ప్రతీకాత్మక చిత్రం
నవంబర్ నెల ఆదివారం రాత్రి..
తన స్నేహితుడు విక్రమ్‌కి చెందిన ఆ అపార్టుమెంట్ ఐదోఅంతస్తులోగల విశాలమైన ఫ్లాట్.. బాల్కనీలో కూర్చొని సన్నగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు మదన్.
రెండు గ్లాసుల్లో ‘బ్లాక్ లేబిల్’ లార్జ్, ఐస్ క్యూబ్స్ కలిపి, ఒక గ్లాస్ అతని చేతికి అందిస్తూ ‘చీర్స్’ చెప్పి ‘అర్జెంట్‌గా మాట్లాడాలన్నావు..ఏంటి విషయం?’ అని అడిగాడు విక్రమ్.
‘వీరేంద్రని హత్య చేయించాలి’ స్కాచ్‌ని చప్పరిస్తూ సూటిగా విషయం చెప్పేశాడు మదన్.
అదిరిపడ్డాడు విక్రమ్. నమ్మలేనట్లుగా చూశాడు.
మదన్, వీరేంద్ర ఇద్దరూ కలసి పాతికేళ్ళ వయసులో స్థాపించిన ‘నెట్ ఇన్‌ఫ్రా సొల్యూషన్’ పదేళ్లలోనే రెండువందల కోట్ల టర్నోవర్ సంస్థగా నిలిచింది. ఒకరు ఎమ్‌డీగా, మరొకరు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. గత పదేళ్లలో వారిద్దరి మధ్య స్నేహబంధం రోజురోజుకి బలపడిందే తప్ప, పొరపొచ్చాలతో బలహీనపడలేదు. అలాంటిదిప్పుడు ఇటువంటి ఆలోచన మదన్‌కి ఎందుకు వచ్చిందో అర్థంకాలేదు విక్రమ్‌కు.
అదే ప్రశ్న అడిగాడు...దోరగా వేయించిన జీడిపప్పు, సలాడ్‌తో కూడిన చికెన్ కబాబ్ ప్లేట్స్ అతని ముందుకు జరుపుతూ.
జీవంలేని ఒక చిన్ననవ్వుతో బదులిచ్చాడు అతను.. ‘పదేళ్లలో ఇద్దరం కలసి అహోరాత్రులు శ్రమించి సాఫ్ట్‌వేర్ రంగంలో ‘నెట్ ఇన్‌ఫ్రా’ను ఉన్నతస్థానంలో నిలిపాం. అందులో సందేహం లేదు. కానీ ఈ విజయానికి సంబంధించి బయట ప్రపంచంలో మాత్రం అతనికే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు లభించాయి. అంతేకాదు, ఈ కంపెనీ కోసం నేను వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి ఒంటరిగా మిగిలిపోయాను. అతను మాత్రం అందమైన భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు. ఆస్తిపాస్తులు కూడా నాకన్నా ఎక్కువ సంపాదించాడు. ఇద్దరిదీ సమానమైన కష్టం, సమానమైన హోదా అయినా అతనికే ఎక్కువ పలుకుబడి ఉండటం.. జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ.
అతని మాటల్లో ఈర్ష్య, ఆక్రోశం ధ్వనించాయి.
‘అయితే చంపించేస్తావా?’ అడిగాడు విక్రమ్.
‘ఎస్. లైఫ్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అనుకున్నంత డబ్బు సంపాదించాను. కానీ ఏదో వెలితి. తృప్తి లేదు. ఏదో మిస్ అవుతున్నా. దానికి కారణం ఆ మదన్‌గాడు. ఇప్పుడు వాడి చావు వార్త మాత్రమే నాకు తృప్తినిచ్చే ఏకైక విషయం’ అన్నాడు కసిగా.
‘మరొక్కసారి ఆలోచించు. అతను మరణిస్తే నీకు వచ్చే లాభమేమీ లేదు’ సాలోచనగా అన్నాడు విక్రమ్.
‘ఉంది. కంపెనీ షేర్లలో మా ఇద్దరిదీ చెరో ముప్పైశాతం వాటా. మిగతా నలభైశాతం ప్రమోటర్లది. వ్యవస్థాపకులుగా మేము చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. మా ఇద్దరిలో ఎవరు మరణించినా మా వాటాలో సగం షేర్లు కుటుంబ సభ్యులకు, మిగతా సగం షేర్లు మాలో జీవించి ఉన్న ఇంకొకరికి చెందేలా విల్లు రాయబడింది’ చెప్పాడు మదన్.
‘ఇదంతా నువ్వు అనుకున్నంత సులువుగా జరుగుతుందా?’ దీర్ఘంగా శ్వాసిస్తూ అడిగాడు విక్రమ్.
‘జరగాలి. వాడు చస్తేనే నా అంతరాత్మకు ప్రశాంతత. అంతేకాదు దాదాపు ముప్పై కోట్ల రూపాయల విలువైన షేర్లు కూడా నాకు కలిస్తే కంపెనీలో నా వాటా అరవై శాతానికి పెరుగుతుంది. నేనే కంపెనీ చైర్మన్ అవుతాను’ గోల్డ్‌ఫ్లేక్ లైట్ సిగరెట్ వెలిగించి గుండెల నిండా పొగ పీలుస్తూ చెప్పాడు.
అతని కళ్ళలో క్రోధంతో కూడిన ఎరుపు జీరను స్పష్టంగా గమనించాడు విక్రమ్. ఇంతకు ముందెప్పుడు అతన్ని అలా చూడలేదు.
‘విక్రమ్ నిన్నెప్పుడూ ఏదీ అడగలేదు. ఇదొక్కటి నాకోసం చేసిపెట్టు’ అభ్యర్థనగా మదన్.
ఆలోచనలో పడ్డాడు విక్రమ్.
అనాథ అయిన విక్రమ్‌ని చేరదీసి, సొంతంగా బిజినెస్ చేసుకోవటానికి ఆర్థిక సహాయమందించాడు. ఒక ఇంటివాడినీ చేసి అతని జీవితానికి అర్థాన్ని ఇవ్వటమే కాకుండా, పేరు పెట్టి పిలిచేంత చనువైన స్నేహాన్ని కూడా ఇచ్చాడు మదన్. అలాంటి గొప్ప స్నేహితుడి కోసం ఏమైనా చెయ్యటానికి సిద్ధపడాలి.. తప్పదు అనుకున్నాడు విక్రమ్. ఇది అతని రుణం తీర్చుకునే అవకాశంగా భావించాడు.
‘అది ఒక ఆక్సిడెంట్ లేదా సహజ మరణంలానో ఉండాలి తప్ప హత్య అని నిర్ధారణ కాకూడదు. ఎలాంటి అనుమానం ఎవ్వరికీ రాకూడదు. ఎంత ఖర్చయినా పరవాలేదు’ చెప్పాడు మదన్.
సాక్ష్యం దొరకని హత్యా పథకం కోసం ఆలోచించసాగాడు విక్రమ్.
‘బెంగాల్ నుంచి షార్ప్ షూటర్ వస్తాడు. పని ముగించుకొని వెళ్తాడు. ఖరీదు ఎక్కువ రెండు కోట్లు’ అన్నాడు విక్రమ్.
‘ఇందులో రిస్క్ ఎక్కువ. పోలీస్ దర్యాప్తు పకడ్బందీగా జరిగితే హంతకుడు పట్టుబడే అవకాశం ఉంది. లేదా భవిష్యత్‌లో మరే నేరంలోనైనా ఆ హంతకుడు అరెస్ట్ అయితే మన విషయం బయటపెట్టే చాన్స్ ఉంటుంది’ విశ్లేషించాడు మదన్.
‘స్లో పాయిజనింగ్? అతను రెగ్యులర్‌గా తీసుకొనే ఆహరంలో రోజూ కొద్దిగా పాయిజన్ కలుపుతూ మోతాదు పెంచితే అతని శరీరం చచ్చుబడిపోయి కొద్దిరోజుల్లో మరణిస్తాడు. ఎవ్వరికీ అనుమానం రాదు. ఖర్చు కూడా చాలా తక్కువ’ వివరించాడు మదన్.
‘నో. ఇది చాలా దీర్ఘంగా సాగుతుంది. మరణించే అవకాశం వంద శాతం అని కచ్చితంగా చెప్పలేం’ సందేహం వెలిబుచ్చాడు మదన్.
‘అతని ఇంట్లోని షాండ్లియర్ తెగి అతని మీద పడేలా చెయ్యటం లేదా అతను తన ఆఫీస్ ఎనిమిదో అంతస్తులో వున్నప్పుడు ప్రమాదవశాత్తు కిటికీలోంచి కింద పడ్డట్లు చిత్రీకరించటం...’
విక్రమ్ మాటలకు అడ్డు తగులుతూ ‘అవన్నీ కూడా అతని పనివాళ్లు లేదా సన్నిహితుల సహకారం లేకుండా చేయలేం. అంతటా సీసీ కెమెరాలు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి పథకాలు నేరస్తున్ని ఈజీగా పట్టిస్తాయి’ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మదన్.
‘మరెలా?’ గ్లాసుల్లో మూడో రౌండ్ ఫిక్స్ చేస్తూ అడిగాడు విక్రమ్.
‘రోడ్డు ప్రమాదంలో మరణించాలి. హైవేలో వెళ్తున్నప్పుడు సీసీ కెమెరాలు లేని చోట ప్రమాదం జరగాలి. వీరేంద్ర కారు తుక్కుతుక్కు అయిపోవాలి. అతడి దేహం ఛిద్రం కావాలి. నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ తో ఒక ప్రాణం బలవ్వటానికి కారణం అయిన డ్రైవర్‌కి గరిష్ఠంగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే’ చెప్పాడు మదన్.. తన మనసులో ఉన్న ప్లాన్‌ని.
‘ఈ ప్లాన్ బాగుంది. కానీ తెలిసి తెలిసి ఎవరు ఒప్పుకుంటారు?’ అడిగాడు విక్రమ్.
‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక లారీ డ్రైవర్‌ని వెతుకు. యాభై లక్షలు క్యాష్ ముందుగానే ఇవ్వు. ఆ మొత్తం అతని జీవితాన్ని సెటిల్ చేస్తుంది. ఆరు సంవత్సరాల తరువాత సుఖవంతమైన కుటుంబ జీవితం అతని సొంతం అని చెప్పు. ఫోన్‌లో కాకుండా నేరుగా సంప్రదింపులు జరుపు’ ఆజ్ఞాపిస్తున్నట్టుగా వివరించాడు మదన్.
∙∙
ఆ మరుసటి ఆదివారం .. అనుకున్నట్టుగానే వారి ప్లాన్ అమలు జరిగింది.
కానీ కారు వీరేంద్రది కాదు.
హైవేలో వెళ్తున్న మదన్ కారుని లారీ ఢీ కొట్టటంతో అక్కడికక్కడే మరణించాడు అతను.
మదన్ ఆస్తులకు బినామీ అయిన విక్రమ్‌కి.. అవి సొంతం అయ్యాయిప్పుడు.
తన హత్యకు తానే పథకం రచించుకున్నాడు ‘పూర్ మదన్’ అనుకున్నాడు విక్రమ్.
- మొగిలి అనిల్‌కుమార్ రెడ్డి
చదవండి: Viral News: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్‌మెంట్..!!
Comments
Please login to add a commentAdd a comment