కథ: మాయ పులి | Charan Parimi Maaya Puli Telugu Short Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

కథ: మాయ పులి

Published Sun, Nov 7 2021 1:22 PM | Last Updated on Sun, Nov 7 2021 1:43 PM

Charan Parimi Maaya Puli Telugu Short Story In Sakshi Funday

అన్యాయం జరిగిన ప్రతిసారి పులి ఎక్కడున్నా సరే అక్కడ ప్రత్యక్షమవుతుంది. వేటగాడు ఎవరా అని గాలిస్తుంది. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది. దాని కోపం దాపున నక్కిన దోషికి దడ పుట్టిస్తుంది. ఏ మూలన దాక్కున్నా.. గుహలో ఉన్నా, పొదలో నక్కినా, వాసన పసిగట్టి తరిమి తరిమి బయటకు తీసుకువస్తుంది.

గాండ్రింపు, భీకర పర్జన్య నాదం. ఆ రాత్రి అడవిలో పులి గాండ్రింపు విని ధైర్యం వచ్చింది పల్లె జనానికి. హాయిగా నిద్ర పోయారు. ఎన్నాళ్లుగానో ఇదే తంతు, అంటే సృష్టి పుట్టినప్పటి నుంచీ. 
పొడవాటి సర్వీ చెట్లు, నల్లటి రాళ్ల గుట్టలు. అడవి పుట్టినప్పటి నుంచి ఉన్నట్టున్న రావి చెట్లు.. కాస్త అందంగా, ఇంకాస్త భయానకంగా కనిపించే అడవి పులికీ, పల్లేకీ జీవన రంగస్థలం.  

అడవిని ఆనుకొని ఉన్న ఆ పల్లెలో పులి దర్జాగా తిరుగుతుంది. గర్జనతో పలకరిస్తుంది. చూసి నవ్వుతుంది. పిలిస్తే పలుకుతుంది. ప్రేమగా మనుషులను రాసుకుంటూ తిరుగుతుంది. అక్కర పడ్డప్పుడు మెరిసి, తక్కిన సమయాల్లో మాయమయ్యే ఈ పులి... మాయపులి. 
‘వనమంతా చుట్టివచ్చిందీ... పూలన్నీ కోసి ఇచ్చింది అయ్యారే హై’
అంటూ మల్లిక పాడే పాటని, అడవి తిరిగి అప్పజెబుతోంది. అమ్మ ఆలకిస్తోంది.
పూలు కోయడమే మల్లిక పని. తల్లిని పాటతో లాలించడమే ఆ పసిదాని పనితనం.. పసితనం.
చెట్ల మధ్య నుంచి ఆ పిల్ల కోకిల నవ్వుకుంటూ బయటకు వచ్చింది. తల్లి చెయ్యి పట్టుకుని దారిన వెళతా ఉంది. పులి చెంగుమని వచ్చి మల్లిక కాళ్ళు నాకింది ప్రేమగా. దాని ప్రతి చేష్టా ధైర్యవాక్కు.

మల్లిక పేరుకు తగ్గట్టే సన్నగా తీగలాగా ఉంటుంది. నల్లగా.. రేగిన జుట్టుతో.. పులికన్నా పెద్ద కళ్ళతో మట్టిలో కలసిపోయే మట్టిరంగుతో వింతైన అందం గల పిల్ల. పూసల దండలు, పూల దుస్తులు వేసుకుంటుంది. వనం నుదుటిన తిలకం ఆ పిల్ల. 
అంతా తల్లి పోలికే. కానీ అమ్మ ఇంకాస్త ఘాటైన రంగులో, మరింత రేగిన జుట్టుతో..  సన్నని ఇనుప కడ్డీలా ఉంటుంది. కూతురు మాత్రం అప్పుడే పెరుగుతున్న తంగేడు మొక్కలా ఉంటుంది. ఎందుకో గానీ నాలుగడుగులు నడిస్తే నీరసం. ఎక్కడికక్కడ కూర్చుండిపోతుంది. నట్టనడి అడవిలో ఆగిపోతుంది. అలాంటప్పుడే పులి గుర్తొచ్చి ధైర్యం తెచ్చుకుంటుంది. ఆ పులి మెత్తని అడుగులతో వచ్చి ఒళ్ళు విరుచుకొని దారి చూపిస్తుంది. 

పులి ఉన్నంత వరకూ ఆ చుట్టుపక్కల ఏ వేటగాళ్లూ కనపడరు.
‘నీకు కష్టం వస్తే ఎదురు నిలబడతా’నని మాట ఇచ్చింది పులి. 
చెట్ల వెనుక దాక్కొని ‘నన్ను కనుక్కో’ అంటుంది మల్లిక. 
అది పులి.. మైళ్ల దూరాన వాసన కూడా పసిగడుతుంది. సరిగ్గా ఆ చెట్టు చాటుకు వెళ్లి ‘దోయ్‌’ అంటుంది గంభీరమైన నవ్వు ముఖంతో. 
మల్లిక తన ఆటలు సాగలేదని బుంగమూతి పెడుతుంది. పులి ఈసారి ఆ చెట్టు, ఈ పుట్టా తిరిగి కనుక్కోడానికి కష్టపడ్డట్టు నటిస్తుంది. 
గమ్మత్తయిన స్నేహమది. 

చెట్టెక్కి చింత చిగురు కోసుకుంటూ చెట్టుతొర్రలో ఉన్న ఉడతకి పులి గురించి చెబితే అది తుర్రుమని పారిపోయింది.
మల్లిక చిటారు కొమ్మకి ఎక్కితే అమ్మ కంగారుగా ‘కింద పడిపోతావు.. రామ్మా బుజ్జి కన్నా’ అంటూ అరచి మొత్తుకునేది. 
మల్లిక నవ్వి ‘పడితే పులి పట్టుకుంటుందిలే’ అని భరోసా ఇచ్చేది. 
 ఉడత నిజమా అన్నట్లు తోక ఊపి చూసింది. ‘నువ్వే చూడూ’ అని దాన్ని మెల్లగా చేతిలోకి తీసుకుని నిదానంగా బంగారు వర్ణపు పులి మీద వదిలితే.. పచ్చిక మీద పడుకున్నట్టు మెత్తగా పడుకుంది ఉడత. ‘చూశావా నా లెవెల్‌’ అన్నట్టు కళ్ళు ఎగరేసింది. 
ఆ ఆటంతా చూసి అమ్మ అబ్బుర పడుతోంది. తన బిడ్డకు పులితో ఏనాటి బంధమో అని మురిసిపోతోంది. తండ్రి ఇవ్వాల్సిన భరోసా బెబ్బులి ఇస్తోంది అని చెంపలు తడి చేసుకుంది. 
∙∙ 
ఆ రోజు ఎందుకో పులి కోపంగా ఉంది. ఎప్పుడూ లేనంత కోపం.. ఉగ్ర గాండ్రింపు చేసింది.
అదే రోజు తన స్నేహితురాలు చిన్నారికి ‘నువ్వు వస్తే పులిని నీకు పరిచయం చేపిస్తాను. అది మనకి ధైర్యం’ అని చెప్పింది. 
అప్పుడప్పుడే లోకం తెలుస్తున్న పిల్ల చిన్నారి ‘అమ్మో పులా!’ అని ఆశ్చర్యపోయింది. కానీ కలవాలనయితే ఉబలాట పడింది. 
‘మరే.. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు భయమొస్తే, చీకటి చలి పుట్టిస్తే, ఏడుపు అందుకున్నాను. అంతే కాకులూ, పిట్టలూ అన్ని నాతోపాటు రాగం తీశాయి. అది పులి దాకా వినపడింది. అంతే, పరిగెత్తుకొచ్చింది పులి. ఇక దర్జాగా దారులన్నీ తిరిగి వెళ్లాను’ అని చిన్నారికి చెప్పి నవ్వింది మల్లిక. 
 కచ్చితంగా పులిని కలవాల్సిందే అనుకుంది చిన్నారి. 

సాయంత్రం కలిశాక పులి గుర్రుమంది. ఆ దరిదాపుల్లో వేటగాడు తిరుగుతున్నాడు. ఆ వేటగాడు జంతువులను వేటాడడు.  మనుషులను మాత్రమే వేటాడుతాడు. 
పులిని చూశాక అబ్బుర పడింది చిన్నారి. మెల్లగా దువ్వి మచ్చిక చేసింది మల్లిక. అప్పటి నుంచి ఇద్దరి స్నేహానికి పులే పెద్దమనిషి. ఆట మధ్యలో గొడవ పడితే పులి తీర్పు తీర్చేది.
∙∙ 
పులిని తోడు తీసుకుని ప్రతి శుక్రవారం కొండ మీద దీపం పెట్టి రావడానికి వెళ్ళేది మల్లిక. మిగతా రోజుల్లో అయితే ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేదని అమ్మ వద్దంది. అప్పటి నుంచి పులే తోడు. పిలవగానే ప్రత్యక్షమయ్యేది, ఈమధ్య కోపంగా ఉంటోంది. అయినా సరే పిలిస్తే బయలుదేరుతోంది గుర్రుగానే. దానికి ఏమైందో ఎందుకలా ఉందో అర్థం కాక మల్లిక తల గొక్కుంది. ఇద్దరూ కొండ ఎక్కారు. అసలు ఆ కొండ మీద ఉన్న స్వామి పేరు తెలియదు. మంత్రం, శ్లోకం ఏమీ రావు. అందుకేనేమో ఆ స్వామిని ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఆయన్ని అడగాల్సింది కూడా పులినే అడిగేది ‘మమ్మల్ని చల్లగా చూడు’ అంటూ. 
కాసేపటికి ఏదో పని ఉన్నట్టు పులి  హడావుడిగా కొండ దిగి మాయమైంది. 
∙∙ 
అక్కడ మాయమై నట్టనడి అడవిలో ప్రత్యక్షమైంది.  కారణం పులి కొత్త వాసన పసిగట్టింది. తన వెతుకులాట సాగేకొద్దీ, వాసన తీవ్రమయ్యే కొద్దీ దాని కళ్ళు ఎర్రబడ్డాయి. దవడలు అదురుతున్నాయి. దాని గుర్రుమన్న శబ్దం అడవి గొంతుక అయింది. ఏదో జరిగింది? వేటగాడు ఇటుపక్కనే ఉన్నాడని పసిగట్టింది పులి. అటువైపు పరుగు తీసింది. రక్తం ఏ జీవిదో గుర్తించడం దానికి ఎంత సేపు! ఆ నెత్తురు వాసన జంతువులది కాదు.. మనిషిది. ఒక ఆడ మనిషిది! 
అల్లంత దూరాన నెత్తుటి ముఖం కనిపించింది. సగం తెగిన మొండెం. బంగారు వర్ణంలో మెరిసే ఆ  స్త్రీ శరీరం సగమే ఉంది. నడుము కింద భాగం వేరుచేసి భుజాన వేసుకొని పోయాడు వేటగాడు. 

అన్యాయం జరిగిన ప్రతిసారి పులి ఎక్కడున్నా సరే అక్కడ ప్రత్యక్షమవుతుంది. వేటగాడు ఎవరా అని గాలిస్తుంది. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది. దాని కోపం దాపున నక్కిన దోషికి దడ పుట్టిస్తుంది. ఏ మూలన దాక్కున్నా.. గుహలో ఉన్నా, పొదలో నక్కినా, వాసన పసిగట్టి తరిమి తరిమి బయటకు తీసుకువస్తుంది. ఆ వేటగాడు దొరికే దాకా వదిలిపెట్టదు. వేటగాడిని వేటాడే పులి. న్యాయంచేసి మాయమయ్యే పులి.. మాయపులి. 

శవం చుట్టూ ప్రదక్షిణ చేసింది పులి. తన శరీరంలానే బంగారు వర్ణపు పిల్ల. అందుకనే ఎక్కువ నచ్చింది కాబోలు. మోముని ప్రేమగా నాకింది. ఆమె చేతిని తాకింది, ఏదో ఆత్మీయత నెమరు వేసుకుంది. ఆ వేటగాడిని వదలకూడదు అని లోకానికి వినపడేలా గాండ్రించింది. ఆ శబ్దం ఎక్కడున్నా వేటగాడికి వినపడే తీరుతుంది. వాడి వెన్నులో వణుకు మొదలయ్యే తీరుతుంది. 

ఎవరైనా ‘వేటగాడికి ఎదురుతిరిగారు.. నిలువరించారు’ అని తెలిస్తే.. ఆరోజు వేట సాగలేదనిగాని తెలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అలా నిలువరించిన వారిని తన వీపు మీద కూర్చోపెట్టుకుని అమ్మవారిని తిప్పినట్టు అడవి అంతా సవారీ చేస్తుంది. వాళ్ల వీరత్వాన్ని గర్వంగా లోకానికి చాటుతుంది.
ఇవన్నీ చూసి మల్లిక తన తండ్రిని కావలించుకున్నట్టు వెళ్లి పులిని హత్తుకుంటుంది. 
ఈ సారి మాత్రం పులి కోపాన్ని చూసి గాభరా పడింది. పులి తన కర్తవ్యనిర్వహణలో పడింది. 
∙∙ 
విరిగిపడే కొండచరియ వంటి పులి అరుపులు, భుకంపం లాంటి పంజా అడుగులతో వేట మొదలైంది. వేటగాడి వేట.. వాడి వాసనన కోసం గాలిని గాలించింది. అడుగుజాడలు పసిగడదామని కొండకోనలు తిరిగి అలసిసొలసిపోయింది. నిద్రాహారాలు మాని కళ్ళ నిండా కసితో వెతుకులాడే దాని తపన చూసి అబ్బుర పడింది మట్టిరంగు పిల్ల. శభాష్‌ అంటూ చప్పట్లు కొట్టింది. 

ఆ నది పక్కన చిత్తడి నేల మీద కిర్రుచెప్పుల అడుగులు కనిపించాయి. వాటిని అనుసరించింది పులి. కొంత దూరానికి చేరాక వాసన అందింది. ఇద్దరు మనుషుల వాసన. ఒకటి చచ్చిన వాళ్లది, రెండు చంపిన వాళ్లది. దాన్ని గుప్పుగుప్పున పిలుస్తూ ఆ గుట్టల్లో దూరి వేటగాడిని కనిపెట్టింది. వాడి విశాలమైన వీపుని బలమైన బాహువులను, మెలేసిన మగతనపు చిహ్నాలను చూసి బెదిరే జాతి కాదు అది. పులి.. మాయపులి. దూరాన మాయమై క్షణాల్లో అతని ముందు తేలింది. నోరంతా తెరచి కోరలతో చూసింది. అతనిలో చావు కళ అప్పుడే కనపడింది. 

ధన్‌మని దూకింది.. మరణం వైపు తరిమింది.. పాపాన్ని పరిగెత్తించింది. పడుతూ లేస్తూ కొండచరియ చివరికి వెళ్ళాడు వేటగాడు. ఇప్పుడు చావు అంచున ఉన్నాడు. అక్కడే.. ఆ కొండచరియ మీదనే బంగారు వర్ణపు స్త్రీ చావుకి న్యాయం చేసింది పులి. 
కొందరు ‘వాడు కొండ మీద నుంచి పడి చచ్చాడు’ అంటారు. 
కొందరేమో ‘పులి వాడి మీద పడి కొరికి చంపేసింది’ అంటారు. 
ఇంకొందరు ‘పులి చంపడానికి ఎవరినో పురమాయించింది’ అంటారు. 
అలా అనేక ఊహాగానాలు ఉన్నా వాడి చావుకు తక్షణ కారణం మాయపులి అన్నది మాత్రం నిజం. 

ఇదంతా తెలిసిన మల్లిక.. పులికి దండాలు పెట్టింది. దాని మెడను చుట్టేసుకుంది. ఆ రోజు నుంచి పులి ఆమెకు సరికొత్తగా కనబడసాగింది. మరింత భరోసాని పొందింది మల్లిక. 
‘నువ్వుంటే చాలు ఇక ఈ లోకానికి ఏ కష్టం ఉండదంట’ అంటూ కొత్త పాట పాడింది. ఆ పాటకి తగ్గట్టు తాళంలో తలూపి అడుగులో అడుగేస్తూ మాయమైంది ఆ పులి. 
∙∙ 
కాలం గడిచింది. చాన్నాళ్లుగా అటువైపు ఏ వేటగాడూ రాలేదు. ఏ దాడీ జరగలేదు. బలహీనమైన ఆ పిల్ల మల్లిక అడవిలో నెమ్మదిగా పోతోంది.. అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తోంది.. ఏదో ఆస్వాదించే పక్షిలాగా. ఎందుకో గాలి శబ్దాలు స్తంభించి ఉన్నాయి. దడదడమని అడుగుల చప్పుడు నేలను తన్నుతూ ముందుకు వస్తోంది.  మునుముందుకు వస్తోంది. సమీపానికి వచ్చేసింది. ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థమై గబుక్కున వెనక్కి తిరిగిచూసింది. 
ఆ.. వేటగాడు! 

ఆతని చూపు లక్ష్యంవైపే ఉంది. అతని పరుగు సాగుతోంది. మల్లికకి కాళ్ళు భూమిలో దిగబడ్డట్టు ఉంది. అడుగు పడలేదు. ఎలాగో పరుగందుకుంది. పరిగెత్తే ఓపిక లేక పిచ్చుకలా దొరికిపోయింది. అతడు అమె శరీరపు కింద భాగాన్ని కర్కశంగా ముక్కలు చేసి భుజాన వేసుకుని తాపీగాపోయాడు. 
నేలన వెలసిన చీమలపుట్టలా ఉంది అమె మట్టిరంగు మిగతా జీవం. 
పులి కోసం చూసీ చూసీ ఊపిరిని అడవి గాలిలో కలిపేసింది మల్లిక. 

పులి ఆమె వాసన పసిగడుతుందా! 
ఆ నెత్తుటి వాసన పులి దాకా చేరుతుందా!  కారడానికి శరీరంలో రక్తం ఎక్కడుంది? ఏమి గ్రహిస్తుంది? అన్న సందేహాలు ఆ శవానికి రాలేదు. వాళ్ళమ్మ కు మాత్రం రాకుండా ఉంటాయా? అదసలే మాయపులి. ఎక్కడున్నా దిగ్గున ప్రత్యక్షమవుతుంది. ఎందుకు? ఎందుకు రాలేదు? కన్నీరు ఇంకిపోయేలా శోకాలు పెట్టింది. 
రెండురోజులు గడిచాయి. గడుస్తూనే ఉన్నాయి. 
శవం చుట్టూ ఈగలు వచ్చాయి.. పురుగులు పట్టాయి. పులి మాత్రం రాలేదు. 

ఎక్కడికి పోయింది? పులికి ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇలా జరిగిన సంగతి ఇంకా దానికి తెలియలేదా? అడవిలో ప్రతిదీ దానికి తెలుస్తుంది కదా.. అని నానా విధాల ఆలోచించింది మల్లిక వాళ్ల  అమ్మ. కుళ్ళిపోతున్న కూతురు శవాన్ని భుజాన వేసుకుని పులి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఎక్కడ కనిపిస్తే అక్కడ పులి ముందు సాక్ష్యంగా పరవాలని అనుకుందామే. అలా వెతుకుతుండగా నట్టనడి అడవిలో అకస్మాత్తుగా అడుగుల చప్పుడు వినబడింది.
 ‘ఎవరో?’ అనుకుంటూ తిరిగి చూసింది. పులి కాదు.. వేటగాడు. ఆమె పక్కనుంచి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు అక్కడా.. ఇక్కడా.. ఎక్కడ పడితే అక్కడ అడవిలో కనిపిస్తునే ఉన్నాడు. తింటున్నాడు.. తాగుతున్నాడు.. తూగుతున్నాడు.. హాయిగా బతుకుతున్నాడు. 

‘ప్రతి కష్టానికి ముందుకొచ్చే పులి వీడిని చూడలేదా? ఎక్కడికి పోయింది?’ ఆ తల్లి ఆక్రోశం అడవంతా వినబడింది.
ఆమె పులి కోసం ఏ దారిన వెళ్ళినా ఆ దారిన వీడే కనిపిస్తున్నాడు. ఇక అలసిసొలసి ఆశలు వదిలేసుకుని పురాతన రావిచెట్టు కింద కూర్చుంది. మల్లిక శవం కొద్దికొద్దిగా మట్టిలో జీర్ణమవుతోంది.  
ఉన్నట్టుండి గుర్రుమని శబ్దం. తలతిప్పి చూస్తే చెట్టు మొదట్లో పులి తాపీగా నిద్రపోతోంది. గుర్రుమని గురక పెడుతూ. 
అమె ఎంత లేపినా నిద్ర లేవలేదు. శక్తి కూడదీసుకుని అరణ్యరోదన చేసింది. అప్పుడు మేలుకుంది పులి. తన కష్టమంతా చెప్పుకుందామె.
‘ఇంత జరిగినా ఆ వేటగాడిని తరమడానికి రాలేదే?’ నిలదీసింది. 

ఎదురుగా ఉన్న మట్టిరంగు శవాన్ని చూపించింది. పులి మెల్లగా లేచి వెళ్లి బంగారు వర్ణంలో మెరిసే తన పంజా పక్కన పెట్టి చూసింది. ఆ పంజా వెయ్యి మంది పిడికిళ్ల పెట్టు. ఆ గాండ్రింపు లక్షగొంతుల రణభేరి. కానీ.. 
పులి పంజా మెరుపు ముందు ఆ నలుపు వెలవెలపోయింది. పులి పంజా వెనక్కి తీసుకుని గడ్డం కింద దాచుకుని కూర్చుంది. మెల్లగా తలెత్తింది. ఎప్పటిలా దిక్కులు పిక్కటిల్లేలా గాండ్రిస్తుందేమో అని కళ్ళార్పకుండా చూసిందామె. కానీ పులి మత్తుగా ఆవులించింది. ఆ మట్టిరంగు శరీరంతో పనిలేనట్లు తల పక్కకు తిప్పి మత్తుగా నిద్రలోకి జారుకుంది. ఎందుకలా నిద్రపోతోందో అర్థంకాక లేపడానికి ప్రయత్నిస్తూనే ఉందా పిల్ల తల్లి. అనేకానేక ఏళ్లుగా.

చరణ్‌ పరిమి

చదవండి: హృదయవిదారక మిస్టరీ..! కన్న బిడ్డలు బతికున్నారోలేదో తెలియక..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement