space exploration
-
అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు
బీజింగ్: అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్‌వాక్‌లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్ఎస్) ‘తియాన్‌గాంగ్’లో షెన్‌జౌ–18 మిషన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు యె గాంగ్ఫు, లీ కాంగ్, లీ గాంగ్‌సూ దాదాపు 6.5 గంటలపాటు స్పేస్‌వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచి్చ, శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్‌వాక్. సీఎస్ఎస్ అప్లికేషన్, డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్‌వాక్ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. సంబంధిత వీడియోలను విడుదల చేశారు. ఇందులో వ్యోమగామి లీ కాంగ్ తెల్లరంగు స్పేస్ సూట్ ధరించి చేసిన తొలి స్పేస్ వాక్ కనిపిస్తోంది. లీ కాంగ్ వెనుక భూగోళం స్పష్టంగా దర్శనమిస్తోంది. షెన్‌జౌ–18 మిషన్‌లో ఇది రెండో స్పేస్‌వాక్. ఇదే మిషన్‌లో మే 28వ తేదీన వ్యోమగాములు 8.5 గంటలపాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. చైనా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సుదీర్ఘకాలం జరిగిన స్పేస్‌వాక్ ఇదే కావడం విశేషం. సీఎస్ఎస్ నుంచి మొట్టమొదటి అంతరిక్ష నడక 2021 జూలై నెలలో జరిగింది. షెన్‌జౌ–12 మిషన్ వ్యోమగాములు 7 గంటలపాటు స్పేస్‌వాక్ చేశారు. షెన్‌జౌ–13 మిషన్‌లో మొట్టమొదటిసారిగా ఓ మహిళా వ్యోమగామి స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. షెన్‌జౌ–14 మిషన్ అస్ట్రోనాట్స్ మూడు స్పేస్‌వాక్‌లు నిర్వహించారు. షెన్‌జౌ–15 మిషన్‌లో భాగంగా ఒకే వ్యోమగామి ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్పేస్‌వాక్‌లు చేశారు. ప్రస్తుతం షెన్‌జౌ–18 మిషన్ కొనసాగుతోంది. మరికొన్ని స్పేస్‌వాక్‌లు చేసే, కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. భూదిగువ కక్ష్యలో పరిశోధనల విషయంలో చైనా ముందంజలో ఉంది. స్పేస్‌వాక్‌లు సునాయాసంగా చేయడం అనేది సాంకేతిక నైపుణ్యాలను నిరూపించుకోవడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్టమైన అంతరిక్ష పరిశోధనలకు నాంది అని చెప్పొచ్చు. -
Narendra Modi: ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండానా?
సాక్షి, చెన్నై: మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పత్రికల్లో డీఎంకే ప్రభుత్వం ఇచి్చన ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో రాకెట్‌పై చైనా జాతీయ జెండాను ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. డీఎంకే ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోందని ఆరోపించారు. పనులేవీ చేయకున్నా తప్పుడు దారుల్లో క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. డీఎంకే నేతలు హద్దులు దాటారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడుకు తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాట పడుతున్నారని విమర్శించారు. భారత జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసొప్పలేదని ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో ఇచి్చన ప్రకటనల్లో చైనా జెండా ముద్రించడం ఏమిటని మండిపడ్డారు. దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే సిద్ధంగా లేదని అన్నారు. ఇండియా ఘనతలను ప్రశంసించడం, ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఎంతమాత్రం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. డీఎంకేను తమిళనాడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కులశేఖరపట్నంలో రూ.986 కోట్ల ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరునల్వేలిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కొత్త ప్రాజెక్టులు ‘అభివృద్ధి చెందిన భారత్’ రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్య భాగమని అన్నారు. అభివృద్ధిలో తమిళనాడు నూతన అధ్యాయాలను లిఖిస్తోందని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పదేళ్ల ట్రాక్ రికార్డు.. వచ్చే ఐదేళ్ల విజన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిర అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారని అన్నారు. ప్రజల విశ్వాసాలంటే ఆ పార్టీ ద్వేషమని మరోసారి రుజువైనట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్‌ను కేంద్ర మంత్రిగా నియమించామని, హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే పారీ్టలకు ప్రజల కంటే వారసత్వ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ఆ పారీ్టల నేతలు సొంత పిల్లల అభివృద్ధి గురించి ఆరాటపడతుంటే తాము మాత్రం ప్రజలందరి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరిపాలనలో తనకు పదేళ్ల ట్రాక్ రికార్డు ఉందని, రాబోయే ఐదేళ్లకు అవసరమైన విజన్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రో జన్ ఇంధన సెల్ దేశీ య వాటర్ క్రాఫ్ట్‌ను తూత్తుకుడి వేదికగా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ ఓడరేవు ఔటర్ పోర్ట్ కార్గో టెరి్మనల్‌కు శంకుస్థాపన చేశారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనను ఆకట్టుకున్నాయని, ఈ రాష్ట్రానికి సేవకుడిగా వచ్చానని, ఈ సేవ కొనసాగుతుందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. వివాదానికి దారి తీసిన డీఎంకే ప్రభుత్వ ప్రకటన -
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలోకి... ఆశలయానం
అంతరిక్ష శోధనలో పెను ముందంజకు భారత్ సర్వసన్నద్ధమవుతోంది. ప్రపంచాళికి ప్రత్యేక ఆకర్షణున్న జాబిల్లికి సంబంధించి ఇతఃపూర్వం బయటపడని రహస్యాలను అందరితో పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. శుక్రవారం శ్రీహరికోట నుంచి చంద్రుని వైపు రివ్వున నింగిలోకి ఎగసే ఉపగ్రహ వాహక నౌకతో ముచ్చటగా మూడోసారి మన చందమామ యాత్ర సాగనుంది. గత యాత్రలకు భిన్నంగా, చంద్రుని అధ్యయనంతో పాటు, ఇతరగ్రహాలపై జీవాన్ని కనుగొనడంలోనూ సాయపడుతుందని ఆశిస్తున్న ప్రయోగమిది. మునుపు ఏ దేశమూ చేయనిరీతిలో క్లిష్టమైన చంద్రమండల దక్షిణ ధ్రువం వద్ద చందమామతో చెట్టాపట్టాలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న శాస్త్రవిజ్ఞాన సాహసమిది. కోట్లాది భారతీయులే కాక, ప్రపంచమంతా ఆసక్తిగా పరికిస్తున్నది అందుకే! దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ తాజా యాత్రకు ముందు రెండుసార్లు భారత్ చంద్రమండల గవేషణ సాగించింది. 2008 అక్టోబర్ నాటి చంద్రయాన్–1లో భాగంగా ప్రయోగించిన 35 కిలోల ‘మూన్ ఇంప్యాక్ట్ ప్రోబ్’ (ఎంఐపీ) చంద్రుని కక్ష్యలో ప్రవేశించి, పరిశోధనలు సాగించి చంద్రుని ఉపరితలంపై నీటి జాడను కనుగొంది. ఇక, చంద్రుని ఉపరితలంపై దిగి, అన్వేషణ జరిపేందుకు ఉద్దేశించిన 2019 సెప్టెంబర్ నాటి చంద్రయాన్–2 పాక్షికంగానే విజయవంతమైంది. ఎనిమిది పరికరాలతో కూడిన ల్యూనార్ ఆర్బిటర్‌ను విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి పంపగలిగాం కానీ, జాబిల్లిపై దిగే రోవర్ (‘ప్రజ్ఞాన్’)ను మోసుకుపోతున్న ల్యాండర్ (‘విక్రమ్’) మాత్రం తుదిక్షణాల్లో కుప్పకూలి, ప్రయోగం పూర్తి సఫలం కాలేదు. మామూలు భాషలో చెప్పాలంటే, మార్గనిర్దేశక సాఫ్ట్‌వేర్‌లో లోపంతో ఆ క్రాష్ ల్యాండింగ్ జరిగిందట. ఇప్పుడు మళ్ళీ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా రెండోసారి చేస్తున్న ప్రయత్నమే... ఈ చంద్రయాన్–3.అంతా సవ్యంగా సాగితే, ప్రయోగించిన దాదాపు నెల తర్వాత చంద్రయాన్–3 చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది. దానిలోని ల్యాండర్, రోవర్లు ఆగస్ట్ 23న చంద్రునిపై కాలూనతాయి. ‘చంద్రయాన్–2’లో తగిలిన దెబ్బల రీత్యా... ఎదురయ్యే ఇబ్బందులు, ఎదుర్కొనే మార్గాలతో ‘వైఫల్యం – సురక్షిత పరిష్కార’ విధానంలో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దారు. ఈసారీ చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరలో 70 డిగ్రీల వద్దే ఉపగ్రహాన్ని దింపనున్నారు. అయితే, గతం నేర్పిన పాఠంతో కచ్చితంగా నిర్ణీత స్థలంలో అని కాక, 4 కి.మీ. “ 2.4 కి.మీ.ల వైశాల్యంలో ఎక్కడైనా సురక్షితంగా దిగేలా సూచనలిచ్చారు. అవసరమైతే సుదూరం ప్రయాణించి, ప్రత్యామ్నాయ స్థలంలో దిగేలా ల్యాండర్లో మరింత ఇంధనం చేర్చారు. ల్యాండర్ స్వయంగా తీసే చిత్రాలకు తోడు మునుపటి చంద్రయాన్–2 ఆర్బిటర్ తీసిన చిత్రాలను సైతం దానికి అందుబాటులో ఉంచారు. తద్వారా సరైన ప్రాంతానికి చేరినదీ, లేనిదీ నిర్ధరించుకొనేలా ఏర్పాటు చేశారు. అధిక వేగంలోనూ దిగేలా ల్యాండర్ కాళ్ళను ఈసారి దృఢంగా తీర్చిదిద్దారు. అదనపు సౌర ఫలకాల్ని ల్యాండర్‌కు అమర్చారు. అసలు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమనేదే సంక్లిష్ట ప్రక్రియ. వైఫల్యాలూ సహజమే. సఫలమైన ఘనత అమెరికా, రష్యా, చైనాలదే. వాటి సరసన నిలవడమే గొప్పయితే, ఇప్పటి దాకా ఎవరూ వెళ్ళని, కనీసం వెలుగైనా తాకని ధ్రువప్రాంతంలో తొలిసారి దిగి, అక్కడి పరిస్థితుల్ని శోధించాలన్న భారత ప్రయత్నం నిస్సందేహంగా అపూర్వమే. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపి, అమెరికా, రష్యా, చైనాల సరసన నిలవాలని పలుదేశాలు గతంలో ప్రయత్నించాయి. 2019లో మనమే కాక ఇజ్రాయెల్ చేసిన ప్రయోగమూ విఫలమైంది. 2022లో వ్యోమనౌకతో ల్యాండర్ – రోవర్‌ను పంపాలని ప్రయత్నించిన జపాన్, అలాగే రోవర్‌ను పంపజూసిన యూఏఈ సైతం చతికిలబడ్డాయి. సఫలమైన దేశాలన్నీ ఉష్ణోగ్రత, ఉపరితలం రీత్యా సురక్షితమూ, సులభమైన చంద్రమండల భూమధ్యరేఖ వద్ద ఉపగ్రహాన్ని దింపాయి. లోయలు, అగ్నిబిలాలు లేకుండా సౌరశక్తికి పుష్కలమైన సూర్యరశ్మి ఉండే ఆ ప్రాంతంలో పరికరాలు దీర్ఘకాలం పనిచేస్తాయి. కానీ, చంద్రయాన్–3 చేరదలిచిన ధ్రువప్రాంతం మైనస్ 230 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే క్లిష్టమైన అసూర్యంపశ్య. సెంటీమీటర్ల మొదలు వేల కిలోమీటర్ల పరిమాణంలో బిలాలు ఉంటాయి. తాజా ప్రయోగం సఫలమైతే, తొట్టతొలిగా అలాంటి దక్షిణ ధ్రువం వద్ద దిగిన మిషన్‌గా చంద్రయాన్–3 మన దేశానికి ఘనకీర్తి కట్టబెడుతుంది. చంద్రమండల రహస్యాల శోధన, ఛేదనలో మన జెండా రెపరెపలాడుతుంది. వలస పాలన నుంచి బయటపడ్డ అనేక దేశాలతో పోలిస్తే మనం అనూహ్యపురోగతి సాధించినట్టవుతుంది. జాబిల్లిపై ధ్రువాల వద్ద గడ్డకట్టిన చలిలో చిక్కిన శిలలు, మట్టి కాలగతికి దూరంగా స్తంభించిన ఆదికాలపు సౌరవ్యవస్థ తాలూకు ఆచూకీని పట్టివ్వగలవు. అలా విశ్వరహఃపేటిక తెరుచుకుంటుంది. భూమి నుంచి చంద్రునితో పాటు, చంద్రుడి నుంచి దివినీ, భువినీ చూసేందుకు కొత్త లోచూపు కలుగుతుంది. సోదర గ్రహాన్ని జయించామని మనిషి సంబరపడిన ప్రతిసారీ సృష్టి విసిరే సరికొత్త సవాళ్ళకు సిద్ధమవడానికి ఉత్సాహం పొంగుతుంది. చంద్రునిపై శాశ్వత స్థావరాలు నెలకొల్పడం భౌగోళిక రాజకీయ పోరులో లక్ష్యమైన వేళ ఇది భారత్‌కు అతి పెద్ద సానుకూల అంశం. అనేక ప్రయోగాలతో విశ్వవేదికపై శాస్త్రీయంగా, రాజకీయంగా జాబిల్లికి ఆకర్షణ, ప్రాధాన్యం అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం ముందు వరుసలో నిలుస్తుంది. ఇన్ని ఉద్విగ్నభరిత కోణాలున్న ఈ అంతరిక్ష యానంలో చివరకు ‘అందెను నేడే అందని జాబిల్లి’ అని భారత్ విజయగీతికలు ఆలపించాలని ఆకాంక్ష. అస్తు! అందుకై అహరహం శ్రమిస్తున్న మన శాస్త్రవేత్తల సమూహానికి విజయోస్తు! -
2030కల్లా చంద్రుడి మీదకు చైనా వ్యోమగాములు
బీజింగ్: అంతరిక్ష పరిశోధనలో పశ్చిమదేశాలతో పోటీపడుతున్న చైనా మరో ముందడుగు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో చంద్రుడి మీదకు మానవసహిత ప్రయోగాలు చేపడతామని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ డెప్యూటీ డైరెక్టర్ లిన్ జిక్వియాంగ్ ప్రకటించారు. భూమి నుంచి చంద్రుడి మీదకు వెళ్లిరావడం, స్వల్పకాలం చంద్రుడిపై ల్యాండింగ్, మానవసహిత రోబో పరిశోధనలు, ల్యాండింగ్, కలియతిరగడం, శాంపిళ్ల సేకరణ, పరిశోధన, తిరుగుప్రయాణం ఇలా పలు కీలక విభాగాల్లో పట్టుసాధించేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. చందమామ దక్షిణ ధృవం వైపు గడ్డకట్టిన నీటి నిల్వల అన్వేషణ కోసం 2025కల్లా మరోమారు వ్యోమగాములను పంపాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించిన నేపథ్యంలో చైనా చంద్రుడిపై శోధనకు సిద్ధమైందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
అంతరిక్ష పరిశోధనలో నవ శకం
శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్ గొప్ప ముందడుగు వేసింది. ‘లిగో–ఇండియా’ ఏర్పాటు సైన్స్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికా సహకారంతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు 2030 కల్లా పనులు ప్రారంభించవచ్చు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసేవారు. గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలోని న్యూట్రాన్ స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను కూడా పరిశీలించవచ్చు. విశ్వ రహస్యాల ఛేదనలో ఇదొక అద్భుతమైన ప్రయత్నం అవుతుంది. శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్ మరో మేలి ముందడుగు వేసింది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా భారత్‌లో ‘ద లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’ ఏర్పాటు కానుండటం దీనికి కారణం. కేంద్ర కేబినెట్ ఇటీవలే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడం సైన్స్ చరిత్రలో ఓ సుదినమని చెప్పాలి. అంతేకాదు... అనేక ఇతర ప్రాథమ్యాలను పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన సైన్స్ బృందం ఈ ప్రాజెక్టు అమలుకు పూనుకోవడం గొప్ప పరిణామం. వందేళ్ల తర్వాత... ఏమిటీ లిగో? దాని ప్రాధాన్యం ఏమిటి? మనకు, ప్రపంచానికి దీనివల్ల ఉపయోగమేమిటి? చాలా ఆసక్తికరమైన ప్రశ్నలివి. ఒక్కటొ క్కటిగా సమాధానాలు తెలుసుకుందాం. అమెరికాలోని కాల్టెక్, మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ల ఆధ్వర్యంలో అమెరికా చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ఈ లిగో! విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం దీని లక్ష్యం. 1916లో ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మొట్టమొదటిసారి ఈ గురుత్వ తరంగాల ఉనికిని అంచనా వేయడమే కాకుండా... దాని ఆధారంగా గురుత్వాకర్షణ శక్తిపై విప్లవా త్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశాల విశ్వంలో ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో నడిచే అత్యంత శక్తిమంతమైన ఘటనల కారణంగా పుట్టే గురుత్వ తరంగాలను 2015లో మొట్ట మొదటిసారి గుర్తించారు. ఇంకోలా చెప్పాలంటే, వాటి ఉనికిని మొదటిసారి అంచనా వేసిన వందేళ్ల తరువాత గుర్తించారని చెప్పాలి. 2015లో గుర్తించిన తరంగాలు సుమారు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణబిలాలు లయమైపోయిన కారణంగా పుట్టుకొచ్చాయి. ఆ ఆవిష్కరణకు 2017లో భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు కూడా దక్కింది. లిగో ద్వారా గురుత్వ తరంగాల ప్రత్యక్ష పరిశీలన విశ్వ దర్శనానికి రెండు కొత్త కళ్లల్లా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసే వారు. గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ మెసెంజర్ అస్ట్రానమీ అన్నమాట. ప్రపంచ నెట్వర్కులా... భారతదేశంలో లిగో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచానికి ఆకాశం మొత్తాన్ని చూసేందుకు వీలవుతుంది. ఏ దిక్కున ఎప్పుడు రెండు కృష్ణబిలాలు ఢీకొంటాయి? లేదా రెండు భారీ నక్షత్రాలు లయమైపోతాయో నిర్ధారించు కునే సామర్థ్యం లభిస్తుంది. అమెరికాతో కలిసి చేపట్టనున్న ఈ ప్రాజె క్టులో భాగంగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో భారీ డిటెక్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని లిగో కేంద్రాలతో కలిసి ఈ డిటెక్టర్ కూడా పనిచేస్తుందన్నమాట. న్యూట్రాన్ స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను వీటిద్వారా పరిశీలించవచ్చు. అంతేకాకుండా... సుమారు 1,300 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం కారణంగా పుట్టిందని నమ్ముతున్న విశ్వం తొలికాలం నాటి ప్రకంపనలనూ గుర్తించేందుకు బహుశా అవకాశం ఉంటుంది. యూరప్, జపాన్ లలోనూ లిగో డిటెక్టర్లు ఏర్పాటైతే అది ఒక ప్రపంచ నెట్వర్క్లా మారిపోతుంది. భారత్‌లోని లిగో డిటెక్టర్ పని మొదలు కాగానే... ఇప్పటికే అందుబాటులో ఉన్న రేడియో, ఆప్టికల్ టెలిస్కోపుల సాయంతో మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఖగోళ ఘటనలు జరిగేందుకు కొన్ని నిమిషాల ముందునాటి కాలానికి చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అమెరికా డిటెక్టర్లకు దూరంగా ఉన్న కారణంగా భారత్‌లోని డిటెక్టర్ ఇప్పటివరకూ చూడని ప్రాంతాలపై దృష్టి పెట్టవచ్చు. భారత్‌లో లిగో డిటెక్టర్ ఏర్పాటు అంతర్జాతీయ దృష్టికోణంలోనూ చాలా ముఖ్యమైన ఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిటెక్టర్ ఖగోళ ఘటనలను చూడగలిగే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది కాబట్టి! ఈ దేశ గడ్డపై ఓ అరుదైన పరిశోధనశాల ఏర్పా టైతే... మొదలైన తొలిరోజు నుంచి అంతర్జాతీయ స్థాయి మౌలిక పరి శోధనలు చేపడితే అది మనందరికీ గర్వకారణమైన అంశమే అవు తుంది. పైగా ఇదో అంతర్జాతీయ ప్రాజెక్టు. రియల్‌టైమ్‌లో పరస్పర సహకారం అవసరం అవుతుంది. ఈ క్రమంలో కొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటాయి. కొంగొత్త ప్రాజెక్టులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ శాస్త్రవేత్తలు ఈ రంగంలో తగిన అనుభవాన్ని గడించేందుకు సువర్ణావకాశమిది. (లిగో డిటెక్టర్ ప్రయోగాల ద్వారా సైన్స్ మరింత ముందుకు వెళ్లడం మాత్రమే కాదు... నోబెల్ అవార్డు అందుకోగల సత్తా ఉన్న అనేకానేక పరిశోధనలకు కేంద్రబిందువు గానూ మారుతుంది. భారతీయ శాస్త్రవేత్తలకూ నోబెల్ అవార్డులు దక్కే అవకాశం మరింత ఎక్కువవుతుందన్నమాట!) పరిశోధకులకు అద్భుత అవకాశం లిగో డిటెక్టర్ల నిర్మాణ దశలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ పనులన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. శక్తిమంతమైన లేజర్లు, అతిపెద్ద, భారీ వాక్యూమ్ పరికరాలు, అణుస్థాయిలో అత్యంత నున్నటి అద్దాలు... క్వాంటమ్ సెన్సింగ్, కంట్రోలింగ్ వ్యవస్థలన్నీ ఇక్కడే తయారైతే... దేశీ ‘ప్రిసిషన్ ఇంజినీరింగ్’ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా భవి ష్యత్తులో మన పారిశ్రామిక ఉత్పత్తి, నాణ్యత రెండూ ఎక్కువవు తాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందుబాటులో ఉండనే ఉన్నారు. ఇప్పటికే నడుస్తున్న కంపెనీలు కూడా హైటెక్ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంటుంది. లిగో డిటెక్టర్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఏజెన్సీ ఇప్పటికే ఈ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. లిగో– ఇండియా యువ భారతీయ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ స్ఫూర్తి తోనే చాలామంది విశ్వం దాచుకున్న అనేకానేక రహస్యాలను ఛేదించేందుకు ముందుకొస్తారు. సైన్స్ రంగంలో లిగో–ఇండియా ఏర్పాటు ఓ అద్భుతం. ఈ ప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్తలు వీలైనంత వేగంగా డిటెక్టర్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డాలి. సైన్స్ అంటే ఆసక్తి ఉన్నవారు... సైన్స్ వ్యాప్తికి కృషి చేస్తున్న వారు లిగో–ఇండియా ప్రాముఖ్యత, అవసరం, లక్ష్యాల గురించి ఈ తరం యువతకు తెలియ జేయాల్సిన సందర్భం కూడా ఇదే. భౌతికశాస్త్రం, దాని అనుబంధ రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఇదో అత్య ద్భుతమైన అవకాశం. స్నాతకోత్తర విద్యలో గురుత్వ తరంగాలపై పరిశోధనలను ఎంచు కోవడం ద్వారా లిగో– ఇండియా నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే లిగో– ఇండియా నిర్మాణం మొత్తం పూర్తయ్యి సమాచార సేకరణ మొదలుపెట్టేందుకు ఇంకా ఏడేళ్ల సమయం(2030) ఉంది. రాణా అధికారి, కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాపకులు; కె.విజయ్ రాఘవన్, కేంద్ర మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు; శివాజీ సోంధీ, ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇతర గ్రహాలపై మానవ మనుగడ అంత సులువు కాదు
హైదరాబాద్: ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో అన్ని దేశాలు అంతరిక్ష పరిశోధనలపైన దృష్టి సారించాయి. భారత్ కూడా ఇస్రో ఆధ్వర్యంలో ఇప్పటికే చంద్రయాన్ వంటి ప్రాజెక్టులను చేపట్టింది. త్వరలో ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ను అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నంలో ఉంది. 40 ఏళ్ల క్రితమే భారత్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలో మొదటిసారిగా కాలుమోపారు. సోవియట్ ఇంటర్ కాస్మోస్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1984లో అంతరిక్షం చేరిన మొదటి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మ చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి, నిజాం కళాశాల నుంచి పట్టభద్రులైన రాకేష్ శర్మ అనంతరం స్పేస్ రీసెర్చ్‌లో తన ప్రాతినిధ్యాన్ని పంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 106వ స్థాపకదినోత్సవం సందర్భంగా బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పట్లో అంతరిక్షం నుంచి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడినప్పుడు.. అక్కడినుంచి భారత్ ఎలా కనిపిస్తోందని ఆమె అడిగితే.. ‘సారే జహాసే అచ్ఛా..’అని చెప్పానంటూ ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. అంతరిక్ష యానానికి సంబంధించి రాకేష్‌శర్మ తెలిపిన ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే.. వనరులు, ప్రత్యామ్నాయ వేదికల అన్వేషణ దిశగా.. భారత్‌లో 40 ఏళ్ల క్రితం ఉన్న సాంకేతికతకు, ప్రస్తుత అధునాతన టెక్నాలజీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ప్రపంచ దేశాలకు పోటీగా మారింది. స్పేస్ టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెంది సొంతగా ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ఇస్రో కీలకపాత్ర పోషిస్తోంది. రానున్న ఏడాదిలో ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు నేను నేషనల్ అడ్వైజరీగా ఉండి పలు అంశాలను పర్యవేక్షిస్తున్నా. గట్టి పునాదులు వేశారు.. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి విక్రమ్ సారాభాయ్ వంటి పరిశోధకులు గట్టి పునాది వేశారు. దానిని విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే వనరులను అన్వేషించనున్నాయి. భూమిపై పర్యావరణం క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికలను సైతం వెతకనున్నాయి. చంద్రుడిపై మనిషి మనుగడ సాధ్యమే కానీ అది సాకారం కావాలంటే ఎంతో పురోగమించాలి. అవకాశాల్ని యువత అందిపుచ్చుకోవాలి.. అంతరిక్షంలో నేను యోగా చేస్తుంటే దీని ఫలితాలు గమనించి ఒకరిద్దరు తోటి వ్యోమగాములు కొన్ని ఆసనాలను అడిగి మరీ ప్రయత్నించారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములకు సెంట్రిఫ్యూజ్ ఆధారిత శిక్షణ ఇస్తున్నారు. అంతరిక్షం నుంచి భారత్ మిశ్రమ వర్ణాల్లో అద్భుతంగా కనిపిస్తుంది. రాజస్థాన్ బంగారు వర్ణంలో, హిమాలయాలు ఊదా రంగులో కనిపిస్తాయి. వ్యోమనౌక కిటికీ నుంచి భూమిని చూడటం మరిచిపోలేని అనుభూతి. మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఓయూలో వనరులు అద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అంతరిక్షంలో యోగా చేశా.. అంతరిక్షంలో ప్రయాణించాలంటే ముందే కఠినమైన శిక్షణ తీసుకోవాలి. అంతరిక్ష నౌక ప్రయాణ వేగం భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రతి సెకనుకు సున్నా నుంచి ఏడున్నర కిలోమీటర్లు పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంపై చాలా ప్రభావం పడుతుంది. గుండె నుంచి వివిధ అవయవాలకు రక్తం సరఫరాపైనా ప్రభావం పడుతుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇవన్నీ తట్టుకోవడానికి వీలుగా సాధారణ స్థాయి కన్నా నాలుగు రెట్ల వేగంతో రక్త ప్రసరణ జరిగేలా శిక్షణ ఉంటుంది. ఇందుకోసం నేను యోగా సాధన కూడా చేశా. రాకేష్ శర్మ -
అంతరిక్షం రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా?
భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ.. గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్‌తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 2003లో పెర్సెయస్ గెలాక్సీ క్లస్టర్ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్ హోల్) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. గ్రహాల ‘పాటలు’ ఇవి నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్రోవర్ మార్స్పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వనిఅతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. విజిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్ వాక్ చేస్తుంటారు. అలా స్పేస్ వాక్ చేసి, తిరిగి ఐఎస్ఎస్లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. ‘టచ్’లో మార్పు లేదట! అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. రకరకాల రుచుల్లో నక్షత్రాలు సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు. కళ్లు ‘ఫ్లాట్’ అవుతాయట! అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ (సాన్స్)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్ డిస్క్‌లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును! -
తెలంగాణ ‘స్పేస్’ రేస్!
సాక్షి, హైదరాబాద్: విశ్వాన్వేషణ, అంతరిక్ష సాంకేతిక రంగాల ‘రేస్’లో తెలంగాణను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా ‘స్పేస్‌టెక్ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రూపొందించింది. దీనిని ఈ 18న వర్చువల్ ప్రపంచమైన ‘మెటావర్స్’వేదికగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలతో.. ‘స్పేస్ టెక్’కు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాను రాష్ట్ర ఐటీ విభాగం విడుదల చేసింది. స్పేస్ టెక్నాలజీపై పట్టున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, జాతీయ సంస్థలు, స్పేస్‌టెక్ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి తుదిరూపు దిద్దుతోంది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో అంతరిక్ష రంగ ఉత్పత్తులు, సేవలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. స్పేస్ లాంచ్ వెహికల్స్, శాటిలైట్ వ్యవస్థల తయారీకి ఊతమిచ్చే విధానాలను తేనుంది. ప్రధానంగా అంతరిక్ష సాంకేతికతను వ్యవసాయం, బీమా, పట్టణ ప్రణాళిక అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, పర్యావరణం, సహజ వనరులు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ రంగాల్లో వినియోగించేందుకు అవసరమైన ఉత్పత్తులు, సేవలపై దృష్టి పెట్టనుంది. స్పేస్‌టెక్‌కు పెరుగుతున్న డిమాండ్ అంతరిక్ష సాంకేతికత పరిశ్రమకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్నా అందులో భారత్ వాటా కేవలం రెండు శాతమే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు వచ్చే ఆర్డర్లు మాత్రమే.. మన దేశ అంతరిక్ష పరిశ్రమకు ఊతంగా నిలుస్తున్నాయి. అయితే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెంచేందుకు ఇప్పటికే కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం వేర్వేరు స్పేస్ పాలసీలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కూడా ఈ రేస్‌లో నిలిచేలా ప్రత్యేక పాలసీ తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్రానికి గుర్తింపుతోపాటు సాంఘిక, ఆర్థికాభివృద్ధికీ తోడ్పడుతుందని భావిస్తోంది. అనుకూల పరిస్థితులతో.. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్, హార్డ్‌వేర్, జనరల్ ఇంజనీరింగ్ పార్కులు, అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ ‘టీ–హబ్’ఉన్నాయి. ఇవన్నీ అంతరిక్ష రంగ కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అంగారక గ్రహం వద్దకు ఇస్రో పంపిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’విడిభాగాల్లో 30 శాతం హైదరాబాద్‌లో తయారైనవేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ‘మెటావర్స్’వేదికగా.. ఎమర్జింగ్ టెక్నాలజీలో ఆధునికమైనదిగా భావిస్తున్న ‘మెటావర్స్’ద్వారా ‘స్పేస్‌టెక్ పాలసీ’ని రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయనుంది. ప్రపంచాన్ని వర్చువల్ (మిథ్య)గా మన ముందుంచే టెక్నాలజీతో రూపొందినదే ‘మెటావర్స్’. కృత్రిమ మేథ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), 3డీ ఇమేజింగ్, బ్లాక్‌చెయిన్ వంటి అత్యున్నత సాంకేతికతల కలయికతో మెటావర్స్‌ను రూపొందించారు. ఇందులో ఎవరైనా తమ ‘అవతార్’తో వర్చువల్ ప్రపంచంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని.. నేరుగా హాజరైన అనుభూతిని పొందవచ్చు. ఏప్రిల్ 18న ‘మెటావర్స్’వేదికగా జరిగే ‘స్పేస్ టెక్ పాలసీ’విడుదల కార్యక్రమంలో.. అతిథులతో పాటు ఐటీ శాఖ అధికారులు, స్పేస్‌టెక్ రంగానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు వర్చువల్‌గా తమ ‘అవతార్’లతో పాల్గొననున్నారు. కాగా స్పేస్‌టెక్ పాలసీ ప్రత్యేకతలు, మెటావర్స్ ద్వారా విడుదలకు సంబంధించిన వివరాలను రెండు మూడు రోజుల్లో పూర్తిగా వెల్లడిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. -
అంతరిక్ష పరిశోధనలపై కరోనా ప్రభావం
-
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ టాప్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనల్లో భారత్ నాలుగో అగ్రగామిగా ఖ్యాతి దక్కించుకుందని ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ (ఆర్ఈఎస్) ప్రొఫెసర్ చైమ్ ఈష్డె పేర్కొన్నారు. బెంగళూర్ వేదికగా ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్– 2019 సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమత్రి అశ్వర్ధ నారాయణ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు అంతరిక్ష విప్లవం భారత్ ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో విప్లవం రానుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ అన్నారు. యువ శక్తిశీల దేశమైన భారత్‌లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అపారమన్నారు. ప్రత్యేకించి సైన్స్ , ఇంజినీరింగ్ సాంకేతికతలో అద్భుతాలు సృష్టించే యువత భారత్‌కు అమూల్యమైన సంపద అంటూ కొనియాడారు. భారత్ చంద్రయాన్–2ను విజయవంతంగా నింగికి పంపి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కించుకుందన్నారు. భారత యువతకు ఆ సత్తా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇజ్రాయిల్ టు సౌత్ ఇండియా ప్రత్యేక అతిథిగా హాజరైన డానా కుర్‡్ష మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనల్లో అంకితభావంతో కృషి చేస్తున్న యువత పనితీరు ప్రశంసనీయన్నారు. భారత్, ఇజ్రాయెల్ అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యంతో చేస్తున్న కృషిని కొనియాడారు. ఇండో–ఇజ్రాయెల్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్, నీటి నిర్వహణ తదితర రంగాల్లో భారత్‌కు సహకరిస్తామన్నారు. 75 ఏళ్లు.. 75 ఉపగ్రహాలు 2022కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ సందర్భంగా 75 విద్యార్థి రూపకల్ప ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చొరవ చూపిస్తామని ఐటీసీ–2019 చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 7 విద్యార్థి రూపకల్పన ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. ఐటీ, బీటీ రంగాలే రేపటి భవిష్యత్తు అని అటల్జీ మాటలను పద్మశ్రీ డాక్టర్ వాసుగం గుర్తుచేశారు. ఈ సదస్సులో 7 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజినీర్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉడే పి.కృష్ణ, ప్రొఫెసర్ ఎంఆర్ ప్రాణేష్, డాక్టర్ బీవీఏ రావులు పాల్గొన్నారు. -
గగన్‌యాన్’తో చైనా సరసన
న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో చైనాతో పోటీ పడుతున్నప్పటికీ గగన్‌యాన్ విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనల్లో పొరుగుదేశంతో భారత్ సమాన స్థాయి పొందుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ కె.శివన్ శుక్రవారం వెల్లడించారు. చైనా ప్రయోగించిన చాంగ్–4 చంద్రుడి ఆవలివైపు ఈ నెలలో దిగి పరిశోధనలు ప్రారంభించిందని, భారత్‌కూడా చంద్రయాన్–2 ద్వారా చంద్రుడి ఆవలివైపు పరిశోధనలకు పూనుకుందని ఆయన తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రస్తుతానికి భారత్ చైనాతో పోటీ పడుతున్నప్పటికీ, 2022 తరువాత భారత్ కూడా చైనాకు దీటుగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో ఈ రెండు దేశాలు కీలకమైనవి, భారత్ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా తన పొరుగుదేశాలకు సాంకేతికతను కానుకగా ఇచ్చిందని, అదే సమయంలో చైనా కూడా పాకిస్తాన్, శ్రీలంకలకు తన సాంకేతికతను అందజేస్తోందని ఆయన వివరించారు. 2017లో భారత్ ప్రయోగించిన ఉపగ్రహ సేవల ద్వారా నేపాల్‌లో చాలాచోట్ల ప్రజలు తొలిసారి టీవీ కార్యక్రమాలు వీక్షించగలిగారని ఆయన అన్నారు. భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్, జీపీఎస్ వ్యవస్థపై అడిగిన ప్రశ్నకు ‘సైనిక దళాలు ఇప్పటికే సొంత నావిగేషన్, జీపీఎస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయని’శివన్ సమాధానమిచ్చారు. ‘గగన్‌యాన్’లో పైలెట్లకే అవకాశం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రాజెక్టులో భాగమైన గగన్‌యాన్‌లో వ్యోమగాములుగా పైలెట్లు ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని ఇస్రో వెల్లడించింది. మానవ సహిత అంతరిక్ష యాత్రకోసం వ్యోమగాముల ఎంపికలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఈ పరిశోధనలో రక్షణ పరిశోధన శాఖ పాత్ర కీలకమని మరో శాస్త్రవేత్త అన్నారు. మానవరహిత గగన్‌యాన్ మిషన్‌ను 2020 డిసెంబర్ నాటికి, మానవ సహితంగా 2021 డిసెంబర్‌కి పూర్తి చేయడమే తమ లక్ష్యమని శివన్ తెలిపారు. -
సూర్యుడిని ముద్దాడే దిశగా..
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో అందని ద్రాక్షలా ఊరిస్తున్న అద్భుత ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించింది. దశాబ్దాలుగా అసాధ్యమైన కలగా మిగిలిన సూర్యుడిపై ప్రయోగాన్ని ‘పార్కర్ సోలార్ ప్రోబ్’వ్యోమనౌకతో సుసాధ్యం చేసింది. కేప్ కెనెవెరాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి డెల్టా–4 హెవీ రాకెట్ సహాయంతో నిప్పులు విరజిమ్ముతూ సూర్యుడిని ముద్దాడేందుకు వ్యోమనౌక బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.01 గంటలకు నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా అనుకున్న ప్రకారం శనివారమే ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా.. పలు సాంకేతిక వైఫల్యాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. సుమారు లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ మిషన్ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. సూర్యుడి వాతావరణాన్ని స్పృశించి అక్కడి రహస్యాల గుట్టు విప్పేందుకు ప్రారంభమైన ఈ ప్రయోగం అనేక ఆటంకాలను ఎదుర్కొని చివరికి గమ్యస్థానం దిశగా సాగింది. ఉష్ణకవచం లేకుంటే.. ప్రయోగమే లేదు.. అన్ని అంతరిక్ష ప్రయోగాలు ఒక ఎత్తు అయితే.. సూర్యుడిపై ప్రయోగం చేపట్టడం మరో ఎత్తు. సూర్యుడి వాతావరణంలో ఉండే అధిక వేడిని తట్టు కుని ప్రయోగాలు చేపట్టడం శాస్త్రవేత్తలకు కొరకరాని కొయ్యగా ఉంది. అయితే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఉష్ణ కవచమే ఈ ప్రయోగానికి బాటలు వేసింది. పార్కర్ ముందు భాగంలో అమర్చిన ఈ ఉష్ణ కవచం 8 అడుగుల వ్యాసం, నాలుగున్నర అంగుళాల మందమున్న కార్బన్ మిశ్రమ లోహంతో తయారైంది. దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలగడం దీని ప్రత్యేకత. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే çసూర్యుడి ఉపరితలంలో 5,500 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయి. కరోనాలో అంతకన్నా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. దీనిపైనే పార్కర్ ప్రోబ్ ప్రధానంగా దృష్టిపెట్టనుంది. సూర్యుడికి ఎంత దగ్గర.. సోలార్ ప్రోబ్ మిషన్ 2024 డిసెంబర్ 19 నాటికి తొలిసారి సూర్యుడికి సుమారు 60 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వెళ్లనుంది. 60 లక్షల కిలోమీటర్లు అనేది చూడటానికి చాలా పెద్ద దూరంలా కనిపిస్తున్నా.. ఇదేమీ అంత దూరం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నుంచి సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరం. దీనికోసం వారు ఓ నమూనాను వివరిస్తున్నారు. ఉదాహరణకు భూమి, సూర్యుడి మధ్య దూరం ఒక మీటర్ ఉందనుకుంటే.. సోలార్ ప్రోబ్ మిషన్‌కు సూర్యుడికి మధ్య దూరం 4 సెంటీమీటర్లు మాత్రమేనని చెబుతున్నారు. ముందు ఏం ఉందో చూద్దాం.. సూర్యుడి వాతావరణంపై పరిశోధనలు చేసిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యూజీన్ పార్కర్(91) గౌరవార్థం ఈ నౌకకు పార్కర్ సోలార్ ప్రోబ్ అని పేరు పెట్టారు. 1958లోనే పార్కర్ సౌర గాలుల ఉనికిని గుర్తించారు.అందుకే నాసా తొలిసారి తన మిషన్‌కు జీవించి ఉన్న ఓ వ్యక్తి పేరు పెట్టింది. వ్యోమనౌకలో పార్కర్ రాసిన ‘ముందు ఏం ఉందో చూద్దాం’ అనే సందేశాన్ని పంపారు. అలాగే 1.1 మిలియన్ల పేర్లున్న మెమరీ చిప్‌ను కూడా పంపారు. ప్రోబ్ ప్రత్యేకతలు.. ఈ సోలార్ ప్రోబ్ మిషన్ బరువు సుమారు టన్ను ఉంటుంది. పార్కర్ 7 సంవత్సరాల పాటూ అంతరిక్షంలో ప్రయాణించనుంది. పార్కర్ ప్రోబ్ గంటకు 6 లక్షల 90 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ప్రతి 88 నుంచి 150 రోజులకు ఒకసారి భ్రమణాన్ని పూర్తి చేస్తూ కరోనాను తాకుతుంది. సూర్యుడి బాహ్యవలయమైన కరో నా కాంతి వలయంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కరోనాలో సూర్యుడి నుంచి వెలువడే వేడి అధికంగా ఉంటుంది. కరోనాలో తరచుగా సౌర తుపానులు ఏర్పడతాయి. ఇవి భూమిని తాకితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో సౌర తుపాన్లు ఎలా ఏర్పడతాయి, వాటి వేగం పెరుగుదల.. లాంటి శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలకు దీని ద్వారా సమాధానం లభించే అవకాశం ఉంది. ఈ సమాచారం ఆధారంగా సౌర తుపాన్ల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషించనున్నారు. -
రక్షణ రంగ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష పరిశోధన, ఉపకరణాల అభివృద్ధిలో ఉన్న స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలవాలని డీఆర్డీవో యోచిస్తోంది. ఇందుకోసం రూ.100-200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రారంభించాలని భావిస్తోంది. ‘ప్రతిభ గల యువత దేశంలో చాలా మంది ఉన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్లు అందరికీ అందుబాటులో లేవు. వారి వ్యాపార ఆలోచన కార్యరూపం దాల్చాలంటే సాఫ్ట్ లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో చీఫ్ అవినాశ్ చందర్ శుక్రవారం తెలిపారు. డిఫెన్స్, ఏరోసప్లై ఇండియా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కీలక ముడిపదార్థాలను నిల్వ చేసే మెటీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచామన్నారు. టెక్నాలజీ సెంటర్లు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు డీఆర్డీవో దేశవ్యాప్తంగా 10 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తొలి రెండు కేంద్రాలు ఐఐటీ చెన్నై, ఐఐటీ ముంబైలో ఈ ఏడాదే రానున్నాయని అవినాష్ చందర్ తెలిపారు. ఒక్కో కేంద్రంలో 500 వరకు పీహెచ్డీ, ఎంటెక్ అభ్యర్థులను తీసుకునే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీల్లో రక్షణ రంగ పరిశోధనను పెంపొందించేందుకు ఏటా రూ.500 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు. రక్షణ సంబంధ వ్యవస్థలను పరీక్షించే కేంద్రాలను హైదరాబాద్ సమీపంలో నాగార్జున సాగర్, షామీర్పేట్, దుండిగల్ వద్ద రూ.1,500 కోట్లతో డీఆర్డీవో నెలకొల్పుతోంది. యూఎస్ ఫండ్ ముందుకు.. అంతరిక్ష రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు యూఎస్ ఫండ్ ఒకటి ముందుకొచ్చిందని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర వెల్లడించారు. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిషోర్ మాట్లాడుతూ నిపుణులైన మానవ వనరుల కొరత డిఫెన్స్, ఏరోస్పేస్ రంగ అభివృద్ధికి అడ్డంకిగా ఉందన్నారు. ప్రభుత్వ అనుమతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. నైపుణ్య శిక్షణకు అవసరమైన పాఠ్యాంశాలను పరిశ్రమలే రూపొందించాలని ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్ తెలిపారు. ప్రమాణాలు పాటించని కళాశాలకు తమ రాష్ట్రంలో ఇక తావులేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు అన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.