సూర్యుడిని ముద్దాడే దిశగా.. | nasa parker solar probe rocket launch successful | Sakshi
Sakshi News home page

సూర్యుడిని ముద్దాడే దిశగా..

Published Mon, Aug 13 2018 1:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

nasa parker solar probe rocket launch successful - Sakshi

అమెరికాలోని కేప్‌ కెనెవెరాల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి ఆదివారం పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ వ్యోమనౌకను మోసుకెళ్తున్న డెల్టా–4 హెవీ రాకెట్‌

వాషింగ్టన్‌: అంతరిక్ష ప్రయోగాల్లో అందని ద్రాక్షలా ఊరిస్తున్న అద్భుత ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించింది. దశాబ్దాలుగా అసాధ్యమైన కలగా మిగిలిన సూర్యుడిపై ప్రయోగాన్ని ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’వ్యోమనౌకతో సుసాధ్యం చేసింది. కేప్‌ కెనెవెరాల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి డెల్టా–4 హెవీ రాకెట్‌ సహాయంతో నిప్పులు విరజిమ్ముతూ సూర్యుడిని ముద్దాడేందుకు వ్యోమనౌక బయలుదేరింది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.01 గంటలకు నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా అనుకున్న ప్రకారం శనివారమే ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా.. పలు సాంకేతిక వైఫల్యాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. సుమారు లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ మిషన్‌ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. సూర్యుడి వాతావరణాన్ని స్పృశించి అక్కడి రహస్యాల గుట్టు విప్పేందుకు ప్రారంభమైన ఈ ప్రయోగం అనేక ఆటంకాలను ఎదుర్కొని చివరికి గమ్యస్థానం దిశగా సాగింది.

ఉష్ణకవచం లేకుంటే.. ప్రయోగమే లేదు..
అన్ని అంతరిక్ష ప్రయోగాలు ఒక ఎత్తు అయితే.. సూర్యుడిపై ప్రయోగం చేపట్టడం మరో ఎత్తు. సూర్యుడి వాతావరణంలో ఉండే అధిక వేడిని తట్టు కుని ప్రయోగాలు చేపట్టడం శాస్త్రవేత్తలకు కొరకరాని కొయ్యగా ఉంది. అయితే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఉష్ణ కవచమే ఈ ప్రయోగానికి బాటలు వేసింది. పార్కర్‌ ముందు భాగంలో అమర్చిన ఈ ఉష్ణ కవచం 8 అడుగుల వ్యాసం, నాలుగున్నర అంగుళాల మందమున్న కార్బన్‌ మిశ్రమ లోహంతో తయారైంది. దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలగడం దీని ప్రత్యేకత. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే çసూర్యుడి ఉపరితలంలో 5,500 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయి.  కరోనాలో అంతకన్నా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. దీనిపైనే పార్కర్‌ ప్రోబ్‌ ప్రధానంగా దృష్టిపెట్టనుంది.

సూర్యుడికి ఎంత దగ్గర..
సోలార్‌ ప్రోబ్‌ మిషన్‌ 2024 డిసెంబర్‌ 19 నాటికి తొలిసారి సూర్యుడికి సుమారు 60 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వెళ్లనుంది. 60 లక్షల కిలోమీటర్లు అనేది చూడటానికి చాలా పెద్ద దూరంలా కనిపిస్తున్నా.. ఇదేమీ అంత దూరం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నుంచి సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరం. దీనికోసం వారు ఓ నమూనాను వివరిస్తున్నారు. ఉదాహరణకు భూమి, సూర్యుడి మధ్య దూరం ఒక మీటర్‌ ఉందనుకుంటే.. సోలార్‌ ప్రోబ్‌ మిషన్‌కు సూర్యుడికి మధ్య దూరం 4 సెంటీమీటర్లు మాత్రమేనని చెబుతున్నారు.

ముందు ఏం ఉందో చూద్దాం..
సూర్యుడి వాతావరణంపై పరిశోధనలు చేసిన  ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యూజీన్‌ పార్కర్‌(91) గౌరవార్థం ఈ నౌకకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అని పేరు పెట్టారు. 1958లోనే పార్కర్‌ సౌర గాలుల ఉనికిని గుర్తించారు.అందుకే నాసా తొలిసారి తన మిషన్‌కు జీవించి ఉన్న ఓ వ్యక్తి పేరు పెట్టింది. వ్యోమనౌకలో పార్కర్‌ రాసిన ‘ముందు ఏం ఉందో చూద్దాం’ అనే సందేశాన్ని పంపారు. అలాగే 1.1 మిలియన్ల పేర్లున్న మెమరీ చిప్‌ను కూడా పంపారు.

ప్రోబ్‌ ప్రత్యేకతలు..
ఈ సోలార్‌ ప్రోబ్‌ మిషన్‌ బరువు సుమారు టన్ను ఉంటుంది. పార్కర్‌ 7 సంవత్సరాల పాటూ అంతరిక్షంలో ప్రయాణించనుంది. పార్కర్‌ ప్రోబ్‌ గంటకు 6 లక్షల 90 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ప్రతి 88 నుంచి 150 రోజులకు ఒకసారి భ్రమణాన్ని పూర్తి చేస్తూ కరోనాను తాకుతుంది. సూర్యుడి బాహ్యవలయమైన కరో నా కాంతి వలయంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కరోనాలో సూర్యుడి నుంచి వెలువడే వేడి అధికంగా ఉంటుంది. కరోనాలో తరచుగా సౌర తుపానులు ఏర్పడతాయి. ఇవి భూమిని తాకితే కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో సౌర తుపాన్లు ఎలా ఏర్పడతాయి, వాటి వేగం పెరుగుదల.. లాంటి శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలకు దీని ద్వారా సమాధానం లభించే అవకాశం ఉంది. ఈ సమాచారం ఆధారంగా సౌర తుపాన్ల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement