స్పేస్‌ఎక్స్ ప్రాజెక్ట్ విజయవంతం
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్‌వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్‌మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది.
ఇసాక్‌మాన్‌తోపాటు ఇద్దరు స్పేస్‌ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్‌ఫోర్స్ థండర్‌బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్‌మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది.
చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్‌మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్‌ఎక్స్ నూతన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్ థీమ్ సాంగ్‌కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే.
– కేప్ కనావరెల్
Comments
Please login to add a commentAdd a comment