న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్‌బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది.
అసలేం జరిగిందంటే?
ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్‌బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్‌ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్‌లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్‌వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్‌స్టేషన్‌లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్‌వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్‌తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు.
అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్‌ఎస్‌కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్‌బ్యాగ్ జాడను ఎర్త్‌స్కై అనే వెబ్‌సైట్ కనిపెట్టింది. ‘ టూల్‌బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు.
ఐఎస్‌ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్‌సైట్ విశ్లేషించింది. ఆ టూల్‌బ్యాగ్‌లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్‌బ్యాగ్‌లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment