strategic partnership
-
US-India Relations: బలమైన రక్షణ బంధం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీటిలో పాలుపంచుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్‌కోట్ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరాల్సిందేనని ప్రకటన స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్ సహా ఉగ్ర సంస్థలన్నింటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచి్చనట్టు వివరించింది. ఫలప్రదం: జై శంకర్ అమెరికా మంత్రులతో చర్చ లు ఫలప్రదంగా సాగాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చించుకున్నామని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతకముందు చర్చల ప్రారంభ కార్యక్రమంలో ఎస్.జైశంకర్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ చర్చలు ఒక అద్భుత అవకాశమని అభివరి్ణంచారు. భారత్–అమెరికా మరింత సన్నిహితం కావడంతోపాటు ఉమ్మడి నిర్మాణాత్మక గ్లోబల్ అజెండాను రూపొందించుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యమని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత, వృద్ధిశీల, భద్రతాయుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు బ్లింకెన్ తెలిపారు. అంతేగాక అంతర్జాతీయ శాంతి, భద్రత తదితరాల సాధనకు కూడా ఇరు దేశాలూ కలసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. భారత్–అమెరికా సంబంధాలకు రక్షణ ఒప్పందాలు మూలస్తంభంగా నిలుస్తున్నాయని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. చైనా దూకుడుకు సంయుక్తంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సంయుక్తంగా సాయుధ సైనిక వాహనాల తయారీ: ఆస్టిన్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలకమైన సాయుధ సైనిక వాహనాల సంయుక్త తయారీ విషయంలో తక్షణం ముందుకు వెళ్లాలని భారత్–అమెరికా నిర్ణయించినట్టు లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరు దేశాల సైనిక దళాల మధ్య సమాచార వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక వ్యవస్థల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ (ఎస్ఓఎస్ఏ) ఒప్పందం ఖరారు తుది దశకు చేరిందని మంత్రి చెప్పారు. జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లో తయారు చేసేలా జనరల్ ఎలక్ట్రిక్ ఏరో స్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్నాయన్నారు. అలాగే భారత్‌కు వీలైనంత త్వరగా అత్యాధునిక ఎంక్యూ–9బి డ్రోన్లను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. ఇది 300 కోట్ల డాలర్ల ఒప్పందం. ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే: భారత్ కెనడాలో ఖలిస్తానీ శక్తుల ఆగడాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. మంత్రుల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా మీడియాకు వెల్లడించారు. వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని బ్లింకెన్, లాయిడ్లకు రాజ్‌నాథ్ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో భారత ఆందోళనను అర్థం చేసుకోగలమని వారు చెప్పారన్నారు. ప్రధానితో మంత్రుల భేటీ భారత్–అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రపంచ శాంతికి, ప్రగతికి అతి పెద్ద చోదక శక్తిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మంత్రుల స్థాయి భేటీ అనంతరం అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్ ఇరువురు శుక్రవారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. విదేశంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. సదస్సు జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను వారు మోదీకి వివరించారు. ‘‘ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువలపై భారత్, అమెరికాలకున్న ఉమ్మడి విశ్వాసం తిరుగులేనివి. ఇరు దేశాల మధ్య జరిగిన మంత్రుల స్థాయి చర్చలు ఆశించిన ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ భేటీ అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా శుక్రవారం మోదీకి ఫోన్ చేశారు. పశి్చమాసియా ఉద్రిక్తత తదితరాలపై నేతలు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు తీవ్ర రూపు దాలుస్తుండటం, ఉగ్రవాదం, మతి లేని హింస భారీ జన నష్టానికి దారి తీస్తుండటం దారుణమన్నారు. బ్రెజిల్ జీ20 సారథ్యం సఫలం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. -
అనివార్య వ్యూహాత్మక భాగస్వాములు
అమెరికా రక్షణ మంత్రి మొన్న భారత్ వచ్చారు. ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఇరుదేశాల సంబంధాలు ప్రస్తుతానికి ఏకీభావంతోనే నడుస్తు న్నాయి. అయితే అమెరికాలోని ఒక వర్గం వ్యూహకర్తలు ఈ భాగస్వామ్యాన్ని బలహీన పరిచే అంశాలను ఎత్తిచూపుతున్నారు. చైనా దూకుడుకు చెక్ పెట్టడంలో భారత్ క్రియాశీల భాగస్వామిగా ఉండాలని అమెరికా ఆశిస్తోందని వారు అంటున్నారు. ఉక్రెయిన్ ఘర్షణలో రష్యాకు బదులుగా పాశ్చాత్య దేశాల వైపు భారత్ నిలబడాలని సలహా ఇచ్చారు. భాగస్వామికీ, మిత్రపక్షానికీ తేడా ఉంది. అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వాములు. ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన అవసరముందని ఇరు దేశాలూ గ్రహించాలి. ఇరువురి జాతీయ అవసరాలను గుర్తించగలిగితే సంబంధాలు బలపడతాయి. అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు సమాంతర పట్టాలపైన ఏకీభావంతోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , భారత ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో హిరోషిమాలో కలుసుకున్న తీరు, అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ జూన్ 4, 5 తేదీల్లో భార త్‌కు విచ్చేసిన వైనం (2021లో బాధ్యతలు చేపట్టాక ఆయన రెండో సారి రావడం), ఈ నెల చివరలో ప్రధాని మోదీ అమెరికాలో పర్య టించనుండటం... ఈ మూడింటినీ పరిగణనలోకి తీసుకుంటే ద్వైపా క్షిక సంబంధాలు సరైన దిశలోనే సాగుతున్నట్లు అర్థమవుతుంది. అమెరికాలోని ఒక వర్గం వ్యూహకర్తల నుంచి వస్తున్న సంకేతాలు, ఈ భాగస్వామ్యాన్ని బలహీన పరిచే అంశాలను ఎత్తిచూపు తున్నాయి. ‘ఫారిన్ ఎఫైర్స్’లో ఇటీవల ప్రచురితమైన కథనం... చైనా ఏకపక్ష దూకుడుకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భారత్ క్రియాశీల భాగ స్వామిగా ఉండాలని అమెరికా ఆశిస్తోందని చెబుతోంది. ఈ అంచనా అంత సరైంది కాదు. అమెరికా, చైనా ఘర్షణల్లో వేలుపెట్టేందుకు భారత్ ఏమాత్రం సిద్ధంగా లేదు. దీనివల్ల తమ భద్రతకు ముప్పు అని భారత్‌కు తెలుసు. వ్యూహాత్మక, సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యానికి భారత్ తగినది కాదన్న ధ్వని కూడా ఆ కథనంలో వినిపించింది. ‘ఫైనాన్షియల్ టైమ్స్’లో ప్రత్యక్షమైన ఇంకో కథనం కూడా అమెరికా లేదా చైనా ఆధిపత్యంలోని ప్రపంచాన్ని భారత్ కోరుకోవడం లేదనీ, పొరుగు దేశం కంటే అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని స్వల్పకాలికంగానైనా సహించే స్థితిలో భారత్ ఉందనీ సూచించింది. ‘ఫారిన్ ఎఫైర్స్’లోనే గతంలో ప్రచురితమైన ఇంకో కథనం, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు బదులుగా పాశ్చాత్యదేశాల వైపు భారత్ నిలబ డాలనీ, అది ఆ దేశాన్ని శక్తిమంతంగా మారుస్తుందనీ వ్యాఖ్యానించింది. అమెరికా దృష్టిలో నమ్మదగ్గ భాగస్వామిగా నిలిచేందుకు ఇదే మంచి అవకాశమని భారత్‌కు సలహా కూడా ఇచ్చింది. ఈ రకమైన కథనాలు ఏ సందర్భంలో వస్తున్నాయి? ఎనిమిది నెలల్లో ఆరుసార్లు భారత్, అమెరికా సంయుక్తంగా మిలిటరీ కార్యకలా పాలు చేపట్టినప్పుడు! ఇరుదేశాల మధ్య ‘ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ (ఐసెట్) ప్రారంభ సమావేశం జరిగిన కొంత కాలానికి! అంతేనా? ఈ ఏడాది జనవరి 31నే ఇరు దేశాల భద్రత సలహాదారులు వాషింగ్టన్ లో సమావేశమయ్యారు కూడా. అంతకు మునుపు కూడా భారత్, అమెరికా రెండూ రక్షణ, భద్రతలకు సంబంధించిన అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటయ్యేందుకు పునాది రాళ్లు వేసుకున్నాయి. ఒక్క విషయమైతే స్పష్టం. ఈ సానుకూల దృక్ప థాన్ని తిరోగమన బాట పట్టించాలని అమెరికా అనుకోవడం లేదు. కాకపోతే ద్వైపాక్షిక సంబంధాలను ఒక్కసారి సమీక్షించుకుని అవస రమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా అర్థం చేసుకోదగ్గ విషయమే. ‘ఫారిన్ ఎఫైర్స్’ మ్యాగజైన్ లో భారత్ నమ్మదగ్గ భాగస్వామి కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కథనం ఒక విషయాన్ని మరచి పోయింది. భాగస్వామికీ, మిత్రపక్షానికీ మధ్య తేడా ఉంది. వారి దృక్కోణాలు వేరుగా ఉండేందుకు ప్రధాన కారణం ఇదే. సంక్షోభాల సమయంలో అమెరికా చేసిన సాయాన్ని భారత్ ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉంది. మైత్రి దృఢంగా మారేందుకు ఇది చాలా కీలకం. అదే సమయంలో తన జాతీయ భద్రత విషయంలో అమెరికాపై భారత్ ఏమాత్రం బాధ్యత, బరువు పెట్టడం లేదు. సామర్థ్యం విష యంలో తేడాలున్నప్పటికీ భారత్, చైనా రెండూ తమ సార్వభౌమత్వా లను కాపాడుకునేందుకు ఎంతగా కట్టుబడి ఉన్నాయో ఇప్పటికే పలు మార్లు నిరూపించుకున్నాయి. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో భారత్ సిద్ధం చేసుకుంటున్న వ్యవస్థలు తమకు మద్దతుగానే అని అమెరికా మేధావులు భావిస్తూంటారు. అయితే మిలి టరీ వర్గాలు మాత్రం మన భద్రత కోసమే అయినప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ సైన్యం మోహరించడం మేలనీ, తద్వారా చైనా బలగాలు తూర్పు దిక్కున తక్కువ అవుతాయనీ భావిస్తారు. అలాగే భారత నావికాదళం అమెరికా, ఇతర భాగస్వాముల సాయంతో హిందూ మహా సముద్ర ప్రాంతంలో నౌకా సంబంధ భద్రతకు కేంద్ర బిందువుగా నిలవగలదు. తద్వారా అమె రికాపై ఒత్తిడి కొంత తగ్గుతుంది. గతాన్ని మరచి ఇరు దేశాల మిలిటరీ వర్గాలు తమ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇరు వర్గాల మధ్య ఇప్పటికే ప్రశంసించదగ్గ స్థాయిలో సహకారం నడుస్తోంది. సమాచార విని మయం, నైపుణ్యాలకు మెరుగపెట్టుకోవడమూ జరుగుతోంది. యుద్ధ విద్యల సామార్థ్యాల్లోనూ, రక్షణ టెక్నాలజీల వ్యాపారంలోనూ ముందడుగులు పడుతున్నాయి. ఇలా సర్వసన్నద్ధమైన బలగాలు అందుబాటులో ఉండటం వల్ల నేతలు ఇతర ముఖ్యమైన అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించే వీలు ఏర్పడుతుంది. టెక్నాలజీ రంగంలో సహకరించుకోవడం అనేది ఇరు దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న అంశం. ద్వైపాక్షికంగానే కాదు... ‘క్వాడ్’ సభ్యదేశాలుగానూ ఇది చాలా ముఖ్యమైంది. ‘ఇనిషియేటివ్ ఆన్ క్రిటి కల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కింద కీలక అంశాలను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్న తరుణమిది. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు, ఏరో ఇంజిన్ ఉత్పత్తిని భారత్‌కు తరలించడం వంటివి ఏవైనా కావచ్చు... ఏవైనా అపోహలుంటే వాటిని తొలగించుకునేందుకు ఇదే మంచి సమయం. ‘డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్’ (డీటీటీఐ) విఫలమైన నేపథ్యంలో దానికి బదులుగా ‘ఐసెట్’ వచ్చిందనేది తప్పుడు అంచనా అవుతుంది. ఎందుకంటే ఇరు పక్షాలూ కలిసికట్టుగా పనిచేయడంలో ఉన్న సున్నితమైన అంశాలపై సంపూర్ణ అవగాహన పొందేందుకు డీటీటీఐ సాయపడింది కాబట్టి! అలాగే ఈ భాగస్వా మ్యాల్లో నిర్ణయాధికారం అమెరికాదని కొందరు అనుకుంటూ ఉండటం కూడా అంత సరికాదు. ఎందుకంటే ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు హిందూ – పసిఫిక్ మహా సముద్ర ప్రాంతలో వ్యూహాత్మక స్థిరత్వానికి సాంకేతిక రంగం విషయంలో ఇరు పక్షాల మధ్య అంతరం తగ్గాల్సిన అవసరముంది. చివరగా, భారతీయ రక్షణ రంగ మార్కెట్ తన ఆయుధ తయారీదారులకు అందకుండా పోతుందన్న అమెరికా ఆందోళన గురించి... అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టిన్ 2021 మార్చిలో భారత్ వచ్చినప్పుడు ఇచ్చిన సూచన ఆచరణ సాధ్యమైంది. ‘‘భారతీయ సైనిక దళాలు అమెరికా ఆయుధ వ్యవస్థల తాలూకూ లాభాలను చవిచూసేందుకు అవకాశాలుండాలి. అప్పుడే వారు తమకు తగిన వాటిని ఎంచుకునే వీలు ఏర్పడుతుంది. అంతేకానీ అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి వాటిని అమ్మే ప్రయత్నం చేయరాదు. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని వ్యాఖ్యానించారు ఆయన. ఈ నెల నాలుగవ తేదీ భారత్‌కు విచ్చేసిన ఆస్టిన్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆ మరుసటి రోజు కలిశారు. రక్షణ రంగ పారిశ్రామిక సహకారానికి ప్రణాళికలను ఖరారు చేసుకున్నారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ ధోవల్‌తోనూ చర్చలు జరిపారు. భారత్, అమెరికా అనివార్య భాగస్వాములు. ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన అవసరముందని ఇరు దేశాలూ గుర్తించాలి. ఇరువురి జాతీయ అవసరాలను గుర్తించగలగడం వంటి లక్షణాలను అలవ ర్చుకుంటే ఇరువురి మధ్య సంబంధాలు బలపడతాయి. ఇరు పక్షాలు చేసిన శత ప్రయత్నాల ఫలితంగానే ప్రస్తుత సుహృద్భావ మైత్రి ఏర్ప డింది. రానున్న కొన్ని నెలల కాలం ఇప్పటికే సిద్ధంగా ఉన్న వ్యవస్థ లను కార్యాచరణకు దింపే అవకాశాలను కల్పిస్తుంది. వ్యాసకర్త ఇండియా–యూఎస్ డీటీటీఐ ఇంటర్ ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్ మాజీ సహాధ్యక్షులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భారత్-పాక్ సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు దేశాల మధ్య తాము మాటల యుద్ధం కోరుకోవటం లేదని చెప్పింది. సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలు చేపట్టాలని సూచించింది. అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈమేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో అమెరికాకు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అటు పాకిస్తాన్‌తోనూ తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రైస్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాలతో సంబంధాలను ఒకదానికొకటి ముడిపెట్టలేమని వివరించారు. భారత్-పాక్ మధ్య మాటల యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రధానీ మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ఈమేరకు బదులిచ్చారు. రెండు దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. భారత్-పాక్ నిర్మాణాత్మక చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటే రెండు దేశాల ప్రజలకు శ్రేయస్కరం అని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారంపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే అమెరికా స్పందించింది. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం..
ఎలక్ట్రిక్ వెహికల్స్ యజమానులకు, ఈవీ వాహనాలు కొనాలనే ఆలోచనతో ఉన్న వారికి అదిరిపోయే వార్త చెప్పారు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్. ఈవీ వెహికల్స్‌కి అతి పెద్ద సమస్యగా ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ టైమ్‌కి అతి త్వరలోనే చెక్ పెడుతున్నట్టుగా వెల్లడించారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఓలా సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఈవీలపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఓలా స్కూటర్ లక్షన్నరకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించింది. క్రమంగా ఈ బుకింగ్స్‌కు తగ్గట్టుగా వాహనాల డెలివరీ జరుగుతోంది. ఇప్పుడు ఈ వాహనాలకు ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం చూపించే పనిలో ఉన్నారు భవీష్ అగర్వాల్. ఈవీ బ్యాటరీలు, ఛార్జింగ్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రగతి సాధించిన స్టోర్‌డాట్‌తో వ్యూహాత్మక భాగస్వామిగా కలుస్తున్నట్టు భవీష్ అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇండియాలో ఈవీలకు సంబంధించి సరికొత్త శకం చూడబోతారని తెలిపారు. 2 వాట్స్, 4 వాట్స్‌కి సంబంధించి ఇండియాలో తయారీ, ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పబోతున్నట్టు వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక స్కూటర్ల విషయానికి వస్తే 18 నిమిషాల ఛార్జింగ్‌తో 78 కి.మీ ప్రయాణం చేయవచ్చని ఆ కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌కి వివిధ మోడళ్లను బట్టి కనిష్టంగా 4 గంటల 48 నిమిషాల నుంచి గరిష్టంగా 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. స్టోర్‌డాట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇది ఐదు నిమిషాల దగ్గరకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. We’re investing big into future cell tech. Excited to announce a strategic partnership with StoreDot of Israel. Will be working together to soon bring to market and manufacture its pioneering extreme fast charging cell tech, capable of charging 0-100% in 5 mins in India. (1/2) — Bhavish Aggarwal (@bhash) March 21, 2022 ఇజ్రాయిల్‌కి చెందిన స్టోర్‌డాట్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ సంస్థల ఛార్జింగ్ టైం కనిష్టంగా 45 నిమిషాల నుంచి గరిష్టంగా 80 నిమిషాల వరకు ఉంది. వీటన్నింటినీ బీట్ చేస్తూ స్టోర్‌డాట్ సంస్థ 5 నిమిషాల్లోనే ఒక కారు బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 100 మైళ్లు (160 కి.మీ) కారులో ప్రయాణం చేయవచ్చు. స్టోర్డాట్కి చెందిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఓలా సంస్థ తమ స్కూటర్లకు ఉపయోగించనుంది. తద్వారా స్కూటర్ల ఛార్జింగ్ టైం అనేది నామమాత్రంగా మారుతుంది. స్టోర్‌డాట్ టెక్నాలజీని ఓలా స్కూటర్లలో ఉపయోగిస్తే... టీ తాగే టైం లేదా ఫోన్లో నోటిఫికేషన్లు చెక్ చేసే టైమ్‌లో బ్యాటరీ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా పెట్రోల్ వెహికల్స్‌లో ఫ్యూయల్ ఎంత ఈజీనో ఈవీలలో ఎనర్జీ కూడా అంతే ఈజీగా లభించే రోజు రానుంది. చదవండి: హమ్మయ్యా ? ఇన్నాళ్లకు ఓ మంచి విషయం చెప్పిన ఓలా సీఈవో -
‘ఆసియాన్‌తో వ్యూహాత్మక బంధానికి చొరవ’
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్, ఆసియాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఆసియాన్‌తో వ్యూహాత్మక బంధం బలపడుతుందని అన్నారు. 17వ ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని మోదీ గురువారం ప్రారంభోపన్యాసం చేస్తూ ఆసియాన్‌తో భౌతిక, ఆర్థిక, సామాజిక, డిజిటల్ర, మారిటైమ్ సంబంధాల బలోపేతానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆసియాన్‌తో ఆయా రంగాల్లో మెరుగైన సంబంధాల దిశగా చొరవచూపామని, ఈ సదస్సు ఈ దిశగా మరింత కీలకంగా మారుతుందని ఆశిస్తున్నామన్నారు. ప్రతి రంగంలోనూ భారత్-ఆసియాన్ల మధ్య సంబంధాలు బలోపేతమమయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాజా సంపద్రింపులతో తమ మధ్య ఉన్న దూరం మరింత తగ్గుతుందని ఆకాంక్షించారు. ఈ సదస్సులో పది ఆసియాన్ దేశాల నేతలు పాల్గొన్నారు. చదవండి : పన్నుల వ్యవస్థలో పారదర్శకత తెచ్చాం -
మోదీకి ట్రంప్ ఫోన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జూన్‌లో జపాన్‌లో జరిగే జీ–20 సమావేశంలో ప్రత్యేకంగా భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీలు శుక్రవారం నిర్ణయించుకున్నారు. అమెరికా, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మోదీని అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. జపాన్‌లో ఇండియా, అమెరికా, జపాన్ల మధ్య త్రైపాక్షిక భేటీ ఉంటుందని శ్వేతసౌధం అధికారులు చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగే అంశంపై వారు ప్రధానంగా చర్చిస్తారంది. జూన్ 28, 29 తేదీల్లో ఈ జీ–20 సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల నేతల అభినందనలు ఎన్నికల్లో ఘనవిజయానికి అభినందిస్తూ మోదీకి పలువురు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్లు చేశారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, సౌదీ అరేబియా రాజు సల్మాన్‌బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్, నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడొ, నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ సహా పలువురు నేతలు మోదీకి అభినందనలు తెలియజేశారు. -
ఉబెర్, జియో వ్యూహాత్మక భాగస్వామ్యం
ముంబై: ఉచిత డ్యాటా, వాయిస్ సేవలతో సంచలనానికి తెరతీసిన రిలయన్స్ జియో మరో కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తన చెల్లింపుల యాప్ ద్వారా టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా జియో వినియోగదారులకు మరో అవకాశాన్ని కల్పిస్తోంది. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా చెల్లింపులకు అనుమతిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఉబెర్ రైడ్లకు గాను, ప్రీ పెయిడ్ జియో మనీ ఆప్ ద్వారా చెల్లింపులను త్వరలోనే తమ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దేశంలో అతిపెద్ద యూజర్ బేస్ ఉన్న రెండు సంస్థలకు ఏకీకరణ డిజిటల్ ప్లాట్ ఫాంకు తెరతీసినట్టు ఉబెర్ బిజినెస్ హెడ్ మధు కన్నన్ చెప్పారు.అతివేగవంతమైన డిజిటల్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్టు అనిర్ బెన్ ఎస్ ముఖర్జీ అన్నారు. జియో, ఉబెర్ ద్వారా వినియోగదారులకు వివిధ కాంప్లిమెంటరీ ప్రోగ్రాముల ద్వారా అనేక అవకాశాలను కల్పించనున్నామన్నారు. జియో మనీ ద్వారా ప్రతి ఉబెర్ రైడర్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నట్టు చెప్పారు. -
మైక్రోమ్యాక్స్‌తో ఎయిర్‌సెల్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌తో టెలికం సర్వీసుల కంపెనీ ఎయిర్‌సెల్ చేతులు కలిపింది. మైక్రోమ్యాక్స్ హ్యాండ్‌సెట్స్‌తో పాటు తమ కనెక్షన్ తీసుకున్నవారికి రూ.10,000 దాకా విలువ చేసే ఆఫర్లు అందించనున్నట్లు తెలిపింది. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎయిర్‌సెల్ రీజనల్ బిజినెస్ హెడ్ హమీర్ బక్షి ఈ విషయాలు వివరించారు. హ్యాండ్సెట్, మొబైల్ కనెక్షన్..రెండూ ఒకే చోట అందించే దిశగా ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని బక్షి పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో పాటు ఆఫర్ అందిస్తున్నట్లు ఎయిర్‌సెల్ ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపిందర్ తివానా తెలిపారు. దీని ప్రకారం రూ. 10,000 దాకా విలువ చేసే ఇంటర్నెట్ టీవీ, మూవీస్, గేమ్స్, యాప్స్ మొదలైన కంటెంట్‌ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, రెండు సెకన్లకు 1 పైసా కాల్ టారిఫ్‌తో పాటు 3జీ స్మార్ట్ఫోన్లలో 2జీబీ దాకాను, 2జీ ఫోన్లలో 1 జీబీ దాకాను డేటా ఉచితంగా అందజేస్తున్నట్లు తివానా పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ డాంగిల్పై 500 ఎంబీ ఇంటర్నెట్ యూసేజ్ ఉచితంగా లభిస్తుంది. 3 నెలల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు పాత టవర్లను కూడా పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నాలుగు వేల పైచిలుకు టవర్లు ఉండగా, హైదరాబాద్‌లో కొత్తగా మరో 22 టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.5 లక్షలుగా ఉన్న యూజర్ల సంఖ్యను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 20 లక్షలకు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తివానా తెలిపారు.