కథ: వెజిటబుల్‌ కేక్‌ | GV Ramesh Vegetable Cake Telugu Short Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

కథ: వెజిటబుల్‌ కేక్‌

Published Sun, Oct 31 2021 2:25 PM | Last Updated on Sun, Oct 31 2021 2:53 PM

GV Ramesh Vegetable Cake Telugu Short Story In Funday Magazine - Sakshi

దూరంగా వస్తున్న స్కూటర్‌ వైపు చూస్తూ, ఆపమంటూ మరియమ్మ చేయి ఊపింది. తనను పట్టించుకోకుండా, ముందుకు వెళ్లిపోతున్న స్కూటర్‌ వైపు నిరాశగా చూస్తూ ఉండిపోయింది. ఓ మోస్తరు ఎత్తు, చామనఛాయ రంగులో కాస్త లావుగా ఉండే మరియమ్మ హరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్‌ నర్సుగా పనిచేస్తోంది. ఏ ఒక్కరు స్కూటర్‌ ఆపినా, టైమ్‌కి ఆస్పత్రి చేరుకోవచ్చని ఆమె ఆశ.  

మెయిన్‌ రోడ్డుకి ఓ కిలోమీటర్‌ దూరంలో ఉంది, ప్రస్తుతం ఆమె ఉంటున్న ఆమె పిన్నిగారి గ్రామం. ఓ వంద గడప ఉండే ఆ చిన్న ఊరి నుంచి రోడ్డు మీదకు రావడానికి పావుగంట పడుతుంది. అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిపురం వెళ్లడానికి రోజూ నిరీక్షణ తప్పదు. 

ఆ వైపుగా వెళ్లే ఆటోలన్నీ కూలి వాళ్లతో కిక్కిరిసి ఉంటాయి. కనీసం కాలు పెట్టడానికి కూడా వీలుండదు. అందుకే అటుగా వచ్చే స్కూటర్ల కోసం ఆశగా చూస్తూ ఉంటుంది. ఓ అరగంట దాటితే ఖాళీ ఆటోలు వస్తాయి. కానీ ఆస్పత్రి టైమ్‌ అయిపోతుంది. అందుకే లిఫ్ట్‌ కోసం తాపత్రయ పడుతుంది. ఆస్పత్రికి చేరే వరకూ ఆమెకు టెన్షన్‌ తప్పదు.
రామశర్మ పని చేసేది కూడా హరిపురం ఉన్నత పాఠశాలలోనే. సన్నగా, పొడుగ్గా ఉండే అతనికి సగం తెల్లబడిన జుత్తు, తెల్లటి ప్యాంట్, షర్ట్‌ పెద్దరికాన్ని ఆపాదిస్తున్నాయి. నుదుట ఓ అడ్డ నామం, దానిపైన ఓ కుంకుం బొట్టు అతని శాశ్వత గుర్తింపు చిహ్నాలు. మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయబోయే శర్మకి హరిపురం పాఠశాల చివరి మజిలీ. రోజూ అతను తన యాక్టివా బండి మీద రయ్యిమంటూ వెళ్లడం మరియమ్మ చూస్తుంటుంది. 

ఓ రోజు స్కూలుకి చేరిన తర్వాత బండి స్లిప్‌ అయి రామశర్మ కాలికి దెబ్బ తగిలింది. టి.టి. ఇంజెక్షన్‌ వేయించుకుందామని ప్రాథమిక ఆస్పత్రికి వెళ్లాడు. 
‘ఇది మొదటిసారి కాదు మరియమ్మా. నువ్వు రోజూ అరగంట లేటుగా వస్తున్నావు. ఇలా అయితే కుదరదు. ఈ ఆస్పత్రికి నువ్వు అవసరం లేదని కలెక్టర్‌కు రాసేస్తాను’ డాక్టర్‌ గొంతు గట్టిగా వినిపిస్తోంది. 

‘ఆటోలు దొరకడం లేదు సార్‌. అందుకే లేటయిపోతోంది. రేపట్నుంచి టైమ్‌కే వచ్చేస్తాను సార్‌’
‘ఈ మాట నువ్వు చాలా సార్లు చెప్పావు. ఉద్యోగం కావాలంటే టైమ్‌కి రావాలి. ఎన్నిసార్లు చెప్పించుకుంటావ్‌? వెళ్లు పేషెంట్లు వెయిట్‌ చేస్తున్నారు’ డాక్టర్‌ విసుగ్గా అంటున్నాడు.
డాక్టర్‌ గదిలోంచి కళ్లు తుడుచుకుంటూ మరియమ్మ బయటకు వచ్చింది.
ఎదురుగా కనిపించిన రామశర్మను ప్రశ్నార్థకంగా చూసింది.
‘కాలికి దెబ్బ తగిలింది. టి.టి. ఇంజెక్షన్‌ వేస్తారేమోనని..’ 
కాలి వైపు చూసి ‘రక్తం కూడా వస్తోంది. ఉండండి సార్, డ్రెస్సింగ్‌ చేస్తాను’ అంటూ లోపలికి వెళ్లింది. 

కట్టు కట్టిన తర్వాత ‘ఒక్క నిమిషం సార్‌’ అంటూ మిగిలిన పేషెంట్ల దగ్గరకు వెళ్లింది. వాళ్లందరికీ ఓపిగ్గా ఇంజెక్షన్లు, మందులు ఇస్తోంది. కాసేపు తర్వాత మళ్లీ రామశర్మ దగ్గరకు వచ్చి ఇంజñ క్షన్‌ చేసింది. ఓ నాలుగు ట్యాబ్లెట్లు ఇచ్చి రెండు పూటలా వేసుకోమంది. 
మర్నాడు రామశర్మ స్కూలుకు వస్తుండగా మెయిన్‌ రోడ్డు పక్కన లిఫ్ట్‌ కోసం వెయిట్‌ చేస్తూ మరియమ్మ కనిపించింది. ముందు రోజు ఆమెను డాక్టర్‌ మందలించిన విషయం శర్మకి గుర్తొచ్చింది.  అప్పటికే ఆమెను దాటుకుని ఓ యాభై అడుగులు ముందుకు వెళ్లిపోయాడు. బ్రేక్‌ వేసి, వెనక్కి తిరిగి  చూశాడు. తన కోసమే ఆగాడని అర్థమైన ఆమె పరుగులాంటి నడకతో వచ్చి స్కూటర్‌ ఎక్కింది. స్కూలుకి వెళ్లే దారిలోనే ఉన్న ఆస్పత్రి దగ్గర దిగింది.    
 
‘థాంక్స్‌ సార్‌. ఈ రోజు కూడా మా డాక్టర్‌ దగ్గర తిట్లు తప్పవనుకున్నాను’
‘ఫర్వాలేదు’ చిరునవ్వుతో సమాధానం చెప్పి వెళ్లిపోయాడు. 
అది మొదలు రామశర్మ ఆమెకు రోజూ లిఫ్ట్‌ ఇస్తూనే ఉన్నాడు. థాంక్స్‌ చెప్పడం తప్ప మరో మాట వాళ్లిద్దరి మధ్య లేదు. ఆ సందర్భమూ రాలేదు.
ఓ సారి దారిలో హోరువాన ప్రారంభం కావడంతో ఓ రేకుల షెడ్డు వద్ద ఆగాల్సి వచ్చింది. 
‘మీ చేతిలో ఎప్పుడూ ఆ మెడికల్‌ కిట్‌ ఉంటుంది. ఎందుకు?’ రామశర్మ అడిగాడు.

‘ఊళ్లో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు కదా సార్‌. అందుకే ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ నాతో పాటు ఉంచుకుంటాను. 
‘మీది ఈ ఊరేనా?’
‘కాదు సార్‌. మాది రణస్థలం. మా పిల్లలూ, అత్తా, మామ అక్కడే ఉంటారు. మా ఆయన బెంగళూరులో ఓ కంపెనీలో డెయిలీ లేబర్‌గా పని చేసేవాడు. కరోనా వల్ల తన పని పోయింది. నాకొచ్చే పదిహేను వేలతో ఇల్లు నడవాలి. అందుకే దూరమైనా ఇక్కడకు వచ్చేశాను. అద్దె కలిసొస్తుందని మా పిన్ని ఇంట్లో ఉంటున్నాను. అక్కడ్నుంచి హాస్పిటల్‌ రావడానికి ఇబ్బంది పడేదాన్ని సార్‌. మీ వల్ల టైమ్‌కి వెళ్లగలుగుతున్నాను.’    
‘మరి డ్యూటీ నుంచి రావడం ఎలా?’

‘రాత్రి ఏడు, ఎనిమిది అయిపోతూ ఉంటుంది సార్‌. అరగంటో, గంటో వెయిట్‌ చేస్తే ఓ ఆటో దొరుకుతుంది. నా డ్యూటీ సాయంత్రం ఐదు గంటల వరకే. కానీ పేషెంట్లు ఉంటారు. వాళ్లని వదిలేసి ఎలా వచ్చేస్తాం సార్‌?’
‘ప్రభుత్వాస్పత్రుల్లో ఓవర్‌ టైమ్‌ చేసే ఉద్యోగులు కూడా ఉన్నారా?’ నవ్వుతూ అన్నాడు ఆమెతో.
ఓ రోజు స్కూలుకి వెళ్లే దారిలో జనం గుమిగూడి ఉండటంతో, రామశర్మ స్కూటర్‌ ఆపాడు. అక్కడ ఓ నలభై ఏళ్ల  స్త్రీ మోచేతికి దెబ్బతగిలి రక్తమోడుతూ కనిపించింది. పక్కనే ఓ స్కూటీ పడిపోయి ఉంది.  అక్కడ వాతావరణం చూస్తే బండి రోడ్డు మీద జారి పడినట్లు ఉంది. వెంటనే మరియమ్మ స్కూటర్‌ దిగి, దెబ్బ తగిలిన మహిళకు డ్రెస్సింగ్‌ చేసి, కట్టు కట్టింది. ఇంజెక్షన్‌ చేసి, ట్యాబ్లెట్లు ఇచ్చింది. 
ఓ రెండ్రోజులు రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందని చెప్పింది.

కాసేపటికి తేరుకున్న ఆ మహిళ, మరియమ్మకు థాంక్స్‌ చెప్పి, బ్యాగ్‌లోంచి ఓ ఐదు వందల రూపాయల నోటు తీసింది.
‘ఫర్వాలేదమ్మా’ అంటూ సున్నితంగా తిరస్కరించింది. 
మరియమ్మ జీతానికి పని చేస్తున్నా, ఆమె తన వృత్తిని ఎంతో ప్రేమిస్తోందనే విషయం రామశర్మకు అర్థమైంది. 
కొన్నాళ్ల తర్వాత.. క్రిస్మస్‌ మర్నాడు ఆస్పత్రి వద్ద స్కూటర్‌ దిగి, సందిగ్ధంగా రామశర్మ వైపు చూస్తూ హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి ఓ స్టీలు బాక్స్‌ తీసింది. 
‘నిన్న క్రిస్మస్‌ కదా. ఈ కేక్‌ మీ కోసం చేశాను సార్‌’ ఆ డబ్బా అతని చేతికి ఇస్తూ అంది.
రామశర్మ కాస్త ఇబ్బందిగా చూశాడు.

‘ఇది వెజిటబుల్‌ కేక్‌ సర్‌. గుడ్డు కలపకుండా చేశాను సార్‌’
అతను నవ్వుతూ ఆ బాక్స్‌ తీసుకున్నాడు. తనో కేక్‌ ముక్క తిని, తన సహ ఉపాధ్యాయులకు తలో ముక్కా ఇచ్చాడు. 
‘కేక్‌ చాలా బాగుందమ్మా. మా స్టాఫ్‌ క్కూడా  బాగా నచ్చింది’ మర్నాడు ఆ డబ్బా తిరిగి ఇస్తూ చెప్పాడు. 
ఓ నాలుగు రోజుల తర్వాత రామశర్మ స్కూల్‌ నుంచి వస్తుండగా ఆస్పత్రి దగ్గర మాస్టారూ అన్న పిలుపు వినిపించింది. బండి ఆపి వెనక్కి తిరిగి చూశాడు. ఓ వ్యక్తి తనను చూసి పరుగులాంటి నడకతో వస్తున్నాడు. 
అతను తన స్టూడెంట్‌ ప్రసాద్‌. 

‘నమస్తే సార్‌’    
‘ప్రసాద్, నువ్వేంటి ఇక్కడ?’
‘ఈ మధ్యే డీఎంహెచ్‌ఓ (జిల్లా వైద్యాధికారి)గా ప్రమోషన్‌ వచ్చింది సార్‌. ఈ ఆస్పత్రిని తనిఖీ చేద్దామని వచ్చాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. రండి సార్‌’ అంటూ ఆహ్వానించాడు.
 ‘మా గురువుగారు’ అంటూ అక్కడ డాక్టర్లకు పరిచయం చేశాడు. ఇద్దరూ చాలాసేపు పాత జ్ఞాపకాల్లోకి జారుకున్నారు.  
జీపులో ఇంటి దగ్గర దిగబెడతానన్న శిష్యుడిని వారించి స్కూటర్‌ మీద ఇంటికి బయల్దేరాడు శర్మ. 
‘సార్‌ ఓ చిన్న సాయం చేయగలరా?’ మర్నాడు తనని ఆస్పత్రి దగ్గర దింపి, వెళ్లిపోతున్న రామశర్మని అడిగింది మరియమ్మ.
ఏంటన్నట్లు ఆమె వైపు చూశాడు.

‘ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి సార్‌. మా డీఎంహెచ్‌ఓ గారు మీ స్టూడెంటే కదా! రణస్థలంలో నర్స్‌ పోస్టు ఖాళీ ఉంది. మీరో మాట ఆయనకు చెబితే నాకు అక్కడకు బదిలీ అవుతుంది. పిల్లలు అక్కడ, నేనిక్కడ ఉండటంతో చాలా ఇబ్బందిగా ఉంది. మా అత్తమ్మ పిల్లలతో చేసుకో లేకపోతోంది. ప్లీజ్‌ సార్‌’
ఆమె అభ్యర్థన విని రామశర్మ సాలోచనగా ఉండిపోయాడు. 
‘నేనెప్పుడూ, ఎవరికీ, ఏ విషయంలోనూ సిఫారసు చేయలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కానీ ప్రసాదుకి ఓ మాట చెబుతాను. తర్వాత మీ అదృష్టం’    
ఓ రెండ్రోజుల తర్వాత ఆమెకు రణస్థలం బదిలీ ఉత్తర్వులు వచ్చాయి.
థాంక్స్‌ చెప్పడానికి స్కూలుకు వెళ్తే రామశర్మ ఆ రోజు రాలేదని తెలిసింది. 

‘ఈ టైమ్‌లో బదిలీలు వద్దని కలెక్టర్‌ గారి ఆర్డర్‌. కాకపోతే మీ గురించి మాస్టారు చాలా చెప్పారు. మీకు సేవాగుణం ఎక్కువట. రాత్రి ఎనిమిదైనా ఆస్పత్రిలోనే ఉంటారంట. ఊర్లో జనం కోసం మెడికల్‌ కిట్‌ కూడా మీ దగ్గర ఉంటుందట. ఆయన మాట కాదనలేక, నేను పర్సనల్‌గా కలెక్టర్‌ గారిని రిక్వెస్ట్‌ చేశాను’ అన్నాడు ప్రసాద్‌ తనకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చిన మరియమ్మతో.

‘సార్, మీరు లేకపోతే నాకు బదిలీ అయ్యేది కాదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు సార్‌’ మర్నాడు రామశర్మతో చెబుతుండగా ఆమె గొంతు గాద్గదికమైంది.
‘ఓ నర్సుగా మీరు చేసిన సర్వీసు నేను కళ్ళారా చూశాను. అదే విషయం ప్రసాదుకి చెప్పాను. అంతకు మించి నేను చేసినదేమీ లేదు’ అన్నాడాయన. 
‘అమ్మా, మొన్న మీరు చేసిన వెజిటబుల్‌ కేక్‌ చాలా బాగుంది. వీలైతే మరొక్కసారి చేసి తీసుకురండి’ శర్మ అన్న మాటకి ఆమె ముఖం మతాబులా వెలిగిపోయింది.
‘కచ్చితంగా చేసి, మీ ఇంటికి తీసుకువస్తాను సార్‌’ అంటూ రామశర్మ అడ్రెస్‌ తీసుకుని వెళ్లింది.

ఇంతలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. మరియమ్మ ఊపిరి సలపనంత బిజీ అయిపోయింది. ఓ రెణ్ణెల్లు ఇంటిక్కూడా  వెళ్లకుండా, ఆస్పత్రిలోనే రాత్రీ పగలూ ఉండిపోయి కరోనా రోగులకు సేవ చేసింది. ఆ మహమ్మారి నుంచి కోలుకుని వెళ్లిన వారిని చూసి ఆనందించింది. కళ్లముందే ప్రాణాలు విడిచిన వారిని చూసి కన్నీరు మున్నీరైంది. 

కేసులు తగ్గుముఖం పట్టి, కాస్త ఊపిరి పీల్చుకునే సమయం వచ్చిన తర్వాత రామశర్మ ఇంటికి బయల్దేరింది. ఆయన ఇంటి ముందు హడావుడిగా ఉంది. ఓ చిన్న పిలకతో ఉన్న ఓ పాతికేళ్ల కుర్రాడు ఏదో క్రతువు నిర్వహిస్తున్నాడు. అతని ఎదురుగా కూర్చున్న పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. అతని చుట్టూ ఉన్న వారి ముఖాల్లో విషాదం కనిపిస్తోంది. 

అసలా ఇల్లు రామశర్మదేనా అనే సందేహం ఆమెకు వచ్చింది. అక్కడున్న ఓ వ్యక్తిని అదే అడిగింది.
‘ఈ ఇల్లు శర్మగారిదే. ఆయన పది రోజుల కిందట కరోనాతో చనిపోయారు’ పిడుగులాంటి వార్తను చెప్పాడతను. 
మరియమ్మకు దుఃఖం ఆగలేదు. ఎవరో ఆత్మీయుడు మరణించిన భావన ఆమెను చుట్టుముట్టింది. వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమెను చూసి శర్మగారి బంధుగణమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. 

‘నాయనా! నాన్నగారిని తలుచుకుని ఆ పిండం గోడ మీద పెట్టు’ ఓ పురోహితుడు పిలకతో ఉన్న కుర్రాడికి చెబుతున్నాడు. 
రామశర్మ కొడుకు పిండాన్ని గోడమీద పెట్టాడు. ఒకట్రెండు కాకులు ఆ చుట్టపక్కలే తిరుగుతున్నాయి కానీ గోడమీద వాలలేదు. 
‘శర్మగారికి ఏవో తీరని కోరికలు ఉన్నట్లున్నాయి’ అంటున్నారు ఎవరో. ఆయన తోబుట్టువులు, ఇతర బంధు మిత్రులు గోడ వద్దకు వచ్చి దండం పెట్టి వెళ్తున్నారు. 
‘నీ కుటుంబాన్ని నేను చూసుకుంటానురా, నీకు బెంగ అక్కర్లేదు’ అంటూ ఏడుస్తోంది శర్మగారి అక్క. ఆ తంతునంతా గమనిస్తున్న మరియమ్మ తన దగ్గరున్న బాక్స్‌ తెరిచి, వెజిటబుల్‌ కేక్‌ ముక్కను తీసింది. గోడ దగ్గరకు వెళ్లి పిండం పక్కన పెట్టి, వెనక్కి నాలుగడుగులు వేసింది. 

ఇంతలో ఓ కాకి రివ్వున వచ్చి ఆ కేక్‌ ముక్కను నోట కరచుకుని వెళ్లిపోయింది. వెంటనే మరో కాకి వచ్చి పిండాన్ని కూడా ఎత్తుకుని వెళ్లిపోయింది. 
అక్కడ ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు శర్మగారి కుటుంబానికి. ఆ వచ్చినామె ఎవరో, ఆమె గోడ మీద ఏం పెట్టిందో కూడా వాళ్లకి తెలియడంలేదు. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా, ప్రశార్థకంగా చూస్తున్నారు.  

‘ఎవరమ్మా మీరు? గోడమీద ఏం పెట్టారు?’ ఒకరిద్దరు బంధువులు అడిగారు.
‘వెజిటబుల్‌ కేక్‌. అదంటే శర్మగారికి చాలా ఇష్టం. స్వయంగా తయారు చేసి తీసుకు రమ్మన్నారు’ అంటూ కాకి వైపు చూసి ‘తీసుకుని వెళ్లిపోయారు’ కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది మరియమ్మ.

- జీవీ రమేష్‌

చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement