Crime Story: ప్రమాదం అంచున..! | Meenakshi Cherukuvada Pramadam Anchuna Telugu Crime Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

Crime Story: ప్రమాదం అంచున..!

Published Sun, Oct 31 2021 2:53 PM | Last Updated on Sun, Oct 31 2021 2:57 PM

Meenakshi Cherukuvada Pramadam Anchuna Telugu Crime Story In Funday Magazine - Sakshi

‘సార్‌! నిన్నటి నుంచి మా రాహుల్‌ కనబడడం లేదు!’ ఎస్‌.ఐ. కోసం వేచి చూస్తూన్న ఆ జంట ఆయన రావడంతోనే గబగబా చెప్పేశారు.
ఫిర్యాదుదారుకి సుమారు ముప్పై, అతని భార్యకు పాతిక వరకూ ఉండొచ్చు వయసు. ముఖాలు వాడిపోయి, అమె కళ్ళయితే ఏడ్చి వాచి ఉన్నాయి.
‘కూర్చోండి, ఎంత వయసు? నిన్ననగా కనబడకుంటే ఇప్పుడా ఫిర్యాదు చెయ్యడం? మీరు పిల్లాడి తల్లి,తండ్రులేనా?’ విసుగ్గా, కోపంగా అడిగాడు ఎస్‌.ఐ.
తప్పు చేసినట్టు తల దించుకున్నారు వాళ్ళు.
‘కూర్చోండి. వివరాలు చెప్పండి’ పరిశీలనగా చూస్తూ చెప్పాడు ఎస్‌.ఐ.


‘రాహుల్‌.. వయసు ఏడేళ్ళు. వివేకానంద స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. నిన్న మేము ఆఫీస్‌ నుంచి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. అప్పుడప్పుడలా జరుగుతుంది. వాడు పక్కవీధిలో ఉన్న మా అక్క ఇంటికెళతాడు. ఉదయాన్నే వచ్చేస్తాడు, ఒక్కోసారి అక్కడి నుంచే స్కూల్‌కి వెడతాడు. మాకిది మామూలే. అందుకే కంగారు పడలేదు. వచ్చాక ఫోన్‌ చేస్తే బిజీ వచ్చింది. అక్కడే ఉంటాడులే అనుకుని అలసిపోయామేమో పడుకుండి పోయాం. ఉదయం ఏదో పని మీద మా అక్క ఫోన్‌చేసే వరకూ వాడక్కడ లేడని తెలియదు. అప్పటి నుంచీ, మేమూ, వాళ్ళూ కూడా తెలిసున్న వాళ్ళందరినీ అడిగి మిస్‌ అయ్యాడు అని నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడానికి వచ్చాం’ తప్పు చేసిన భావన అతని స్వరంలో స్పష్టంగా వినబడింది.

‘సరే.. వివరాలన్నీ రాసి, ఫోటో కూడా ఇచ్చి వెళ్ళండి. దర్యాప్తు చేస్తాం. అన్నట్టు మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీరే ఉద్యోగం చేస్తారు?’ ఆరాగా అడిగాడు ఎస్‌.ఐ.
‘మేమిద్దరం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్‌మే. మాకు ఒక్కడే కొడుకు. ఎవరితోనూ గొడవల్లేవు. ఎవరి మీదా అనుమానమూ లేదు. స్కూల్‌కి కూడా వెళ్లొచ్చాం, నిన్న సాయంత్రం స్కూల్‌ అయిపోయాక మామూలుగా స్కూల్‌ బస్‌లోనే వచ్చి మా ఇంటి దగ్గర స్టాప్‌లోనే దిగాడని బస్‌ వాళ్లు కూడా చెబుతున్నారు’ ఏడుస్తున్న భార్య భుజాల చుట్టూ ఓదార్పుగా చెయ్యివేసి బదులిచ్చాడు అతను.

‘సరే మీరు వెళ్ళండి. మేము దర్యాప్తు చేస్తాం’అన్నాడు ఎస్‌.ఐ.
‘ఆ.. అన్నట్టు పిల్లాడి మెడలో గొలుసూ గట్రా ఏమైనా ఉందా?’
‘లేదు సర్‌‘ చెప్పింది తల్లి.
‘మీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చారుగా. ఆచూకీ తెలియగానే ఫోన్‌ చేస్తా.. వెళ్ళండి’ 
ఎస్‌.ఐ. తన ముందున్న ఫిర్యాదులు చూడడంలో బిజీ అయిపోయాడు.
‘సర్‌! దయచేసి కొంచెం వెంటనే వెతకండి. నాకు భయంగా ఉంది’  వెళ్ళబోతూ అంది ఆమె.
‘మీరు ఫిర్యాదు ఇచ్చి క్షణంకాలేదు. కనీసం పిల్లాడు మీ అక్క దగ్గరకు వెళ్ళాడో లేదో కూడా తెల్సుకోని తల్లితండ్రులు.. మాకు చెబుతున్నారు! చూస్తాం వెళ్ళండి’ విసుక్కున్నాడాయన.  

చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..

తల దించుకుని, మౌనంగా వెళ్ళిపోయారు వాళ్ళు.
‘ఏం తల్లితండ్రులో? ఉద్యోగాలు, సంపాదనలే ముఖ్యం అనుకున్నప్పుడు పిల్లలను కనడం దేనికి?’ చిరాగ్గా అంటూ లేచాడు. వాళ్ళిచ్చిన ఫోటో చూశాడు. చాలా ముద్దుగా బాగున్నాడు. లేత ముఖం, చురుకైన చూపులూ!
‘నాతోరా’ అని కానిస్టేబుల్తో అంటూ ఫోటో జేబులో పెట్టుకుని బయలుదేరాడు ఎస్‌.ఐ.
∙∙ 
స్కూల్‌కి వెళ్ళి రొటీన్‌ విచారణ జరిపాడు ఎస్‌.ఐ. ఏ బస్‌ ఎక్కాడో.. ఆ సంబంధీకులతో మాట్లాడాడు. వాళ్ళు చెప్పిన స్టాప్‌లో సుమారుగా ఎన్ని గంటలకు ఆ బస్‌ ఆగిందో కనుక్కున్నాడు. దాన్ని ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్‌తో నిర్ధారణ చేసుకున్నాడు.
పిల్లాడు దిగి పక్క వీధిలోకి వెళ్ళడం స్పష్టంగా కనబడింది. వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఆ అక్కగారింటికి వెళ్ళారు. 
‘అప్పుడప్పుడు వస్తాడు కానీ నిన్న రాలేదు.  తమ్ముడు ఫోన్‌ చేయలేదంటే ఇంటికే వెళ్ళిపోయాడనుకున్నా’ చెప్పింది ఆమె. 
‘మీరేం చేస్తుంటారు?’  అన్న ప్రశ్నకు తాను గృహిణి అని, తన భర్త లాయర్‌ అని, వాళ్లకు ఒక కొడుకూ, కూతురూ అని వివరాలు ఇచ్చింది. 
‘వాళ్ళేం చదువుతున్నారు?’ ఇల్లంతా కలియచూస్తూ అడిగాడు ఎస్‌.ఐ.

‘పిల్లాడు ఎనిమిదో తరగతి, పిల్ల ఆరు’  అని చెప్పిందావిడ.
‘ఏరీ?’ అన్న ప్రశ్నకు ‘స్కూల్‌కి వెళ్ళార’ని బదులిచ్చింది. 
తలా, తోకాలేని ఆ కేస్‌ తలనెప్పిగా మారింది.
ఆస్తి కోసమా అంటే వాళ్ళకు ఆస్తులేం లేవు.  కుటుంబ కలహాలా అంటే అతనికి ఆ ఒక్క అక్క తప్ప ఇంకెవరూ తోబుట్టువుల్లేరు. పోనీ డబ్బు కోసం కిడ్నాప్‌ అనుకునేందుకు రోజులు గడచిపోయినా ఎటువంటి బెదిరింపు కాల్స్‌ రాలేదు. మరి? 
ఆ మరి దగ్గరే ఆలోచన ఆగిపోతోంది.

మూడు రోజులు గడచిపోయాయి. ఎటువంటి చిన్న ఆధారమూ దొరకలేదు. అసలు అది ఎందుకు జరిగి ఉంటుంది అన్న కారణం తెలిసినా ఎవరు చేసి ఉంటారు? అని ఊహించొచ్చు. తెలుస్తుంది కూడా.  కానీ ఇక్కడ ఏ ఆధారం దొరకలేదు. అనుమానితులు కానీ, అనుమానాస్పద సంఘటన కానీ లేదు.
ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కి పోవడం తప్ప ఏ ఆధారం దొరకని ఎస్‌.ఐ. మళ్ళీ ఫిర్యాదు దారు వాళ్ల అక్క ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.

తల్లీ, తండ్రీ హాల్లో కూర్చుని సినిమా చూస్తున్నారు. పిల్లలు వాళ్ళ గదుల్లో ఉన్నారని చెప్పారు. పిల్లాడి గదిలోకి వెళ్ళిన ఎస్‌.ఐ. విస్తుపోయాడు. ఆ గదిలో ఒక ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్, ఖరీదైన వస్తువులతో అది చిన్నపిల్లాడి గదిలా లేదు. వాడు చాలా సీరియస్‌గా ఏదో వీడియో గేమ్‌ ఆడుతున్నాడు. నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డ అతనికి ఆశ్చర్యం వేసింది. తన గదిలో మరో వ్యక్తి ఉనికిని కూడా గమనించనంత దీక్షగా ఆ పిల్లాడు ఆ గేమ్‌లో మునిగిపోయాడు. అదేదో హంటింగ్‌ గేమ్‌. చాలా నిష్ణాతుడిలా ఆడుతున్నాడు.

అంతకంటే ఆశ్చర్యం తనను గదిలోకి పంపి ఆ తల్లి కానీ, తండ్రి కానీ కూడా రాలేదు, పని పిల్లతో కాఫీ పంపించి వాళ్ళు సినిమా చూడడంలో మునిగి పోయారు. అది ఒక క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌.

కొంచెంసేపు చూసి ఎస్‌.ఐ. పక్కగదిలోకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అమ్మాయి మంచం మీద అడ్డదిడ్డంగా పడుకొని నిద్రపోతోంది. సమయం పదకొండు కావస్తోంది. ఎంత సెలవైనా ఆ పిల్లకి ఇంకా అంత నిద్రేమిటో? వాళ్ళు పట్టించుకోకుండా ఉండడమేమిటో? అనుకున్న అతనికి ఆ ఇల్లూ, వాతావరణం, మనుషులూ ఎంత బాధ్యతలేనివారో అర్థమై.. మొదటిసారిగా ఆ పిల్లాడి మీద అనుమానం కలిగింది. అలాంటి వాతావరణంలో పెరిగేపిల్లల మనస్థితి అతనికి బాగానే తెలుసు.

చేతి నిండా డబ్బూ, అడ్డూఅదుపూ లేని పెంపకం, వాడు చూస్తున్న సినిమాలూ, ఆడుతున్న ఆటలూ ఆ వయసు పిల్లల్లో ఎలాంటి పోకడలూ, వెర్రితలలూ వేస్తాయో తెల్సినవాడిగా, వాడిని ‘నాతోరా’అంటూ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరతీశాడు. వెతకడంలో సాయానికి అనుకున్న వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. చిన్న కుర్రాడు, అదీ తమ్ముడి కొడుకు కనబడకుండా పోయి మూడు రోజులే అయింది. ఆ బాధ కానీ, ఆలోచన కానీ లేకుండా శుభ్రంగా టిఫిన్‌ తిని, ఆరామ్‌గా సినిమా చూస్తున్న వాళ్ళను ఏం అనుకోవాలో కూడా అర్థంకాలేదు ఎస్‌.ఐకి. ఏదో యథాలాపంగా ‘పిల్లాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా?’ అన్న వాళ్ళ నిర్లిప్తతకు అతని మతి పోయింది. కనీసం ‘తనకున్న టెన్షన్‌ కూడా వాళ్ళకు లేదు’అని విస్తుపోయాడు.

ఆ పిల్లాడిని స్టేషన్‌కు కాకుండా ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసికెళ్లాడు. వాడితో కబుర్లుచెప్పి, అచ్చికబుచ్చిక లాడి, ‘రేపొద్దున నువ్వే పోలీస్‌ ఆఫీసర్‌ అయ్యావనుకో.. ఏం చేస్తావ్‌?’ అని అడిగాడు. 

అంత చిన్నపిల్లాడు ఏ మాత్రం జంకుగొంకు లేకుండా  చెప్పిన జవాబుకు బిత్తరపోయాడు ఎస్‌.ఐ. 
ఐదు వందల రూపాయల బిల్లయ్యింది కానీ వాడి నుంచి చిన్న విషయం కూడా రాబట్టలేకపోయాడు. 
ఐస్‌క్రీమ్‌ తిన్నాకా అక్కడ టిష్యూ పేపర్‌ అయిపోవడం గమనించి జేబులోంచి చేతి రుమాలు తీసిన ఆ కుర్రాడు, దానితో బాటూ చిన్న తాళంచెవి కింద పడిపోవడం గమనించ లేదు. అది చూసిన ఎస్‌.ఐ. ముందు అది ఏ సైకిల్‌ తాళంచెవో అనుకుని, వాడికి చెప్పబోతూ అంతలోకే ఏదో అనుమానం వచ్చి వంగి దాన్ని తీశాడు. అది గాడ్రెజ్‌ తాళంచెవి.

‘ఈ తాళంచెవి ఏమిటీ?’ అంటూ చూపాడు ఎస్‌.ఐ. 
 ‘మా స్టోర్‌రూమ్‌ కీ’ ఠకీమని చెప్పాడు పిల్లాడు ఏ మాత్రం తడుముకోకుండా.
‘నీ జేబులో ఎందుకుంది?’ 
 ‘పొద్దున మమ్మీ పాతపేపర్లు అందులో పెట్టమని ఇచ్చింది. ఆటలో పడి మరచిపోయి జేబులో పెట్టేసుకున్నా.  ఇటివ్వండీ’ అంటూ చెయ్యి చాపాడు.
అప్పటికే ఎస్‌.ఐ.బుర్రలో ఉన్న అనుమానం, అంత తేలికగా ఆ కుర్రాడిని నమ్మనివ్వలేదు.
‘సరే పదా!’ అంటూ ఆ తాళంచెవిని జేబులో పడేసుకున్నాడు. కుర్రాడు దాని గురించి మళ్ళీ అడగకపోవడం అతని అనుమానాన్ని బలపరచింది.
∙∙ 
ఇల్లు చేరిన వెంటనే కుర్రాడు తనగదిలోకి వెళ్ళగానే.. స్టోర్‌ రూమ్‌ గురించీ, తాళంచెవి గురించీ పిల్లాడి తల్లిదండ్రులను అడిగాడు ఎస్‌. ఐ. 
‘అందులో పాతసామాను ఉంటుంది. నెలకోసారి పనివాళ్ళే తీసి శుభ్రం చేస్తారు. ఆ తాళంచెవి వాడెందుకు తీస్తాడు?’అంటూ అయోమయంగా అడిగింది పిల్లాడి తల్లి. 
గబగబా కుర్రాడి గదిని బయట నుంచి లాక్‌ చేసి,పెరటి వైపున్న ఆ గది తెరిచాడు ఎస్‌.ఐ.  దాదాపుగా అపస్మారకస్థితిలో, నోటికి అడ్డంగా కట్టిన గుడ్డ, పక్కన ఎంగిలి ప్లేట్లు, భరించలేని దుర్గంధంతో ఉన్న స్థితిలో రాహుల్‌ కనిపించాడు.
అతని కూడా వచ్చిన తల్లీ, తండ్రీ విస్తుపోయి చూస్తున్నారు.

వేగంగా రాహుల్‌ దగ్గరకు వెళ్లి ఆ పిల్లాడిని భుజాన వేసుకుని బయటకు తెచ్చాడు ఎస్‌.ఐ.  అంతలోకే లాయర్‌ గబగబా తమ ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్‌ చేశాడు. ఆయన వచ్చి పిల్లాడిని ట్రీట్‌ చేశాడు.
‘పొరపాటున ఆ పిల్లాడు ఆ గదిలోఉండగా చూడకుండా తాళం పెట్టారేమో!’ అంటున్న ఆ తల్లిని వారించి, ‘విషయం మీ అబ్బాయితో చెప్పిస్తా.. రండి’ అంటూ వాళ్ళను కుర్రాడి గదిలోకి తీసుకెళ్ళాడు ఎస్‌.ఐ.
ఏ మాత్రం అదురూ,బెదురూ లేకుండా ‘థ్రిల్‌ కోసం, పట్టుకోగలరో లేదో చూద్దామనే చేశాను ఈ పని’అని చెప్పాడు ఆ కుర్రాడు. 
వాడి నోటి వెంట వచ్చిన ఆ మాటలకు నిర్ఘాంతపోయారంతా.  

ముందుగా తేరుకున్న ఎస్‌.ఐ ‘ఇప్పుడు నేనేం చేయాలి? మీ అబ్బాయిని అరెస్ట్‌చేసి కోర్టులో సబ్‌మిట్‌ చేయాలా? అలా చేస్తే ఏం జరుగుతుందో లాయర్‌గారూ..  మీకు చెప్పక్కర్లేదనుకుంటా’ తీక్షణంగానే అన్నాడు ఎస్‌.ఐ.
పిల్లాడికి ఏ ప్రమాదం జరగలేదు కనుక కుర్రాడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వదిలేయమని కాళ్ళావేళ్ళా పడ్డారు వాళ్ళు.

‘చదువుకున్న వాళ్ళయి ఉండీ పిల్లలు ఎలా పెరుగుతున్నారో, ఏ దారిలో వెడుతున్నారో చూడకుండా, వాళ్ళకు అక్కరలేనన్ని సౌకర్యాలు ఇచ్చి, ఈ వయసులోనే ఓ ప్రత్యేక గది, ల్యాప్‌టాప్,నెట్,మొబైల్‌ ఇచ్చిన వాళ్ళు, వాడు వాటిని దేనికి వాడుతున్నాడో, ఎటు పోతున్నాడో చూడక్కర లేదా? ఇదేనా పెంపకం? మీ అబ్బాయిని కాదు మిమ్మల్ని శిక్షించాలి! మీ తమ్ముడు వాళ్లను  పిలవండి. వాళ్ళు చెప్పిన జవాబు మీద నా చర్య ఆధారపడి ఉంటుంది’ స్థిరంగా చెప్పాడు ఎస్‌.ఐ. 

విషయం తెల్సి షాక్‌ అయిన రాహుల్‌ తల్లి, తండ్రి హుటాహుటిన వచ్చేశారు. పిల్లాడిని హత్తుకొని ముద్దులు పెడుతూ ఆ తల్లి ఏడ్వసాగింది.  పేరెంట్స్‌గా వాళ్ల బాధ్యతను గుర్తుచేసి, పిల్లల పట్ల నిర్లక్ష్యమూ నేరమే అని హెచ్చరించి స్టేషన్‌కు బయలుదేరాడు ఎస్‌.ఐ.  

మీనాక్షీ చెరకువాడ

చదవండి: African Wild Dogs: శునకస్వామ్యం.. తుమ్ములతో మద్దతు ప్రకటన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement