క్రైమ్‌ స్టోరీ: ఆ బ్యాగ్‌ | BVD Prasada Rao AA Bag Crime Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ స్టోరీ: ఆ బ్యాగ్‌

Published Sun, Nov 7 2021 2:54 PM | Last Updated on Sun, Nov 7 2021 2:58 PM

BVD Prasada Rao AA Bag Crime Story In Sakshi Funday

గాలి జోరు తెలుస్తోంది. వాన వచ్చేలా ఉంది. గది కిటికీ అద్దాలు మూశాను. విండో కర్టెన్‌ సర్దాను. నా భార్య.. పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. ప్రస్తుతం ఇంట్లో ఒక్కణ్ణే.
లైట్‌ ఆర్పి మంచం ఎక్కాను. నిద్రకి ఉపక్రమిస్తున్నాను. అంతలోనే బయట డోర్‌బెల్‌ మోగింది. ‘ఎవరబ్బా’ అనుకున్నాను. 
లేచి లైట్‌ వేశాను. గది నుంచి బయటకు నడిచాను. హాలు, బయట లైట్లు వేశాను. మెయిన్‌ డోర్‌ పక్కనున్న విండో కర్టెన్‌ కాస్త తొలగించి దాని డోర్‌ తీశాను. బయటకి చూశాను. ఎవరో.. ఒకతను! యువకుడులా ఉన్నాడు. బయట తచ్చాడుతున్నాడు.


‘ఎవరూ?’ అతణ్ణే చూస్తున్నాను.
అతను విండో దరికి వచ్చి ‘సారీ ఫర్‌ ది ట్రబుల్‌’ అన్నాడు.
చిన్నగా తలాడిస్తూ ‘ఏమిటీ’ అడిగాను.
‘మీ ఎదురు రూమ్‌లో నా ఫ్రెండ్‌  ఉంటాడు. వాడికై వస్తే వాడు లేడు’
నా చూపును ఎదురు రూమ్‌ వైపు పోనిచ్చాను. తాళంవేసి ఉంది. ఆ రూమ్‌లో ఒకతను ఉండడం నాకు తెలుసు. అతను ఉద్యోగి అనుకుంటున్నా.
తిరిగి నా చూపుని విండో ముందున్న అతని వైపు తీసుకొచ్చాను.

‘ఈ బ్యాగ్‌ వాడికి అందించాలి. వర్షం వచ్చేలా ఉంది. పాలుపోవడం లేదు’ అతను కుదురు తప్పేలా తోస్తున్నాడు.
‘దయచేసి ఈ బ్యాగ్‌ను వాడికి అందించి పెట్టండి’ అతనిలో దీనం అగుపిస్తోంది.
మెయిన్‌ డోర్‌ తీశాను. అతను గుమ్మం వైపు వచ్చాడు. నా ముందు ఆ బ్యాగ్‌ పెట్టాడు.
‘అతడిని చూస్తున్నా.. కానీ అతనితో నాకు పరిచయం లేదు’ చెప్పాను.
‘ఫోన్‌ చేస్తే రూమ్‌లో ఉంటాను అన్నాడు’ చెప్పాడు అతను.
‘సాయంకాలం ఆఫీస్‌ నుంచి వస్తూ రూమ్‌లో అతణ్ణి చూశాను’ నేనూ చెప్పాను.

‘మరెటు వెళ్లాడో ఏమో!  పైగా వాడి ఫోన్‌ సిచ్చాఫ్‌లో ఉందిప్పుడు’ అతను కంగారుగా ఉన్నట్టు అగుపిస్తున్నాడు.
‘నేను రామారావు. నేను వచ్చి ఇచ్చానని చెప్పండి. వాడి పేరు శ్యామలరావు’ అతను చెబుతున్నాడు.
‘అతడు ఎప్పుడు వస్తాడో ఏమో. నేను ఉన్న టైమింగ్స్‌లో కనిపిస్తాడో లేదో’ సందిగ్ధమవుతున్నాను.
‘వాడితో ఫోన్‌లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాను. మిమ్మల్ని కలసి బ్యాగ్‌ తీసుకొనేలా నేను చూస్తాను’ చెప్పాడు రామారావు.
చినుకులు మొదలయ్యాయి.
‘నేను ఈ ఊరు వచ్చిన పని అపోయింది. తిరిగి ఊరెళ్లిపోవాలి. రిటర్న్‌ టికెట్టు అయిపోయింది. రైల్వేస్టేషన్‌కి పోవాలి’ రామారావు తొందరవుతున్నాడు.
‘సర్లే. నా పేరు కృష్ణారావు. నీ ఫ్రెండ్‌ని కలవమను. అవకాశం కుదిరితే నేనే అందచేస్తాను’ చెప్పాను ఆ బ్యాగ్‌ని లోపలికిలాక్కుంటూ. 
‘థాంక్స్‌’ అంటూ  కదిలి పరుగులా పోతున్నాడు రామారావు.

నేను మెయిన్‌ డోర్‌ మూసి హాల్లోకి వచ్చాను ఆ బ్యాగ్‌తో. అందులో ఏమున్నాయో కానీ  చాలా బరువనిపించింది.
ఫ్రిజ్‌లోంచి బాటిల్‌ తీసి వాటర్‌ తాగాను. లైట్లార్పి గదిలోకి వచ్చాను.
బయట చినుకులు కాస్తా వానగా మారిందని తోస్తోంది. రామారావు పరిస్థితి ఏమిటో! స్టేషన్‌ని చేరుకోగలడా? ఊరుకి పోగలడా? ఇంతకీ శ్యామలరావు ఎటు వెళ్లాడో? ఎప్పుడు వస్తాడో? బ్యాగ్‌ అతడికి అందించడం ఎలాగో? తర్జనభర్జనలతోనే లైట్‌ ఆర్పి మంచం ఎక్కేశాను. ఎప్పుడు ఎలా పట్టేసిందో నిద్ర పట్టేసింది. లేచేసరికి తెల్లారి పోయింది. హాలులోని ఆ బ్యాగ్‌ని చూశాక రాత్రి ఘటన సర్రున గుర్తుకు వచ్చింది.
పేపర్‌కై  మెయిన్‌ డోర్‌ తీస్తూ ఎదురు రూమ్‌ వైపు చూశాను. ఆ రూమ్‌ తలుపు తీసి ఉంది.
పేపర్‌ రాలేదు. శ్యామలరావుకై వేచి చూస్తున్నాను. అతడు కానరావడం లేదు. నేనే కదిలి ఆ రూమ్‌ ముందుకు వెళ్లాను. ‘హలో’ అన్నాను. రెండో పిలుపుకి ఒకతను రూమ్‌లోంచి బయటకి వచ్చాడు. నేను ఈ రూమ్‌లో చూస్తున్న అతనే.

‘మీరు శ్యామలరావా’ అడిగాను.
‘అవును’ అన్నాడు అతను. 
నేను విషయమంతా చెప్పాను.
‘అవునవును. మీల్స్‌కెళ్లాను. నా ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయిపోయింది. రూమ్‌కి వచ్చి చార్జింగ్‌ పెట్టాక రామారావు ఫోన్‌కాల్‌ అటెండ్‌ కాగలిగాను. వాడు మా ఊరు వాడే. మా వాళ్లు వాడి చేత నాకు ఆ బ్యాగ్‌ పంపారు. వాడు తన సొంత పని కాగానే నాకా బ్యాగ్‌ అందచేయాలనుకున్నాడట. నేనా సమయానికి వాడికి అందుబాటులో లేకపోయాను. ట్రైన్‌కి టైమైపోతుందని మీకు ఆ బ్యాగ్‌నిచ్చేసి వాడు తిరిగి ఊరు బయలుదేరిపోయాడట. ఆ బ్యాగ్‌కై మిమ్మల్ని నేనే కలవాలనుకుంటున్నాను’ చెప్పాడు శ్యామలరావు. 
శ్యామలరావుని పిలుచుకొని ఇంట్లోకి వచ్చాను. హాల్లోని ఆ బ్యాగ్‌ని చూపాను. 

ఆలోపే ‘పేపర్‌’ అంటూ బయట నుంచి పేపర్‌ బాయ్‌ కేక. దాని కంటే ముందుగానే పేపరు సర్రున హాల్లోకి వచ్చి పడింది. నేను చిత్రమవుతున్నాను.
శ్యామలరావు ‘థాంక్స్‌’ చెప్పి ఆ బ్యాగ్‌ని తీసుకెళ్ళిపోతున్నాడు. నేను అతని వెనుకే వెళ్ళి మెయిన్‌ డోర్‌ మూశాను.
పేపరు తీసుకొని హాల్లోని సోఫాలో కూర్చున్నాను. పేపర్‌ పేజీలు తిప్పుతూ హెడింగ్స్‌ చదువుతున్నాను. డోర్‌ బెల్‌ మోగింది. వెళ్లి మెయిన్‌ డోర్‌ తీశాను. శ్యామలరావు కనిపించాడు. 
‘ఏమట?’అడిగాను.
‘బ్యాగ్‌లో రాళ్లున్నాయి’ దాదాపుగా ఏడుపు గొంతుతో అతను.
నేను కంగారుపడుతూ ‘నాకేం తెలుసు? అతనిచ్చిందే మీకు అందించేశాను’ అన్నాను.
‘లేదు. మా వాళ్లు ఏం పంపారో అవి లేవు’ గందికవుతున్నాడు శ్యామలరావు.

‘అయ్యో. నాకేం సంబంధం?’ అనేశాను.
‘రామారావుకి ఫోన్‌ చేశాను. వాడూ మా వాళ్ళు ఇచ్చిందే తెచ్చి ఇచ్చానని చెప్పుతున్నాడు. బ్యాగ్‌లో ఏం ఉన్నాయో తనకీ తెలియదంటున్నాడు’ చెప్పుతున్నాడు శ్యామలరావు. నేను వింటున్నాను.
‘మా వాళ్లనీ వాకబు చేశాను. వాళ్లు పంపినవి చెప్పారు. అవి లేవు. వాటి బదులు రాళ్లు ఉన్నాయి’ శ్యామలరావు తంటాలు పడుతున్నాడు. నేను అతణ్ణే చూస్తున్నాను.
‘ఏమీ తేలడం లేదు. మోసం జరిగింది. ఇలాగైతే నేను మీ మీద పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తాను’ చెప్పాడు శ్యామలరావు చాలా ఘోరంగా.
నాకు చుర్రుమంది. అయినా తమాయించుకున్నాను. మాట్లాడడానికి యత్నిస్తున్నాను. కానీ శ్యామలరావు విసురుగా వెళ్లి పోయాడు.
గంట తర్వాత పోలీసులు రావడంతో నేను స్టేషన్‌కి వెళ్లవలసి వచ్చింది.
ఇన్‌స్పెక్టర్‌కి జరిగింది చెప్పాను.

మరుసటి రోజు  పోలీసులు మళ్లీ పిలవడంతో నేను స్టేషన్‌కి వెళ్లాను.
స్టేషన్‌లో శ్యామలరావుతో పాటు రామారావు, మరొకతను ఉన్నారు.
‘ఇతడేనా మీకు ఆ బ్యాగ్‌ ఇచ్చింది’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.. రామారావుని చూపుతూ.
‘అవును’ అన్నాను.
అక్కడ ఉన్న మరొకతణ్ణి పిలిచి ‘మీరు ఇక్కడ నిల్చోండి’ అన్నారు ఇన్‌స్పెక్టర్‌. అతడు అక్కడ నిల్చున్నాడు. అతడి పక్కన రామారావుని, అతని పక్కన నన్ను, నా పక్కన శ్యామలరావుని వరుసగా నిలబెట్టాడు ఇన్‌స్పెక్టర్‌.

మా నలుగురుకీ తన టేబుల్‌ మీద ఉన్న ఆ బ్యాగ్‌ని చూపుతూ ‘మీ చేతులు మారింది ఇదే బ్యాగ్‌ కదూ’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. మేం నలుగురం  ‘అవును’ అన్నాం.
‘మీరు అప్పారావు. శ్యామలరావు తండ్రి. మీరేగా మీ అబ్బాయికి అందించమని ఈ బ్యాగ్‌ని పంపింది’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.. మాలోని ఆ మరొకతన్ని.
ఆయనా తలూపాడు.
ఇన్‌స్పెక్టర్‌ చెప్పగా అప్పారావు టేబుల్‌ మీది బ్యాగ్‌ని తీసుకున్నాడు.
‘మీరు పంపినప్పుడు బ్యాగ్‌ ఇంతే బరువు ఉందా’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘అబ్బే. ఇంత బరువు కాదు’  చెప్పాడు అప్పారావు.

తర్వాత రామారావు వంతు. తర్వాత నా వంతు. తర్వాత శ్యామలరావు వంతు. మేమ్ముగ్గురం ‘ఇంతే బరువు’ అని ఒప్పుకున్నాం.
‘సో. రామారావు నుంచే బ్యాగ్‌ బరువు మారింది’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.. రామారావునే చూస్తూ.
రామారావు గమ్మున ‘సార్‌ నాకేం తెలియదు. నేను పుచ్చుకున్నప్పుడే బ్యాగ్‌ అంత బరువుగా ఉంది’ చెప్పాడు.
‘అబద్ధమాడకు. తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయి’ ఇన్‌స్పెక్టర్‌ గద్దించాడు.
‘ఒట్టు సార్‌. నిజం సార్‌’ బెంబేలయిపోతున్నాడు రామారావు.

‘అంటే ఆయన అబద్ధం చెబుతున్నాడా? ఆయన అందించేటప్పుడు బ్యాగ్‌ అంత బరువు లేదన్నాడుగా’ అప్పారావుని చూపుతూ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
‘లేదు సార్‌. నేను తీసుకున్నప్పుడు అంతే బరువు ఉంది. అయినా బ్యాగ్‌ నాకు ఈయన ఇవ్వలేదు’ చెప్పాడు రామారావు.
‘వ్వాట్‌?’ ఆశ్చర్యమయ్యాడు ఇన్‌స్పెక్టర్‌.
‘అవును సార్‌. ముందు రోజు అప్పారావు అంకుల్‌ నేను కలిశాం. మాటల్లో రేపు నేను ఊరు వెళ్తున్నానంటే ఒక బ్యాగ్‌ ఇస్తాను శ్యామలరావుకి అందించు అన్నారు. సరే అన్నాను. మర్నాడు ట్రైన్‌ మూవ్‌ అవుతున్న సమయాన సోమశేఖర్‌ తెచ్చిచ్చాడు ఈ బ్యాగ్‌ని’ చెప్పుతున్నాడు రామారావు.
‘రామారావు చెబుతోంది నిజమేనా?’ అప్పారావుని అడిగాడు ఇన్‌స్పెక్ట్టర్‌.
ఆయన ‘నిజమే’ అన్నాడు.

‘హూష్‌. నిగ్గుతేలాలి’ సీరియసయ్యాడు ఇన్‌స్పెక్టర్‌.
మమ్మల్నందరినీ రెండు రోజుల తర్వాత తిరిగి సమావేశపరచాడు ఇన్‌స్పెక్టర్‌.
ఈ సమావేశంలో మరో కొత్త వ్యక్తి కూడా చేరాడు.
అతణ్ణే చూస్తూ ‘ఇతడు సోమశేఖర్‌. అప్పారావు మినహా ఇతడూ మీ ముగ్గురులానే ఆ బ్యాగ్‌ తను అందుకున్నప్పుడు సుమారుగా ఇదే బరువున ఉందని తేల్చాడు. సో ఇక తప్పక నా పనితనాన్ని కఠినం చేశాను. తొలుత అప్పారావు నుంచే మొదలు పెట్టాను. అప్పారావు మొదటి భార్య చనిపోయింది. ఆవిడ కొడుకే శ్యామలరావు. అప్పారావు రెండో పెళ్లి చేసుకున్నాక శ్యామలరావుతో విభేదాలు పెరిగాయి.     

శ్యామలరావు తన వాటా ఇచ్చేస్తే శాశ్వతంగా తను బయటకి పోతానన్నాడు. అందుకు అప్పారావు ససేమిరా అంటూ వచ్చాడు. తర్వాత్తర్వాత ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. 
తన మొదటి భార్య నగలు, నగదుతో పాటు ఆవిడ పేరున ఉన్న పత్రాలు శ్యామలరావుకి ముట్ట జెప్పడానికి అప్పారావు అంగీకరించాడు. వాటినే ఆ బ్యాగ్‌ ద్వారా అందజేస్తున్నట్టు శ్యామలరావుకి చెప్పాడు. కానీ ఆ బ్యాగ్‌లో వాటి బదులు తనే రాళ్లుపెట్టి పంపాడు.      
శ్యామలరావుకి ఆ బ్యాగ్‌ అందే ప్రోసెస్‌లో చేతులు మారే విధం ఉండడంతో తను సేఫ్‌ కావొచ్చు అనుకున్నాడు. హు. అడ్డంగా దొరికిపోయాడు. అసలు మోసకారి అప్పారావే’ ఇన్‌స్పెక్టర్‌ చెబుతున్నాడు.
‘హమ్మయ్య’ అనుకున్నాను.

- బివిడి ప్రసాదరావు 

చదవండి: కథ: మరణ దండన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement