ఒకప్పుడు పిల్లలు ఆటల్లో మునిగి తేలేవారు. ఇప్పుడు స్క్రీన్‌లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చే ఫోన్ ఇప్పుడు పిల్లల అటెన్షన్, క్రియేటివిటీ, ఎమోషనల్ గ్రోత్‌ను దోచుకుంటోంది.
సైలెంట్ డిజిటల్ బేబీ సిట్టర్
పిల్లల మెదడు మొదటి ఐదేళ్లలో నిర్మాణం చెందుతుంది. ఈ వయసులో వచ్చే ప్రతి ఇంద్రియానుభవం వారి మెదడులోని న్యూరాన్ల మధ్య బంధాలను ఏర్పరుస్తుంది. కాని, బిజీగా ఉన్న తల్లిదండ్రులు తరచుగా అనే మాట– ‘నేను కాసేపు పనిచేసుకోవాలి, అప్పటివరకు ఫోన్‌లో కార్టూన్ చూసుకో!’
అలా ‘డిజిటల్ బేబీ సిటింగ్’ మొదలవుతుంది. స్క్రీన్ ఆ బిడ్డ మొదటి స్నేహితుడిగా మారిపోతుంది. స్క్రీన్ అందించే అనుభవం వేగంగా, ప్రాసెసింగ్–లోడ్ ఎక్కువగా, సహజ ప్రపంచం కంటే అసంబద్ధంగా ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా మెదడు నిజ జీవితంలోని అనుభవాలపట్ల ఆసక్తి కోల్పోతుంది.
డోపమైన్ లూప్
స్క్రీన్ టచ్ చేసిన ప్రతిసారీ పిల్లల మెదడులో సంతోషాన్నిచ్చే రసాయనం ‘డోపమైన్’ విడుదలవుతుంది. కాని, అది వెంటనే తగ్గిపోతుంది. దానికోసం మరొక వీడియో కావాలి. ఇంకో కార్టూన్ కావాలి. ఇంకో గేమ్ కావాలి. అలా వలయంలో చిక్కుకుపోతారు.
అంటే స్క్రీన్‌కు అలవాటైన పిల్లలు తక్షణ సంతృప్తికి అలవాటు పడతారు. అంటే, తక్షణ ఆనందం తప్ప మిగతా ఏదీ విలువైనదిగా కనిపించదు. దీనివల్ల పిల్లలు కేంద్రీకరించడం, శాంతంగా ఆలోచించడం, సహనంతో నేర్చుకోవడం వంటి నైపుణ్యాలను కోల్పోతున్నారు.
తగ్గిన అటెన్షన్ స్పాన్
అటెన్షన్ స్పాన్ కేవలం చదువుకోడానికే కాదు, జీవితానికే ఆధారం. కాని, మానవుల సగటు అటెన్షన్ స్పాన్12 సెకన్ల నుండి 8 సెకన్లకు తగ్గిందని మైక్రోసాఫ్ట్ చేసిన అధ్యయనం చెబుతోంది. అది ఎంత తక్కువంటే ఒక గోల్డ్ ఫిష్ అటెన్షన్ స్పాన్ కంటే తక్కువ.
పిల్లలు ఒక్క క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోవడం, బోర్ అనిపిస్తే వెంటనే యూట్యూబ్ తెరవడం– ఇది కేవలం అలవాటు కాదు, అటెన్షన్ డెఫిషిట్ కండిషన్ ప్రారంభమైందనడానికి సంకేతం.
మాయమైన ఆటల ప్రపంచం...
‘ఆటలే పిల్లల పని’ అన్నారు మరియా మాంటిస్సోరి. కాని, ఆ ఆటల స్థానంలో ఇప్పుడు డిజిటల్ ప్లే వచ్చింది.
ఫోన్ గేమ్‌లో హీరో పరిగెడతాడు. కాని, పిల్లాడు కదలడు. వీడియోలో రంగులు మారతాయి, కాని, బిడ్డ బయట పూల రంగులు చూడడు. దీనివల్ల కేవలం శారీరక కదలిక తగ్గడమే కాదు, ఇమాజినేషన్, క్రియేటివిటీ, సోషల్ అవేర్‌నెస్ అన్నీ తగ్గిపోతున్నాయి.
పిల్లలు ‘ఏం చేయాలి?’ అనే ప్రశ్నను అడగరు, ‘ఏం చూపిస్తావు?’ అనే అంచనాతో ఎదురు చూస్తారు.
ఇది వారి సహజ కుతూహలాన్ని ముంచేస్తుంది.
భావోద్వేగ శూన్యత
స్క్రీన్ అనుభవాలను చూపిస్తుంది కాని, భావోద్వేగాలను కాదు. వాటిని చూసి పిల్లలు నవ్వుతారు, కాని, అర్థం లేకుండా విసిగిపోతారు. కాని, ఎందుకో తెలియదు. వాస్తవ ప్రపంచంలోని సంబంధాలు, మమత, శ్రద్ధ, సహానుభూతి– ఇలాంటి ఎమోషనల్ స్కిల్స్ ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతాయి. కాని, ఫోన్‌పై మమకారం పెరిగితే, మనుషుల పట్ల మమకారం తగ్గిపోతుంది.
పేరెంట్స్ మారాలి
పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండవచ్చు కాని, నియంత్రణ తల్లిదండ్రుల చేతిలో ఉండాలి. పేరెంట్స్ ఫోన్ చూస్తూ పిల్లలతో మాట్లాడుతుంటే, ‘మా పేరెంట్స్‌కు ఫోనే ముఖ్యం, నేను కాదు’ అని అర్థం చేసుకుంటారు. పిల్లలు మనం చెప్పేది వినరు, మనమేం చేస్తున్నామో చూస్తారు. తల్లిదండ్రులే స్క్రీన్‌కు బానిసలైతే, పిల్లలకు డిజిటల్ డిసిప్లిన్ గురించి చెప్పడం వృథా. కాబట్టి మొదటి మార్పు పెద్దల్లోనే ప్రారంభం కావాలి.
అటెన్షన్ లోపం చిహ్నాలు
చదువుతుంటే తక్షణం బోర్ అనిపించడం · గేమ్ ఆడకపోతే చిరాకు, ఆగ్రహం · ఒకే పని పైన దృష్టి నిలపలేకపోవడం · ఆటలలో క్రియేటివిటీ లేకపోవడం · మాట్లాడేటప్పుడు అర్థం లేని సారాంశం ఇవి కేవలం ప్రవర్తనా సమస్యలు కాదు, న్యూరో–డెవలప్మెంటల్ వార్నింగ్స్.
అటెన్షన్ పెంచే మార్గాలు
అటెన్షన్ పెంచడానికి పరిష్కారం టెక్నాలజీని ద్వేషించడం కాదు, దానిని సమయ పరిమితితో, మనో పరిమితితో ఉపయోగించడం.
1. రోజుకు ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్.
2. రోజూ బయట ఆటలు, చేతులతో చేసే క్రియేటివిటీ
3. భోజన సమయంలో ఫోన్ లేకుండా మాట్లాడుకోవడం
4. కథలు, పుస్తకాలు, సంగీతం ద్వారా మెదడుని మెల్లగా ఉత్తేజపరచడం.
5. ఫోన్ వినియోగంలో తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవడం.
సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్


