
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రయాణికులు భాషా సమస్య, విబిన్న ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఢిల్లీకి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. చాలా మంది పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారిని బస్సుల్లో వివిధ ప్రాంతాలకు పంపించారని ప్రయాణికులు చెబుతున్నారు.
కొంతమందికి పాఠశాలల్లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అక్కడ లభించే విభిన్న ఆహారం తినలేక ఇబ్బంది పడుతుంటే..దీనికి తోడు అక్కడ భాష అస్సలు అర్థం గాక మరింత గందగోళంగా ఉన్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. పిల్లలతో ఉన్న ప్రయాణికులు అరకొర వసతులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ఎయిర్ ఇండియా ప్రయాణికుడు మాట్లాడుతూ..తమకు ఓ కళాశాల హాస్టల్‌లో వసతి కలప్పించారని, లక్కీగా తమకు ఇక్కడ వైఫై అందుబాటులో ఉండటంతో తమ కుటుంబాలతో టచ్‌లో ఉండగలిగామని చెప్పుకొచ్చారు.
మరికొంతమంది ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఒకే గదిలో 20 మంది నిద్రించాల్సిన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిక్కుకుపోయిన ప్రయాణికులను మగడాన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించడానికి ముంబై నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని పంపనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించింది.
విమానాయన సంస్థ ప్రయాణికులకు కావాల్సిన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తున్నామని, వారందరికీ హాస్టళ్లు, హోటళ్లలో వసతి కల్పించామని పేర్కొంది. కాగా, ఎయిర్ ఇండియా మగడాన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆ విమానంలో తలెత్తిన సాంకేతిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు రష్యా ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment