neutron stars
-
అంతరిక్ష పరిశోధనలో నవ శకం
శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్ గొప్ప ముందడుగు వేసింది. ‘లిగో–ఇండియా’ ఏర్పాటు సైన్స్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికా సహకారంతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు 2030 కల్లా పనులు ప్రారంభించవచ్చు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసేవారు. గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలోని న్యూట్రాన్ స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను కూడా పరిశీలించవచ్చు. విశ్వ రహస్యాల ఛేదనలో ఇదొక అద్భుతమైన ప్రయత్నం అవుతుంది. శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్ మరో మేలి ముందడుగు వేసింది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా భారత్‌లో ‘ద లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’ ఏర్పాటు కానుండటం దీనికి కారణం. కేంద్ర కేబినెట్ ఇటీవలే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడం సైన్స్ చరిత్రలో ఓ సుదినమని చెప్పాలి. అంతేకాదు... అనేక ఇతర ప్రాథమ్యాలను పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన సైన్స్ బృందం ఈ ప్రాజెక్టు అమలుకు పూనుకోవడం గొప్ప పరిణామం. వందేళ్ల తర్వాత... ఏమిటీ లిగో? దాని ప్రాధాన్యం ఏమిటి? మనకు, ప్రపంచానికి దీనివల్ల ఉపయోగమేమిటి? చాలా ఆసక్తికరమైన ప్రశ్నలివి. ఒక్కటొ క్కటిగా సమాధానాలు తెలుసుకుందాం. అమెరికాలోని కాల్టెక్, మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ల ఆధ్వర్యంలో అమెరికా చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ఈ లిగో! విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం దీని లక్ష్యం. 1916లో ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మొట్టమొదటిసారి ఈ గురుత్వ తరంగాల ఉనికిని అంచనా వేయడమే కాకుండా... దాని ఆధారంగా గురుత్వాకర్షణ శక్తిపై విప్లవా త్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశాల విశ్వంలో ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో నడిచే అత్యంత శక్తిమంతమైన ఘటనల కారణంగా పుట్టే గురుత్వ తరంగాలను 2015లో మొట్ట మొదటిసారి గుర్తించారు. ఇంకోలా చెప్పాలంటే, వాటి ఉనికిని మొదటిసారి అంచనా వేసిన వందేళ్ల తరువాత గుర్తించారని చెప్పాలి. 2015లో గుర్తించిన తరంగాలు సుమారు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణబిలాలు లయమైపోయిన కారణంగా పుట్టుకొచ్చాయి. ఆ ఆవిష్కరణకు 2017లో భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు కూడా దక్కింది. లిగో ద్వారా గురుత్వ తరంగాల ప్రత్యక్ష పరిశీలన విశ్వ దర్శనానికి రెండు కొత్త కళ్లల్లా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసే వారు. గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ మెసెంజర్ అస్ట్రానమీ అన్నమాట. ప్రపంచ నెట్వర్కులా... భారతదేశంలో లిగో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచానికి ఆకాశం మొత్తాన్ని చూసేందుకు వీలవుతుంది. ఏ దిక్కున ఎప్పుడు రెండు కృష్ణబిలాలు ఢీకొంటాయి? లేదా రెండు భారీ నక్షత్రాలు లయమైపోతాయో నిర్ధారించు కునే సామర్థ్యం లభిస్తుంది. అమెరికాతో కలిసి చేపట్టనున్న ఈ ప్రాజె క్టులో భాగంగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో భారీ డిటెక్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని లిగో కేంద్రాలతో కలిసి ఈ డిటెక్టర్ కూడా పనిచేస్తుందన్నమాట. న్యూట్రాన్ స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను వీటిద్వారా పరిశీలించవచ్చు. అంతేకాకుండా... సుమారు 1,300 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం కారణంగా పుట్టిందని నమ్ముతున్న విశ్వం తొలికాలం నాటి ప్రకంపనలనూ గుర్తించేందుకు బహుశా అవకాశం ఉంటుంది. యూరప్, జపాన్ లలోనూ లిగో డిటెక్టర్లు ఏర్పాటైతే అది ఒక ప్రపంచ నెట్వర్క్లా మారిపోతుంది. భారత్‌లోని లిగో డిటెక్టర్ పని మొదలు కాగానే... ఇప్పటికే అందుబాటులో ఉన్న రేడియో, ఆప్టికల్ టెలిస్కోపుల సాయంతో మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఖగోళ ఘటనలు జరిగేందుకు కొన్ని నిమిషాల ముందునాటి కాలానికి చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అమెరికా డిటెక్టర్లకు దూరంగా ఉన్న కారణంగా భారత్‌లోని డిటెక్టర్ ఇప్పటివరకూ చూడని ప్రాంతాలపై దృష్టి పెట్టవచ్చు. భారత్‌లో లిగో డిటెక్టర్ ఏర్పాటు అంతర్జాతీయ దృష్టికోణంలోనూ చాలా ముఖ్యమైన ఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిటెక్టర్ ఖగోళ ఘటనలను చూడగలిగే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది కాబట్టి! ఈ దేశ గడ్డపై ఓ అరుదైన పరిశోధనశాల ఏర్పా టైతే... మొదలైన తొలిరోజు నుంచి అంతర్జాతీయ స్థాయి మౌలిక పరి శోధనలు చేపడితే అది మనందరికీ గర్వకారణమైన అంశమే అవు తుంది. పైగా ఇదో అంతర్జాతీయ ప్రాజెక్టు. రియల్‌టైమ్‌లో పరస్పర సహకారం అవసరం అవుతుంది. ఈ క్రమంలో కొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటాయి. కొంగొత్త ప్రాజెక్టులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ శాస్త్రవేత్తలు ఈ రంగంలో తగిన అనుభవాన్ని గడించేందుకు సువర్ణావకాశమిది. (లిగో డిటెక్టర్ ప్రయోగాల ద్వారా సైన్స్ మరింత ముందుకు వెళ్లడం మాత్రమే కాదు... నోబెల్ అవార్డు అందుకోగల సత్తా ఉన్న అనేకానేక పరిశోధనలకు కేంద్రబిందువు గానూ మారుతుంది. భారతీయ శాస్త్రవేత్తలకూ నోబెల్ అవార్డులు దక్కే అవకాశం మరింత ఎక్కువవుతుందన్నమాట!) పరిశోధకులకు అద్భుత అవకాశం లిగో డిటెక్టర్ల నిర్మాణ దశలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ పనులన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. శక్తిమంతమైన లేజర్లు, అతిపెద్ద, భారీ వాక్యూమ్ పరికరాలు, అణుస్థాయిలో అత్యంత నున్నటి అద్దాలు... క్వాంటమ్ సెన్సింగ్, కంట్రోలింగ్ వ్యవస్థలన్నీ ఇక్కడే తయారైతే... దేశీ ‘ప్రిసిషన్ ఇంజినీరింగ్’ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా భవి ష్యత్తులో మన పారిశ్రామిక ఉత్పత్తి, నాణ్యత రెండూ ఎక్కువవు తాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందుబాటులో ఉండనే ఉన్నారు. ఇప్పటికే నడుస్తున్న కంపెనీలు కూడా హైటెక్ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంటుంది. లిగో డిటెక్టర్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఏజెన్సీ ఇప్పటికే ఈ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. లిగో– ఇండియా యువ భారతీయ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ స్ఫూర్తి తోనే చాలామంది విశ్వం దాచుకున్న అనేకానేక రహస్యాలను ఛేదించేందుకు ముందుకొస్తారు. సైన్స్ రంగంలో లిగో–ఇండియా ఏర్పాటు ఓ అద్భుతం. ఈ ప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్తలు వీలైనంత వేగంగా డిటెక్టర్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డాలి. సైన్స్ అంటే ఆసక్తి ఉన్నవారు... సైన్స్ వ్యాప్తికి కృషి చేస్తున్న వారు లిగో–ఇండియా ప్రాముఖ్యత, అవసరం, లక్ష్యాల గురించి ఈ తరం యువతకు తెలియ జేయాల్సిన సందర్భం కూడా ఇదే. భౌతికశాస్త్రం, దాని అనుబంధ రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఇదో అత్య ద్భుతమైన అవకాశం. స్నాతకోత్తర విద్యలో గురుత్వ తరంగాలపై పరిశోధనలను ఎంచు కోవడం ద్వారా లిగో– ఇండియా నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే లిగో– ఇండియా నిర్మాణం మొత్తం పూర్తయ్యి సమాచార సేకరణ మొదలుపెట్టేందుకు ఇంకా ఏడేళ్ల సమయం(2030) ఉంది. రాణా అధికారి, కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాపకులు; కె.విజయ్ రాఘవన్, కేంద్ర మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు; శివాజీ సోంధీ, ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కృష్ణబిలం పుట్టింది!
అంతరిక్షంలో ఒక అరుదైన దృగ్విషయం సైంటిస్టుల కంటబడింది! రెండు న్యూట్రాన్ నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి కిలోనోవాగా పేర్కొనే భారీ పేలుడుకు దారి తీయడమే గాక, చూస్తుండగానే శక్తిమంతమైన కృష్ణబిలంగా రూపొంతరం చెందాయి. ఇటీవలి కాలంలో అంతరిక్షంలో చోటుచేసుకున్న అత్యంత శక్తిమంతమైన పేలుడు ఇదేనని నాసా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రెండు తారలూ కలిసిపోయి కొద్దిసేపు ఒకే తారగా మారి అలరించాయట. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ నుంచి సైంటిస్టులు సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. ఇదంతా మనకు 1.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎన్జీసీ4993 గెలాక్సీలో చోటుచేసుకుందట. -
అంతరిక్షంలో బంగారం!
వాషింగ్టన్: మన పాలపుంతలో గ్రహాలతోపాటు కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. సమీపంలోని రెండు నక్షత్రాలు పరస్పరం ఢీకొని శక్తివంతమైన కొత్త నక్షత్రంగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిణామాన్ని కిలోనోవా అంటారు. మనం ఉంటున్న నక్షత్ర మండలంలో మరో అరుదైన కిలోనోవాకు అంకురార్పణ జరిగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగోళం నుంచి 11,000 కాంతి సంవత్సరాల దూరంలో రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నట్లు తేల్చారు. తొలుత నాసాకు చెందిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గమనించారు. అనంతరం చిలీలో అమెరికన్ అబ్జర్వేటరీలో ఉన్న స్మార్ట్ 1.5 మీటర్ టెలిస్కోప్ సాయంతో కిలోనోవా పరిణామాన్ని నిర్ధారించారు. అధ్యయనం ఫలితాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. త్వరలో సంభవించబోయే కిలోనోవా కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు నక్షత్రాలు కలిసిపోయినప్పుడు భారీ పేలుడు సంభవిస్తుందని, ఇందులో బంగారం లాంటి లోహాలు ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా నక్షత్రాలు, గ్రహాల పుట్టుకతోపాటు అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు ఈ కిలోనోవా దోహదపడుతుందని భావిస్తున్నారు. విశ్వంలో ఇప్పటిదాకా 10 కిలోనోవాలో సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక భారీ నక్షత్రం జీవితకాలం కనీసం 10 లక్షల సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత అందులో పేలుడు జరిగి, న్యూట్రాన్ స్టార్ ఉద్భవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు. -
అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా
వాషింగ్టన్: రోదసిలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. అంతుచిక్కని రహస్యాలను ఛేదించడానికి మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా పరిశోధకులు అంతరిక్షం లో జరిగిన దృగ్విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. రోదసిలో న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటన సుమారు 900 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. న్యూట్రాన్ స్టార్ , బ్లాక్ హోల్ ఢీ కొట్టుకోవడాన్ని పరిశోధకులు తొలిసారిగా గమనించారు. జూన్ 5 2020 నుంచి జూన్ 15 2020 మధ్యలో ఏకంగా సుమారు పది సార్లు ఢీ కొట్టుకున్నాయని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ ఢీ కొట్టుకోవడం తో బలమైన గురుత్వాకర్షణ తరంగాలు ఉధ్బవిం చాయని పరిశోధకులు తెలిపారు. ఈ అరుదైన రెండు దృగ్విషయాలు ఢీ కొట్టుకోవడం తో బైనరీ వ్యవస్థల మూలాలు, అవి ఎంత తరచుగా విలీనం అవుతాయనే విషయాలను తెలుసుకోవడంలో, ఉపయోగ పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు -
ఐన్‌స్టీన్ సిద్ధాంతమే నిజం..!
వాషింగ్టన్: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతికూల సంద ర్భాల్లో కూడా నిజమేనని నిరూపితమైందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం బరువుతో సంబంధం లేకుండా విశ్వంలోని ఏ వస్తువైనా ఒకే సమయంలో కిందకు పడిపోతుంది. అయి తే ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతా లు మాత్రం తక్కువ బరువున్న వాటితో పోలిస్తే.. అధిక గురుత్వాకర్షణ శక్తి ఉండే న్యూట్రాన్ స్టార్ కిందకు పడే సమయాల్లో తేడా లుంటాయని పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఐన్‌స్టీన్ సిద్ధాంతమే మరోసారి నిజమని నిరూపితమైనట్లు అమెరికాలోని గ్రీన్‌బ్యాంక్ అబ్జర్వేటరీ పరిశోధకులు చెప్పారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ భూమికి 4,200 కాంతి సంవత్సరా ల దూరంలో ఉన్న ట్రిపుల్ స్టార్ సిస్టమ్‌ను 2011లో కనుగొంది. ఈ వ్యవస్థలో న్యూట్రాన్ నక్షత్రం, రెండు మరుగుజ్జు నక్షత్రాలున్నాయి. ఈ న్యూట్రాన్ స్టార్ కన్నా లోపలి తెలుపు రంగు మరుగుజ్జు నక్షత్రం తక్కువ బరువుతో ఉంది. ఇతర పరిశోధకుల సిద్ధాంతా లే నిజమైతే.. న్యూట్రాన్ స్టార్, లోపలి తెలుపు రంగు నక్షత్రం వేర్వేరు సమయాల్లో కిందకు పడిపోవాల్సి ఉందని, కానీ అలా జరగలేదని చెప్పారు. -
విశ్వం వింతలు..కొన్ని నిజాలు!
రాత్రిపూట ఆకాశంలో చందమామ.. జలతారు వెన్నెల్లో ఏ దూరతీరాలకో పరుగులు తీసే మేఘాలు.. అంతులేని నిశీధిలో మినుకుమినుకుమనే తారలు.. విశ్వం నిజంగా ఎంతో అద్భుతం కదూ..! ఇంత అద్భుతమైన విశ్వంలో మనం నిజంగా ఒంటరివాళ్లమా? భూమిలాంటి మరో గ్రహం ఉందా? ఏడేడు పద్నాలుగు లోకాలు ఉన్నాయా? ఎన్నో ఆలోచనలు మనసును ముప్పిరిగొంటుంటాయి కదూ..! సువిశాలమైన ఈ విశ్వం గురించి కొన్ని వింతైన నిజాలు తెలుసుకుందామా... న్యూట్రాన్ తారలు సెకనుకు 600 సార్లు తిరుగుతాయ్..! నక్షత్రాలు పేలిపోయిన తర్వాత ఆ పేలుడు కేంద్రంలో ఏర్పడే నక్షత్ర స్థితినే ‘న్యూట్రాన్ నక్షత్రం’గా పిలుస్తారు. ఈ నక్షత్రం జస్ట్ 10 కి.మీ. విస్తీర్ణంలో ఉన్నా కూడా.. మన సూర్యుడి కన్నా అనేక రెట్ల ద్రవ్యరాశితో ఉంటుందట. సాధారణంగా ఇవి సెకనుకు 60 సార్లు తమచుట్టూ తాము గిర్రున తిరుగుతుంటాయి. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వీటి భౌతిక లక్షణాలు మారిపోయి ఏకంగా సెకనుకు 600 సార్లు కూడా ఇవి తిరుగుతాయట. రోదసీలో నో సౌండ్! అంతరిక్షంలో మనం అరిచి కేకలేసినా.. పక్కన ఉన్నవారికి కాదుకదా.. మన శబ్దం మనకే వినిపించదు. ఎందుకంటే యానకం లేనిదే ధ్వనితరంగాలు ప్రయాణించలేవు మరి. రోదసీలో వాతావరణం ఉండదు కాబట్టి.. ధ్వని ప్రయాణానికి అవకాశం లేక అంతా సెలైంట్‌గా ఉంటుందన్నమాట. మరి వ్యోమగాములు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? రేడియో కమ్యూనికేషన్ ద్వారా. కాంతిలా ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే విశ్వం నుంచి నిరంతరం వచ్చే శబ్దాలతో మన చెవులు చిల్లులు పడేవి! విశ్వంలో చుక్కలెన్ని? ఈ విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలున్నాయంటే లెక్కించడం దాదాపు అసాధ్యమే. అయితే మన పాలపుంతలోని తారల సంఖ్యతో విశ్వంలోని అన్ని గెలాక్సీల సంఖ్యను గుణిస్తే.. కచ్చితంగా కాకపోయినా.. ఎంతోకొంత అంచనా వేయొచ్చు. ఈ రకంగా చూస్తే.. విశ్వంలో 70 సెక్స్ట్రిలియన్లు అంటే.. 70,000 మిలియన్ మిలియన్ మిలియన్ల తారలు ఉండవచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అంచనా. అలాగే విశ్వంలో జిలియన్ల కొద్దీ తారలు ఉండవచ్చని నాసా అంచనా వేసినప్పటికీ.. జిలియన్ అంటే అసంఖ్యాక సంఖ్యగా పేర్కొంటారే గానీ అదిఎంతన్నది ఇంతవరకూ ఎవరూ నిర్ణయించలేదు. చంద్రుడిపై మనిషి అడుగుజాడలు 10 కోట్ల ఏళ్ల వరకూ చెరిగిపోవు! చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. ముద్రలు చెరిగిపోవాలంటే మట్టి కదలాలి. మట్టి కదలాలంటే గాలి లేదా నీరు కావాలి. చంద్రుడిపై ఇవి రెండూ ఉండవు కాబట్టే.. పాదముద్రలు, రోవర్ చక్రాల జాడలు కోట్ల ఏళ్లపాటు అలాగే ఉండిపోతాయన్నమాట. జాబిల్లిపై నిరంతరం అతిసూక్ష్మస్థాయిలోని ఉల్కారేణువులు కురుస్తూనే ఉన్నా.. అవి పేరుకుపోయి జాడలు చెరిగిపోవడం ఇప్పట్లో జరగదు. సౌర కుటుంబంలో 99% ద్రవ్యరాశి సూర్యుడిదే! సౌరకుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99% ద్రవ్యరాశి ఒక్క సూర్యుడిదేనట. అందుకే కోట్ల కి.మీ. దూరంలోని గ్రహాలను సైతం సూర్యుడు అలా గురుత్వాకర్షణతో చుట్టూ తిప్పుకుంటున్నాడు. సాంకేతికంగా చూస్తే.. సూర్యుడు ‘జీ-టైప్ మెయిన్-సీక్వెన్స్ స్టార్’. ప్రతి సెకనుకూ 60 కోట్ల టన్నుల హైడ్రోజన్‌ను హీలియంగా మార్చేస్తాడన్నమాట. ఇందులో ప్రతిసారీ 40 లక్షల టన్నుల పదార్థం శక్తిరూపంలో విడుదలవుతుంది. అయితే ఇంధనం ఖాళీ కాగానే నక్షత్రాలు నాశనం కాకతప్పదు కాబట్టి.. మన సూర్యుడూ అంత్యదశలో రెడ్ జెయింట్గా మారతాడట. అప్పుడు భారీగా పెరిగి ఏకంగా భూమిని సైతం కప్పేస్తాడట. ఇదంతా మరో 500 కోట్ల ఏళ్ల తర్వాతే జరుగుతుంది కాబట్టి.. ఇప్పుడు మనకేమీ భయం లేదు లెండి!