సాక్షి, హైదరాబాద్: విశ్వాన్వేషణ, అంతరిక్ష సాంకేతిక రంగాల ‘రేస్’లో తెలంగాణను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా ‘స్పేస్‌టెక్ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రూపొందించింది. దీనిని ఈ 18న వర్చువల్ ప్రపంచమైన ‘మెటావర్స్’వేదికగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలతో..
‘స్పేస్ టెక్’కు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాను రాష్ట్ర ఐటీ విభాగం విడుదల చేసింది. స్పేస్ టెక్నాలజీపై పట్టున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, జాతీయ సంస్థలు, స్పేస్‌టెక్ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి తుదిరూపు దిద్దుతోంది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో అంతరిక్ష రంగ ఉత్పత్తులు, సేవలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది.
స్పేస్ లాంచ్ వెహికల్స్, శాటిలైట్ వ్యవస్థల తయారీకి ఊతమిచ్చే విధానాలను తేనుంది. ప్రధానంగా అంతరిక్ష సాంకేతికతను వ్యవసాయం, బీమా, పట్టణ ప్రణాళిక అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, పర్యావరణం, సహజ వనరులు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ రంగాల్లో వినియోగించేందుకు అవసరమైన ఉత్పత్తులు, సేవలపై దృష్టి పెట్టనుంది.
స్పేస్‌టెక్‌కు పెరుగుతున్న డిమాండ్
అంతరిక్ష సాంకేతికత పరిశ్రమకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్నా అందులో భారత్ వాటా కేవలం రెండు శాతమే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు వచ్చే ఆర్డర్లు మాత్రమే.. మన దేశ అంతరిక్ష పరిశ్రమకు ఊతంగా నిలుస్తున్నాయి. అయితే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెంచేందుకు ఇప్పటికే కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం వేర్వేరు స్పేస్ పాలసీలను విడుదల చేశాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ కూడా ఈ రేస్‌లో నిలిచేలా ప్రత్యేక పాలసీ తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్రానికి గుర్తింపుతోపాటు సాంఘిక, ఆర్థికాభివృద్ధికీ తోడ్పడుతుందని భావిస్తోంది.
అనుకూల పరిస్థితులతో..
ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్, హార్డ్‌వేర్, జనరల్ ఇంజనీరింగ్ పార్కులు, అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ ‘టీ–హబ్’ఉన్నాయి. ఇవన్నీ అంతరిక్ష రంగ కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అంగారక గ్రహం వద్దకు ఇస్రో పంపిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’విడిభాగాల్లో 30 శాతం హైదరాబాద్‌లో తయారైనవేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
‘మెటావర్స్’వేదికగా..
ఎమర్జింగ్ టెక్నాలజీలో ఆధునికమైనదిగా భావిస్తున్న ‘మెటావర్స్’ద్వారా ‘స్పేస్‌టెక్ పాలసీ’ని రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయనుంది. ప్రపంచాన్ని వర్చువల్ (మిథ్య)గా మన ముందుంచే టెక్నాలజీతో రూపొందినదే ‘మెటావర్స్’. కృత్రిమ మేథ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), 3డీ ఇమేజింగ్, బ్లాక్‌చెయిన్ వంటి అత్యున్నత సాంకేతికతల కలయికతో మెటావర్స్‌ను రూపొందించారు.
ఇందులో ఎవరైనా తమ ‘అవతార్’తో వర్చువల్ ప్రపంచంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని.. నేరుగా హాజరైన అనుభూతిని పొందవచ్చు. ఏప్రిల్ 18న ‘మెటావర్స్’వేదికగా జరిగే ‘స్పేస్ టెక్ పాలసీ’విడుదల కార్యక్రమంలో.. అతిథులతో పాటు ఐటీ శాఖ అధికారులు, స్పేస్‌టెక్ రంగానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు వర్చువల్‌గా తమ ‘అవతార్’లతో పాల్గొననున్నారు. కాగా స్పేస్‌టెక్ పాలసీ ప్రత్యేకతలు, మెటావర్స్ ద్వారా విడుదలకు సంబంధించిన వివరాలను రెండు మూడు రోజుల్లో పూర్తిగా వెల్లడిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment