అనివార్య వ్యూహాత్మక భాగస్వాములు | sakshi guest column india america strategic partnership | Sakshi
Sakshi News home page

అనివార్య వ్యూహాత్మక భాగస్వాములు

Published Fri, Jun 9 2023 1:21 AM | Last Updated on Fri, Jun 9 2023 1:25 AM

sakshi guest column india america strategic partnership - Sakshi

అమెరికా రక్షణ మంత్రి మొన్న భారత్‌ వచ్చారు. ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఇరుదేశాల సంబంధాలు ప్రస్తుతానికి ఏకీభావంతోనే నడుస్తు న్నాయి. అయితే అమెరికాలోని ఒక వర్గం వ్యూహకర్తలు ఈ భాగస్వామ్యాన్ని బలహీన పరిచే అంశాలను ఎత్తిచూపుతున్నారు. చైనా దూకుడుకు చెక్‌ పెట్టడంలో భారత్‌ క్రియాశీల భాగస్వామిగా ఉండాలని అమెరికా ఆశిస్తోందని వారు అంటున్నారు. ఉక్రెయిన్‌  ఘర్షణలో రష్యాకు బదులుగా పాశ్చాత్య దేశాల వైపు భారత్‌ నిలబడాలని సలహా ఇచ్చారు. భాగస్వామికీ, మిత్రపక్షానికీ తేడా ఉంది. అమెరికా, భారత్‌ వ్యూహాత్మక భాగస్వాములు. ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన అవసరముందని ఇరు దేశాలూ గ్రహించాలి. ఇరువురి జాతీయ అవసరాలను గుర్తించగలిగితే సంబంధాలు బలపడతాయి.

అమెరికా, భారత్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాలు సమాంతర పట్టాలపైన ఏకీభావంతోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ , భారత ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో హిరోషిమాలో కలుసుకున్న తీరు, అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌  జూన్‌ 4, 5 తేదీల్లో భార త్‌కు విచ్చేసిన వైనం (2021లో బాధ్యతలు చేపట్టాక ఆయన రెండో సారి రావడం), ఈ నెల చివరలో ప్రధాని మోదీ అమెరికాలో పర్య టించనుండటం... ఈ మూడింటినీ పరిగణనలోకి తీసుకుంటే ద్వైపా క్షిక సంబంధాలు సరైన దిశలోనే సాగుతున్నట్లు అర్థమవుతుంది. 

అమెరికాలోని ఒక వర్గం వ్యూహకర్తల నుంచి వస్తున్న సంకేతాలు, ఈ భాగస్వామ్యాన్ని బలహీన పరిచే అంశాలను ఎత్తిచూపు తున్నాయి. ‘ఫారిన్‌  ఎఫైర్స్‌’లో ఇటీవల ప్రచురితమైన కథనం... చైనా ఏకపక్ష దూకుడుకు చెక్‌ పెట్టే ప్రయత్నాల్లో భారత్‌ క్రియాశీల భాగ స్వామిగా ఉండాలని అమెరికా ఆశిస్తోందని చెబుతోంది. ఈ అంచనా అంత సరైంది కాదు. అమెరికా, చైనా ఘర్షణల్లో వేలుపెట్టేందుకు భారత్‌ ఏమాత్రం సిద్ధంగా లేదు. దీనివల్ల తమ భద్రతకు ముప్పు అని భారత్‌కు తెలుసు. వ్యూహాత్మక, సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యానికి భారత్‌ తగినది కాదన్న ధ్వని కూడా ఆ కథనంలో వినిపించింది. 

‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’లో ప్రత్యక్షమైన ఇంకో కథనం కూడా అమెరికా లేదా చైనా ఆధిపత్యంలోని ప్రపంచాన్ని భారత్‌ కోరుకోవడం లేదనీ, పొరుగు దేశం కంటే అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని స్వల్పకాలికంగానైనా సహించే స్థితిలో భారత్‌ ఉందనీ సూచించింది. ‘ఫారిన్‌  ఎఫైర్స్‌’లోనే గతంలో ప్రచురితమైన ఇంకో కథనం, ఉక్రెయిన్‌  యుద్ధం నేపథ్యంలో రష్యాకు బదులుగా పాశ్చాత్యదేశాల వైపు భారత్‌ నిలబ డాలనీ, అది ఆ దేశాన్ని శక్తిమంతంగా మారుస్తుందనీ వ్యాఖ్యానించింది. అమెరికా దృష్టిలో నమ్మదగ్గ భాగస్వామిగా నిలిచేందుకు ఇదే మంచి అవకాశమని భారత్‌కు సలహా కూడా ఇచ్చింది. 

ఈ రకమైన కథనాలు ఏ సందర్భంలో వస్తున్నాయి? ఎనిమిది నెలల్లో ఆరుసార్లు భారత్, అమెరికా సంయుక్తంగా మిలిటరీ కార్యకలా పాలు చేపట్టినప్పుడు! ఇరుదేశాల మధ్య ‘ఇనిషియేటివ్‌ ఆన్‌  క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌’ (ఐసెట్‌) ప్రారంభ సమావేశం జరిగిన కొంత కాలానికి! అంతేనా? ఈ ఏడాది జనవరి 31నే ఇరు దేశాల భద్రత సలహాదారులు వాషింగ్టన్‌ లో సమావేశమయ్యారు కూడా. అంతకు మునుపు కూడా భారత్, అమెరికా రెండూ రక్షణ, భద్రతలకు సంబంధించిన అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటయ్యేందుకు పునాది రాళ్లు వేసుకున్నాయి. ఒక్క విషయమైతే స్పష్టం. ఈ సానుకూల దృక్ప థాన్ని తిరోగమన బాట పట్టించాలని అమెరికా అనుకోవడం లేదు. కాకపోతే ద్వైపాక్షిక సంబంధాలను ఒక్కసారి సమీక్షించుకుని అవస రమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా అర్థం చేసుకోదగ్గ విషయమే. 

‘ఫారిన్‌  ఎఫైర్స్‌’ మ్యాగజైన్‌ లో భారత్‌ నమ్మదగ్గ భాగస్వామి కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కథనం ఒక విషయాన్ని మరచి పోయింది. భాగస్వామికీ, మిత్రపక్షానికీ మధ్య తేడా ఉంది. వారి దృక్కోణాలు వేరుగా ఉండేందుకు ప్రధాన కారణం ఇదే. సంక్షోభాల సమయంలో అమెరికా చేసిన సాయాన్ని భారత్‌ ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉంది. మైత్రి దృఢంగా మారేందుకు ఇది చాలా కీలకం. అదే సమయంలో తన జాతీయ భద్రత విషయంలో అమెరికాపై భారత్‌ ఏమాత్రం బాధ్యత, బరువు పెట్టడం లేదు.  సామర్థ్యం విష యంలో తేడాలున్నప్పటికీ భారత్, చైనా రెండూ తమ సార్వభౌమత్వా లను కాపాడుకునేందుకు ఎంతగా కట్టుబడి ఉన్నాయో ఇప్పటికే పలు మార్లు నిరూపించుకున్నాయి. 
తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో భారత్‌ సిద్ధం చేసుకుంటున్న వ్యవస్థలు తమకు మద్దతుగానే అని అమెరికా మేధావులు భావిస్తూంటారు. అయితే మిలి టరీ వర్గాలు మాత్రం మన భద్రత కోసమే అయినప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ సైన్యం మోహరించడం మేలనీ, తద్వారా చైనా బలగాలు తూర్పు దిక్కున తక్కువ అవుతాయనీ భావిస్తారు. అలాగే భారత నావికాదళం అమెరికా, ఇతర భాగస్వాముల సాయంతో హిందూ మహా సముద్ర ప్రాంతంలో నౌకా సంబంధ భద్రతకు కేంద్ర బిందువుగా నిలవగలదు. తద్వారా అమె రికాపై ఒత్తిడి కొంత తగ్గుతుంది. 

గతాన్ని మరచి ఇరు దేశాల మిలిటరీ వర్గాలు తమ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇరు వర్గాల మధ్య ఇప్పటికే ప్రశంసించదగ్గ స్థాయిలో సహకారం నడుస్తోంది. సమాచార విని మయం, నైపుణ్యాలకు మెరుగపెట్టుకోవడమూ జరుగుతోంది. యుద్ధ విద్యల సామార్థ్యాల్లోనూ, రక్షణ టెక్నాలజీల వ్యాపారంలోనూ ముందడుగులు పడుతున్నాయి. ఇలా సర్వసన్నద్ధమైన బలగాలు అందుబాటులో ఉండటం వల్ల నేతలు ఇతర ముఖ్యమైన అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించే వీలు ఏర్పడుతుంది.  
టెక్నాలజీ రంగంలో సహకరించుకోవడం అనేది ఇరు దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న అంశం. ద్వైపాక్షికంగానే కాదు... ‘క్వాడ్‌’ సభ్యదేశాలుగానూ ఇది చాలా ముఖ్యమైంది. ‘ఇనిషియేటివ్‌ ఆన్‌ క్రిటి కల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌’ కింద కీలక అంశాలను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్న తరుణమిది. సెమీకండక్టర్‌ రంగంలో పెట్టుబడులు, ఏరో ఇంజిన్‌  ఉత్పత్తిని భారత్‌కు తరలించడం వంటివి ఏవైనా కావచ్చు... ఏవైనా అపోహలుంటే వాటిని తొలగించుకునేందుకు ఇదే మంచి సమయం. 

‘డిఫెన్స్‌ టెక్నాలజీ అండ్‌ ట్రేడ్‌ ఇనిషియేటివ్‌’ (డీటీటీఐ) విఫలమైన నేపథ్యంలో దానికి బదులుగా ‘ఐసెట్‌’ వచ్చిందనేది తప్పుడు అంచనా అవుతుంది. ఎందుకంటే ఇరు పక్షాలూ కలిసికట్టుగా పనిచేయడంలో ఉన్న సున్నితమైన అంశాలపై సంపూర్ణ అవగాహన పొందేందుకు డీటీటీఐ సాయపడింది కాబట్టి! అలాగే ఈ భాగస్వా మ్యాల్లో నిర్ణయాధికారం అమెరికాదని కొందరు అనుకుంటూ ఉండటం కూడా అంత సరికాదు. ఎందుకంటే ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు హిందూ – పసిఫిక్‌ మహా సముద్ర ప్రాంతలో వ్యూహాత్మక స్థిరత్వానికి సాంకేతిక రంగం విషయంలో ఇరు పక్షాల మధ్య అంతరం తగ్గాల్సిన అవసరముంది. చివరగా, భారతీయ రక్షణ రంగ మార్కెట్‌ తన ఆయుధ తయారీదారులకు అందకుండా పోతుందన్న అమెరికా ఆందోళన గురించి... అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టిన్‌  2021 మార్చిలో భారత్‌ వచ్చినప్పుడు ఇచ్చిన సూచన ఆచరణ సాధ్యమైంది. ‘‘భారతీయ సైనిక దళాలు అమెరికా ఆయుధ వ్యవస్థల తాలూకూ లాభాలను చవిచూసేందుకు అవకాశాలుండాలి. అప్పుడే వారు తమకు తగిన వాటిని ఎంచుకునే వీలు ఏర్పడుతుంది. అంతేకానీ అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి వాటిని అమ్మే ప్రయత్నం చేయరాదు. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని వ్యాఖ్యానించారు ఆయన. 

ఈ నెల నాలుగవ తేదీ భారత్‌కు విచ్చేసిన ఆస్టిన్‌  రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆ మరుసటి రోజు కలిశారు. రక్షణ రంగ పారిశ్రామిక సహకారానికి ప్రణాళికలను ఖరారు చేసుకున్నారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్‌ ధోవల్‌తోనూ చర్చలు జరిపారు. భారత్, అమెరికా అనివార్య భాగస్వాములు. ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన అవసరముందని ఇరు దేశాలూ గుర్తించాలి. ఇరువురి జాతీయ అవసరాలను గుర్తించగలగడం వంటి లక్షణాలను అలవ ర్చుకుంటే ఇరువురి మధ్య సంబంధాలు బలపడతాయి. ఇరు పక్షాలు చేసిన శత ప్రయత్నాల ఫలితంగానే ప్రస్తుత సుహృద్భావ మైత్రి ఏర్ప డింది. రానున్న కొన్ని నెలల కాలం ఇప్పటికే సిద్ధంగా ఉన్న వ్యవస్థ లను కార్యాచరణకు దింపే అవకాశాలను కల్పిస్తుంది.

లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అనిల్‌ అహూజా (విశ్రాంత)
వ్యాసకర్త ఇండియా–యూఎస్‌ డీటీటీఐ ఇంటర్‌ ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్‌ మాజీ సహాధ్యక్షులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement