
బ్యాకప్‌గా ప్రశాంత్ బాలకృష్ణన్
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం భారతవాయుసేన గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లాను ఎంపికచేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మానవసహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం (హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ), నాసా, అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా గగనయాత్రికులను నాసా ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లనుంది.
మిషన్ పైలట్‌గా గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా వ్యవహరిస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన వెళ్లలేకపోతే బ్యాకప్ మిషన్ పైలట్‌గా మరో గ్రూప్ కెపె్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఐఎస్‌ఎస్‌కు పంపిస్తారు. వీరికి ఈ వారంలోనే శిక్షణ మొదలవుతుంది. యాక్సియమ్–4 మిషన్ ద్వారా అక్కడకు వెళ్లే శుక్లా ఐఎస్‌ఎస్‌లో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలుచేయడంతోపాటు పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. తర్వాత ఐఎస్‌ఎస్ ఆవల అంతరిక్షంలోనూ గడిపే అవకాశముంది.
శుక్లాతోపాటు ఐఎస్‌ఎస్‌కు అమెరికా, పోలండ్, హంగేరీల నుంచి ఒకరు చొప్పున వ్యోమగామి రానున్నారు. భారత తన సొంత మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం నలుగురిని గత ఏడాదే ఎంపికచేసిన విషయం తెల్సిందే. గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. ఇటీవల రష్యాలోనూ ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా సముద్రజలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment