ‘బాగా చెప్పావు.. సరిగ్గా నా మదిలో కూడా అవే జవాబులు ఉన్నాయి’ అన్నాడు రాజు. అప్పుడు ఆ పశువుల కాపరి విరగబడి నవ్వడంతో రాజుకు కోపం వచ్చింది. రాజు పట్టరాని కోపంతో ‘ఎందుకు ఆ నవ్వు?’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘నేను చెప్పిన తప్పుడు సమాధానాలన్నీ మీరు ఒప్పు అని అంటుంటే మరి నవ్వక ఏం చేయాలి?’ అని మొహం మీదే అనేశాడు పశువులకాపరి. అయితే సరైన సమాధానం ఏమిటో చెప్పమని గర్జించాడు విక్రమసింహుడు. ‘సృష్టిలో అన్నింటికన్నా వేగమైంది మనసు, విలువైన జలం ఎడారిలో దొరికే జలం, ఉత్తమమైన పాన్పు అమ్మ ఒడి’ అని పశువులకాపరి బదులిచ్చాడు. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడుతూ ఊళ్లోకి వెళ్లకుండానే వెనుదిరిగాడు రాజు. అప్పటి నుంచి తన అహంకారాన్ని వదిలి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండసాగాడు. -
పిల్లల కథ: జానకమ్మ తెలివి
రామాపురం అనే గ్రామంలో రామదాసు అనే పిసినారి ఉండేవాడు. అతనికి ఒక పాత పెంకుటిల్లు ఉండేది. ఆ గ్రామంలో అతను మిక్కిలి ధనవంతుడైనా పిసినారితనంతో ఇల్లు కట్టలేదు. అతని భార్య జానకమ్మ ఉత్తమ ఇల్లాలు. ఆ గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా దొంగ మాత్రం దొరకలేదు. రామదాసుకు అత్యవసరంగా దూరంగా ఉన్న పట్టణానికి పోవలసి వచ్చింది. అతడు తన భార్యతో ‘మన ఇంటికి దొంగరాడు. మన ఇల్లే పాడుబడిన కొంప. దీన్ని చూసిన ఏ దొంగ కూడా మన ఇంట్లో దొంగతనం చేయడానికి ముందుకు రాడు. అయినా నీ జాగ్రత్తలో నీవు ఉండు’ అని చెప్పి పట్టణానికి వెళ్ళాడు. అతని ఊహకు భిన్నంగా మరునాడే ఆ దొంగ రామదాసు ఇంటిలోనికి ప్రవేశించాడు. జానకమ్మ చాలా ధైర్యం గలది.. ఉపాయశాలి కూడా. అందువల్ల ఆమె ఆ దొంగకు వణికి భయపడినట్లు నటిస్తూ ‘బాబ్బాబూ! నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళు. అంతే కానీ నన్ను మాత్రం ఏమీ చేయకు. నీకు పుణ్యం ఉంటుంది’ అని బతిమిలాడింది. దొంగ ఏమీ మాట్లాడకుండా చీరలు, నగలు సర్దుకోసాగాడు. అప్పుడు జానకమ్మ ‘దొంగన్నా! మా వారు చాలా పిసినారి. నీవు ఈ ఊర్లో ఎవరినైనా అడిగి ఆయన గురించి తెలుసుకో! ఆయన నాకు చేయించి ఇచ్చినవి ఈ రెండే రెండు బంగారు చిన్ని నగలు, ఈ కొద్ది చీరలు. అవి కూడా నీవు తీసుకొని వెళ్లితే ఆయన నాకు మళ్ళీ నగలు చేయించడు. చీరలను కొనివ్వడు. నీ సోదరిగా భావించి ఈ నగలు, చీరలను వదిలిపెట్టు’ అని అంది. అప్పుడు దొంగ ‘అలాగా! అవి వదలిపెడతాను సరే! కానీ మీ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో చెప్పు’ అని గద్దించాడు. ‘మేము చాలా పేదవారం నాయనా! మా పేదరికం గురించి మా ఇల్లే నీకు చెబుతుంది. నీవు అడిగావు కనుక చెబుతున్నాను. మావారి బీరువాలో కొంత నగదు ఉంది. నీవు తీసుకొని వెళ్ళు’ అని అంది. ఆ మాటలకు దొంగ సంతోషించి ఆ నగదును తీసుకొని ఆ నగలు, చీరలు అక్కడే వదిలిపెట్టి పరుగుతీశాడు. ఆ తర్వాత ఇరుగు పొరుగువారు వచ్చి రామదాసు ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకొని అతడు ఊళ్లో లేనందుకు విచారం వ్యక్తం చేశారు. మరునాడు పట్టణం నుండి వచ్చిన రామదాసు భార్యతో ‘మన ఇంట్లో దొంగలు పడ్డారని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా! నేను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా!’ అన్నాడు. జానకమ్మ ఏమీ మాట్లాడలేదు. రామదాసు కంగారుగా ‘ఏం మాట్లాడవ్? ఏమేమి పోయాయో చెప్పు’ అంటూ గొంతు పెంచాడు. ‘నా నగలు, చీరలు పోలేదండి. నా మాటలకు కరిగిపోయిన దొంగ వాటిని ఇక్కడే వదిలి పెట్టి వెళ్ళాడు’ అని అంది జానకమ్మ సంతోషంతో. రామదాసు వెంటనే ‘నీ చీరలు, నగలు కూడా నా బీరువాలోనే ఉన్నాయి కదా! అందులోని నా నగదు పోయిందా ఏమిటి? నా ఖర్మ!’ అంటూ కంగారు పడ్డాడు రామదాసు. అప్పుడు ఆమె ‘పోయిందండి’ అంది విచారంగా. ‘అయ్యో! పది లక్షల నగదు.. ఎంత పనైపోయింది! వాటిని కాపాడితే నీకు రెండు బంగారు గొలుసులు చేయిద్దామనుకున్నాను. కానీ నీవు చాలా దురదృష్టవంతురాలివి. నీకు ఆ యోగం లేదు’ అంటూ బాధపడ్డాడు. అప్పుడు ఆమె‘ మీరేనా ఈ మాటలంటున్నది. అలాగైతే నాకు నగలు, చీరలు మీరు బాకీ ఉన్నట్లే’ అని అంది. ‘తమాషా చెయ్యకు. నగదు సంచీ పోయి నేను ఏడుస్తుంటే’ అన్నాడు రామదాసు. ‘అవునండీ.. మీ సంచి దొంగ ఎత్తుకొని పోయాడు’ అంది జానకమ్మ. ‘నా సంచీ ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నగదు ఎక్కడ ఉంటుంది? నీ చీరలు, నగల కోసం నాకు అబద్ధం చెబుతావా’ అంటూ కసురుకున్నాడు. ‘అబద్ధాలు చెప్పడం లేదండీ! మీ సంచీని ఆ దొంగనే ఎత్తుకుపోయాడు. అందులో అన్నీ పదిరూపాయల నోట్లే ఉన్నాయి.అంతా కలిసి ఒక వెయ్యి రూపాయల కన్నా మించవు. ముందుగానే జాగ్రత్తగా మీ సంచీలో నుండి యాభై, వంద, ఐదు వందలు, రెండువేల నోట్లను తీసి నా సంచీలో పెట్టి నా దిండు కింద దాచిపెట్టానండీ. ఒకవేళ మనింటికి ఆ దొంగోడు వచ్చినా కేవలం పది రూపాయల నోట్లు మాత్రమే ఎత్తుకొని పోతాడు అని. నా ఊహే నిజమైంది. మీ లక్షల నగదు భద్రంగా ఉంది. వాడికి మీ సంచీని చూపించాను. పిచ్చివాడు.. ఆ పది రూపాయల నోట్లే గొప్ప నగదు అనుకొని, నా చీరలు, నగలు వదిలేసి వెళ్లాడు’ అని చెప్పింది. ఆపద సమయంలో భార్య ప్రదర్శించిన ధైర్యం, తెలివికి అబ్బురపడ్డాడు రామదాసు. అప్పటి నుండి తన పిసినారి తనాన్ని వీడి.. భార్య చెప్పినట్టు వింటూ పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాడు. -
పట్టువదలని విక్రమార్కుడు.. రుజువుకాని నేరం
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘రాజా.. నువు ఏ నీతి, నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదుగాని, ఈ లోకంలో నీతి జయిస్తుందనీ, అవినీతికి శిక్ష ఉంటుందనీ చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను శ్రమతెలియకుండా విను’అంటూ ఇలా చెప్పసాగాడు.. చాలాకాలం కిందట హరిప్రసాద్ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు. జమీందారీ వ్యవహారాలన్నిటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతను మంచివాడూ, జమీందారుకు విశ్వాసపాత్రుడూనూ. అతని ప్రతి సలహానూ జమీందారు మారుమాటాడకుండా స్వీకరించేవాడు. గ్రామాలలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్లు పెరిగాయి. వాటితోబాటు నమస్కారాలు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఒకేరకం సహాయం ఇద్దరు, ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్లలో పోటీలు ఏర్పడసాగాయి. నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్లబుట్టలు పట్టుకురాసాగారు. గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్లబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్లబుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడచివస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడిపూజారి ఉద్యోగమే గానీ బడిపంతులు ఉద్యోగమేగానీ డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది. రానురాను గిరిధరుడి భార్య మెడనిండా మోయలేనంత బంగారమూ, ఇంటి నిండా అంతులేని వస్తుసామాగ్రీ ఏర్పడ్డాయి. దీని ఫలితంగా హరిప్రసాదు జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలుగల బీదవారికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు. వారాలు చేసి చదువుకుని ఎంతో తెలివితేటలు గలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు. కాని ఒక్క పళ్లబుట్ట అయినా ఇయ్యలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు. తన నమస్కారబాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి, శేషగిరికి ఒళ్లు మండుకొచ్చింది. అతను జమీందారు వద్దకు వెళ్లి ‘మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు. లంచం పెట్టితే చాలు ఎలాటి పనికిమాలిన వాడికైనా పని దొరుకుతున్నది. చదువూ, తెలివీ ఉన్న పేదలు నీరుకారిపోతున్నారు’ అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి, తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల మీద గిరిధరుణ్ణి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. శేషగిరి మాట నమ్మలేక జమీందారు ‘నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను’ అని చెప్పి అతణ్ణి పంపేశాడు. తరవాత జమీందారు యాయవారం బ్రాహ్మణ్ణి ఒకణ్ణి పట్టుకుని ‘ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు. ఈ నూరు రూపాయల సంచీ తీసుకుని ఆ ఊళ్లో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని చెప్పి పంపించేశాడు. పూజలు చేయించటంలో చాలాకాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిపించి ‘నువు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని అతణ్ణి కూడా పంపేశాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్లారు. యాయవారపు బ్రాహ్మడు రూపాయల సంచీ పట్టుకు కూర్చున్నాడు. అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటంవల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతను వచ్చిన పని తెలుసుకుని ‘ఈ గుడి మన జమీందారుగారు కట్టించినదే. నీ వంటి అనుభవంగలవాణ్ణి పూజారిగా నియమించటానికి జమీందారుగారు ఎందుకు అభ్యంతరం చెబుతారు?’ అన్నాడు. యాయవారపు బ్రాహ్మడు కూడా అదే పనికోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు ‘ఏమీరాని నీకు పూజారి పని ఏమిటి? వెళ్లవోయ్’ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడిపూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట, జమీందారు శేషగిరికి కబురుపెట్టి ‘నేను గిరిధరుడికి పరీక్ష పెట్టిచూశాను. అతను లంచగొండి అని రుజువుకాలేదు’ అని చెప్పాడు. శేషగిరి కొంచెం చిరాకుపడి ‘అతను లంచగొండి అనటానికి వేరే పరీక్షకావాలాండీ? అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి! సామానుల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి! మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారమూ, అన్ని సామాన్లూ కొనలేడని మీకే తెలుస్తుంది’ అన్నాడు. జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పాపెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికి రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి ‘మా ఊళ్లో మంచిపొలం అమ్మకానికి వచ్చింది. కొందామంటే నా వద్ద డబ్బులేదు. నువ్వయినా కొనుక్కో! చాలా మంచి బేరం’ అన్నాడు. గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమరిదికి ఇచ్చి ‘ఈ నగలు తాకట్టుపెట్టి పొలం కొనుక్కో. తరవాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లిగా తాకట్టు విడిపించుకోవచ్చు’ అన్నాడు. అదేసమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది. వాళ్ల అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు. అలాటి పరిస్థితిలో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయనను చూసి కంగారుపడుతూ ‘అయ్యో కూర్చోవటానికి సరి అయిన కుర్చీ కూడా లేదు’ అని ఒక జంపఖానా పరచి దాని మీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీటవేశాడు. గిరిధరుడి భార్య ‘ఒక వెండి గ్లాసయినా లేదు’ అనుకుంటూ బాగా తోమిన కంచులోటాలో పాలుపోసి పళ్లెంలో కొన్ని పళ్లుతెచ్చి జమీందారుకు ఇచ్చింది. జమీందారు ఆమెను పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపుతాడు తప్పలేదు. చేతులు బోసిగా ఉన్నాయి. ఇల్లంతా బావురుమంటున్నది. ‘నా గురించి ఏమీ హైరానా పడవద్దు. గ్రామంలో పని ఉండి వచ్చి, పలకరించి పోదామని తొంగి చూశాను’ అంటూ జమీందారు లేచాడు. గిరిధరుడు నొచ్చుకుంటూ ‘పని ఏదన్నా ఉంటే నాకు కబురు చెయ్యకపొయ్యారా? మీరు రావలసిన పని ఏమిటి? నేనే వద్దామనుకుంటున్నాను. ఈ మధ్య కొంత పన్ను వసూలయింది’ అని డబ్బు సంచీ తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపుస్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటంచేత జమీందారు ‘ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో. లెక్కలు తరవాత తీరికగా చూసుకోవచ్చు’ అని డబ్బు సంచీ తీసుకోకుండా తిరిగి వెళ్లిపోయాడు. తరవాత ఆయన శేషగిరిని పిలిపించి ‘నువు చెప్పినది ఒకటీ రుజువుకాలేదు. గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉన్నది. అతని భార్య మెడలో పుస్తెలకు పసుపుతాడు తప్పలేదు. అతని మీద ఇలాటి అభాండాలు నాతో ఎందుకు చెప్పావో తెలీదు. నువ్విక వెళ్లవచ్చు’ అని పంపేశాడు. జమీందారు అబద్ధం ఆడి ఉండడు. కానీ గిరిధరుడికి అలాటి పరిస్థితి ఎందుకు ఏర్పడినదీ శేషగిరి ఊహకు అందలేదు. ‘అతణ్ణి దేవుడే కాపాడుతూ ఉండాలి. లేకపోతే అతనిలాటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతాను’ అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి ‘రాజా.. దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా? అలాంటివాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసీ చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది’అన్నాడు. దానికి విక్రమార్కుడు ‘ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదనటంలో సందేహం లేదు. అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాటివారి అవినీతికి శిక్ష.. సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది. జమీందార్ల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పుకాదు. అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చెయ్యటం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదనీ, అతనికి కానుకలు ఇచ్చినవారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారనీ స్పష్టంగా తెలుస్తోంది. స్వతహాగా అతను చాలా మంచివాడు. ఇతరులకు సహాయపడేవాడు. అంతేగానీ ఇతరులను పీడించేవాడు కాడు. డబ్బుల్లేని బావమరిదికి పొలం కొనుక్కునేందుకు తన భార్య ఒంటి మీది నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు. ఎవరో పొరుగువారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరువిచ్చాడు. స్వతహాగా అతను స్వార్థపరుడూ, శిక్షార్హుడూ కాడు. పోతే జమీందారు కూడా అవివేకి ఎంతమాత్రమూ కాడు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారెయ్యక రెండు పరీక్షలకు అతణ్ణి గురిచేశాడు. ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతణ్ణి శిక్షించటానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు. అదేమిటంటే గిరిధరుడు ఎవరికిగానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్నమాట. అలా అడిగే అలవాటుంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి’ అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. (బేతాళ కథలు.. చందమామ, 1980, జనవరి సంచిక నుంచి) సేకరణ: అనిల్ బత్తుల -
కథ: మరైతే.. ఎవరీ మనిషి?
హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శివకుమార్ ‘ఏవోయ్!’ అంటూ గట్టిగా కేకేశాడు వంటింట్లో ఉన్న వనజమ్మకు వినపడేలా. ‘ఏంటండీ!’ అంతే గట్టిగా అరిచిందావిడ. ‘బదులుకు బదులు అరవడం ఆపి, కాసేపు ఇటు వైపొస్తావూ? నాకెందుకో భయం భయంగా ఉంది’ ‘అబ్బబ్బా! నేను మీ పక్కన లేకపోతే ఒక్క ఘడియ ధైర్యంతో ఉండరు కదా! ఇప్పుడేమైపోయిందని చిన్న పిల్లాడిలా అంత భయం?’ విసుక్కుంటూ వచ్చిందక్కడికి. ‘కొల్లేటి సరస్సులో తప్పిపోయిన పిల్లకొంగలా ఉంది నా పరిస్థితి. పంచ్‌లు ఆపి, పరిష్కారం చూపవూ?’ ‘మరీ పిల్ల కొంగ ఏంటండీ? ముసలి కొంగ అనలేరూ?’ అని ఓవైపు దెప్పుతూనే, మరొకవైపు ‘అసలు విషయమేంటో తెమల్చండి!’ అంది. ‘ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు తెలుసా?’ అనడిగాడు. ‘అవును. రేపు ఒకటవ తారీఖు కూడా! తమరికి ఎందుకొచ్చిందీ డౌటు?’ ‘ప్రతినెలా ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు. ఆ రామారావు, నాగేశ్వరరావు, కాంతారావులు నన్ను వదలకుండా చంపుకు తింటున్నారనుకో!’ ‘తినరూ మరి! ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం తమరికి పడదు మొర్రో అని మొత్తుకున్నా, నా మాట విన్నారా? అనుభవించండి’ ‘తరుణోపాయం ఆలోచించి, ఓ నారీ! నీ ఆలోచనల అంబుధి నుంచి ఒక చిటికెడు ఉపాయాన్ని నాకు విదిల్చవూ?’ వేడుకున్నాడు శివకుమార్ ‘ఎంచక్కా నెలనెలా వచ్చే పెన్షన్‌తో గడిపితే ఈ తిప్పలు ఉండేవా చెప్పండి? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో రిటైర్మెంట్ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో కోటలు కట్టారని ఎగిరితే, ఏమైంది? అడ్వాన్సులు ఇచ్చి బేరం పెట్టుకున్న ఫ్లాట్స్ అమ్ముడు పోక, పనికిమాలిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది’ ‘సర్లేవోయ్! తెల్లవారడం ఆలస్యం వాళ్లంతా ఇక్కడ ప్రత్యక్షమవుతారు. ఈనెల అమౌంట్ ఇచ్చేస్తానని వాగ్దానం చేశాను. ముందైతే గండం గట్టెక్కించు‘ ప్రాధేయపడ్డాడు శివకుమార్. ‘అయితే నేను చెప్పినట్టు చేయండి. మిగతా డ్రామా నేను నడిపిస్తా!’ అంటూ ఆ ఉపాయాన్ని భర్త చెవిలో ఊదేసింది వనజమ్మ. తలాడించాడు శివకుమార్. భార్య చెప్పిన విషయాన్ని ఇంకా రిహార్సలే చేయలేదు.. ఊహించని విధంగా ఊడి పడ్డాడతను పిడుగులా. ‘ఇప్పుడెలా?’ అన్నట్టు భార్య వంక దీనంగా చూశాడు శివకుమార్. ‘ఏం వర్రీ అవకండి!’ చేత్తో సైగ చేసింది వనజమ్మ. బక్కపలచ బాడీకి లాల్చీ పైజామా తగిలించుకున్న రామారావు, చంకలో లెదర్ బ్యాగ్‌తో యమ హుషారుగా లోపలికి దూసుకొచ్చాడు. శివకుమార్ పక్కన సోఫాలో కూర్చుంటూ ‘నమస్కారం మాస్టారూ!’ అన్నాడు పళ్ళికిలిస్తూ. ‘ఇంకా ఒకటో తారీఖు రానేరాలేదు. అంత ఆత్రం దేనికో?’ మనసులో తిట్టుకున్నాడు శివకుమార్. ఆ మూగభాష అర్థం చేసుకున్న వాడిలా ‘రేపు వస్తే కాంపిటీషన్ ఉంటుంది కదా.. అందుకే ముందు వచ్చానన్న మాట!’ ఈనెల ఎలాగైనా శివకుమార్ నుంచి డబ్బులు రాబట్టాలని చాలా దృఢసంకల్పంతో ఉన్నాడు రామారావు. కట్టెలా బిర్ర బిగుసుకుపోయిన భర్త వాలకాన్ని చూసి వెంటనే యాక్షన్ పార్ట్లోకి దిగింది వనజమ్మ.. ‘అయ్యో! ఈయన ఆయన కాదన్నయ్యా!’ అంటూ. శివకుమార్ ముఖంలోకి ముఖం పెట్టి మరీ చూస్తూ ‘ఏం, ఈ మాస్టారు మీ వారు కాదా? చిన్నప్పుడు తప్పిపోయి ఇన్నేళ్ళకి ఇంటికి తిరిగొచ్చిన డబల్ సీనా?’ ఆశ్చర్యపోయాడు రామారావు, ‘అంత సీన్ లేదు’ అంది వనజమ్మ. ‘నాటకాలా?’ ‘అయ్యో ఎంత మాట అనేశారు అన్నయ్యా!’ నొచ్చుకుందావిడ. ‘మరైతే ఎవరీ మనిషి?’ అంటూ అనుమానంగా చూశాడు శివకుమార్ వంక. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ‘ఈయన ఆయనే! కానీ, మునుపటి మన మనిషి కాదన్నయ్యా!’ కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది. ‘మామూలుగా చెబితేనే నాకస్సలు అర్థం కాదు. అలాంటిది ఈ వంకర్లు టింకర్లు నైజాంతా! కాస్తంత డీటెయిల్డ్‌గా చెప్పు చెల్లెమ్మా!’ ప్రాధేయ పడ్డాడు రామారావు. రియలిస్టిక్‌గా రియాక్ట్ అవుతూ ‘ఈయనకి మతిమరుపు వచ్చింది అన్నయ్యా!’ అంది సీన్‌ని ఆస్కార్ లెవెల్లో పండిస్తూ. ఖంగుతిన్న రామారావు ‘వామ్మో! తలకి బలంగా దెబ్బ తగిలి గతం మరచిన కేసా? లేక అలై్జమర్సా?’ అంటూ శివకుమార్ నుంచి రావాల్సిన అంత డబ్బు గుర్తుకొచ్చి అపరిచితుడిలా పిచ్చి చూపులు చూశాడు. ‘అంతకంటే ఎక్కువే!’ అంది వనజమ్మ అతడిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తూ. ‘అంటే?’ అన్నట్లుగా చూశాడు రామారావు. ‘పాలీమర్స్ అంట! గతం మర్చి పోవడమే కాదు. బొమ్మలా కూర్చోవడం ఈ జబ్బు లక్షణాలంట. అలై్జమర్స్ కంటే అడ్వా¯Œ ్స స్టేజ్!’ అంటూ మరోమారు నోటికి కొంగు అడ్డం పెట్టుకుంది వనజమ్మ. ‘ఇప్పుడు నేనేం చేయాలి?’ తల మీద రెండు అరచేతులు ఉంచుకొని వాపోయాడు రామారావు. అతను తన కహానీ నమ్మేశాడనే ఉత్సాహం ఆపుకోలేక ‘బ్యాగూ గీగూ సర్దుకుని చక్కా వెనుదిరిగి వెళ్లిపోవడమే!’ తన ప్రజెంట్ రోల్ మరచి శివకుమార్ నోరుజారాడు. ‘డింకు చకా.. మీ ఆయన పాలిమర్స్ హుష్ కాక్! నేను కనబడగానే గతమంతా ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా గుర్తుకు వస్తున్నట్టుంది’ హుషారుగా అరిచాడు రామారావు. తనని కోపంగా చూస్తున్న భార్య వైపు తల తిప్పిన శివకుమార్ చప్పున నాలిక్కరుచుకుంటూ ఎప్పటిలా చెక్కిన కట్టె బొమ్మలా కదలకుండా ఉండిపోయాడు. తిరిగి రామారావు తన ముఖంలో ముఖం పెట్టి చూసేలోగా! ‘ఆయనకి గతం గుర్తుకు రావడం కాదు! ఆయనకి పాలిమర్స్ వచ్చిందని తెలిసిన షాక్‌లో నా గొంతు విని మా ఆయన గొంతు అనుకున్నట్టున్నారు’ ‘నో ఛాన్స్! ఆడ గొంతుకి మగ గొంతుకి కూడా తేడా తెలియనంత వెర్రిబాగుల వాడినా చెల్లెమ్మా?’ ‘అయ్యయ్యో ఎంతమాటన్నయ్యా! మీరు వెర్రిబాగుల వారని ఎవరన్నారు? మీ చెవులు మీ మాట వినాలి కదా’ అసలే కన్ఫ్యూజన్ మనిషి అయిన రామారావు .. వనజమ్మ మాటలకు మరింత కన్ఫ్యూజ్ అయ్యాడు. మన చెవులు మన మాట వినకుండా కూడా ఉంటాయా? బుర్ర గోక్కుంటూ ‘ఏదీ? తిరిగోసారి ఆ డైలాగ్ చెప్పమ్మా!’ అవునో కాదో తేల్చుకుందామని అనుమానంగా అడిగాడు రామారావు. ఇలాంటి ఎగ్జామేదో రామారావు నుంచి ఎదురవుతుందని పసిగట్టిన వనజమ్మ ఆ డైలాగ్‌ని ఆల్రెడీ బట్టీ పట్టేసింది. ‘మూటాముల్లె సర్దేసుకుని చక్కా వెనుతిరిగి వెళ్లిపోవడమే!’ అనేసింది. ‘డైలాగ్‌లో ఏదో తేడా కొడుతున్నట్టుందే!’ అనుమానం వ్యక్తపరచాడు రామారావు. నాలుక కరుచుకుంటూ ‘బ్యాగూ గీగూ అనబోయి.. అన్నాను అంతే కదా!’ అంది. ఏం తోచలేదు రామారావుకి. మెల్లగా లేచాడు. వెళ్ళబోతున్న రామారావుని ఆపి ‘అన్నయ్యా, మీరో సాయం చేసి పెట్టాలి’ అడిగింది వనజమ్మ. ‘ఇప్పటికే లక్షలు లక్షలు సాయం చేశాను మీ ఆయనకు. ఇంకా నా వల్ల కాదమ్మా!’ . ‘అయ్యో, ఆ సహాయం కాదన్నయ్యా!’ జేవురించిన మొహంతో ‘రవ్వంత సహాయం కూడా నావల్ల కాదంటే కాదు!’ మొత్తుకున్నాడు రామారావు. ‘మరేంటి.. ఆమధ్య మా ఆయన మీ గురించి అంతలా చెప్పారు?’ విసిరిందొక బాణం. ‘ఏమని?’ కుతూహలంగా అడిగాడు. ‘రామారావు గారైతే కాస్త నయం! డబ్బులు లేవంటే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు జలగల్లా పట్టి పీడిస్తారనుకో!’ అంటూ ప్లాన్ బి ప్రయోగించింది. కాస్త మెత్తబడుతూ ‘ఏమో చెల్లెమ్మా!’ అన్నాడు. ప్లాన్ వర్కవుట్ అయ్యిందని ‘మా ఆయనకి పాలిమర్స్ జబ్బు వచ్చిందని మిగతా వాళ్ళకి కూడా సూచనప్రాయంగా చెప్పండి అన్నయ్యా!’ ‘చెప్పక చస్తానా! సరేనమ్మా!’ అంటూ వెళ్ళిపోయాడు రామారావు. ‘యాహూ!’ అంటూ ఆనందంతో శివకుమార్ చిన్న పిల్లవాడై పోయాడు. అప్పటికి గండం గట్టెక్కింది. ముందుంది ముసళ్ళ పండుగ. ∙∙ ‘మే ఐ కమిన్!’ ఇంట్లో వాళ్ల అనుమతి లేకుండానే లోపలికి దూసుకు వచ్చాడతను. ఇదివరకెప్పుడూ అతడిని చూడని శివకుమార్, వనజమ్మ తెల్ల మొహాలేశారు. టక్కు, టై, మిల్ట్రీ కటింగ్‌తో కుర్రాడు యమ హుషారుగా ఉన్నాడు. రెండు చేతులెత్తి ఇద్దరికీ నమస్కారం చేసి, వాళ్ళకెదురుగా కూర్చున్నాడు. ‘నా పేరు కృష్ణంరాజు’ వాళ్లను అట్టే సస్పె¯Œ ్సలో పెట్టక తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈమధ్య కొత్త వాళ్లెవరు ఇంటికొచ్చినా శివకుమార్ ‘పాలిమర్స్ రోల్’ ప్లే చేస్తున్నాడు ఎందుకైనా మంచిదని! ‘ఇంతకూ నీవొచ్చిన పనేంటో’ వనజమ్మ, భుజానికి ఉన్న ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి టకటకా ఏవో బటన్స్ ప్రెస్ చేసి తిరిగి దాన్ని మూసేస్తూ ‘మీ వారి పేరు నాటకాల శివకుమార్ కదా ఆంటీ!’ అనడిగాడు. కంగారు పడుతూ ‘అవును. నీకెట్లా తెలుసు?’ ఆశ్చర్యపోయింది వనజమ్మ. ‘ మీవారు సర్వీసులో ఉండగా ఆ కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తుల పేరిట ‘హాంఫట్ బీమా’ కంపెనీతో డీలింగ్ కుదుర్చుకున్నారు. ఆ బీమా కంపెనీ ప్రతినిధిని. మీ వారికిప్పుడు తొమ్మిదిలక్షల ఎనభైఏడు వేల ఆరువందలయాభై నాలుగు రూపాయలు రావాల్సి ఉంది’ చెప్పాడు. అది వింటూనే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. శివకుమార్‌కి లోలోపల మహా ఉబలాటంగా ఉంది. ఎప్పుడు ఆ అమౌంట్‌ని హ్యాండోవర్ చేసుకుందామా అని! వెంట తెచ్చిన ఫైల్లోంచి ఒక పేపర్ తీసి ‘ఈ కాగితం మీద మీవారు ఒక్క సంతకం పెడితే ఆ డబ్బులు శాలరీ అకౌంట్లో పడిపోతాయి’ అంటూ ఆమెకి అందించాడు. తన భర్త ‘పాలిమర్స్ జబ్బు’ గురించి చెప్పేసింది ఏకధాటిగా! ‘అయితే ఈయన సంతకం పెట్టడం కుదరదన్నమాట!’ అంటూ చప్పున ఆ కాగితాన్ని ఆమె చేతిలోంచి లాక్కున్నాడు కృష్ణంరాజు. ‘అంత తొందర ఎందుకయ్యా! ఆయనతో నేను పెట్టిస్తాగా!’ అంది. ‘కుదరదు అంటీ! శివకుమార్ గారు ఈ కాగితం మీద సంతకం పెట్టేటప్పుడు ఒక వీడియో తీసి, దాన్ని వాట్సాప్‌లో హెడ్ ఆఫీస్‌కి పంపాల్సి ఉంటుంది.’ డైలమాలో పడింది వనజమ్మ. కృష్ణంరాజు కంటపడకుండా శివకుమార్ భార్యకు కనుసైగ చేశాడు. ‘ఒక చిన్న హెల్ప్ బాబూ!’ అని అడిగింది వనజమ్మ. వరాలిచ్చే దేవుడిలా తలూపాడతను. ‘ఒక పది నిమిషాలు అలా ఇంటి బయట ఉండి వస్తావూ?’ విన్నవించుకుంది. ‘ష్యూర్ ఆంటీ!’ అంటూ బయటకు వెళ్లాడు. ‘ఏమోయ్! మా ఆఫీసువాళ్ళు ఉద్యోగస్తుల పేరుతో బీమా చేసినట్టు మాకెప్పుడూ వినపడలేదే!’ బుర్ర గోక్కున్నాడు శివ కుమార్. ‘ఆ..మీ చాదస్తం నాకు తెలియదా?మీ తాత చుట్టం అయినట్టు డబ్బులొస్తాయంటూ పనిగట్టుకొని ఇతగాడు ఇంటిదాకా వస్తాడా? బుర్ర తక్కువ ఆలోచనలు మానేసి, ముందు ఏం చేద్దామో చెప్పండి’ భర్తను తొందర పెట్టింది వనజమ్మ. ‘ఈ కృష్ణంరాజు దగ్గర కాసేపు ఆ పాలిమర్స్ జబ్బుకు పాతరేస్తే సరి!’ పరిష్కారం చెప్పాడు శివకుమార్. వనజమ్మ తలూపుతూ పిలిచిందతడిని. లోపలికి వస్తూనే ‘అంకుల్ ఓకే కదా..!’ క్లారిఫై కోసం అడిగాడు కృష్ణంరాజు. ‘మీ ఆంటీకే పాలిమర్స్! నాకేం? దుక్కలా ఉన్నాను చూడూ?’ అన్నాడు శివకుమార్ దర్పంగా. హీరో చేత విలన్ తుక్కుతుక్కుగా తన్నులు తిన్నాక క్లైమాక్స్‌లో పోలీసులు వచ్చినట్టు కృష్ణంరాజు విజిల్ ఊదగానే పోలోమని రామారావు, నాగేశ్వరరావు, కాంతారావులు పరుగు పరుగున వచ్చారక్కడికి! ‘తెలివి తేటలు నీకే ఉన్నాయనుకుంటే ఎలా శివకుమార్? మీ ప్లాన్‌కు విరుగుడు ప్లాన్ మా దగ్గరా ఉంటుంది’ అని రామారావు అంటుంటే నిశ్చేష్టులైన శివకుమార్ దంపతులు నిజంగానే పాలిమర్స్ జబ్బు వచ్చిన వాళ్లలా బిర్ర బిగుసుకుపోయారు. కాస్త తేరుకున్నాక కృష్ణంరాజు వంక చూస్తూ ‘మరైతే ఎవరీ మనిషి?’ అడిగాడు శివకుమార్ వణుకుతున్న గొంతుతో. ‘మేం ముగ్గురం కలసి తెచ్చుకున్న కిరాయి మనిషి!’ అంటూ బిగ్గరగా నవ్వాడు నాగేశ్వరరావు. - ఎనుగంటి వేణుగోపాల్ -
ఈవారం కథ: ఎదురు చూపులు
తెల్లారితే ‘బుల్లి బుజ్జి’గాడి పెళ్లి. అంతా సందడిగా ఉంది. ఆ ఇంటి మనుషుల్లో మాత్రం సంతోషం లేదు. పెళ్లి పందిరికి కొంచెం ఆవల.. బోదె గట్టునున్న డొక్కల గూడుకి జారబడి ఆకాశం వైపు చూస్తా ‘పెద్ద బుజ్జి’గాడి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీరామ్మూర్తి. ఆడు ఇల్లొదిలి పెట్టేసి వెళ్లి ఐదేళ్లు దాటేసింది. ‘బుల్లి బుజ్జి’గాడి పెళ్లికి ముçహూర్తం పెట్టిన రోజు నుండీ అస్తమానూ ‘పెద్దబుజ్జి’గాడే గుర్తొస్తున్నాడు. అలా ఆడు గుర్తొచ్చినప్పుడల్లా పెద్దాడికి కాకుండా చిన్నోడికి పెళ్లంటే గుండె గుబ గుబలాడిపోతోంది. పోనీ ఆడికే పెళ్లి చేద్దామంటే ఆ మనిషి ఊసే తెలియకుండా పోయింది. ఆనోటా ఈ నోటా తమ్ముడి పెళ్లి సంగతి తెలిసైనా ఇంటి మొహం చూస్తాడన్న ఆశ, ఒడిగట్టిన దీపంలా మిణుకు మిణుకు మంటూనే ఉంది. ఆరు బయట నిలబడి తల కాస్త బయటికి వంచి కళ్లు చిట్లించి రోడ్డు మలుపులోకి ఆశగా చూస్తున్నాడు శ్రీరామ్మూర్తి. రోడ్డు మీద వీధి దీపాల పలచటి వెలుగు. రోడ్డుకి అవతలున్న వరిచేలలో నుండి కీచురాళ్ళ శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. పెళ్లి పందిరిలో పసుపు నీళ్లు చల్లడం కోసం ఇంట్లో నుండి బయటకొచ్చింది వరలక్ష్మి. శ్రీరామ్మూర్తిని చూసి ‘ఏంటయ్యా చుక్కలు లెక్కెట్టేతున్నావ్. కొంపదీసి కొనేత్తావా ఏంటీ?’ బుగ్గలు నొక్కుకుంటూ వెటకారంగా అంది. ‘అబ్బా.. ఊరుకోవేసే! యెప్పుడూ ఎటకారమే నీకు? మన పెద్దోడి కోసం ఆలోసిత్తన్నానే.. ఎక్కడున్నాడో ఏంటో? మనసంతా ఆడే ఉన్నాడే’ ఆ మాటలంటున్నప్పుడు శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. వరలక్ష్మి కళ్లల్లో వెటకారం ఆవిరైపోయింది. ఆమె మొహం మబ్బులు కమ్మేసిన ఆకాశమైపోయింది. ‘ఊరుకో లేవయ్యా! ఆడు ఎక్కడున్నా నిజంగా మనల్నే కనిపెట్టుకుని ఉండుంటే, తెల్లారే సరికి మూర్తం టైమ్కైనాతప్పకుండా వొత్తాడు. ఆడిప్పుడు రాలేదంటే ఇంక ఎప్పటికీ రానట్టే. ఆడు రాకపోతే ఏమయ్యా? ఎక్కడోచోట చల్లగా ఉంటే అదే చాలు! ఎక్కువ ఆలోచన ఎట్టుకోకుండా నువ్వెళ్ళి ఏదో ఓ మూల నడుం వాల్చు. తెల్లారగట్ల పెళ్లి పనులు సక్కబెట్టుకోవాలి కదా!’ అనేసి బరువెక్కిన గుండెతో ఇంట్లోకెళ్ళిపోయింది వరలక్ష్మి. శ్రీరామ్మూర్తికి ఏం చేయాలో పాలుబోవడం లేదు. ఒకట్రెండు సార్లు రాత్రుల్లో మల్లిబాబుగాడికి లాకు సెంటర్లో కనిపించినట్టు చెప్పేడు. నిజమో! అబద్ధమో?! ఏదో శంక అడ్డొచ్చి ఇంటికి రావడానికి తన్నుకులాడుతున్నాడేమో! ఇంటి ముందున్న పంటబోదెకి, అడ్డంగా ఏసిన తాటి పట్టెల మీదగా నడిచి రోడ్డు మీదకొచ్చాడు శ్రీరామ్మూర్తి. ఆ రోడ్డు పక్కనున్న దిబ్బల మీద వేసిన గడ్డి మేటుల్లో నుండి రోడ్డు మీదకొస్తున్న ఎలుకలు అడుగుల చప్పుడుకి బెదిరిపోయి మళ్ళీ గడ్డి వాముల్లోకి దూరిపోతున్నాయి. నడుస్తూనే ‘ఆ రోజు’ జరిగిందంతా అవలోకనం చేసుకుంటున్నాడు. ∙∙ అది సంక్రాంతి నెల. ఒళ్ళంతా బురద పూసుకుని ఓ వారం తరవాత ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టాడు ‘పెద్దబుజ్జి’. యవ్వనంతో పంట బోదె పక్కన నిబ్బరంగా పెరిగిన ‘టేకు మాను’లా పిటపిటలాడుతున్నాడు. ఒంటికి అంటిన బురదతో నల్ల రాతి విగ్రహానికి మట్టి పూత పూసినట్టున్నాడు. ఆడి ఒత్తయిన నల్లటి జుట్టులో నుండి చెమట చెంపల మీదగా జారి మెడ వంపులోకి తిరిగి జారుతోంది. ముక్కు మీద కొన్ని చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. పెదాలపైన నవ్వు.. మబ్బుల చాటు నుండి తొంగిచూసే చందమామలా వెలుగుతోంది. కొడుకు వాలకం చూసి గబగబా పొయ్యి మీద నీళ్లు పెట్టింది వరలక్ష్మి. ఉడుకుడుకు నీళ్లు నెత్తి మీద నుండి పోసుకున్నాడు పెద్దబుజ్జి. ఒంటి మీద బురద, పాయలు పాయలుగా నేలకి జారిపోయింది. ఆడి మెడలో వేళ్ళాడుతున్న బొటన వేలంత వీరాంజనేయుడి ‘వెండి బొమ్మ’ మంచు గడ్డలా తెల్లగా మెరిసి పోతోంది. మనిషి.. గుళ్లో రాముడిలా నల్లగా నిగనిగలాడిపోతున్నాడు. వరలక్ష్మి కొడుకుని కళ్లారా చూసుకుని ‘నా అందమే వొచ్చింది చిట్టి నా తండ్రికి!’ అని మురిసిపోతూ మెటికలు విరిచింది. వాకిలి బయటున్న కొబ్బరి చెట్టుకి నిలబడి ఆ తంతు అంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరామ్మూర్తి. కొడుకుని ఏదో అడగాలనుకుని సమయం కోసం ఆగి చూస్తున్నాడు. అప్పుడే వార్పు తీసిన వేడి వేడి అన్నంలో పెద్దబుజ్జికి ఇష్టమైన చేమదుంపల పులుసు వేసి కొడుకు ముందు పెట్టింది. ఆవురావురుమని తింటున్న కొడుకుని చూస్తుంటే వరలక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘ఇంకెన్నాళ్లురా ఈ చాకిరీ.. బుల్రాజుగారి పొలంలో గొడ్డులా కట్టపడుతున్నావు. బాకీ తీరడానికి ఇంకెన్నాళ్లు పడతాదంటాన్నార్రా?’ కొడుకుని ఆరా తీసింది. ‘మొన్నే లెక్కలు చూసేరమ్మ రాజుగారు.. వొచ్చే ఏసం కాలానికి తీరిపోద్దంటమ్మ. అదయ్యాకా నేను ఎంచక్కా ఏదో యాపారం చేసుంటానే’ పెద్ద బుజ్జి కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. ‘మాయదారి ఇల్లు కట్టకపోయినా కొంపలేం ములగక పోదును. చేసిన అప్పుకి బంగారం లాంటి పిల్లోడ్ని ఆ కఠినాత్ముల దగ్గర పనికి పెట్టాల్సొచ్చింది. మాయదారి సంతని.. మాయదారి సంత’ వాకిట్లో నిలబడున్న మొగుడి వంక ఛీత్కారంగా చూసిందామె. శ్రీరామ్మూర్తి తల తిప్పేసుకున్నాడు. ‘పుణ్యవతిగారు ఎలాగున్నార్రా బుజ్జి! పాపం పట్టుమని మూడు పదులైనా నిండలేదు ఆవిడకి. భర్తపోయి పుట్టింటి పంచకి చేరాల్సొచ్చింది. అన్నగారు చేసిన పాపాలు చెల్లి తలకి చుట్టుకున్నట్టున్నాయి. పాపం.. ఓ పసిగుడ్డునైనా కళ్ల చూడలేదు మా రాజు తల్లీ!’ బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి. ‘పుణ్యవతి’ పేరు వినగానే పెద్దబుజ్జిగాడి ఒళ్ళు ఉప్పొంగింది. ‘అమ్మా.. ఆవిడ చాలా మంచోరే. బోయినానికని ఇంటికిపోయి పంచలో కూకుంటే నీలాగే కడుపు చూసి అన్నం పెడతారే. వొద్దన్నా కొసరు ఏత్తారు. ఆదివారం రోజైతే నాలుగు మాంసం ముక్కలు ఎక్కువే ఎత్తారే. అమ్మా ఆవిడ ఎందుకో గానీ నేనంటే ఎక్కువ మక్కువ చూపిత్తారే. మిగిలిన పనోళ్లంతా నన్ను చూసి కుళ్ళు కుంటారే!’ పత్తి పువ్వులా నవ్వేడు బుజ్జి. వరలక్ష్మి ఉలిక్కి పడింది.. ‘ఓరేయ్ పెద్దోడా! పెద్దోళ్ళతో సేగితాలు అంత మంచియివి కావురా. అయినా వన్నం ఆవిడేందుకు పెడతాది. వంట పనోళ్ళు లేరా ఆ ఇంట్లో !’ బుగ్గలు నొక్కుకుంటూ అడిగిందామె. ‘ఎప్పుడైనా కుదిరితే ఆవిడ నాకు మాత్రమే పెడతారే. నువ్వసలు మాయ తెలీనోడివిరా బుజ్జి! అని అంటారే. మా అన్న నీ చేత గొడ్డుచాకిరీ చేయుంచుకుంటున్నాడ్రా! అని బాధ పడిపోతారే. రాజుగారు ఇంట్లో లేనప్పుడే నాతో మాట్లాడతారు. ఆయనుంటే కాలు కూడా గుమ్మం బయటికి పెట్టరావిడ’ చిన్నపిల్లాడిలా సంబరంగా చెప్పుకుంటూ పోతున్నాడు పెద్దబుజ్జి. వరలక్ష్మి ఎందుకో కీడు శంకించింది.. ‘ఒరేయ్ పెద్దబుజ్జి! ఎందుకు చెబుతున్నానో యినుకోరా. పెద్దోళ్ళతో మనలాంటోళ్ళం కొంచెం దూరంగా మసలాలి. ఆళ్ళు చనువిచ్చినా మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల్రా. అందుకేనేమో మీ నాన్న నిన్నటి నుండి కిందా మీదా పడతన్నాడు. ఎవరో ఏదో చెప్పారంట నీ గురుంచి! నలుగురు నోళ్ళల్లో నానితే కొండంత నల్లరాడైనా నలుసై పోద్దిరా! కూసింత జాగ్రత్తరా నాన్నా’ కొడుకు గెడ్డం పట్టుకుని అతడి కళ్ళల్లోకి దీనంగా చూసింది వరలక్ష్మి. బుద్ధిగా తలాడించాడు పెద్దబుజ్జి. రాత్రి భోజనాలు అయ్యాక విషయాన్ని మెల్లగా కదలేశాడు శ్రీరామ్మూర్తి. ‘ఏరా.. ఆ పుణ్యవతమ్మగారితో చనువుగా ఉంటన్నావంట. యెందాక వొచ్చిందేంటి యవ్వారం!’ అని కొడుకుని నిలదీశాడు. నులక మంచంలో పడుకున్న పెద్దబుజ్జి త్రాచుపాములా సర్రున పైకి లేచాడు. పిడికిలి బిగించాడు. పళ్ళు పటపటమని కొరికాడు. ‘ఏ ఎదవ నా కొడుకు చెప్పేడేంటీ నీతో. ఆడ్ని ఇటు రమ్మను. నరికి పోగులు పెట్టేత్తారాడయ్యా!’ అంటా బుసలు కొట్టాడు. అతడి కళ్ళల్లో గిరుక్కున నీళ్లు తిరిగాయ్. గొంతు గాద్గదికమైపోయింది. ‘ఎవడు చెప్తే నీకెందుకురా! నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ముందు?’ కొడుకుని మరింత నిలదీశాడు శ్రీరామ్మూర్తి. ‘పెద్ద బుజ్జి’ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. వరలక్ష్మి ఒక్క ఉదుటన వొచ్చి కొడుకుని అక్కున చేర్చుకుంది. శ్రీరామ్మూర్తి మింగిలా మిన్నకుండిపోయాడు. గుండె బరువు దిగే వరకూ ఎక్కెక్కి ఏడ్చాడు పెద్దబుజ్జి. మోచేత్తో కళ్ళు తుడుచుకున్నాడు. ముక్కు చీది వాళ్ళ నాన్న మొహంలోకి తీక్షణంగా చూశేడు. ‘ఇదిగో నీకైనా ఇంకెవడికైనా ఒకటే మాట చెబుతున్నా.. నన్నేమైనా అనండీ. కానీ పుణ్యవతమ్మ గార్ని ఏమైనా అన్నారంటే చెమడాలు ఎక్కదీసేత్తా ఏమనుకున్నారో!’ బట్టలున్న చేతి సంచిని తీసుకుని దిగ్గున అరుగు దిగి వెళ్లిపోయాడు పెద్దబుజ్జి. ‘అంత మొనగాడివైపోయావేరా.. ఏదీ నా చెమడాలు ఎక్కదీయి చూద్దాం’ వాకిట్లోకి ఉరికాడు శ్రీరామ్మూర్తి. పెద్దబుజ్జి సివంగిలా బోదె దాటేశాడు. దాటినోడు దాటినట్టే చీకట్లో కలిసిపోయాడు. వెనుక నుండి వరలక్ష్మి అరుస్తూనే ఉంది. పెద్దబుజ్జి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. శ్రీరామూర్తిని శాపనార్థాలు పెట్టింది వరలక్ష్మి. ‘ఓ రెండ్రోజులు ఉందామని ఇంటికొచ్చిన కొడుకుని పట్టుమని ఒక్క పూటైనా లేకుండా తరిమేశావ్ కదయ్యా! నీ నోట్లో మన్నడిపోనూ.. నిన్ను తగలెయ్యా!’ అంటూ. శ్రీరామ్మూర్తి ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోయాడు. వాడెళ్ళిపోయాక ఓ రెండ్రోజులాగి కొడుక్కోసం వాకబు చేశాడు శ్రీరామ్మూర్తి. బుల్రాజుగారి కొండగట్టు పొలాల్లో దమ్ము చేస్తున్నాడని చెప్పారెవరో. పని మొదలెట్టాడంటే రాత్రి పగలు తేడా ఉండదు ఆడికి. బుల్రాజుగారి కొండగట్టు పొలం ఊరికి ఓ ఐదు కిలోమీటర్ల ఆవల ఉంటుంది. రాత్రి, పగలు ఆడికి అక్కడే మకాం. వారం గడిచిపోయింది. వారానికి ఇంటికి రావాల్సిన పెద్ద కొడుకు రాక పోయేసరికి కొంచెం కంగారు పడింది వరలక్ష్మి. రాజుగారి పొలంలో పనిచేసే మిగతా పనోళ్ళని వాకబు చేసింది. రాజుగారి పాలేరు వీరంశెట్టి, రాజుగారి ఇంటి నుండి కేరేజీ పట్టికెళ్తే పొలంలోనే తినేసి అక్కడే పాకలో పడుకుంటున్నాడని చెప్పేరు. చూస్తుండగానే రెండో వారం వొచ్చేసింది. బుజ్జిగాడు రాజుగారి పొలాల్లో కనిపించడం లేదని చెప్పేరెవరో. రాజుగారింటికి ఎళ్ళేడు శ్రీరామ్మూర్తి. ‘ఏరా శీరామ్మూర్తి.. ఆడు రాలేదా మీ ఇంటికి? చేలోనే ట్రాక్టరు వొదిలేసి ఎటో ఎల్లిపోయాడంట తొత్తు కొడుకు. బొత్తిగా భయం బత్తి లేకుండా పెంచేరు సన్నాసిని. ఆడింటికొస్తే నేను రమ్మన్నానని చెప్పు’ రెండే రెండు ముక్కలు మాట్లాడేసి దబ్బున కూర్చీలో నుండి పైకి లేచి భుజం మీద కండువాని ఒక్క దులుపు దులిపి విసురుగా ఇంట్లోకెళ్ళిపోయారు రాజుగారు. చూస్తుండగానే వారాలు కదిలి నెలలైనాయి. ఎన్ని దిక్కులు తిరిగినా పెద్దబుజ్జిగాడి ఆచూకీ తెలీలేదు. కొడుకు కోసం బెంగటిల్లి పోయాడు శ్రీరామ్మూర్తి. వరలక్ష్మి ఐతే మంచం పట్టేసింది. ఆడి కోసం వెతకని చోటు లేదు. చేయని వాకబు లేదు. ఎక్కడో టౌన్లో ఎవరో పిల్లతో కనిపించాడని ఒకరిద్దరు చెప్పేరు. అన్నవరం కొండమీద కనిపించాడని అన్నారు ఇంకొందరు. ఎన్ని శకునాలకి ఎళ్లినా ఏదో దిక్కున ఉన్నాడనే చెబుతున్నారు. కళ్ళు కాయలు కాసేలా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఐదేళ్లుగా గుండెల్లోనే కుంపటి పెట్టుకుని భారంగానే బతుకుని వెళ్లదీస్తున్నారు ఆ ఇద్దరూ. బుల్లిబుజ్జిగాడి పెళ్లికైనా పెద్ద కొడుక్కి విషయం తెలిసి ఇంటికొస్తాడనే ఆశ వాళ్ళిద్దరిలో మిణుకు మిణుకు మంటూనే ఉంది. ∙∙ శ్రీరామ్మూర్తి అడుగులు లాకు సెంటరు వైపు భారంగా పడుతున్నాయి. ‘ముత్తాలమ్మ దయ వల్ల ఆడక్కడే ఉంటే ఎంత బావుంటాది! వొచ్చే తీర్థానికి యేట పోతుని బలిత్తాను తల్లో!’అని ఊరి దేవతకి మనసులోనే మొక్కుకుంటా లంక పొగాకు చుట్టని ఎలిగించాడు. పంచాయతీ ఆఫీసు దాటి, ఆ పక్కనే ఉన్న ముత్యాలమ్మ గుడి పక్కనుండి ఎడమ వైపుకి తిరిగి మెల్లగా కాలవ గట్టు ఎక్కేడు. ఓ పక్క నిబ్బరంగా అంతెత్తు పెరిగి, బోర్డర్లో కాపుకాసే జవానుల్లా ఉన్నాయి తాడిచెట్లు. ఇంకో పక్క గుంపులు గుంపులుగా పెరిగి కాల్వలోకి జారిన ముళ్ల పొదలు. నిశాచరాలు అలికిడి చేస్తున్నాయి. మెల్లగా లాకుల మీదకి వొచ్చి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి. రెండు కాల్వల మధ్యలో లాకుల దిగువున ఉన్న మొండిలో చింత చెట్ల గుబురుల్లో చిక్కటి చీకటి తలదాచుకుంది. చలికి ముడుచుకు కూర్చున్న ముసలమ్మల్లా నాలుగైదు పెంకుటిళ్లు. ఓ పెంకుటింట్లో లైటు వెలుగుతూనే ఉంది. అది లాకు సూపెర్నెంటు ఆఫీసు. లాకు స్టాఫ్ కోసం కట్టిన మిగిలిన ఇళ్లు పాడుపడిపోవడం వల్ల వాటిల్లో ఎవరూ కాపురాలు ఉండట్లేదు. ఆ సూపెర్నెంటు ఆఫీస్ గది వెనుకనున్న కిటికిలో నుండి జారుతున్న లైటు వెలుతురు బయట ఉన్న చీకటిని చీల్చడానికి విఫలయత్నం చేస్తూ చింత చెట్ల మొదళ్లో పలచగా పరుచుకుంది. శ్రీరామ్మూర్తి చుట్టని మునివేళ్లతో తిప్పుతూ గట్టిగా ఓ దమ్ము లాగి వదిలాడు. చుట్టూ చూశాడు. ఎవరి జాడ కనిపించలేదు. కళ్ళల్లో నీళ్లు గిరుక్కున తిరిగాయి. భారంగా వెనక్కి తిరిగి వొచ్చేస్తుంటే చింతతోపులో చిన్నగా ఏదో అలికిడి అయినట్టనిపించింది. అటువైపు కళ్ళు చిట్లించి చూశాడు శ్రీరామ్మూర్తి. చింత చెట్టు మొదట్లో, మసక మసగ్గా పరుచుకున్న వెలుతుర్లో ఏదో ఆకారం అస్పష్టంగా కదలాడినట్టన్పించింది. గట్టు మీద నుండి కొంచెం కిందకి దిగి పరకాయించి చూశాడు. ఒక్కటి కాదు రెండు ఆకారాలు. శ్రీరామ్మూర్తి కళ్ళు మెరిశాయి. ‘పెద్దబుజ్జిగాడే! ఆడి పక్కన ఉన్నది ఎవరో చెప్పిన పిల్ల గామోసు! ఆ పిల్లని ఊళ్ళోకి తీసుకు రావడానికి తన్నుకులాడుతున్నాడేమో’ గబగబా మొండిలోకి దిగిపోయాడు శ్రీరామ్మూర్తి. ఆ అలికిడికి ఆ రెండు ఆకారాలు ఉలిక్కిపడ్డాయి. దిగ్గున లేచి కూచున్నాయి. మగ ఆకారం వెంటనే తేరుకుని మసక వెలుతురులో నుండి చటుక్కున చిమ్మ చీకట్లోకి జారుకుంది. ఆడ మనిషి మాత్రం నెత్తి మీద చెంగు కప్పుకుని తలొంచుకుని అలాగే నిలబడి పోయింది. ఆ మగాడి వెనకాల పడ్డాడు శ్రీరామ్మూర్తి. ‘ఓరేయ్ పెద్దబుజ్జీ! నిన్నేం చేయను ఆగరా.. మీ అమ్మ నీ కోసం బెంగెట్టుకుందిరా’ అరుస్తూనే ఆ నల్లటి మనిషి వెనకాల పరుగెత్తాడు. ఆ మనిషి చీకట్లో చీకటిలా కలిసిపోతూ చేతికి చిక్కడం లేదు. శ్రీరామ్మూర్తి పరుగెడతానే ఉన్నాడు. పరుగెడుతూ పరుగెడుతూ ఇద్దరూ యించు మించుగా కాలవ వారకి వొచ్చేశారు. శ్రీరామ్మూర్తి ఆ నల్లటి మనిషి మీదకి ఉరికి లాఘవంగా చేతిని అతడి మెడ చుట్టూ మెలేశాడు. ఊపిరి ఆగిపోయినట్టు ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆ మనిషి. శ్రీరామ్మూర్తిని ఒక్క తోపు తోశాడు ఆ నల్లటి మనిషి. శ్రీరామూర్తి పట్టు తప్పి వెల్లకిలా పడబోయి తమాయించుకున్నాడు. ఆ ఊపులో ఆ నల్ల మనిషి మెడలోని తాడు శ్రీరామ్మూర్తి చేతిలోకొచ్చేసింది. ఆ నల్లటి మనిషి మాత్రం ఒక్క అంగలో కాల్వలోకి దూకి రెండు బారల్లో ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఉసూరోమనిపోతూ సూపర్నెంటు ఆఫీసు కిటికీ దగ్గరకొచ్చి నిస్సత్తువుగా గోడకి జారగిలపడిపోయాడు శ్రీరామ్మూర్తి. చేతిలో నల్ల తాడుని పైకెత్తి నిరాసక్తంగా చూశేడు దాని వైపు. కొసన చంద్రుడిలా వేళ్ళాడుతూ తళుక్కున మెరిసింది వీర హనుమంతుడి వెండి బొమ్మ! దిగ్గున లేచి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి. ‘ఆడు బుజ్జిగాడే!’ నల్లతాడున్న ఆంజనేయుడి బొమ్మని పిడికిలిలో బిగించి పట్టుకున్నాడు. చీర చెంగుని నెత్తి మీద కప్పుకుని, వడి వడిగా గట్టు మీదకెళ్ళిపోబోతున్న ఆడామె భుజం మీద చెయ్యేసి సర్రున వెనక్కి లాగాడు. చీరచెంగు ఆమె నెత్తి మీద నుండి జారింది. కిటికిలోని లైటు వెలుగు ఆమె మొహం మీద పడింది. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్మూర్తి. ‘తూము కాడ బేబమ్మ!’ నోరెళ్లబెట్టాడు. తల దించుకుంది బేబమ్మ. ‘ఏంటే బేబమ్మా! మా వోడు నీకోసం యిక్కడికొత్తున్నాడని ఒక్క మాటైనా సెప్పలేదే! ఆడి కోసం ఎంత మనేద పడతన్నామో నీకు తెల్వదా? నీకు మేమేం పాపం చేశామే బేబమ్మా!’ బోరుమంటూ మొహాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. చివ్వున తలెత్తింది బేబమ్మ ‘ఊరుకోవయ్యా పేద్ద ఏడ్చేవూ! వల్లో ఏసుకోడానికి పెద్దబుజ్జిగాడు మీ అందరిలాగా దగుల్బాజీ ఎదవనుకున్నావా! నిఖార్సైన మొగోడు. పెతీ ఆడబిడ్డలోనూ అమ్మని చూసేంత మంచోడు. ఆడ్ని ఏమైనా అంటే అన్నోళ్ల కళ్ళు పెటీల్మని పేలిపోతాయి. పురుగులు పడి సచ్చిపోతారు’ బేబమ్మ శాపనార్థాలు పెట్టింది. అది శ్రీరామ్మూర్తి క్కూడా తెలుసు. కాకపోతే ఆ రోజేదో సెప్పుడు మాటలు విని అలా ఊగిపోయాడు. కానీ మరిప్పుడు కళ్ళతో చూశాడు కదా! ‘అయితే ఆడిప్పుడు ఏ తప్పూ చేయలేదంటావా?’ ‘ఆ.. ఇక్కడ జరిగింది తప్పే, కానీ ఆ తప్పు చేసింది పెద్దబుజ్జిగాడు కాదు. మల్లిబాబుగాడు’ బేబమ్మ ఆవేశంలో నిజం కక్కేసింది. శ్రీరామ్మూర్తి స్థాణువై పోయాడు. ఆ వెంటనే తేరుకున్నాడు. ‘పారిపోయినోడు మల్లిబాబుగాడు అయితే ‘మరి ఇది?’ వెండి బొమ్మున్న అరచేతిని పైకెత్తి బేబమ్మ ముందుకి చాపాడు. బేబమ్మ నీళ్లు నమిలింది.. ‘చెప్తావా.. పీక పిసికేసి కాల్వలో పడీ మంటావా!’ సింహంలా ముందుకురికాడు శ్రీరామ్మూర్తి. బేబమ్మ భయపడుతూనే చెప్పడం మొదలెట్టింది. ∙∙ ఆయాల నీళ్ల బోదె దూకేసి చీకట్లో కలిసిపోయిన పెద్దబుజ్జి సరాసరి రాజుగారింటికి వెళ్లిపోయాడు. ఆయాలప్పుడు వొచ్చిన బుజ్జిగాడిని ఒకింత అనుమానంగా చూశేరు రాజుగారు. అసలు గొడవ చెప్పక నాన్న తాగి తందనాలు ఆడుతుంటే ఇంట్లో ఉండలేక వొచ్చేశానన్నాడు పెద్దబుజ్జిగాడు. రాజుగారికెందుకో నమ్మకం కలగలేదు. అప్పటికే పనోళ్లు ఒకరిద్దరు చెవులు కొరుక్కుంటున్నప్పుడు వినకూడని మాటలు ఒకట్రెండు ఆయన చెవిలో పడ్డాయి. అయినా కూడా చింకి చాప ఒకటి ఇప్పించి ఆడ్ని పంచలో పడుకోమన్నారు. బయటంతా చల్లగా ఉంది. ఆ చలిలోనే మోకాళ్ళు డొక్కలోకి ముడుచుకుని వొణుకుతా పడుకున్నాడు పెద్దబుజ్జి. అప్పటికే పుణ్యవతిగారు నిద్ర పోయేరు. తెల్లారగట్ల ఇంకా మసక చీకటి ఉండగానే కాలు మడుచుకుందారని బయటకొచ్చింది ఆవిడ. పంచలో బుజ్జిగాడి మూలుగు విన్పించిందావిడకి. జ్వరంతో ఆడి వొళ్ళు పెనంలా కాలిపోతుంటే దుప్పటి తెచ్చి కప్పేరు. తడిగుడ్డతో మొహం తుడిసి, నుదుటికి అమృతాంజనం రాస్తుంటే రాజుగారి కళ్ళల్లో పడిపోయారు. చప్పున తల దించేసుకున్నాడాయన. అంతకుమించి ఇంకేం అనలేదు చిత్రంగా. తెల్లగా తెల్లారక ఆరెంపీని పిలిపించి ఆడికి వైద్యం చేయించారు. ఆడికి ఇష్టమైన కూరలవి వొండి పెట్టమన్నారు రాజుగారు. కొంచెం తెరిపిన పడ్డాక రెండ్రోజులాగి కొండగట్టు పొలంలో దమ్ము చేయడానికని పంపించేరు. దమ్ము చేసినన్నాళ్లు అక్కడే మకాం. రోజూ రాజుగారి పాలేరు వీరంశెట్టి కేరేజీ పట్టుకెళ్ళి యిచ్చొచ్చేవోడు. చెప్పడం ఆపేసింది బేబమ్మ. ‘ఆ తర్వాత ఏమైంది?’ హుంకరించాడు శ్రీరామ్మూర్తి. ‘ఆ తర్వాత ఆడి గురుంచి నాకేం తెలీదు’ తలొంచుకుని నిలబడింది బేబమ్మ. ఒక్క అంగలో ఉరికి బేబమ్మ జుట్టు పట్టుకుని గుంజి పళ్ళు పటపటా కొరికాడు శ్రీరామ్మూర్తి. బేబమ్మ నేలకి ఒంగిపోయింది. శ్రీరామ్మూర్తి కాళ్ళు పట్టుకోబోయింది. ‘నాకు అంత వరకే తెలుసు శీరామూర్తే.. అది కూడా ఆ వంట మనిషి నాగరత్నం చెబితే తెలిసింది. ముత్తేల్లమ్మ సాచ్చిగా ఇంకేం తెలీదు నాకు’ చేతులెత్తి దణ్ణమెట్టింది బేబమ్మ. ‘మరి ఆ మల్లిబాబుగాడి మెళ్ళోకి ఈ బొమ్మేలా వొచ్చింది?’ కోపంతో శ్రీరామ్మూర్తి ముక్కు పుటాలు అదురుతున్నాయి. ‘ఆ ఎండి బొమ్మ గురుంచి ఆ మల్లిబాబుగాడు ఎవరికీ చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు శ్రీరామ్మూర్తే! అయినా నీవు అడిగేవు గాబట్టి చెబుతున్నాను. అదైతే ఆడికి రాజుగారి కొండగట్టు పొలాల్లో దొరికిందంట’ అంటూ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది బేబమ్మ. ‘మొన్న పోయిన వేసవిలో చేపల చెరువు కోసమని కొండగట్టు పొలాల్లో ఓ పదెకరాల్లో మట్టి తవ్వించారంట రాజుగారు. పక్క టౌన్ నుండి తవ్వోడలు, పక్క ఊరు నుండి మట్టి పని చేసేవోల్లు వొచ్చేరు. మన ఊళ్ళో నుండి మల్లిబాబు, పాలేరు వీరంశెట్టి మాత్రమే ఆ జనాలతో కలిశారు. రెండో రోజు తవ్వకాల్లో తవ్వోడా పళ్ల చక్రాలకి ఓ ఎముకుల గూడు తగులుకుని పైకి లేచిందంట. పక్కూరు నుండొచ్చిన మట్టి పనోళ్ళు జడుసుకున్నారంట. ఆ పక్కనే మట్టిలో మల్లిబాబుకి ఈ వెండి బొమ్మ దొరికిందంట. అది ఎవరికీ తెలీకుండా ఈడు బొమ్మని జోబీలో పెట్టేసుకున్నాడంట. ఎముకల గూడు గురించి బయటికి పొక్కితే ప్రాణాలు తీసేత్తానని బెదిరించారంట రాజుగారు. ఆ మర్నాడే మల్లిబాబుకి జొరమొచ్చేసి ఓ రెండ్రోజుల వరకూ లేవలేదు. మళ్ళీ ఆడు ఆ పనికెళ్ళలేదు. ఓ రెండు మూడుసార్లు మల్లిబాబుగాడు రాజుగారి పాలేరుని దాని గురించి ఆరా తీసేడంటా. ఆడు ఇషయం చెప్పలేదంట. మల్లిబాబుగాడైతే ఆ ఎముకల గూడు ‘పెద్దబుజ్జి’ గాడిదేమో అంటున్నాడు. ఒకట్రెండు సార్లు ఈ బొమ్మ ఆడి మెళ్ళో ఈడు సూసేనంటున్నాడు. అది గనుక నీకంట్లో పడితే ఆరా తీత్తావని, ఇషయం బయటికి పొక్కితే రాజుగారు ఈడ్ని కూడా కొండగట్టు పొలానికి బలిత్తాడని బయపడి ఇన్నాళ్లు ఎవరి కంట్లో పడకుండా చొక్కాలో దాసేసుకున్నాడు ఆ బొమ్మని. నా మీద దయుంచి ఈ సంగతి ఇంకెక్కడా చెప్పకు శ్రీరామ్మూర్తే’ చేతులెత్తి దణ్ణమెట్టింది బేబమ్మ. శ్రీరామ్మూర్తి నిట్టనిలువునా నేల మీద కూలబడిపోయాడు. నెత్తిని నేలకేసి బాదుకున్నాడు. ‘పెద్దబుజ్జే..! ఎంత ఘోరం జరిగిపోయింద్రా.. పెద్దోళ్ళతో సేగితం చెయ్యొద్దని మీ అమ్మ చెప్పినా యిన్నావు కాదురా కొడుకో. పెద్దోళ్ళకి మన పేణాల కంటే ఆళ్ల పరువే పేణమని తెలుసుకోలేక పోయావేంట్రా. ఒరేయ్ పెద్ద బుజ్జే.. ఆళ్ళు నీకెట్టిన కేరేజీల్లో ఏ విషమెట్టి సంపేశారో నా తండ్రో’ అంటా నెత్తీ నోరూ బాదుకుంటూ నేల మీద దొర్లిదొర్లి దిక్కులు పిక్కటిల్లేలా బోరుమన్నాడు. గుండెల్లో బరువు దిగే వరకూ చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు. ∙∙ తెల్లారిపోయింది.. ‘బుల్లిబుజ్జి’ గాడి పెళ్లైపోయింది. ‘మన పెద్దోడు రాలేదయ్యా!’ దిగులుగా శ్రీరామ్మూర్తి భుజం మీద తలవాల్చింది వరలక్ష్మి. ‘ఏదో ఓ రోజు వొత్తాడు లేవే.. ఆడికి మనమంటే పేణం. పేణాల్ని వదిలేసి ఈ భూమ్మీద ఎవడు మాత్రం ఎంతకాలం ఉండగలడే’ శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పెద్దబుజ్జి భూమ్మీద లేడని తెలిస్తే వరలక్ష్మి బతికి బట్టకట్టలేదని శ్రీరామ్మూర్తికి తెలుసు. అందుకే విషయం ఎక్కడ బయటికి పొక్కనీయొద్దని ఆరాత్రే బేబమ్మ చేత ఒట్టేయించుకున్నాడు. పెద్దబుజ్జిగాడ్ని చంపేశారన్న విషయం ఇప్పుడు ఆ ఊళ్ళో ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు. ‘పరువు’ కోసం పెద్దబుజ్జిగాడ్ని చంపించేసిన బుల్రాజుగారికి, ఆయన చెప్పినట్టే అన్నం కేరేజిలో విషం కలిపి చంపేసిన వీరంశెట్టికి ఆ విషయం ఆళ్ళకి తెలిసిపోయిందని ఏమాత్రం తెలీదు. ‘పెద్దబుజ్జిని’ తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన వరలక్ష్మి, ఆడు రాజుగారి పొలంలో పని చేసినన్నాళ్లు కొడుకులా కనిపెట్టుకుని ఉన్న పుణ్యవతిగారు.. ఆడి కోసం ఆశగా ఎదురు చూస్తానే ఉన్నారు. -శ్రీనివాస్ కుడిపూడి -
బాల్యపు స్మృతుల ప్రతిరూపం-రెక్కలపిల్ల
1980, 90, ఈ శతాబ్ది ఆరంభ దశకాల్లోని పిల్లలు ఎంతైనా అదృష్టవంతులని చెప్పాలి. వారి జీవితాల్లో ఆటలున్నాయి. పాటలున్నాయి. అందమైన స్నేహాలున్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. బాల్యపు మధురిమలను అందంగా అమాయకంగా తమలోకి ఒంపుకున్న రోజులున్నాయి. బడిలోని విద్యతోపాటు సమాజంలో తోటి పిల్లలతో ఆడిపాడి- కులమత వివక్షలకు అతీతంగా పెనవేసుపోయి.. మనిషిలో సంకుచిత్వాన్ని నాటి బాల్యం ఎద్దేవా చేసింది. అమాయకంగా అందరినీ కలుపుకొనిపోయింది. మనుషులకు గీతల్లేవన్నది. మతాల్లేవన్నది. ధనిక-బీద భేదాల్లేవన్నది. దోస్తులతో గుంపులుకట్టి.. అప్పటి బచ్‌పనా తనవారి కోసం ఒక చిన్నసైజు గ్యాంగ్‌వారే చేసింది. మరీ అప్పటి పిల్లలు ఇప్పటి జనరేషన్‌లా ట్రెండీ కాదు. వారికి సెల్‌ఫోన్ తెలియదు. టీవీతో పరిచయం అంతంతమాత్రమే. స్కూలు అయిపోగానే ఇంటికి పరిమితమైపోయి.. ఐదంగుళాల తెరలోకి తల దూర్చి అదే లోకమనుకునే చెడ్డలవాటు అప్పటి పిల్లలకు తెలియదు. అందుకే స్కూలు అయిపోగానే అప్పటి పిల్లలు బ్యాగులు ఇంటిలో పడేసి.. స్వేచ్ఛాగా రెక్కలు విడిచిన పక్షుల్లా వీధుల్లోకి పరిగెత్తుకువచ్చేవారు. తోటి పక్షులతో కలిసి కిచకిచమంటూ అలా స్వేచ్ఛగా విహారానికి వెళ్లేవారు. ఆడేవారు. పాడేవారు. కథలు చెప్పుకునేవారు. అందులో దెయ్యాల కథలు, రాకుమారుల కథలు ఉండేవి. అమ్మలు-నాన్నలు, అమ్మలక్కలు చెప్పుకునే విషయాలుండేవి. ఆటలుండేవి. ఆటల్లో దెబ్బలుండేవి. ఆ ఆటల్లో తాకిన దెబ్బలు దాచుకొని.. దాచుకొని అమ్మకు తెలియకుండా ఇంట్లో నక్కి పండుకునే రోజులుండేవి. ఎంత విచిత్రమైనది బాల్యం. అదొక మాయాలమరాఠీ. ఎన్నో విచిత్రాలు చూపించి.. అమాంతం కరిగిపోయింది. మంత్రదండంలా, ఇంద్రజాలికుడిలా ఎన్నో అద్భుతాలను చూపించి మాయమైంది. స్వచ్ఛమైన అమాయకత్వం బాల్యం. లోకం తెలుసుకోవాలన్న తపన బాల్యం. నిరంతరం ఏదో కొత్త విషయం కోసం ఆరాటపడి ఏది తెల్సినా అదో వింతలా అబ్బురపడే సంచార సహజనైజం బాల్యం. అదొక వజ్రాలగని. తవ్వి చూడండి ఎన్నో అద్భుతమైన మణులు దొరుకుతాయి. జీవితంలోకి మరెంతో వెలుగు వస్తోంది ఆ రంగురంగుల మణుల నుంచి.. అలా బాల్యాన్ని తవ్వితీసి.. అందులోని రంగురంగు మణులను, అద్భుతాలను, చెణుకులను, అల్లరిని, ఆటపాటలను, అమ్మనాన్న, స్నేహితులు, చుట్టు ఉన్న సమాజాన్ని అప్పటి కళ్లతో అంతేగా అమాయకంగా, అంతే స్వచ్ఛంగా అందిస్తే అది రెక్కలపిల్ల పుస్తకమవుతుంది. 56 కథలు, 260 పేజీలు.. ఓ అమాయకపు బాల్యం. ఏ కల్మషమెరుగని పసితనం స్వచ్ఛమైన రెక్కలు తొడిగే ఆకాశమంతా విహరిస్తే.. ఈ రెక్కలపిల్ల అవుతుందేమో. బాల్యం రెక్కలు తొడుగుతూ తొలి అడుగులు వేస్తున్న దశలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి మధ్య ఓ చిన్నారి తన దోస్తులతో ఒక గ్యాంగ్‌లా ఏర్పడి చేసిన విన్యాసాలు, మనషుల పట్ల ప్రేమతో కూడిన బాల్యపు స్మృతులు, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకుంటూ.. దానిపట్ల స్పందించే తీరు.. దాని ప్రశ్నలు.. అన్నింటికీ మించి స్వచ్చమైన అమాయకత్వం.. ఇది రెక్కలపిల్లలోని కథల వరుస. ఈ పుస్తకంలోని అన్ని కథల్లోనూ బాల్యపు ఫ్లేవర్ ఉంటుంది. అన్ని చదివింపజేస్తాయి. చాలావరకు కథలు కథనాత్మకంగా ఉండి చివరివరకూ ఏం జరుగుతుందా? అన్నంత ఆసక్తి రేపుతాయి. గడుసుతనం, పెంకితనం, అనుకుంటే ఏదైనా చేసే బాల్యపు మొండితనం ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో చాలాచోట్ల ప్రశ్నలు చిత్రంగా ఉంటాయి. బాల్యపు ప్రశ్నలు. అమాయకపు ప్రశ్నలు. వాటికి లభించే సమాధానాలు కూడా చిత్రమైనవే అనిపిస్తాయి. పున్నాగ పూలు, వీరబాబు, పడవ ప్రయాణం, వాన కోసం తపస్సు, యాది-జారుడుబండ, ఓ స్త్రీ రేపు రా, జ్వాలాతోరణం కథలు నాకు బాగా నచ్చాయి. యాదగిరి-చిల్లర, రంగ-కలువపూలు, ఓకులు-బెచ్చాలు, అవ్వా-దీపావళి కూడా మంచి కథలు. పిల్లలు అన్ని మతాలను, దేవుళ్లను సమానంగా చూస్తారనడానికి ఇందులో హిందు, ముస్లిం, క్రైస్తవ నేపథ్యాలతో ఉన్న కథలు చాటుతాయి. ఓ స్త్రీ రేపు రా కథలో తన ఇంటి మీద రాయకుండా, తన ఫ్రెండ్ పద్మ ఇంటి మీద రాసి ఉన్న `ఓ స్త్రీ రేపు రా` అన్నది చెరిపేయడం.. దానివెనుక ఉన్న కారణం, జ్వాలాతోరణం కథలో గుడ్డివాడిగా చెప్పి అడుక్కుంటున్న తాతతో జ్వాలాతోరణం కింద నడిపించడం వంటి ట్విస్టులు, లారీ- ఇల్లు కథలో తండ్రికి ఇంటికి రాకపోతే.. రాత్రిపూట ఒంటరిగా బజారు వరకు ధైర్యంగా వెళ్లిరావడం వంటివి కొసమెరుపులు ఆహ్లాదపరుస్తాయి. మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపడానికి, ఆనాటి మధురాతిమధురమైన స్నేహపు స్మృతులను నెమరువేసుకోవడానికి ఈ పుస్తకాన్ని ఓసారి చదివితీరాల్సిందే. - శ్రీకాంత్ కాంటేకర్ ‘రెక్కలపిల్ల’ కథల పుస్తకం. కవయిత్రి, రచయిత్రి శ్రీసుధ మోదుగు రెండో పుస్తకమిది. ఆమె ఇంతకుముందు రాసిన ‘అమోహం’ కవితాసంపుటి పాఠకుల మన్ననను పొందింది. రచయిత్రి ప్రస్తుతం జమైకాలో నివాసముంటున్నారు. వైద్యరంగంలో స్థిరపడ్డారు. -
తెలుగు కథలు జీవిత సవుస్యలకు దర్పణం
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: వర్తమాన ఆకాంక్షలకు, జీవిత సమస్యలకు, రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామాలకు తెలుగు కథ దర్పణం పడుతోందని సుప్రసిద్ధ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు అన్నారు. సోమవారం సాయంత్రం రంజని తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో ఏజీ ఆఫీసు ఆరుబయట రంగస్థలంలో 2013 రం జని నందివాడ భీమారావు కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఆయు న ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన రచయితలు తెలుగు కథను పరిపుష్టం చేస్తున్నారని చెప్పారు. పదేళ్ల క్రితం అవార్డును ఏర్పాటుచేసిన రచయిత నందివాడ భీమారావు మాట్లాడుతూ కథల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని.. గతేడాది ఆస్తమించిన తన శ్రీమతి నందివాడ శ్యామల సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది రచయిత్రి జ్వలితకు ప్రదానం చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. పోటీలు కొత్తవారిని బాగా ప్రోత్సహిస్తాయని, రంజని వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని జ్వలిత చెప్పారు. విజేతలు వీరే.. నందివాడ భీమారావు కథల పోటీలో మొదటి బహుమతిగా రచయిత ఆర్. కశ్యప్ (రామదుర్గం మధుసూదనరావు) రాసిన ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ’ కథ ఎంపికైంది. రచయితకు బహుమతిగా రూ. 4వేలు అందజేశారు. రెండవ బహుమతిగా రచయిత పి. శ్రీనివాస్‌గౌడ్ రాసిన ‘మార్జినోళ్ళు’ గెల్చుకుంది. నగదు బహుమతి రూ. 3వేలు అందజేశారు. మూడో బహుమతిని రంగనాధ రామచంద్రరావు సొంతం చేసుకున్నారు. నాల్గో స్థానంలో ఉపేందర్ రాసిన ‘జ్ఞాపకం’ నిల్చింది. రంజని అధ్యక్షుడు సుందరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రంజని ప్రధాన కార్యదర్శి మట్టిగుంట వెంకటరమణ, ఉపాధ్యక్షుడు నంద్యాల మురళీకృష్ణ, కోశాధికారి ఆదిశేషు పాల్గొన్నారు.