అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు | China completes 16th spacewalk onboard Tiangong Space | Sakshi

అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు

Published Mon, Jul 8 2024 4:58 AM | Last Updated on Mon, Jul 8 2024 7:24 AM

China completes 16th spacewalk onboard Tiangong Space

16 స్పేస్‌వాక్‌లు చేసిన వ్యోమగాములు  

బీజింగ్‌: అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్‌వాక్‌లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్‌ఎస్‌) ‘తియాన్‌గాంగ్‌’లో షెన్‌జౌ–18 మిషన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు యె గాంగ్‌ఫు, లీ కాంగ్, లీ గాంగ్‌సూ దాదాపు 6.5 గంటలపాటు స్పేస్‌వాక్‌ చేశారు. 

అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచి్చ, శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్‌వాక్‌. సీఎస్‌ఎస్‌ అప్లికేషన్, డెవలప్‌మెంట్‌ దశలో ఇది 16వ స్పేస్‌వాక్‌ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. సంబంధిత వీడియోలను విడుదల చేశారు. ఇందులో వ్యోమగామి లీ కాంగ్‌ తెల్లరంగు స్పేస్‌ సూట్‌ ధరించి చేసిన తొలి స్పేస్‌ వాక్‌ కనిపిస్తోంది. లీ కాంగ్‌ వెనుక భూగోళం స్పష్టంగా దర్శనమిస్తోంది. షెన్‌జౌ–18 మిషన్‌లో ఇది రెండో స్పేస్‌వాక్‌. ఇదే మిషన్‌లో మే 28వ తేదీన వ్యోమగాములు 8.5 గంటలపాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 

చైనా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సుదీర్ఘకాలం జరిగిన స్పేస్‌వాక్‌ ఇదే కావడం విశేషం. సీఎస్‌ఎస్‌ నుంచి మొట్టమొదటి అంతరిక్ష నడక 2021 జూలై నెలలో జరిగింది. షెన్‌జౌ–12 మిషన్‌ వ్యోమగాములు 7 గంటలపాటు స్పేస్‌వాక్‌ చేశారు. షెన్‌జౌ–13 మిషన్‌లో మొట్టమొదటిసారిగా ఓ మహిళా వ్యోమగామి స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. షెన్‌జౌ–14 మిషన్‌ అస్ట్రోనాట్స్‌ మూడు స్పేస్‌వాక్‌లు నిర్వహించారు.

 షెన్‌జౌ–15 మిషన్‌లో భాగంగా ఒకే వ్యోమగామి ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్పేస్‌వాక్‌లు చేశారు. ప్రస్తుతం షెన్‌జౌ–18 మిషన్‌ కొనసాగుతోంది. మరికొన్ని స్పేస్‌వాక్‌లు చేసే, కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. భూదిగువ కక్ష్యలో పరిశోధనల విషయంలో చైనా ముందంజలో ఉంది. స్పేస్‌వాక్‌లు సునాయాసంగా చేయడం అనేది సాంకేతిక నైపుణ్యాలను నిరూపించుకోవడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్టమైన అంతరిక్ష పరిశోధనలకు నాంది అని చెప్పొచ్చు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement