కథ: కథకుడు | Vemuri Satyanarayana Kathakudu Telugu Short Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

కథ: కథకుడు

Published Sun, Nov 21 2021 3:43 PM | Last Updated on Sun, Nov 21 2021 3:46 PM

Vemuri Satyanarayana Kathakudu Telugu Short Story In Funday Magazine - Sakshi

ఆ సాయంత్రం కథావేదిక సమావేశానికి ఎంత ప్రయత్నించినా టైమ్‌కి బయల్దేరలేకపోయాను.. ఒకరి తర్వాత ఒకరు అతిథులు రావటంతో. వెళ్లకుండా మానేద్దాం అనుకుంటే ఆరోజు ‘జనరంజకంగా కథ’అనే అంశంపై నేను మాట్లాడవలసి ఉంది. అతిథుల హడావుడి అయిపోయాక, బస్సులో వెళితే సమయానికి చేరలేను అని క్యాబ్‌ బుక్‌ చేశాను. ఇదిగో వచ్చేస్తుంది అనుకుంటుండగా మెసేజ్‌.. ‘మన్నించాలి ముందు బుక్‌ చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాడు.

మీకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని.  మొత్తానికి మరో రెండు (ఇద్దరు) డ్రైవర్‌ రద్దుల తర్వాత, పావుగంట సమయం ఖర్చు అయ్యాక వచ్చింది క్యాబ్‌. అది ఆగటంతోనే క్యాబ్‌ డ్రైవర్లందరి మీద చిరాకు భావంతో వెళ్లాను ఎడమవైపు తలుపు దగ్గరకు. ఇంతలో తటాలున తన వైపు డోర్‌ తీసి పరుగున వచ్చి ఈ వైపున ఉన్న డోర్‌ తీసి పట్టుకుని ‘రండి సార్‌’ అన్నాడా డ్రైవర్‌. ఆశ్చర్యంగా చూశాను అతని వైపు. అంతకుముందు డ్రైవర్ల మీద ఏర్పడ్డ చిరాకు మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది అతడి ప్రవర్తనతో.   నేను కూర్చున్న తర్వాత తలుపు మూసి వెళ్లి తన సీట్లో కూర్చుని తన వైపు డోర్‌ కూడా వేసుకుని సీట్‌ బెల్ట్‌ పెట్టుకుంటూ నా వంక తిరిగి ‘స్టార్ట్‌ చేయనా సార్‌’ అన్నాడు. నేను అంగీకారంతో తల వూపడంతో అతడి మొబైల్లో ట్రిప్‌ స్టార్ట్‌ చేసి, కారు స్టార్ట్‌ చేశాడు.

 కాస్త దూరం వెళ్ళామో లేదో, పక్కనున్న అడ్డరోడ్డులోంచి హఠాత్తుగా.. వేగంగా.. మేం వెళ్తున్న కారుకి అడ్డంగా వచ్చిందో స్కూటర్‌. ఈ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వెయ్యకపోతే ఆ స్కూటర్‌ని గుద్దేసేదే కారు. సడన్‌ బ్రేక్‌ వెయ్యడంతో నేను సీట్లో ఎగిరి దాదాపు తల టాప్‌కి తగిలి మళ్లీ కూలబడ్డాను. ఆ స్కూటర్‌ అతన్ని తిడుతున్నాడు క్యాబ్‌ డ్రైవర్‌.
తిరిగి కారు బయల్దేరాక గమనించాను నా కాళ్ల దగ్గర పడి ఉన్న కథల పుస్తకాన్ని. డాష్‌ బోర్డు మీద ఉన్నది ఎగిరి పడినట్లు ఉంది. తీసి అక్కడ పెడుతూ చూశాను అది నా కథా సంకలనమే. ఇటీవలే వచ్చిన మూడో కథా సంకలనం.
ఇప్పటికే వందకు పైగా కథలు, మూడు నవలలు, కొన్ని వ్యాసాలు రాసిన సీనియర్‌ రైటర్‌ని. అయినా ఒక క్యాబ్‌ డ్రైవర్‌ దగ్గర నా కథల పుస్తకం చూసి ఒక కొత్త ఆనందం, గర్వం కలిగాయి.

‘పుస్తకాలు చదువుతావా?’ నా చేతిలో పుస్తకాన్ని డాష్‌ బోర్డు మీద పెడుతూ అడిగాను అతన్ని.
‘అవునండీ. ఎక్కువ కథల పుస్తకాలే చదువుతాను. ఎప్పుడూ ఒకటో రెండో కారులో పెట్టుకుంటాను, బేరాలు లేక ఖాళీగా ఉన్న సమయాల్లో చదువుకోటానికి ఉంటాయని’ అన్నాడతను.
అంటూనే ఏదో గుర్తొచ్చినట్టుగా నా వైపు ఒంగి ఆ పుస్తకం తీసుకుని వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ ఉన్న నా ఫొటో చూపిస్తూ ‘ఇది మీరేగా సార్‌’ అన్నాడు.
‘నేనే’ అన్నాను.. మనసులో గర్వం.

ఆ పుస్తకాన్ని నాకు ఇస్తూ ‘మీ సంతకం పెట్టి ఇవ్వండి సార్‌. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా కారులో ఇలా రావటం’  అన్నాడు ఉత్సాహంగా.
పుస్తకం తీసుకుని మొదటి పేజీలో సంతకం చేసి తిరిగి దాని స్థానంలో పెట్టాను.
‘థాంక్యూ సార్‌’ అని చెప్పి ఊరుకోకుండా గలగలా మాట్లాడేస్తున్నాడు.
‘మీ  కథలు చదువుతుంటే అవేవో కల్పితాలుగా అనిపించవు సార్‌ నాకు. ఎంత బాగా రాస్తారో! నా కళ్ళముందు జరిగినట్లు అనిపిస్తుంది. చాలా గ్రేట్‌ సార్‌ మీరు!’
ఆ మాటలు వింటుంటే సంతోషమే కాదు గర్వం కూడా నాకు.
క్యాబ్‌ ఎక్కేముందు తను దిగొచ్చి నా కోసం డోర్‌ తెరిచి పట్టుకున్న డ్రైవర్‌ని తొలిసారి చూశాను. పైగా అతనికి సాహిత్యం చదివే అలవాటు. చాలా గౌరవం, ఇష్టం కలిగాయి అతనిమీద.

‘నీ పేరు’ అడిగాను
‘రమేశ్‌.. సార్‌’ 
‘ఎంతవరకు చదివావు?’
‘డిగ్రీ మొదటి సంవత్సరంలో మానేశాను సార్‌’
‘ఎందుకలా? ఇంకా చదువుకోవాల్సింది’

‘పరిస్థితులు సార్‌. పేదరికం. నాన్నని ఇంకా కష్టపెట్టలేకపోయాను’
‘ఈ కారు నీ సొంతమేనా?’
‘లేదు సార్‌.. అద్దెదే’
‘ఆదాయం బాగానే ఉంటోందా’
‘పర్వాలేదు సార్‌. ఏమైనా కారు సొంతమైతే అదొక రకమైన తృప్తి. ఇంకొంచెం ఆదాయం కూడా’
నేనేం మాట్లాడలేదు. కాసేపయ్యాక అతనే అన్నాడు..

‘ఆరునెలల కిందట కారు కొనడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను సార్‌. నేను సేవ్‌ చేసుకున్న రెండు లక్షలు ఉన్నాయి. నాలుగున్నర లక్షలకు బేరం కుదుర్చుకున్నాను. ఫైనాన్స్‌కి సంబంధించిన పేపర్లన్నీ సిద్ధం చేసుకున్నాను. మర్నాడు వెళ్లి ఆ డబ్బుకట్టి ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టి కారు తెచ్చుకోవాలని ప్లాన్‌’
‘మరి?’ అని అడిగాను.
‘మనం మానవ మాత్రులమే సార్‌. అన్నీ మన చేతుల్లో ఉంటాయనుకుంటాం. ఆ రాత్రి...’ అంటూ ఆగాడు రమేశ్‌.
‘ఏమైంది మరి’ అప్రయత్నంగానే ఆత్రం దొర్లింది నా మాటల్లో. 
‘మా నాన్న పోయారు’
ఊహించని మాట. ‘అయ్యో’ సానుభూతి ధ్వనించింది నా స్వరంలో.

‘ఏ ఆరోగ్యసమస్యలు లేవు సార్‌. పడుకోబోయే ముందు ‘కారు రేపేగా తెచ్చేది. నేనూ వస్తాను వెళ్లే ముందు చెప్పు’ అని కూడా అన్నాడు. రాత్రి రెండింటికి అమ్మ ఏడుపు విని లేచాను. నాన్న ఆయాస పడిపోతున్నాడు. మాట్లాడలేక పోతున్నాడు. ఏవో సైగలు చేస్తున్నాడు’ అంటూ జరిగింది చెప్పుకుపోతున్నాడతను.
వింటున్నాను..
‘వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. లాభం లేకపోయింది. అప్పటికే పోయాడు ఆయన. హార్ట్‌ ఎటాక్‌ అని చెప్పారు డాక్టర్లు’
‘సారీ రమేశ్‌’ అన్నాను ఓదార్పుగా.

‘అదొక అదృష్టం సార్‌. అలాగే ఆస్పత్రిలో చేరి మరో నాలుగురోజుల వైద్యం తర్వాత పోయుంటే నా దగ్గరి రెండు లక్షలూ హారతి కర్పూరం అయ్యేవి. నాన్నకి న్యాయమూ చేయలేకపోయేవాడిని!’
ఆశ్చర్యంగా చూశాను అతని వంక.
‘నిజం సార్‌! అలా జరగబట్టే నా దగ్గర ఉన్న డబ్బుతో మా నాన్నని ఘనంగా సాగనంపాను. దిన కార్యాలు పూర్తయ్యేవరకూ ఏ లోటూ చేయకుండా గొప్పగా వచ్చిన బంధువులకి మందు, మాంసం ఏర్పట్లన్నీ అదిరిపోయేలా చేశాను’  
‘మీ ఆచారమా అలా చేయటం?  అంత ఖర్చుతో ప్రతి వాళ్ళు చెయ్యాలా?’ అడిగాను.

‘అదేంలేదు సార్‌. తక్కువలో కూడా కావాలంటే ముగించేయొచ్చు. కానీ నాన్న సార్‌.. ఆయన కోసం నేను చేసే ఆఖరి పని. నలుగురూ ఆయన గురించి, ఆయన చివరి జ్ఞాపకాల గురించి ఘనంగా చెప్పుకోవాలి. డబ్బుదేముంది సార్‌? ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. అలా చేసినందువల్ల నేను పొందిన ఆనందం.. తృప్తి గొప్పవి సార్‌. దానికి విలువ కట్టలేము కదా’ అన్నాడు.
ఒక్కో మెట్టు పైకెక్కి కనపడుతున్నాతను నాకిప్పుడు. 
మొదట నాకు ఇచ్చిన మర్యాద.. పుస్తకాలు చదివే అలవాటు.. తండ్రి మీద తను చూపించిన అపారమైన గౌరవం, ప్రేమ.. రెండు లక్షలు ఇంట్లో.. తెల్లవారితే కారు వచ్చేది.. ఆ రాత్రి తండ్రికి హార్ట్‌ ఎటాక్‌.. హఠాన్మరణం. తండ్రి చివరి జ్ఞాపకంగా ఆ డబ్బంతా ఖర్చు చేయటం.. ఇవన్నీ కలిపితే ఇంతకంటే గొప్ప కథావస్తువు ఉంటుందా? నాలో రచయిత ఆలోచిస్తున్నాడు.

‘సార్‌ వచ్చేశాం’ అన్నాడు రమేశ్‌.
చూస్తే  ఆలంబన స్కూల్‌ ముందు ఉన్నాం. అక్కడే కథా వేదిక సమావేశం. దిగాను.  నూటా నలభై మంది హాజరు. పర్సు తీసి రెండు వంద నోట్లు తీయబోతూ ఆగి, అయిదు వందల నోటు తీసిచ్చాను.
అతను జేబులోంచి చిల్లర తీసి ఇవ్వబోయాడు.
‘వద్దు ఉంచేసుకో’ అన్నాను.

‘ఎందుకు సార్‌?’అన్నాడతను మొహమాటంగా.
‘పర్వాలేదు ఇటు రా’ అంటూ అతన్ని నా దగ్గరకు పిలిచి ‘మీ నాన్న కోసం నువ్వు చేసిన పని నాకు నచ్చిందయ్యా. చాలా గొప్ప పని చేశావ్‌. నిన్ను కలవడం సంతోషంగా ఉంది’ అని అతని భుజం తట్టి లోపలికి నడిచాను.
నేను గేటు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి బయట కారు స్టార్టయ్యి వెళ్లిపోయిన శబ్దం వినిపించింది.
అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న వేదిక సభ్యులకు సారీ చెప్పాను. ఆ రోజుకి నేను ప్రిపేర్‌ అయిన విషయాన్ని పక్కనబెట్టి, రమేశ్‌ చెప్పిన అనుభవాన్ని ప్రస్తావించి మాట్లాడాను.

ఒక్కోసారి కల్పనని మించి వాస్తవం ఎంతగా కరిగిస్తుందో.. ఆ వాస్తవ వివరణ ఎంత ఆకట్టుకుంటుందో నా మాటల్లో చెప్పాను. ‘ఫ్యాక్ట్‌ ఈజ్‌ స్ట్రేంజర్‌ దేన్‌ ఫిక్షన్‌’ అన్న  కొటేషన్‌ గుర్తు చేశాను. అందరూ రమేశ్‌ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు.
∙∙ 
ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు రమేశ్‌ గురించి మా ఆవిడ లక్ష్మికి చెప్పాను. ‘నాన్నకి నేను చేసే ఆఖరి పని సార్‌’ అన్న అతని మాటల్ని ప్రత్యేకంగా చెప్పాను. తను కూడా ఎంతో మెచ్చుకుంది అతని వ్యక్తిత్వాన్ని.
ఆ తర్వాత లక్ష్మి వంటిల్లు సర్దుకుంటూండగా ఫోన్‌ తీసి కాసేపు ఫేస్‌బుక్‌ పోస్టులు చూస్తూ కూర్చున్నాను.
రకరకాల విషయాలు దొర్లుతున్నాయి ఆ పోస్టుల్లో. 

కవిత ఒకరు రాస్తే, కుల వివక్ష గురించి ఇంకొకరు వేదన చెందితే, మంచి మంచి ఫొటోలు.. వాటికి వ్యాఖ్యలు మరికొందరివి. వాటికింద కామెంట్లు ఆసక్తికరంగానే వుంటాయి. కొన్నిసార్లు మితిమీరిన విమర్శలతో,అసభ్యమైన భాషలతో కొన్ని అసహ్యంగానూ వుంటాయి.
అలా వాటిని చూస్తూ ఒకచోట ఆగాను.. అక్కడున్న ఒక సెల్ఫీ ఫొటో చూసి. నాకు వ్యక్తిగతంగా పరిచయం లేని ఒక ఫేస్‌బుక్‌ స్నేహితుడు.. క్యాబ్‌ డ్రైవర్‌ రమేశ్‌తో దిగిన సెల్ఫీ అది. అతనితో ఈ స్నేహితుడి పరిచయ కథనం కూడా ఉంది.

‘ఈ ఫొటోలో నాతో ఉన్న ఒక గొప్ప మనిషి రమేశ్‌ గురించి చెప్పాలి. వారం కిందట  నేను ఒక పెళ్ళికి ఇతని క్యాబ్‌లోనే వెళ్లాను. దారిలో మాటల మధ్య అతడు చెప్పిన విషయం విని అతనికి సెల్యూట్‌ చేయాలనిపించింది. ఆరునెలల కిందట అతను సొంతంగా కారు కొనుక్కోవాలి అనుకున్న సందర్భం అది. రెండు రోజుల్లో ఆ డబ్బు కట్టి మరికొంత ఫైనా¯Œ ్స తీసుకుని కారు తెచ్చుకునే ప్రయత్నం. అయితే ఒకరోజు ముందే ఒక స్నేహితుడి చెల్లి పెళ్లి.. కట్నం సమస్యతో ఆగిపోయే పరిస్థితి రావటంతో క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లి ఆ రెండు లక్షలు ఇచ్చి సాయపడ్డాడట ఆ స్నేహితుడికి.
‘డబ్బు దేముంది సార్‌? మళ్లీ సంపాదించుకోవచ్చు. నా స్నేహితుడి కష్టం చూసి తట్టుకోలేక పోయాను. ఆ గొడవ జరుగుతుండగా బిక్క మొహంతో నిలబడ్డ ఆ పిల్లను చూసి గుండె తరుక్కుపోయింది’ అన్నాడతను.

‘ఆ స్నేహితుడు నెలనెలా పదివేల చొప్పున తిరిగి ఇచ్చేస్తున్నాడు సార్‌’ అని కూడా తన స్నేహితుడి గురించి మెచ్చుకోలుగా చెప్పాడు. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ రమేశ్‌ చేసిన ఈ ఉదాత్తమైన పనిని మీతో పంచుకోవాలనిపించింది. ఈ మంచి మనిషికి జేజేలు చెబుదాం అందరం!’
చివరి వరకు చదివిన నేను అలా ఆ ఫొటోలో రమేశ్‌ వంక చూస్తూ ఉండిపోయాను. అతని అనుభవాన్ని వేదిక మీటింగ్‌లో నా మాటలతో ఆసక్తికరంగా చెప్పినప్పుడు సభ్యులు కొట్టిన చప్పట్లు గుర్తొచ్చాయి.
∙∙ 
ఈ కథని ఇంతవరకూ రాసిన నేను ఆ క«థలోని ‘నేను’ను కాదు. కథని ఫస్ట్‌ పర్సన్‌లో చెప్పే ఏర్పాటు మాత్రమే.
అంతా రాసేశాక ‘ఓ హెన్రీ’ గుర్తొచ్చి  ముగింపుగా ఈ కిందది రాశాను.
ఆరోజు రాత్రి రమేశ్‌ భార్య అతనికి పెద్దక్లాస్‌ తీసుకుంది.

‘రెండు లక్షల చుట్టూ మీకు తోచిన కథలల్లి చెప్తున్నారు సరే. మీకు కారు కొనుక్కోవటానికి తన సేవింగ్స్‌ నుంచి ఆ రెండు లక్షలు ఇచ్చిన మామయ్యగారిని ఇలా చచ్చిపోయినట్టు కథ అల్లటం.. ఛీ ఛీ...బుద్ధుందా అసలు’ అంటూ!
‘అదికాదే.. బతికున్న మనిషి చావు గురించి మాట్లాడితే వాళ్ల ఆయుష్షు పెరుగుతుందని నిన్నే ఒక పుస్తకంలో చదివాను’ అన్నాడు రమేశ్‌ ‘నాన్నా.. ఎలా ఉన్నారు?’ అని పలకరించటానికి ఆయన ఫోన్‌ నంబర్‌ డయల్‌ చేస్తూ!

- వేమూరి సత్యనారాయణ

చదవండి: Electric Motorcycle: డుగ్గు.. డుగ్గు.. మాబాగా మడతడిపోద్ది! పార్కింగ్‌ అక్కరలేదోచ్‌ ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement