అంతరిక్ష పరిశోధనలో నవ శకం | Sakshi Guest Column On Ligo India Space exploration | Sakshi
Sakshi News home page

అంతరిక్ష పరిశోధనలో నవ శకం

Published Thu, May 4 2023 3:35 AM | Last Updated on Thu, May 4 2023 3:35 AM

Sakshi Guest Column On Ligo India Space exploration

శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్‌ గొప్ప ముందడుగు వేసింది. ‘లిగో–ఇండియా’ ఏర్పాటు సైన్స్‌ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికా సహకారంతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు 2030 కల్లా పనులు ప్రారంభించవచ్చు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసేవారు.

గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలోని న్యూట్రాన్  స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను కూడా పరిశీలించవచ్చు. విశ్వ రహస్యాల ఛేదనలో ఇదొక అద్భుతమైన ప్రయత్నం అవుతుంది.

శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్‌ మరో మేలి ముందడుగు వేసింది. అంతర్జాతీయ సైన్స్‌ ప్రాజెక్టులో భాగంగా భారత్‌లో ‘ద లేజర్‌ ఇంటర్‌ఫెరోమీటర్‌ గ్రావిటేషనల్‌–వేవ్‌ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’ ఏర్పాటు కానుండటం దీనికి కారణం. కేంద్ర కేబినెట్‌ ఇటీవలే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడం సైన్స్‌ చరిత్రలో ఓ సుదినమని చెప్పాలి. అంతేకాదు... అనేక ఇతర ప్రాథమ్యాలను పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన సైన్స్‌ బృందం ఈ ప్రాజెక్టు అమలుకు పూనుకోవడం గొప్ప పరిణామం. 

వందేళ్ల తర్వాత...
ఏమిటీ లిగో? దాని ప్రాధాన్యం ఏమిటి? మనకు, ప్రపంచానికి దీనివల్ల ఉపయోగమేమిటి? చాలా ఆసక్తికరమైన ప్రశ్నలివి. ఒక్కటొ క్కటిగా సమాధానాలు తెలుసుకుందాం. అమెరికాలోని కాల్‌టెక్, మసాచూసెట్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)ల ఆధ్వర్యంలో అమెరికా చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ఈ లిగో! విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం దీని లక్ష్యం.

1916లో ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్ స్టీన్‌ మొట్టమొదటిసారి ఈ గురుత్వ తరంగాల ఉనికిని అంచనా వేయడమే కాకుండా... దాని ఆధారంగా గురుత్వాకర్షణ శక్తిపై విప్లవా త్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశాల విశ్వంలో ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో నడిచే అత్యంత శక్తిమంతమైన ఘటనల కారణంగా పుట్టే గురుత్వ తరంగాలను 2015లో మొట్ట మొదటిసారి గుర్తించారు.

ఇంకోలా చెప్పాలంటే, వాటి ఉనికిని మొదటిసారి అంచనా వేసిన వందేళ్ల తరువాత గుర్తించారని చెప్పాలి. 2015లో గుర్తించిన తరంగాలు సుమారు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణబిలాలు లయమైపోయిన కారణంగా పుట్టుకొచ్చాయి. ఆ ఆవిష్కరణకు 2017లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డు కూడా దక్కింది.

లిగో ద్వారా గురుత్వ తరంగాల ప్రత్యక్ష పరిశీలన విశ్వ దర్శనానికి రెండు కొత్త కళ్లల్లా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసే వారు. గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ మెసెంజర్‌ అస్ట్రానమీ అన్నమాట.

ప్రపంచ నెట్‌వర్కులా...
భారతదేశంలో లిగో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచానికి ఆకాశం మొత్తాన్ని చూసేందుకు వీలవుతుంది. ఏ దిక్కున ఎప్పుడు రెండు కృష్ణబిలాలు ఢీకొంటాయి? లేదా రెండు భారీ నక్షత్రాలు లయమైపోతాయో నిర్ధారించు కునే సామర్థ్యం లభిస్తుంది. అమెరికాతో కలిసి చేపట్టనున్న ఈ ప్రాజె క్టులో భాగంగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో భారీ డిటెక్టర్‌ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నారు.

అమెరికాలోని లిగో కేంద్రాలతో కలిసి ఈ డిటెక్టర్‌ కూడా పనిచేస్తుందన్నమాట. న్యూట్రాన్  స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను వీటిద్వారా పరిశీలించవచ్చు. అంతేకాకుండా... సుమారు 1,300 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం కారణంగా పుట్టిందని నమ్ముతున్న విశ్వం తొలికాలం నాటి ప్రకంపనలనూ గుర్తించేందుకు బహుశా అవకాశం ఉంటుంది. యూరప్, జపాన్ లలోనూ లిగో డిటెక్టర్లు ఏర్పాటైతే అది ఒక ప్రపంచ నెట్‌వర్క్‌లా మారిపోతుంది. 

భారత్‌లోని లిగో డిటెక్టర్‌ పని మొదలు కాగానే... ఇప్పటికే అందుబాటులో ఉన్న రేడియో, ఆప్టికల్‌ టెలిస్కోపుల సాయంతో మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఖగోళ ఘటనలు జరిగేందుకు కొన్ని నిమిషాల ముందునాటి కాలానికి చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అమెరికా డిటెక్టర్లకు దూరంగా ఉన్న కారణంగా భారత్‌లోని డిటెక్టర్‌ ఇప్పటివరకూ చూడని ప్రాంతాలపై దృష్టి పెట్టవచ్చు. 

భారత్‌లో లిగో డిటెక్టర్‌ ఏర్పాటు అంతర్జాతీయ దృష్టికోణంలోనూ చాలా ముఖ్యమైన ఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిటెక్టర్‌ ఖగోళ ఘటనలను చూడగలిగే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది కాబట్టి! ఈ దేశ గడ్డపై ఓ అరుదైన పరిశోధనశాల ఏర్పా టైతే... మొదలైన తొలిరోజు నుంచి అంతర్జాతీయ స్థాయి మౌలిక పరి శోధనలు చేపడితే అది మనందరికీ గర్వకారణమైన అంశమే అవు తుంది. పైగా ఇదో అంతర్జాతీయ ప్రాజెక్టు. రియల్‌టైమ్‌లో పరస్పర సహకారం అవసరం అవుతుంది.

ఈ క్రమంలో కొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటాయి. కొంగొత్త ప్రాజెక్టులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ శాస్త్రవేత్తలు ఈ రంగంలో తగిన అనుభవాన్ని గడించేందుకు సువర్ణావకాశమిది. (లిగో డిటెక్టర్‌ ప్రయోగాల ద్వారా సైన్స్‌ మరింత ముందుకు వెళ్లడం మాత్రమే కాదు... నోబెల్‌ అవార్డు అందుకోగల సత్తా ఉన్న అనేకానేక పరిశోధనలకు కేంద్రబిందువు గానూ మారుతుంది. భారతీయ శాస్త్రవేత్తలకూ నోబెల్‌ అవార్డులు దక్కే అవకాశం మరింత ఎక్కువవుతుందన్నమాట!)

పరిశోధకులకు అద్భుత అవకాశం
లిగో డిటెక్టర్ల నిర్మాణ దశలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్  పనులన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. శక్తిమంతమైన లేజర్లు, అతిపెద్ద, భారీ వాక్యూమ్‌ పరికరాలు, అణుస్థాయిలో అత్యంత నున్నటి అద్దాలు... క్వాంటమ్‌ సెన్సింగ్, కంట్రోలింగ్‌ వ్యవస్థలన్నీ ఇక్కడే తయారైతే... దేశీ ‘ప్రిసిషన్ ఇంజినీరింగ్‌’ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా భవి ష్యత్తులో మన పారిశ్రామిక ఉత్పత్తి, నాణ్యత రెండూ ఎక్కువవు తాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందుబాటులో ఉండనే ఉన్నారు.

ఇప్పటికే నడుస్తున్న కంపెనీలు కూడా హైటెక్‌ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంటుంది. లిగో డిటెక్టర్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఏజెన్సీ ఇప్పటికే ఈ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. లిగో– ఇండియా యువ భారతీయ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ స్ఫూర్తి తోనే చాలామంది విశ్వం దాచుకున్న అనేకానేక రహస్యాలను ఛేదించేందుకు ముందుకొస్తారు. 

సైన్స్‌ రంగంలో లిగో–ఇండియా ఏర్పాటు ఓ అద్భుతం. ఈ ప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్తలు వీలైనంత వేగంగా డిటెక్టర్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డాలి. సైన్స్‌ అంటే ఆసక్తి ఉన్నవారు... సైన్స్‌ వ్యాప్తికి కృషి చేస్తున్న వారు లిగో–ఇండియా ప్రాముఖ్యత, అవసరం, లక్ష్యాల గురించి ఈ తరం యువతకు తెలియ జేయాల్సిన సందర్భం కూడా ఇదే.

భౌతికశాస్త్రం, దాని అనుబంధ రంగాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఇదో అత్య ద్భుతమైన అవకాశం. స్నాతకోత్తర విద్యలో గురుత్వ తరంగాలపై పరిశోధనలను ఎంచు కోవడం ద్వారా లిగో– ఇండియా నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే లిగో– ఇండియా నిర్మాణం మొత్తం పూర్తయ్యి సమాచార సేకరణ మొదలుపెట్టేందుకు ఇంకా ఏడేళ్ల సమయం(2030) ఉంది. 

రాణా అధికారి, కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యాపకులు; కె.విజయ్‌ రాఘవన్, కేంద్ర మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు; శివాజీ సోంధీ, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ 
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement