International Space Station
-
ఐఎస్ఎస్ చేరిన డ్రాగన్
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయల్దేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. కాసేపటికే అందులోని వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ ఐఎస్ఎస్లో ప్రవేశించారు. సునీత, విల్మోర్ తదితరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. స్పేస్ ఎక్స్ క్రూ–9 మిషన్‌ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరల్ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. జూన్‌లో బోయింగ్ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకున్నారు. 8 రోజుల్లో వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుబడిపోయారు. చివరికి స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత, విల్మోర్ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. వారికి చోటు కలి్పంచేందుకు వీలుగా నాలుగు సీట్ల సామర్థ్యమున్న డ్రాగన్ క్యాప్సూల్‌లో హేగ్, గోర్బనోవ్లను మాత్రమే పంపడం తెలిసిందే. -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
Sunita Williams: నీ రాక కోసం!
కేప్కనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను సురక్షితంగా భూమికి తిరిగి తెచ్చేందుకు శనివారం స్పేస్–ఎక్స్ క్యాప్సుల్ డ్రాగన్ బయలుదేరింది. ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, విల్మోర్లు ఎనిమిది రోజులకు భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లో హీలియం లీక్, థ్రస్టర్ల సమస్యలు తలెత్తడంతో అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. మానవసహిత తిరుగు ప్రయాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని నాసా తేల్చడంతో అది ఖాళీగానే తిరిగివచ్చింది. సునీత, విల్మోర్లను భూమికి తేవడానికి వీలుగా డ్రాగన్‌లో రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. ఇద్దరు వ్యోమగాములతో శనివారం ఇది ప్రయాణమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్లను తీసుకొని భూమికి తిరిగి వస్తుంది. ఎనిమిది రోజుల్లో రావాల్సిన వీరు ఏకంగా ఎనిమిది నెలల తర్వాత భూమికి వస్తారు. -
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.బోయింగ్ స్టార్‌లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్‌లైనర్‌లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్‌స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్‌లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్‌ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి కజకిస్తాన్‌కు చేరుకుంది. ఐఎస్ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్‌లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్లు 374 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉన్నారు. కాగా, ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు. -
అంతరిక్షంలో 370 రోజులకు పైగా!
మాస్కో: రష్యా వ్యోమగాములు ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలకుపైగా ఉన్నారు. పాత రికార్డును తిరగరాశారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వ్యోమగాములు నిరాటంకంగా ఇన్ని రోజులో ఐఎస్ఎస్లో ఉండడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా ఎక్కువ కాలం ఐఎస్ఎస్లో ఉన్న రికార్డు రష్యా అస్ట్రోనాట్స్ సెర్గీ ప్రొకోపివ్, దిమిత్రి పెటెలిన్, అమెరికా అస్ట్రోనాట్ ఫ్రాన్సిస్కో రుబియా పేరిట ఉంది. వారు 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు ఐఎస్ఎస్లో గడిపారు. ఈ రికార్డును ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ బద్ధలు కొట్టారు. వారు సోమవారం భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కొనొకెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సోమవారం నాటికి ఆయన ఐఎస్ఎస్లో ఏకంగా 1,110 రోజులు గడిపినట్లు అవుతుంది. ఇప్పటిదాకా ఇన్ని రోజులు అక్కడ ఉన్నవారెవరూ లేరు. -
Butch Wilmore and Sunita Williams: ఐఎస్ఎస్లో ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్టీ–100 స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్‌లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుంచి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్‌లైనర్‌లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు. అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్మోర్ వెల్లడించారు. -
తిరిగొచ్చిన స్టార్‌లైనర్
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లిన స్టార్ లైనన్ స్పేస్‌క్రాఫ్ట్ ఒంటరిగానే తిరిగొచ్చింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9.31 గంటలకు అమెరికాలో న్యూమెక్సికో ఎడారిలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో క్షేమంగా దిగింది. ఐఎస్ఎస్ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ సాంకేతిక లోపాల వల్ల మూడు నెలలకు పైగా ఆలస్యంగా భూమిపై అడుగుపెట్టింది. స్టార్ లైనర్‌లో వెనక్కి రావాల్సిన సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఐఎస్ఎస్లోనే ఉండి, అంతరిక్ష పరిశోధనల్లో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లి, ఒంటరిగా తిరిగివచ్చిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా స్టార్ లైనర్ రికార్డుకెక్కింది. ఏమిటీ స్టార్ లైనర్? ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్. ఈ ఏడాది జూన్ 5వ తేదీన ప్రయోగాత్మకంగా ఇద్దరు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. సునీతా విలియమ్స్, విల్మోర్ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇంజన్‌లోని కొన్ని థ్రస్టర్లు విఫలమయ్యాయి. హీలియం గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మత్తులతో స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీతా విలియమ్స్, విల్మోర్ 8 రోజులపాటు అక్కడే ఉండి, ఇదే స్టార్‌లైనర్‌లో వెనక్కి తిరిగిరావాలి. మరమ్మత్తులు చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారిద్దరూ భూమిపైకి తిరిగి రానున్నారు. ‘డ్రాగన్’లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది. కానీ, ఇద్దరే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. వచ్చేటప్పుడు సునీతా విలియమ్స్, విల్మోర్ను కూడా తీసుకురానున్నారు. – వాషింగ్టన్ -
నేడు ఖాళీగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం
కేప్‌కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్‌లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్‌లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్‌సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్‌లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్‌ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్‌లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్‌కు వీలుగా శుక్రవారం స్టార్‌లైనర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం భారతవాయుసేన గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లాను ఎంపికచేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మానవసహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ), నాసా, అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా గగనయాత్రికులను నాసా ఐఎస్ఎస్కు తీసుకెళ్లనుంది. మిషన్ పైలట్‌గా గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా వ్యవహరిస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన వెళ్లలేకపోతే బ్యాకప్ మిషన్ పైలట్‌గా మరో గ్రూప్ కెపె్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఐఎస్ఎస్కు పంపిస్తారు. వీరికి ఈ వారంలోనే శిక్షణ మొదలవుతుంది. యాక్సియమ్–4 మిషన్ ద్వారా అక్కడకు వెళ్లే శుక్లా ఐఎస్ఎస్లో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలుచేయడంతోపాటు పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. తర్వాత ఐఎస్ఎస్ ఆవల అంతరిక్షంలోనూ గడిపే అవకాశముంది. శుక్లాతోపాటు ఐఎస్ఎస్కు అమెరికా, పోలండ్, హంగేరీల నుంచి ఒకరు చొప్పున వ్యోమగామి రానున్నారు. భారత తన సొంత మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం నలుగురిని గత ఏడాదే ఎంపికచేసిన విషయం తెల్సిందే. గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. ఇటీవల రష్యాలోనూ ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా సముద్రజలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. -
Sunita Williams: వచ్చేస్తాగా..!
సాహసం అంటే సునీతకు సరదా! అంతరిక్షంలో భారరహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ... ‘డ్యూటీ’ చేయటం ఆమెకొక విహారం. ఇక స్పేస్‌లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా ఆమె వ్యాయామం ఆపలేదు! ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి మేలు చేసే ఎక్సర్సైజ్లే అన్నీ. మానసికంగా శక్తినిచ్చే సాధనకు సైతం ఏనాడూ ఆమె విరామం ఇవ్వలేదు. ఆ సాధనే... అనుదిన భగవద్గీత పఠనం. ప్రస్తుతం సునీత ఆ అంతరిక్షంలోనే చిక్కుబడిపోయారు. భూమిపై అందరూ ఆమె కోసం భయాందోళనలు చెందుతూ ఉంటే ఆమె మాత్రం... చిరునవ్వుతో... ‘‘వచ్చేస్తాగా...’’ అని తనే రివర్స్‌లో నాసాకు, భారతీయులకు నమ్మకం ఇస్తున్నారు!సునీతా విలియమ్స్ గత 53 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. సునీతను, సహ వ్యోమగామి బచ్ విల్మోర్ను భూకక్ష్యకు 400 కి.మీ ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఐ) విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడికి చేర్చాక చేతులెత్తేసింది. జూన్ 5న వాళ్లు వెళ్లారు. తిరిగి జూన్ 12కి, కనీసం జూన్ 15 కి వారు భూమి పైకి రావలసింది. స్టార్‌లైనర్‌లోని రాకెట్ మోటార్లు (థ్రస్టర్స్) మొరాయించటంతో విల్మోర్తో పాటుగా సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. మరోవైపు నాసా టీమ్ భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్‌కు నెలన్నరకు పైగా మరమ్మతులు చేస్తూ ఉంది. స్టార్‌లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా అని ప్రత్యక్షంగా పరీక్షించేందుకు వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే ఉండిపోయారు. వారు ఎప్పటికి తిరిగొస్తారు అనే ప్రశ్నకైతే ఇప్పటి వరకు సమాధానం లేదు. తాజాగా చిన్న ఆశ మినుకుమంది! థ్రస్టర్స్‌ని మండించి చూసిన నాసాకు అవి పని చేయబోతున్న సంకేతాలు కనిపించాయి. ఇది గుడ్ న్యూస్. నాసాకే కాదు, సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్న యావత్భారతావనికి కూడా. ‘‘స్టార్‌లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది’’ అని సునీత భూమి పైకి సందేశం పంపారు. ‘‘ఆమె చాలా ధైర్యంగా ఉన్నారు’’ అని సహ వ్యోమగామి విల్మోర్ ఆమె గురించి గొప్పగా చె΄్పారు.అంతరిక్షంలో డాన్స్!విల్మోర్ చె΄్పారనే కాదు.. సునీతా విలియమ్స్ గట్టి అమ్మాయి. భూమి మీద ఉండి మనం ఆమె గురించి భయపడుతున్నాం కానీ.. అంతరిక్షంలో ఆమె ఉల్లాసంగా గడుపుతున్నారు. నాసా వారు ఇచ్చిన వీక్ ఆఫ్‌ని చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతున్నారు కూడా. ఇంకా.. మైక్రో గ్రావిటీలో మొక్కలు నీటిని ఎలా సంగ్రహిస్తాయో సునీత పరీక్షిస్తున్నారు. నిజానికి రోదసీయానం సునీతా విలియమ్స్‌కి ఇదే మొదటిసారి కాదు. 2006లో, 2012లో ఐఎస్ఎస్కి వెళ్లారు. 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. మొత్తం కలిపి 50 గంటల 40 నిముషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆనందంతో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది కూడా. సునీతకు అంతరిక్ష యాత్ర ఇదే తొలిసారి కాకున్నా.. బోయింగ్ స్టార్ లైనర్‌తో మానవ సహిత యాత్రను నిర్వహించటం నాసాకు మొదటిసారే. కన్నవారి కలకల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాలు కలిగిన రెండో మహిళ సునీతా విలియమ్స్. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు సునీత. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లొవేనియా మహిళ. సునీత ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో కొన్నాళ్లు డైవింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేశారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. వ్యోమగామి కావాలన్నది మాత్రం తల్లిదండ్రుల కల. ఆ కల నెరవేరటానికి కూడా కారణం అమ్మానాన్నే అంటారు సునీత. సునీత త్వరగా భూమిపైకి తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం. -
ఐఎస్ఎస్ నుంచి త్వరలో సునీత రాక!
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపయనంపై ఆశలు ఇంకాస్త చిగురించాయి. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేర్చాక స్టార్‌లైనర్‌లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం విదితమే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్ల తిరుగుప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టడం తెల్సిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచి్చతత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్ఎస్ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు. -
నాసా ప్రయోగానికి ‘గగన్‌యాన్’ వ్యోమగామి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఉమ్మడిగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగంలో పాలుపంచుకొనేందుకు ‘గగనయాన్’ మిషన్ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని ఐఎస్ఎస్కు పంపిచనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అమెరికాలో పర్యటించారు. ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించారు. ఉమ్మడి స్పేస్ మిషన్లలో భాగంగా 2024లో భారత వ్యోమగామిని ఐఎస్ఎస్కు పంపిస్తామని బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు గగన్‌యాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో అస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. -
స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
కేప్కనవెరాల్: బోయింగ్ అంతరిక్ష నౌక ‘స్టార్ లైనర్’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తెలిపారు. స్టార్ లైనర్ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్ 5న సునీత, విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్లో సమస్యల వల్ల ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్ఎస్ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్‌ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్ఎస్లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్ విలేకరులతో అన్నారు. -
మన అంతరిక్ష కేంద్రంపై... ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఎస్ కక్ష్యే ఎందుకు? ఐఎస్ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు ఐఎస్ఎస్తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఏఎస్ కొన్ని విశేషాలు... → భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం → ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది → బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది → దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం → బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోరాల కనువిందు
వాషింగ్టన్: భూ ఉపరితల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. కనువిందు చేసే ఆకుపచ్చ, ఊదా రంగుల కాంతి పుంజాల (ఆరోరా) ఫొటోలు, వీడియోలను భూమికి పంపింది. ఆరోరాల పైనుంచి అంతరిక్ష కేంద్రం పయనిస్తున్న సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర ధ్రువజ్యోతి అని, కాంతి ప్రవాహం అని పిలిచే అరోరాలు భూమి నుంచి అరుదుగా కనిపిస్తుంటాయి. గాలి రేణువులు, విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకొన్నప్పుడు అరోరాలు ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో కనిపిస్తాయి. -
మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు కచి్చతంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్‌లైనర్‌లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులదాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5న సునీత, విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకొనే అవకాశం ఉంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
24 గంటల్లో 16 న్యూ ఇయర్స్
కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు. వేర్వేరు టైమ్‌జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్‌వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్‌వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్‌తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
నాలుగు దేశాలు.. నలుగురు వ్యోమగాములు
కేప్ కెనవెరాల్: నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం కేప్ కెనవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ఆదివారం నలుగురు వ్యోమగాములు అడుగిడుతారు. మార్చి నెల నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు. ఆరు నెలలపాటు అక్కడుంటారు. నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు. అమెరికా ఇలా ఒకే అంతరిక్ష నౌకలో వేర్వేరు దేశాలకు చెందిన వారిని ఐఎస్ఎస్కు పంపించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నాసా పంపించిన స్పేస్ ఎక్స్ ట్యాక్సీ రాకెట్లలో ఇద్దరు లేదా ముగ్గురు అమెరికన్లు ఉండేవారు. తాజా బృందానికి నాసాకు చెందిన జాస్మిన్ మొఘ్‌బెలి అనే మెరైన్ పైలట్ నాయకత్వం వహిస్తున్నారు. జాస్మిన్ తల్లిదండ్రులు ఇరాన్ దేశస్తులు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో జర్మనీ వెళ్లిపోయారు. అక్కడే జాస్మిన్ పుట్టారు. న్యూయార్క్‌లో పెరిగారు. అమెరికా మెరైన్స్ చేరి అఫ్గానిస్తాన్‌లో యుద్ధ హెలికాప్టర్లు నడిపారు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఇరాన్ బాలికలకు చూపుతున్నానని ఆమె అంటున్నారు. -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..
కేప్ కెనవెరాల్: అరబ్ దేశాల నుంచి మొట్టమొదటి వ్యోమగామి సహా మూడు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకుంది. ఆరు నెలల ఈ మిషన్‌లో యూఏఈ రెండో వ్యోమగామి సుల్తాన్ అల్–నెయాడీ పాలుపంచుకుంటున్నారు. నెయాడీతోపాటు అమెరికాకు చెందిన స్టీఫెన్ బోవెన్, వారెన్ హొబర్గ్, రష్యాకు చెందిన అండ్రీ ఫెడ్యాయెవ్ ఉన్నారు. వీరు అక్కడికి చేరుకున్నాక ఐఎస్ఎస్లో గత ఏడాది అక్టోబర్ నుంచి ఉంటున్న అమెరికా, రష్యా, జపాన్ వ్యోమగాములు భూమిపైకి చేరుకోవాల్సి ఉంది. -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెన్స్‌ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నారన్న వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. కానీ ఆయన కంటే ముందే రష్యా ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్’లో ఒక సీక్వెన్స్‌ను 2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్‌తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. తద్వారా అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఇందులో నటిస్తోంది. షూట్ కోసం సినిమా బృందం ఐఎస్ఎస్లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించనున్నారు. మున్ముందు చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్ చేస్తానని క్లిమ్ చెబుతున్నారు! -
సొంతంగా స్పేస్ స్టేషన్‌ని నిర్మించనున్న రష్యా...యూఎస్‌తో మరో ఆరేళ్లు...
వాషింగ్టన్: రష్యా అంతరిక్ష కేంద్రం చీఫ్ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. 2024 నాటికల్లా రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఐతే ఇరు దేశాల మాజీ ప్రచ్ఛన యుద్ధ వ్యతిరేకులు రెండు వారాల కిందటే క్రూ ఎక్స్ఛేంజ్ ఒప్పందంపై సంతకాలు చేసిన తరుణంలో ఆయన ఈ అనుహ్య ప్రకటన వెల్లడించారు. ఇది భవిష్యత్తులో యూఎస్ వ్యోమోగాములు, రష్యన్ వ్యోమోగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విమానాలు పంచుకునేలా వీలు కల్పించే ఒప్పందం. అదీగాక నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్నెల్సన్ రష్యా ఐఎస్ఎస్ భాగస్వామ్యాన్ని 2030 వరకు పొడిగించేలా నాసా, రోస్కోస్మోస్ చర్చలు జరుపుతున్నాయని అన్నారు. పైగా ఈ చర్చలు సఫలం అయ్యేవరకు కూడా రష్యా కొనసాగేలా నాసా ప్రణాళికను అమెరికా శ్వేతసౌధం అమోదించిందని చెప్పారు. అంతేకాదు రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తమ సొంత అంతరిక్ష ఔట్‌పోస్ట్‌ను నిర్మించి, పనిచేసేంత వరకు తమతో కలిసి పనిచేయాలని నాసా అధికారులు కోరినట్లు తెలిపారు. పైగా రష్యా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది కూడా. దీంతో అమెరికాతో రష్యా తన భాగస్వామ్యాన్ని మరో ఆరేళ్లు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 1998లో ప్రారంభించబడిన ఐఎస్ఎస్ యూఎస్-రష్యన్ నేతృత్వంలోని భాగస్వామ్యం నవంబర్ 2020 నుంచి నిరంతరంగా కొనసాగింది. దీనిలో కెనడా, జపాన్‌తో సహా సుమారు 11 యూరోపియన్ దేశాల భాగస్వామ్యాం కూడా ఉంది. ఐతే రష్యా తమ భాగస్వామ్యంలో భాద్యతలన్నింటిని నెరవేర్చి 2024 తర్వాత నుంచి వైదోగాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు బోరిసోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. కానీ ఐఎస్ఎస్ డైరెక్టర్ రాబిన్ గాటెన్స్ ఈ విషయం గురించి రష్యన్ సహచరులు తనకు తెలియజేయలేదని ఆమె అన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పీటర్స్ కూడా మాస్కో ఐఎస్ఎస్ నుంచి వైదొలగాలనే ఉద్దేశాన్ని అమెరికాకు అధికారికంగా తెలియజేయలేదని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతోనే యూఎస్, రష్యా దేశాల మధ్య సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధాన్ని విరమించుకోమని యూఎస్ పదేపదే హెచ్చరించడమే కాకండా ఆంక్షలు విధించేందుకు కూడా యత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య కాస్త విభేదాలు తలెత్తాయి. ఐతే అమెరికాలోని నాసా అధికారులు మాత్రం ఇరు దేశాల మధ్య అంతరిక్ష కేంద్రంలో ద్వైపాక్షిక సహకారం అలాగే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతేకాదు అమెరికా కాలిఫోర్నియా విశ్యవిద్యాలయం ప్రస్తుత వ్యోమోగామీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారెట్ రీస్మాన్, రిటైర్డ్ వ్యోమగామీ తాము కలిసే ఉన్నామని, తమ భాగస్వామ్య సహకారం అలాగే కొనసాగుతుందని చెప్పడం విశేషం. (చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా... యూఎస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్)