రంగాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి పాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. తనవద్ద గల పాడి ఆవులకు వేళకు తిండిపెడుతూ కంటికి రెప్పలా చూసుకునేవాడు. రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆవు పాలు ముందు వాటి దూడలకు పట్టించి,ఆ తర్వాత పాలను పితికే వాడు. వచ్చిన పాలను ఇంటి అరుగు మీద పెట్టి అమ్మేవాడు.« ధర్మయ్య అమ్మే పాలు చిక్కగా ఉంటాయని, పాలల్లో చుక్క నీరు కూడా కలపడని ఊరు వారందరికీ ధర్మయ్య మీద నమ్మకం. పేరుకు తగ్గట్టుగా పాల వ్యాపారం ధర్మంగా చేస్తాడని ఊరంతా అనుకునే వారు. ధర్మయ్యకు ‘రాజయ్య’ అనే ఇరవై ఏళ్ల కొడుకు ఉండేవాడు. రోజూ పాలు అమ్మడంలో తండ్రికి చేదోడు,వాదోడుగా ఉండేవాడు. కొడుకు తోడవడంతో పాల వ్యాపారం మరింత చురుకుగా సాగేది.
ఒకసారి ధర్మయ్య తన బంధువుల ఇంట్లో పెళ్లి కారణంగా పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. పాలు అమ్మే బాధ్యత కొడుక్కి అప్పగిస్తూ ‘రాజయ్యా! ఈ మూడురోజులు వ్యాపారం జాగ్రత్తగా చూసుకో. గుర్తుంచుకో.. వ్యాపారానికి పునాది,నిజమైన పెట్టుబడి నమ్మకమే! అది కోల్పోతే వ్యాపారం చేయలేం’ అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు.
మరుసటిరోజున రాజయ్య తన తండ్రి చేసినట్టే చేసి పాలు అమ్మాడు. ఒక్క చుక్క కూడా నీరు కలపకుండా. క్షణాల్లో పాలన్నీ అమ్ముడై పోయాయి. రెండోరోజున ‘ఈ పాలల్లో కొంచెం నీళ్లు కలిపినంత మాత్రాన పాలు తెల్లదనాన్ని కోల్పోవు. ఎవరికీ తెలియదు. పైగా పాల పరిమాణం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. నాన్న రోజూ సంపాదించే డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. శభాష్ అని మెచ్చుకుంటాడు కూడా!’ అని అనుకున్నాడు.
వెంటనే ఆ పాలల్లో నీళ్లు కలిపాడు. రాజయ్య అనుకున్నట్లుగానే పాలు పెరిగాయి. ఆరోజు ఆదాయం కూడా రోజూ కంటే ఎక్కువ వచ్చింది. రాజయ్యకు చాలా ఆనందం వేసింది. ఆశ పెరిగింది. మూడోరోజు కూడా పాలల్లో నీళ్లు కలిపాడు. ఎప్పటిలాగే పాల పాత్రలు పెట్టుకుని అరుగు మీద కూర్చున్నాడు. అయితే పాలకోసం ఒక్కరూ రాలేదు. కొన్నిగంటలు గడిచాయి. పాలన్నీ పాత్రల్లో అలాగే ఉన్నాయి. నిన్న వచ్చిన ఆనందం కరిగి పోయింది. బాధేసింది. పాలన్నీ పాడైపోయాయి. వాటిని చూసి ‘అయ్యో’ అనుకున్నాడు.
నాలుగోరోజు ధర్మయ్య ఉదయమే ఇంటికి వచ్చాడు. తండ్రి రావడంతో రాజయ్య పాలల్లో నీళ్లు కలప లేదు. పాలకోసం ఊరందరూ వచ్చారు. పాలు కొన్నారు. కొంత సేపటికే పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి.
పాలు పోయించుకుని వెళ్లబోతున్న సాంబయ్యతో ‘నిన్న మీరందరూ పాలకోసం రాలేదే?’నని అడిగాడు రాజయ్య. అప్పుడు సాంబయ్య చిన్నగా నవ్వుతూ ‘మా అందరికి నీ మీద నమ్మకం పోయింది. నీ తండ్రి ధర్మయ్య ఎప్పుడూ పాలల్లో నీళ్లు కలపలేదు. ఆ నమ్మకంతోనే ధర్మయ్యను చూసి పాలుకొన్నాం’ అని చెప్పాడు.
అతి తెలివి, అత్యాశతో తాను చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నాడు రాజయ్య. తండ్రి ముందు సిగ్గుతో తలదించుకున్నాడు.
అప్పుడు ధర్మయ్య ‘నువ్వు చేసిన పని గురించి నేను ఊళ్ళోకి రాగానే సాంబయ్య చెప్పాడు. నమ్మకం కోల్పోయిన చోట వ్యాపారం రాణించదన్న సత్యాన్ని ఎన్నటికీ మరువకు’ అంటూ కొడుక్కి హితబోధ చేశాడు.
ఆ రోజు నుంచి రాజయ్య తన తండ్రి మాటను ఆదర్శంగా తీసుకున్నాడు. తండ్రి బాటను అనుసరించాడు.
- కేవీ లక్ష్మణ రావు
చదవండి: Revolt of 1857: ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు...సేఫ్టీవాల్వ్ అందుకే...!
Comments
Please login to add a commentAdd a comment