spacewalk
-
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్‌వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్‌వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్‌మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్‌ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్‌మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్‌మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్ థీమ్ సాంగ్‌కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్
కేప్ కెనావెరాల్: ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్ చేసిన మొట్టమొదటి నాన్–ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్ ఐజాక్మాన్(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్మాన్ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘పోలారిస్ డాన్’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్–9 రాకెట్ ద్వారా మంగళవారం ఐజాక్మాన్ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్ మస్క్‌తోపాటు ఐజాక్మాన్ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు
బీజింగ్: అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్‌వాక్‌లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్ఎస్) ‘తియాన్‌గాంగ్’లో షెన్‌జౌ–18 మిషన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు యె గాంగ్ఫు, లీ కాంగ్, లీ గాంగ్‌సూ దాదాపు 6.5 గంటలపాటు స్పేస్‌వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచి్చ, శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్‌వాక్. సీఎస్ఎస్ అప్లికేషన్, డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్‌వాక్ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. సంబంధిత వీడియోలను విడుదల చేశారు. ఇందులో వ్యోమగామి లీ కాంగ్ తెల్లరంగు స్పేస్ సూట్ ధరించి చేసిన తొలి స్పేస్ వాక్ కనిపిస్తోంది. లీ కాంగ్ వెనుక భూగోళం స్పష్టంగా దర్శనమిస్తోంది. షెన్‌జౌ–18 మిషన్‌లో ఇది రెండో స్పేస్‌వాక్. ఇదే మిషన్‌లో మే 28వ తేదీన వ్యోమగాములు 8.5 గంటలపాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. చైనా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సుదీర్ఘకాలం జరిగిన స్పేస్‌వాక్ ఇదే కావడం విశేషం. సీఎస్ఎస్ నుంచి మొట్టమొదటి అంతరిక్ష నడక 2021 జూలై నెలలో జరిగింది. షెన్‌జౌ–12 మిషన్ వ్యోమగాములు 7 గంటలపాటు స్పేస్‌వాక్ చేశారు. షెన్‌జౌ–13 మిషన్‌లో మొట్టమొదటిసారిగా ఓ మహిళా వ్యోమగామి స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. షెన్‌జౌ–14 మిషన్ అస్ట్రోనాట్స్ మూడు స్పేస్‌వాక్‌లు నిర్వహించారు. షెన్‌జౌ–15 మిషన్‌లో భాగంగా ఒకే వ్యోమగామి ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్పేస్‌వాక్‌లు చేశారు. ప్రస్తుతం షెన్‌జౌ–18 మిషన్ కొనసాగుతోంది. మరికొన్ని స్పేస్‌వాక్‌లు చేసే, కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. భూదిగువ కక్ష్యలో పరిశోధనల విషయంలో చైనా ముందంజలో ఉంది. స్పేస్‌వాక్‌లు సునాయాసంగా చేయడం అనేది సాంకేతిక నైపుణ్యాలను నిరూపించుకోవడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్టమైన అంతరిక్ష పరిశోధనలకు నాంది అని చెప్పొచ్చు. -
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్‌వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్‌వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్‌తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
అంతరిక్ష చెత్త భయంతో ఆగిన స్పేస్‌వాక్
కేప్ కనావెరల్: అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా అమెరికా నాసా తన స్పేస్‌వాక్ కార్యక్రమాన్ని వాయిదావేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు సమీపంగా వేగంగా పరిభ్రమిస్తున్న శకలాలు స్పేస్‌వాక్ సమయంలో వ్యోమగాముల సూట్‌కు తూట్లు పెట్టే ప్రమాదముందని స్పేస్‌వాక్‌ను ఆపేశారు. ఐఎస్‌ఎస్‌కూ నష్టం వాటిల్లవచ్చని భావించారు. ఐఎస్ఎస్ బయటి యాంటీనాను మార్చేందుకు వ్యోమగాములు సిద్ధమయ్యారు. అయితే, సోమవారం రాత్రి ఒక శకలం ఐఎస్ఎస్కు దగ్గరగా దూసుకెళ్లవచ్చని అంచనాకొచ్చారు. దీంతో యాంటీనా పునరుద్ధరణ కార్యక్రమం ఆగింది. నవంబర్ 15న తన పాత కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా క్షిపణి సాయంతో పేల్చేసింది. దాంతో 1,700 పెద్ద, వేలాది సూక్ష్మ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. స్పేస్‌వాక్‌కు ఆటంకం కల్గించింది ఈ శకలాలా? కాదా? అనేది నిర్ధారణ కాలేదని నాసా అధికారులు చెప్పారు. -
క్యాట్ వాక్ కాదు స్పేస్ వాక్
వాషింగ్టన్: ఆకాశంలో సగంగా కాదు. ఆకాశమంతటా తామేనని నిరూపించారు మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్‌లు. మునుపెన్నడూ ఎరుగని ఈ అనుభవాన్ని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం శుక్రవారం ఈ అనంతకోటి ప్రపంచానికి కనువిందు చేసింది. మొత్తంగా ఏడు గంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపి వీరిద్దరూ స్పేస్‌వాక్ విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌కాల్ చేశారు. మహిళా వ్యోమగాములిద్దరినీ అభినందించారు. మీరిద్దరినీ చూసి అమెరికా గర్విస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్ 54 ఏళ్లలో తొలిసారి అచ్చంగా మహిళా వ్యోమగాములు పురుషులతోకలసి కాకుండా మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్ వాక్ చేసిన తొలి సందర్భం ఇదే కావడం విశేషం. అర్ధశతాబ్దకాలానికిపైగా వ్యోమగాములు 420 సార్లు స్పేస్ వాక్ చేశారు. 421వ స్పేస్ వాక్ ఆసాంతం మహిళల సొంతం. ఇప్పటి వరకు మొత్తం 227 మంది వ్యోమగాములు స్పేస్ వాక్ చేస్తే, అందులో మహిళలు కేవలం 14 మందే. గతంలో స్పేస్ వాక్ చేసిన స్త్రీలంతా ఇతర పురుషులతో కలిసి చేసినవారే తప్ప ప్రత్యేకించి స్త్రీలే స్పేస్‌వాక్ చేసిన సందర్భం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్ వ్యోమగాములు క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్‌లు ఈ చారిత్రక ఘటనలో పాలుపంచుకున్నారు. మార్చి నుంచి క్రిస్టినా కోచ్, ఫిబ్రవరి నుంచి జెస్సికా మియెర్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. అంతరిక్షంలో తేలుతూ ఈ ఇద్దరు మహిళలు గత వారాంతంలో స్పేస్ స్టేషన్ వెలుపల నిరుపయోగంగా మారిన బ్యాటరీ చార్జర్‌ను మార్చారు. దీంతోపాటు ఇతరత్రా రిపేర్ల కోసం స్పేస్ స్టేషన్ వెలుపల ఏడుగంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు స్పేస్ వాక్‌లు జరిపిన వారిలో జెస్సికా 228 వ వారు. ప్రత్యేకించి మహిళా వ్యోమగాల స్పేస్ వాక్ నిజానికి ఆరు నెలల క్రితమే జరగాల్సి ఉంది. అయితే వ్యోమగాములకు సరిపోయే స్పేస్ సూట్ లేకపోవడం వల్ల స్సేస్ వాక్ ఆర్నెల్లు వాయిదాపడింది. ఇద్దరికి స్పేస్ సూట్ కావాల్సి ఉండగా ఒకే ఒక్క మధ్యతరహా కొలతలతో కూడిన స్పేస్ సూట్ అందుబాటులో ఉండడంతో ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. వీరికోచ్ మెక్ క్లెయిన్ తిరిగి భూమిపైకి రావడంతో రెండో స్పేస్ సూట్ అంతరిక్ష పరి శోధనా కేంద్రానికి తీసుకెళ్ళడం సాధ్యమైంది. -
నేడు రష్యా వ్యోమగాముల స్పేస్‌వాక్
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న రష్యా వ్యోమగాములు సోమవారం ఆరు గంటల పాటు స్పేస్‌వాక్ చేయనున్నారు. ఎక్స్‌పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ప్లైట్ ఇంజినీర్ మైకెల్ కోర్నియంకో సోమవారం రాత్రి 7.44 గంటల నుంచి స్పేస్ వాక్ చేయనున్నారని, దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది. కొత్త పరికరాలను అమర్చేందుకు, అనంతరం ఐఎస్ఎస్ బాహ్య భాగాన్ని పరీక్షించేందుకు వారు ఈ స్పేస్‌వాక్ చేయనున్నట్లు తెలిపింది. మొత్తంగా ఇది 188వ స్పేస్‌వాక్ కాగా, గెన్నడీ పడల్కా 10వ సారి చేస్తుండడం విశేషం. అత్యధిక కాలం పాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగామిగా పడల్కా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. -
ఆరుగంటలు లైవ్‌లో స్పేస్ వాక్!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన నాసా సంస్థ ఓ మహత్తర కార్యక్రమానికి తెరతీసింది. రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఆరు గంటలపాటు అంతరిక్షంలో నడుస్తుండగా దానిని లైవ్‌లో అందించనుంది. అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు గెన్నడీ పడాల్కా, ప్లైట్ ఇంజినీర్ మికెయిల్ కోర్నెన్కో స్పేస్ వాక్ చేయనున్నారు. ప్రత్యేక దుస్తులు ధరించి శూన్యంలోకి సోమవారం రాత్రి 19.44గంటల ప్రాంతంలో అడుగుపెట్టనున్నారు. అంతరిక్షంలో నడిచే సమయంలో వారు చుట్టూ ఉన్న ప్రదేశాలను చాలా స్పష్టంగా ఫొటోలు చిత్రీకరించనున్నారు. దీంతోపాటు వారు గ్యాప్ స్పానర్స్ అనే పరికరాలను, కమ్యూనికేషన్ యాంటెన్నాలను అంతరిక్ష కేంద్రం పై భాగంలో అమర్చనున్నారు.