
నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి రష్యా ప్రయోగించిన సూయిజ్ రాకెట్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. గురువారం కజకిస్తాన్‌లోని బైకనూర్ కేంద్రం నుంచి బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వ్యోమగాములు నిక్ హేగ్(అమెరికా), అలెస్కీ ఒవ్‌చినిన్(రష్యా)లు క్షేమంగా ఉన్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ‘ప్రయోగంలో తొలి దశ పూర్తయ్యాక బూస్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. క్షణాల్లో స్పందించిన ఎమర్జెన్సీ రెస్క్యూ బృందం చాకచక్యంగా వ్యవహరించి రాకెట్‌ను సురక్షితంగా నేలకు దించారు’ అని తెలిపింది.
జెజ్‌కాజ్‌గన్ పట్టణంలో రాకెట్ అత్యవసరంగా ల్యాండ్ అయిందని, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కంట్రోల్ రూంలోని రెస్క్యూ బృందంతో వారు మాట్లాడుతున్నారని నాసా అధికారి ఒకరు తెలిపారు. శిక్షణలోనూ వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని, రాకెట్ అసాధారణ వేగంతో నేలకు దిగుతున్నప్పుడు అధిక గురుత్వాకర్షణ శక్తికి లోనైనా తట్టుకున్నారని వెల్లడించారు. ప్రయోగం ప్రారంభమైన 2 నిమిషాల్లోనే సమస్య తలెత్తిందని, అప్పటికి తామింకా సీటు బెల్టును పూర్తిగా పెట్టుకోలేదని వ్యోమగామి ఒవ్‌చినిన్ అన్నట్లు ఓ వీడియో బహిర్గతమైంది.
Comments
Please login to add a commentAdd a comment