అంతరిక్ష పరిజ్ఞానంతో అద్భుత ఫలితాలు
ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి
సాక్షి, హైదరాబాద్: భారతీయ అంతరిక్ష పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోందని, దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతిని గడించిందని, గొప్ప, గొప్ప దేశాలు సైతం మనకు సాటిరావని ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి అన్నారు. దేశం ఎన్నోరంగాల్లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని వినియోగించి అద్భుత ఫలితాలు సాధిస్తోందని చెప్పారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఐక్యరాజ్యసమితి-ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం నగరంలోని సైఫాబాద్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు.
వివిధ రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల నిర్మాణంలో సమాచార విశ్లేషణ కోసం అంతరిక్ష పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కేంద్రం గట్టి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అంతరిక్ష పరిజ్ఞానం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారన్నారు. అంతరిక్షం నుంచి ఉపగ్రహాల సహాయంతో భూఉపరితలం, సముద్రాలు, వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వివిధ అవసరాల కోసం వినియోగించేందుకు ఈ పరిజ్ఞానం దోహదపడుతోందని అన్నారు. అంతరిక్ష పరిజ్ఞానంతో సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి ఆహారభద్రత, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అధ్యయనం, విపత్తుల నిర్వహణ, సహజ వనరుల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఈ విషయంలో ఇస్రో సహకారం అందిస్తోందని అన్నారు.
అంతరిక్ష పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని చెప్పారు. అంతరిక్ష పరిజ్ఞానం ఆధారంగా స్టార్టప్‌లను నెలకొల్పేందుకు కొత్త ఐడియాలతో వచ్చే విద్యార్థులను ఇస్రో ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెలలో నగరంలోని జీడిమెట్లలో ఇస్రో ఆధ్వర్యంలో ఇల్యుమేషన్ కేంద్రాన్ని ఏర్పా టు చేసి 360 ఖగోళ యంత్రాలను విద్యార్థుల సందర్శకుల కోసం ఉంచనున్నామని తెలిపారు. సెమినార్‌లో భారత ఖగోళ శాస్త్ర సంచాలకులు రఘునందన్ కుమార్, ప్రిన్సిపాల్ బి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.