దూరంగా సిపాయీల బూట్ల శబ్దం వినిపించింది. ఓ ఇద్దరు సిపాయిలు రావడం కనిపించింది. ఒకడు పెద్దపాత్రని గుడ్డ సాయంతో పట్టుకొస్తుంటే మరొకడు పెద్దబకెట్టు పట్టుకొస్తున్నాడు. రెండూ మూతలు పెట్టి ఉన్నాయి. మూతలు తీయగానే.....
‘అయ్యా.. ఉరితీసే ముందు నా చివరి కోరిక ఒకటే.. నేను తినడానికి ఎక్కువ అన్నం, ఎక్కువ పప్పు పెట్టండి చాలు!’
జైలు సూపరింటెండెంట్‌కి దోషి చివరి కోరిక తీర్చమని ఆదేశాలిచ్చి ‘ కోర్ట్ ఎడ్జర్న్›్డ‘ అంటూ కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు బ్రిటిష్ మెజిస్ట్రేట్.
పరమా.. ఒరిస్సా అడవుల్లో నివసించే ఆదివాసుల గుంపుల్లోని ఓ గుంపులోని వాడు. తన గుడిసె బయట కూర్చుని కొబ్బరి ఆకులూ, వెదురు ముక్కలతో బుట్టలు అల్లుతుంటాడు. ఇతర ఆదివాసుల్లానే అతడూ బెత్తెడు బట్టతో తన శరీరంలోని కింది భాగాన్ని కప్పుకున్నాడు. చిన్న చిన్న రంగు రాళ్ళతో చేసిన దండలున్నాయి అతని మెడలో. తన తండ్రి గుర్తింపుగా మొహాన్ని ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులతో పులుముకొని ఉన్నాడు.
బక్కగా ఉన్నా.. పొడగరి. నలభై ఏళ్ళు ఉండొచ్చేమో! వేటాడేటప్పుడు జంతువు వెనుక పరిగెడితే ఎత్తులూ, పల్లాలూ అనే తేడా లేకుండా ఒకే వేగంతో పరిగెత్తేవాడు. దారిలో పొదల్నీ, మొక్కల్నీ ఒకే ఒక గెంతులో దాటేసేవాడు. బాగా వంగి ఉన్న చెట్టు కొమ్మలను దూరాన్నించే చూసి, వంగి, చేతుల్ని మోపి, జంతువులా చేతులూ, కాళ్ళతో వాటి కింద నుంచి వెళ్ళిపోయేవాడు. కూరగాయలూ, పశు పక్ష్యాదుల మాంసం, అన్నం.. వాడి భోజనం. కానీ అపుడపుడూ పస్తులుండాల్సి వచ్చేది. అన్నం ఉంటే కూరగాయలు ఉండేవి కావు. పక్షులు దొరికితే తక్కిన వస్తువులు దొరికేవి కావు. అంటే ఎప్పుడూ కడుపారా భోజనం ఉండేదే కాదు. అడవిలో దొరికే వేళ్ళూ, కంద మూలాలూ కాల్చుకుని తిని పొట్టనింపుకునేవాడు.
పరమా గురించి మీకు పూర్తి వివరాలివ్వటానికి కారణం అతనిని ఆదివాసుల ప్రతినిధిగా భావించి అతని జీవన విధానం తెలుసుకోవటంతో బాటు పగలూ, రాత్రీ తీరిక లేకుండా గడుపుతున్న అతని జీవితం గురించి కూడా తెలియజేయాలనే.
మరుసటి రోజు ఉరిశిక్ష అమలు చేసే విషయాన్ని పరమాకు తెలియ చేశాడు జైలు సూపరింటిండెంట్. మౌనంగా విన్నాడు పరమా. జైలు సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఖాన్ ఎల్త్తైన మనిషి. అతని గోధుమరంగు శరీరాన్ని కంటద్దాలు, పెద్ద పెద్ద కోర మీసాలు.. అతన్నో గంభీరమైన వ్యక్తిగా చూపిస్తాయి. అతని ఆఫీసులో .. మూత్రం వాసన, చెమ్మ వలన కలిగే ముక్క ముక్క వాసన.. కాగితాలూ, ఫైళ్ళ వాసన కలగలిపి ఓ విచిత్రమైన దుర్గంధం పుడుతోంది. సండ్ర (సీసం) కర్రతో చేసిన తన రూళ్ళ కర్రను చేతుల మధ్య తిప్పుతూ పరమాను అడిగాడాయన ‘నీకు భోజనం ఎప్పుడు పెట్టాలి?’ అని.
‘ఉరితీసే ముందు’ చెప్పాడు పరమ.
‘రాత్రా? అప్పటికి కిచెన్ మూసేస్తారుగా! సాయంత్రం వండి ఉంచింది తినేస్తావా?’
‘తినాలంటే నేను ఎన్ని రోజుల పాచిదైనా తినేస్తాను గానీ ఇది నా ఆఖరు భోజనం కదా!! అందుకే వేడివేడిగా తినాలని కోరిక.. అంతే’
‘అలాగే.. ఎంత తింటావు?’
పరమా తన రెండు చేతులూ చాచి కొలమానం చెప్పాడు.
‘మరి పప్పు..?’
పరమా ఎదురుగా ఉన్న పెద్ద బక్కెట్టుని చూపించాడు. ఆ బక్కెట్టు పూర్తిగా నిండి ఉండాలని కూడా సైగలు చేశాడు. జైలు సూపరింటెండెంట్ కంటద్దాల్లోంచి గుచ్చిగుచ్చి చూడసాగాడు వాణ్ణి. బహుశా ఇంత ఎక్కువ భోజనం (పప్పూ, అన్నం) అడగటంలో ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామనేమో!
‘అంతా తినేయగలవా నువ్వు?’
అవునని రెండోసారి తలూపాడు పరమా.
మరుసటి రోజే ఉరిశిక్ష అమలుపరచే రోజు.
మంగలి కత్తితో నున్నగా పరమాకి గుండు గీశారు. కొత్త దుస్తులు తొడిగారు. వాడి మతమేమిటో తెలియదు గనుక పాస్టర్నీ, మౌల్వీనీ, పురోహితుణ్ణీ, బౌద్ధ భిక్షువునూ తీసుకొచ్చారు. నలుగురూ తమ తమ మతం ప్రకారంగా వాడికి మోక్షం కలగాలని, ముక్తి ప్రసాదింపమనీ ప్రార్థనలు చేశారు. అంతమయే జీవితంపై నమ్మకం ఉంచమని, అపరాధానికి క్షమాయాచన చేయమనీ తమ తమ భాషల్లో పరమాకి సలహా ఇచ్చి వెళ్ళిపోయారు.
వెళ్తూ వెళ్తూ బౌద్ధ భిక్షువు జైలు సూపరింటెండెంట్‌ను ప్రశ్నించాడు..
‘ఏ నేరం వల్ల ఇతనికి ఉరిశిక్ష విధిస్తున్నారో చెపుతారా?’ అంటూ.
‘ఇతను ఓ బ్రిటిష్ వ్యక్తిని హత్య చేశాడు’
‘బ్రిటిష్‌వాడిని హత్యా? ఎందుకు?’
పటిష్ఠంగా.. ఎత్తుగా ఉన్న జైలు పెద్ద గేటు దగ్గర ఆగి జైలు సూపరింటెండెంట్ ‘చాలా కష్టపడ్డాం తెలుసుకోవడానికి. వీడు ఓ రోజు ఇంటి ముందు కూర్చుని బుట్టలు అల్లుతున్నాడు. వీడి కూతురు ఇంటి ముందున్న పొదల మధ్య మెరుస్తున్న కళ్ళను చూపిస్తూ ఆ జింక పిల్లను తెచ్చివ్వమని సైగలు చేసింది. పరమాకి కూతురంటే ప్రాణం. చిరునవ్వుతో లేచి జింకపిల్లను సమీపించే లోపే ‘ఢాం’ అని శబ్దం వచ్చింది. జింక గిలగిలా కొట్టుకుని నేలపై పడిపోయింది. తుపాకీ పట్టుకుని ఓ బ్రిటిష్‌వాడు ఊరి మనుషులిద్దరితో కలసి జింక వైపు రావటం పరమా చూశాడు. గిలగిలా కొట్టు్టకుంటున్న జింక బాధ, కళ్ళల్లో దుఃఖంతో కూడిన భయాన్ని చూసి పరమాకి కోపం రాలేదు. ఓ ఆలోచన పుట్టింది. అక్కడే ఉన్న పెద్ద బండరాయిని తీసుకుని బ్రిటిష్‌వాడి తలపై మోదాడు. ఆ గట్టి దెబ్బకి ఆ బ్రిటిష్‌వాడు అక్కడికక్కడే చనిపోయాడు’ అని వివరించాడు.
జైలు పెద్దగేటులోని చిన్న తలుపు తెరుచుకుంది. ఆ నలుగురూ జైలు సూపరింటెండెంట్‌తో కరచాలనం చేసి వెళ్ళిపోయారు. ఆ నలుగురి మనసుల్లో ఆలోచన ఒకటే. ఎవరి ముక్తికీ, మోక్షానికీ ప్రార్థన చేశారో.. వాడు నిజంగా దోషేనా? ఉరిశిక్ష వేసేటంతటి పాపమా అతనిది?
∙∙
కాకులు అరవటానికి కారణం ఉండక్కర లేదు. కానీ కోడీ.. తెలవారకపొతే కూత వేయదు. పరమాకి నిద్ర పడితేగా? రాత్రంతా మేలుకునే ఉన్నాడు. తన జీవితంలోని కష్టాల కాలం.. ఆనందంతో గడిపిన క్షణాలూ గుర్తుకొచ్చాయి. తల్లి మరణించిన రోజు, పాముకాటుతో గిలగిలా కొట్టుకుని తండ్రి చనిపోయిన రోజు, తన పెళ్ళి రోజు, పాప పుట్టిన రోజు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. నెలరోజుల్లో జైలు కఠోర వాతావరణంలో.. తన శరీరంలోని అంగాలన్నీ కుదించుకుపోయి కుంచించుకుపోవటం కూడా జ్ఞప్తికి వచ్చింది.
దూరంగా సిపాయీల బూట్ల శబ్దం వినిపించింది. ఓ ఇద్దరు సిపాయిలు రావడం కనిపించింది. ఒకడు పెద్దపాత్రని గుడ్డ సాయంతో పట్టుకొస్తుంటే మరొకడు పెద్దబకెట్టు పట్టుకొస్తున్నాడు. రెండూ మూతలు పెట్టి ఉన్నాయి. మూతలు తీయగానే అప్పుడే వండిన అన్నం, పప్పూ వాటి ఆవిరితో కూడిన సువాసన గదంతా వ్యాపించింది. పెద్ద గోనె పట్టా పరచి ఓ అల్యూమినియం కంచం పెట్టారు వాళ్ళు. దగ్గరగా మంచి నీళ్ళ కూజా, గ్లాసూ కూడా పెట్టారు.
వచ్చిన వారి ప్రవర్తనలో తేడా గమనించాడు పరమా. ఈ రోజు భోజనం వడ్డించటంలో వాళ్ళు మర్యాద పాటిస్తున్నారు. ముందయితే కుక్కకు విసిరేసినట్టు విసిరేసేవారు.
కొంచెం అన్నం, పప్పు కంచంలో వేసుకుని తినేశాడు పరమా. తృప్తి కలగలేదు. మరి కొంచెం తిన్నాడు. మళ్ళీ మరి కొంచెం. జీవితంలో ఈ రోజే కడుపారా భోజనం దొరికినట్లు తింటూనే ఉన్నాడు. అయినా చాలా ఎక్కువ పప్పూ, అన్నం మిగిలిపోయాయి. వాటిని జాగ్రత్తగా మూత పెట్టాడు. మెడలోని రంగురాళ్ళ హారాలు తీసేశాడు. చేతికున్న ఇనప కడియాన్ని లాగేశాడు. చెవుల్లో ఉన్న గవ్వలూ, ఏనుగు దంతాల జూకాల్నీ తీసేసి, ఉతికి ఆరేసిన తను తొడుక్కునే గోచీ బట్టని జాగ్రత్తగా ఉంచాడు. వీటన్నిటినీ నిన్న సాయంత్రమే జైలు సూపరింటెండెంట్‌ను అభ్యర్థించి అడిగి తన దగ్గరే పెట్టుకున్నాడు. తీసిన వాటన్నిటినీ భోజన పాత్రల చుట్టూ పేర్చాడు. తనదే ఆ సామ్రాజ్యం.. వీటన్నిటికీ మూల శక్తి తనేనన్నట్టు.
∙∙
ఉరి తయారయింది. కట్టబడిన ఉరి తాడును పదే పదే లాగి దాని దృఢత్వాన్ని పరీక్షిస్తున్నాడు తలారి.
జైలు సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఖాన్ బూట్ల సవ్వడి పెద్దగా విన్పించింది. జైలుగది తాళం తీశారు. ఇనుప తలుపు తెరిచారు.
‘పరమా! తెలవారబోతోంది.. ఉరి తయారయింది పదా’
అంగీకరిస్తున్నట్టు తలూపాడు పరమా. నేలమీద ఉన్న అన్ని వస్తువుల్నీ చూపిస్తూ ‘అయ్యా! ఈ చిన్న చిన్న వస్తువులు నావే కదా?’ అని అడిగాడు.
తలూపుతూ ఖాన్ ‘ఊ’ అన్నాడు.
తర్వాత రెండు పాత్రల మూతలు తెరిచాడు పరమా. వాటిలో ఉన్న అన్నం, పప్పును చూపిస్తూ ‘అయ్యా ! మరి ఈ భోజనం?’
‘అది నీ కోసమే కదా వండించింది!’
‘అయితే ఇవీ నావే కదా?’
‘అవును.. నీవే!’
‘అయితే ఓ సాయం చేయండి అయ్యా..! నా శవాన్ని తీసుకుపోవటానికి నా భార్యా,కూతురూ, తమ్ముడూ వస్తున్నారు. అదే.. నాకు ఉరి శిక్ష ఖరారు చేసేటప్పుడు కోర్టులో చెప్పారుగా వాళ్ళు’
‘ఊ.. అయితే?’
‘ఈ వస్తువులన్నిటితో బాటు ఈ భోజనం కూడా వాళ్ళకిచ్చెయ్యండయ్యా.. కడుపు నిండా తింటారు’ అని అభ్యర్థించాడు పరమా!
- హిందీ అనువాదం : డాక్టర్ టి. మహాదేవ్ రావు
ఉర్దూ మూలం : అన్వర్ కమర్
చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!
Comments
Please login to add a commentAdd a comment