కథ: మరైతే.. ఎవరీ మనిషి? | Yenuganti Venugopal Maraithe Evaree Manishi Telugu Short Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

కథ: మరైతే.. ఎవరీ మనిషి?

Published Sun, Oct 17 2021 11:32 AM | Last Updated on Sun, Oct 17 2021 12:03 PM

Yenuganti Venugopal Maraithe Evaree Manishi Telugu Short Story In Funday Magazine - Sakshi

హాల్లో కూర్చుని పేపర్‌ చదువుకుంటున్న శివకుమార్‌ ‘ఏవోయ్‌!’ అంటూ గట్టిగా కేకేశాడు వంటింట్లో ఉన్న వనజమ్మకు వినపడేలా.
‘ఏంటండీ!’ అంతే గట్టిగా అరిచిందావిడ.


‘బదులుకు బదులు అరవడం ఆపి, కాసేపు ఇటు వైపొస్తావూ? నాకెందుకో భయం భయంగా ఉంది’
‘అబ్బబ్బా! నేను మీ పక్కన లేకపోతే ఒక్క ఘడియ ధైర్యంతో ఉండరు కదా! ఇప్పుడేమైపోయిందని చిన్న పిల్లాడిలా అంత భయం?’ విసుక్కుంటూ వచ్చిందక్కడికి.
‘కొల్లేటి సరస్సులో తప్పిపోయిన పిల్లకొంగలా ఉంది నా పరిస్థితి. పంచ్‌లు ఆపి, పరిష్కారం చూపవూ?’
‘మరీ పిల్ల కొంగ ఏంటండీ? ముసలి కొంగ అనలేరూ?’ అని ఓవైపు దెప్పుతూనే, మరొకవైపు ‘అసలు విషయమేంటో తెమల్చండి!’ అంది.
‘ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు తెలుసా?’ అనడిగాడు.

‘అవును. రేపు ఒకటవ తారీఖు కూడా! తమరికి ఎందుకొచ్చిందీ డౌటు?’
‘ప్రతినెలా ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు. ఆ రామారావు, నాగేశ్వరరావు, కాంతారావులు నన్ను వదలకుండా చంపుకు తింటున్నారనుకో!’
‘తినరూ మరి! ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తమరికి పడదు మొర్రో అని మొత్తుకున్నా, నా మాట విన్నారా? అనుభవించండి’
‘తరుణోపాయం ఆలోచించి, ఓ నారీ! నీ ఆలోచనల అంబుధి నుంచి ఒక చిటికెడు ఉపాయాన్ని నాకు విదిల్చవూ?’ వేడుకున్నాడు శివకుమార్‌
‘ఎంచక్కా నెలనెలా వచ్చే పెన్షన్‌తో గడిపితే ఈ తిప్పలు ఉండేవా చెప్పండి? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో రిటైర్మెంట్‌ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌తో కోటలు కట్టారని ఎగిరితే, ఏమైంది? అడ్వాన్సులు ఇచ్చి బేరం పెట్టుకున్న ఫ్లాట్స్‌ అమ్ముడు పోక, పనికిమాలిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది’

‘సర్లేవోయ్‌! తెల్లవారడం ఆలస్యం వాళ్లంతా ఇక్కడ ప్రత్యక్షమవుతారు. ఈనెల అమౌంట్‌ ఇచ్చేస్తానని వాగ్దానం చేశాను. ముందైతే గండం గట్టెక్కించు‘ ప్రాధేయపడ్డాడు శివకుమార్‌.
‘అయితే నేను చెప్పినట్టు చేయండి. మిగతా డ్రామా నేను నడిపిస్తా!’ అంటూ ఆ ఉపాయాన్ని భర్త చెవిలో ఊదేసింది వనజమ్మ.
తలాడించాడు శివకుమార్‌.
భార్య చెప్పిన విషయాన్ని  ఇంకా రిహార్సలే చేయలేదు.. ఊహించని విధంగా ఊడి పడ్డాడతను పిడుగులా. ‘ఇప్పుడెలా?’ అన్నట్టు భార్య వంక దీనంగా చూశాడు శివకుమార్‌.

‘ఏం వర్రీ అవకండి!’ చేత్తో సైగ చేసింది వనజమ్మ.
బక్కపలచ బాడీకి లాల్చీ పైజామా తగిలించుకున్న రామారావు, చంకలో లెదర్‌ బ్యాగ్‌తో యమ హుషారుగా లోపలికి దూసుకొచ్చాడు. శివకుమార్‌ పక్కన సోఫాలో కూర్చుంటూ ‘నమస్కారం మాస్టారూ!’ అన్నాడు పళ్ళికిలిస్తూ.
‘ఇంకా ఒకటో తారీఖు రానేరాలేదు. అంత ఆత్రం దేనికో?’ మనసులో తిట్టుకున్నాడు శివకుమార్‌.
ఆ మూగభాష అర్థం చేసుకున్న వాడిలా ‘రేపు వస్తే కాంపిటీషన్‌ ఉంటుంది కదా.. అందుకే ముందు వచ్చానన్న మాట!’ ఈనెల ఎలాగైనా శివకుమార్‌ నుంచి డబ్బులు రాబట్టాలని చాలా దృఢసంకల్పంతో ఉన్నాడు రామారావు.

కట్టెలా బిర్ర బిగుసుకుపోయిన భర్త వాలకాన్ని చూసి  వెంటనే యాక్షన్‌ పార్ట్‌లోకి దిగింది వనజమ్మ.. ‘అయ్యో! ఈయన ఆయన కాదన్నయ్యా!’ అంటూ. 
శివకుమార్‌ ముఖంలోకి ముఖం పెట్టి మరీ చూస్తూ ‘ఏం, ఈ మాస్టారు మీ వారు కాదా? చిన్నప్పుడు తప్పిపోయి ఇన్నేళ్ళకి ఇంటికి తిరిగొచ్చిన డబల్‌ సీనా?’ ఆశ్చర్యపోయాడు రామారావు, 
‘అంత  సీన్‌ లేదు’ అంది వనజమ్మ.
‘నాటకాలా?’
‘అయ్యో ఎంత మాట అనేశారు అన్నయ్యా!’ నొచ్చుకుందావిడ.
‘మరైతే ఎవరీ మనిషి?’ అంటూ అనుమానంగా చూశాడు శివకుమార్‌ వంక.

ఎమోషనల్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తూ ‘ఈయన ఆయనే! కానీ, మునుపటి మన మనిషి కాదన్నయ్యా!’ కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది.
‘మామూలుగా చెబితేనే నాకస్సలు అర్థం కాదు. అలాంటిది ఈ వంకర్లు టింకర్లు నైజాంతా! కాస్తంత డీటెయిల్డ్‌గా చెప్పు చెల్లెమ్మా!’ ప్రాధేయ పడ్డాడు రామారావు.
రియలిస్టిక్‌గా రియాక్ట్‌ అవుతూ ‘ఈయనకి మతిమరుపు వచ్చింది అన్నయ్యా!’ అంది సీన్‌ని ఆస్కార్‌ లెవెల్‌లో పండిస్తూ.
ఖంగుతిన్న రామారావు  ‘వామ్మో! తలకి బలంగా దెబ్బ తగిలి గతం మరచిన కేసా? లేక అలై్జమర్సా?’ అంటూ శివకుమార్‌ నుంచి రావాల్సిన అంత డబ్బు గుర్తుకొచ్చి అపరిచితుడిలా పిచ్చి చూపులు చూశాడు.
‘అంతకంటే ఎక్కువే!’ అంది వనజమ్మ అతడిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తూ.
‘అంటే?’ అన్నట్లుగా చూశాడు రామారావు. 

‘పాలీమర్స్‌ అంట! గతం మర్చి పోవడమే కాదు. బొమ్మలా కూర్చోవడం ఈ జబ్బు లక్షణాలంట. అలై్జమర్స్‌ కంటే అడ్వా¯Œ ్స స్టేజ్‌!’ అంటూ మరోమారు నోటికి కొంగు అడ్డం పెట్టుకుంది వనజమ్మ.
‘ఇప్పుడు నేనేం చేయాలి?’ తల మీద రెండు అరచేతులు ఉంచుకొని వాపోయాడు రామారావు.
అతను తన  కహానీ నమ్మేశాడనే ఉత్సాహం ఆపుకోలేక ‘బ్యాగూ గీగూ సర్దుకుని చక్కా వెనుదిరిగి వెళ్లిపోవడమే!’ తన ప్రజెంట్‌ రోల్‌ మరచి శివకుమార్‌ నోరుజారాడు.
‘డింకు చకా.. మీ ఆయన పాలిమర్స్‌ హుష్‌ కాక్‌! నేను కనబడగానే గతమంతా ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా గుర్తుకు వస్తున్నట్టుంది’ హుషారుగా అరిచాడు రామారావు.
తనని కోపంగా చూస్తున్న భార్య వైపు తల తిప్పిన శివకుమార్‌ చప్పున నాలిక్కరుచుకుంటూ ఎప్పటిలా చెక్కిన కట్టె బొమ్మలా కదలకుండా ఉండిపోయాడు. తిరిగి రామారావు తన ముఖంలో ముఖం పెట్టి చూసేలోగా!

‘ఆయనకి గతం గుర్తుకు రావడం కాదు! ఆయనకి పాలిమర్స్‌ వచ్చిందని తెలిసిన షాక్‌లో నా గొంతు విని మా ఆయన గొంతు అనుకున్నట్టున్నారు’
‘నో ఛాన్స్‌! ఆడ గొంతుకి మగ గొంతుకి కూడా తేడా తెలియనంత వెర్రిబాగుల వాడినా చెల్లెమ్మా?’
‘అయ్యయ్యో ఎంతమాటన్నయ్యా! మీరు వెర్రిబాగుల వారని ఎవరన్నారు? మీ చెవులు మీ మాట వినాలి కదా’  అసలే కన్ఫ్యూజన్‌ మనిషి అయిన రామారావు .. వనజమ్మ మాటలకు మరింత కన్ఫ్యూజ్‌ అయ్యాడు.
మన చెవులు మన మాట వినకుండా కూడా ఉంటాయా? బుర్ర గోక్కుంటూ ‘ఏదీ? తిరిగోసారి ఆ డైలాగ్‌  చెప్పమ్మా!’ అవునో కాదో తేల్చుకుందామని అనుమానంగా అడిగాడు రామారావు.
ఇలాంటి ఎగ్జామేదో రామారావు నుంచి  ఎదురవుతుందని పసిగట్టిన వనజమ్మ ఆ డైలాగ్‌ని ఆల్రెడీ బట్టీ పట్టేసింది. ‘మూటాముల్లె సర్దేసుకుని చక్కా వెనుతిరిగి వెళ్లిపోవడమే!’ అనేసింది. 

‘డైలాగ్‌లో ఏదో తేడా కొడుతున్నట్టుందే!’ అనుమానం వ్యక్తపరచాడు రామారావు.
నాలుక కరుచుకుంటూ ‘బ్యాగూ గీగూ అనబోయి.. అన్నాను అంతే కదా!’ అంది.
ఏం తోచలేదు రామారావుకి. మెల్లగా లేచాడు. వెళ్ళబోతున్న రామారావుని ఆపి ‘అన్నయ్యా, మీరో సాయం చేసి పెట్టాలి’ అడిగింది వనజమ్మ.
‘ఇప్పటికే లక్షలు లక్షలు సాయం చేశాను మీ ఆయనకు. ఇంకా నా వల్ల కాదమ్మా!’ .
‘అయ్యో, ఆ సహాయం కాదన్నయ్యా!’
జేవురించిన మొహంతో ‘రవ్వంత సహాయం కూడా నావల్ల కాదంటే కాదు!’  మొత్తుకున్నాడు రామారావు.
‘మరేంటి.. ఆమధ్య మా ఆయన మీ గురించి అంతలా చెప్పారు?’ విసిరిందొక బాణం.
‘ఏమని?’ కుతూహలంగా అడిగాడు.

 ‘రామారావు గారైతే కాస్త నయం! డబ్బులు లేవంటే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు జలగల్లా పట్టి పీడిస్తారనుకో!’ అంటూ ప్లాన్‌ బి ప్రయోగించింది. 
కాస్త మెత్తబడుతూ ‘ఏమో చెల్లెమ్మా!’ అన్నాడు.
ప్లాన్‌ వర్కవుట్‌ అయ్యిందని ‘మా ఆయనకి పాలిమర్స్‌ జబ్బు వచ్చిందని మిగతా వాళ్ళకి కూడా  సూచనప్రాయంగా చెప్పండి అన్నయ్యా!’
‘చెప్పక చస్తానా! సరేనమ్మా!’ అంటూ వెళ్ళిపోయాడు రామారావు.
‘యాహూ!’ అంటూ ఆనందంతో  శివకుమార్‌ చిన్న పిల్లవాడై పోయాడు. అప్పటికి గండం గట్టెక్కింది. ముందుంది ముసళ్ళ పండుగ.
∙∙ 
‘మే ఐ కమిన్‌!’ ఇంట్లో వాళ్ల అనుమతి లేకుండానే లోపలికి దూసుకు వచ్చాడతను. ఇదివరకెప్పుడూ అతడిని చూడని శివకుమార్, వనజమ్మ తెల్ల మొహాలేశారు. టక్కు, టై, మిల్ట్రీ కటింగ్‌తో కుర్రాడు యమ హుషారుగా ఉన్నాడు. రెండు చేతులెత్తి ఇద్దరికీ నమస్కారం చేసి, వాళ్ళకెదురుగా కూర్చున్నాడు.
‘నా పేరు కృష్ణంరాజు’ వాళ్లను అట్టే సస్పె¯Œ ్సలో పెట్టక తనని తాను పరిచయం చేసుకున్నాడు.
ఈమధ్య కొత్త వాళ్లెవరు ఇంటికొచ్చినా శివకుమార్‌ ‘పాలిమర్స్‌ రోల్‌’ ప్లే చేస్తున్నాడు ఎందుకైనా మంచిదని!
‘ఇంతకూ నీవొచ్చిన పనేంటో’ వనజమ్మ, భుజానికి ఉన్న ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి టకటకా ఏవో బటన్స్‌ ప్రెస్‌ చేసి తిరిగి దాన్ని మూసేస్తూ ‘మీ వారి పేరు  నాటకాల శివకుమార్‌ కదా ఆంటీ!’ అనడిగాడు. 
             కంగారు పడుతూ ‘అవును. నీకెట్లా తెలుసు?’ ఆశ్చర్యపోయింది వనజమ్మ. 
             ‘ మీవారు సర్వీసులో ఉండగా ఆ కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తుల పేరిట ‘హాంఫట్‌ బీమా’ కంపెనీతో డీలింగ్‌ కుదుర్చుకున్నారు. ఆ బీమా కంపెనీ ప్రతినిధిని. మీ వారికిప్పుడు తొమ్మిదిలక్షల ఎనభైఏడు వేల ఆరువందలయాభై నాలుగు రూపాయలు రావాల్సి ఉంది’ చెప్పాడు. 

అది వింటూనే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. శివకుమార్‌కి లోలోపల మహా ఉబలాటంగా ఉంది. ఎప్పుడు ఆ అమౌంట్‌ని హ్యాండోవర్‌ చేసుకుందామా అని!
వెంట తెచ్చిన ఫైల్లోంచి ఒక పేపర్‌ తీసి ‘ఈ కాగితం మీద మీవారు ఒక్క సంతకం పెడితే ఆ డబ్బులు శాలరీ అకౌంట్లో పడిపోతాయి’ అంటూ ఆమెకి అందించాడు.
తన భర్త ‘పాలిమర్స్‌ జబ్బు’ గురించి చెప్పేసింది ఏకధాటిగా!
‘అయితే ఈయన సంతకం పెట్టడం కుదరదన్నమాట!’ అంటూ చప్పున ఆ కాగితాన్ని ఆమె చేతిలోంచి లాక్కున్నాడు కృష్ణంరాజు.
‘అంత తొందర ఎందుకయ్యా! ఆయనతో నేను పెట్టిస్తాగా!’ అంది.
‘కుదరదు అంటీ! శివకుమార్‌ గారు ఈ కాగితం మీద సంతకం పెట్టేటప్పుడు ఒక వీడియో తీసి, దాన్ని వాట్సాప్‌లో హెడ్‌ ఆఫీస్‌కి పంపాల్సి ఉంటుంది.’
డైలమాలో పడింది వనజమ్మ. కృష్ణంరాజు కంటపడకుండా శివకుమార్‌ భార్యకు కనుసైగ చేశాడు. ‘ఒక చిన్న హెల్ప్‌ బాబూ!’ అని అడిగింది వనజమ్మ. వరాలిచ్చే దేవుడిలా తలూపాడతను.

‘ఒక పది నిమిషాలు అలా ఇంటి బయట ఉండి వస్తావూ?’ విన్నవించుకుంది. 
‘ష్యూర్‌ ఆంటీ!’ అంటూ బయటకు వెళ్లాడు.
‘ఏమోయ్‌! మా ఆఫీసువాళ్ళు ఉద్యోగస్తుల పేరుతో బీమా చేసినట్టు మాకెప్పుడూ వినపడలేదే!’ బుర్ర గోక్కున్నాడు శివ కుమార్‌.
‘ఆ..మీ చాదస్తం నాకు తెలియదా?మీ తాత చుట్టం అయినట్టు డబ్బులొస్తాయంటూ పనిగట్టుకొని ఇతగాడు ఇంటిదాకా వస్తాడా? బుర్ర తక్కువ ఆలోచనలు మానేసి, ముందు ఏం చేద్దామో చెప్పండి’ భర్తను తొందర పెట్టింది వనజమ్మ.

‘ఈ కృష్ణంరాజు దగ్గర కాసేపు ఆ పాలిమర్స్‌ జబ్బుకు పాతరేస్తే సరి!’ పరిష్కారం చెప్పాడు శివకుమార్‌. వనజమ్మ తలూపుతూ పిలిచిందతడిని.
లోపలికి వస్తూనే ‘అంకుల్‌ ఓకే కదా..!’ క్లారిఫై కోసం అడిగాడు  కృష్ణంరాజు.
‘మీ ఆంటీకే పాలిమర్స్‌! నాకేం? దుక్కలా ఉన్నాను చూడూ?’ అన్నాడు శివకుమార్‌ దర్పంగా.
హీరో చేత విలన్‌ తుక్కుతుక్కుగా తన్నులు తిన్నాక క్లైమాక్స్‌లో పోలీసులు వచ్చినట్టు కృష్ణంరాజు విజిల్‌ ఊదగానే పోలోమని రామారావు, నాగేశ్వరరావు, కాంతారావులు పరుగు పరుగున వచ్చారక్కడికి!

‘తెలివి తేటలు నీకే ఉన్నాయనుకుంటే ఎలా శివకుమార్‌? మీ ప్లాన్‌కు విరుగుడు ప్లాన్‌ మా దగ్గరా ఉంటుంది’ అని రామారావు అంటుంటే నిశ్చేష్టులైన శివకుమార్‌ దంపతులు నిజంగానే పాలిమర్స్‌ జబ్బు వచ్చిన వాళ్లలా బిర్ర బిగుసుకుపోయారు.
కాస్త తేరుకున్నాక కృష్ణంరాజు వంక చూస్తూ ‘మరైతే ఎవరీ మనిషి?’ అడిగాడు శివకుమార్‌ వణుకుతున్న గొంతుతో. 
‘మేం ముగ్గురం కలసి తెచ్చుకున్న కిరాయి మనిషి!’ అంటూ బిగ్గరగా నవ్వాడు నాగేశ్వరరావు.      

- ఎనుగంటి వేణుగోపాల్‌                        

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement