
ఎట్టకేలకు తిరిగొస్తున్న సునీత, విల్మోర్
రేపు తెల్లవారుజామున 3.27కు రాక
ఫ్లోరిడా తీరంలో దిగనున్న క్యాప్సూల్
వారితో పాటే రానున్న హేగ్, గుర్బనోవ్
9 నెలల అంతరిక్షవాసానికి శుభం కార్డు
వాషింగ్టన్: భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ఏడెనిమిది రోజులనుకుంటే ఏకంగా వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. ఉన్నది భారరహిత స్థితిలోనే. అయినా అటు కార్యభారం. ఇటు ఎడతెగని ఆలోచనల భారం. క్షణమొక యుగంగా సమయం కూడా భారంగానే గడుస్తున్న పరిస్థితి. ఎడతెగని ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు శుభంకార్డు పడనుంది. 9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (59), బచ్ బారీ విల్మోర్ (62) భూమికి తిరిగి రానున్నారు.
వాతావరణం అనుకూలించి, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిరీ్ణత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెపె్టంబర్లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్ (అమెరికా), అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా) కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్‌తో పాటే తిరిగి వస్తున్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోందిప్పుడు.
బాధ్యతల అప్పగింత
బోయింగ్ సంస్థ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు వారు ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతుకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దాంతో రిస్కు తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెపె్టంబర్ 7న స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది.

వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో చేసిన ఒకట్రెండు ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్‌ఎస్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆమెను, విల్మోర్‌ను వెనక్కు తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్–9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌ను చేరింది. అందులో వచ్చిన నలుగురు వ్యోమగాములు సునీత బృందం నుంచి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ ఒచినిన్‌కు సునీత అప్పగించారు. వచ్చే ఆర్నెల్ల పాటు ఐఎస్‌ఎస్ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి.
అయినా స్థైర్యమే...
అనూహ్యంగా ఐఎస్‌ఎస్‌లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు! నడవటమెలాగో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ గత జనవరిలో నాసా సెంటర్‌తో మాట్లాడుతూ చమత్కరించారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులూ ఊపిరి సలపని బాధ్యతల నడుమే గడిపారు. అలాగని చిన్నచిన్న సరదాలకూ లోటులేకుండా చూసుకున్నారు. సహచరులతో కలిసి సునీత, విల్మోర్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో టచ్‌లో ఉంటూ వచ్చారు.
→ ఐఎస్‌ఎస్ కమాండర్‌గా కీలక ప్రయోగాలకు సునీత సారథ్యం వహించారు.
→ అంతరిక్షంలో భారరహిత స్థితిలో మొక్కల్ని పెంచిన నాసా ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించారు.
→ మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేశారు.
ఎందరికో స్ఫూర్తి
వ్యోమగామిగా గ‘ఘన’ విజయాలు సాధించిన సునీతవి భారత మూలాలు. ఆమె పూర్తి పేరు సునీతా లిన్ విలియమ్స్. 1965లో అమెరికాలోని ఒహాయోలో జని్మంచారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కాగా తల్లి బోనీ జలోకర్‌ది స్లొవేనియా. వారి ముగ్గురు సంతానంలో సునీత అందరికన్నా చిన్న. అమెరికా నావల్ అకాడెమీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు.
తండ్రి సూచనతో...
తండ్రి సూచన మేరకు నావికా దళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్‌గా చేరారు సునీత.
→ నేవల్ ఏవియేటర్‌గా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌లో పని చేశారు.
→ 30 ఏళ్ల వృత్తిగత జీవితంలో పైలట్‌గా 30 పై చిలుకు రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆమె సొంతం.
→ నేవీ నుంచి రిటైరయ్యాక సునీత 1998 జూన్ లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.
→ 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఐఎస్‌ఎస్‌లో ఆర్నెల్లకు పైగా గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు.
→ 2012లో రెండోసారి ఐఎస్‌ఎస్‌కు వెళ్లి నాలుగు నెలలకు పైగా ఉన్నారు.
→ సునీత భర్త మైకేల్ జె.విలియమ్స్ రిటైర్డ్ ఫెడరల్ మార్షల్. వారికి సంతానం లేరు. పెట్ డాగ్స్ అంటే ఈ జంటకు ప్రాణం. వాటినే తమ సంతానంగా భావిస్తుంటారు.
→ సునీత హిందూ మతావలంబి. నిత్యం భగవద్గీత చదువుతానని చెబుతారు.
పరిహారమేమీ ఉండదు
సునీత, విల్మోర్ ఏకంగా 9 నెలలకు పైగా ఐఎస్‌ఎస్‌లో చిక్కుబడిపోయారు కదా. మరి వారికి పరిహారం రూపంలో అదనపు మొత్తం ఏమన్నా లభిస్తుందా? అలాంటిదేమీ ఉండదు. తమకు ప్రత్యేకంగా ఓవర్‌టైం వేతనమంటూ ఏమీ ఉండదని నాసా వ్యోమగామి కాడీ కోల్మన్ చెప్పారు. ‘‘అంతరిక్ష యాత్రలను అధికార పర్యటనల్లో ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే పరిగణించడమే ఇందుకు కారణం. ఇలాంటప్పుడు ఖర్చుల నిమిత్తమని మాకు అదనంగా రోజుకు కేవలం 4 డాలర్లు (రూ.347) అందుతాయంతే’’ అని వివరించారు. ఆ లెక్కన సునీత, విల్మోర్ అదనంగా 1,148 డాలర్లు (దాదాపు రూ.లక్ష) అందుకోనున్నారు. వారు అమెరికా ప్రభుత్వోద్యోగుల్లో అత్యున్నతమైన జీఎస్–15 వేతన గ్రేడ్‌లో ఉన్నారు. ఆ లెక్కన వాళ్లకు ఏటా 1.25 లక్షల నుంచి 1.62 లక్షల డాలర్ల (కోటి నుంచి 1.41 కోట్ల రూపాయల) వేతనం లభిస్తుంది.
తిరుగు ప్రయాణం ఇలా...
→ సునీత బృందం తిరుగు ప్రయాణానికి భారత కాలమానం ప్రకారం మంగళవారం కౌంట్‌డౌన్ మొదలవుతుంది.
→ క్రూ డ్రాగన్–10 వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15కు మొదలవుతుంది.
→ ఐఎస్‌ఎస్ నుంచి వ్యోమనౌక విడివడే ప్రక్రియ మంగళవారం ఉదయం 10.35కు మొదలవుతుంది. ఆ తర్వాత నాసా ప్రత్యక్ష ప్రసారం ఆడియోకు పరిమితమవుతుంది. అంతా అనుకూలిస్తే బుధవారం (మంగళవారం అర్ధరాత్రి దాటాక) తెల్లవారుజాము 2.15 గంటలకు తిరిగి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది.
→ బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
→ బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27కు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుంది.
→ ఆ వెంటనే నలుగురు వ్యోమగాములనూ నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తారు.
అన్నీ అనుకూలించాలి
అయితే ప్రయాణ సమయం నిర్ణయమైనా చివరి నిమిషం దాకా అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. వాతావరణంతో పాటు ఇతర పరిస్థితులన్నీ సజావుగా ఉంటేనే తిరుగు ప్రయాణం షెడ్యూల్ ప్రకారం సాగుతుంది.
ప్రత్యక్షప్రసారం
సునీత బృందంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ–9 స్పేస్‌క్రాఫ్ట్ తిరుగు ప్రయాణాన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 నుంచి నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
రికార్డు మాత్రం కాదు
సునీత, విల్మోర్ వరుసగా 9 నెలల పాటు (287 రోజులు) ఐఎస్‌ఎస్‌లో గడిపినా ప్రపంచ రికార్డుకు మాత్రం దూరంగానే ఉండిపోయారు. రష్యా వ్యోమగామి వలేరీ పొల్యకోవ్ తమ దేశానికి చెందిన మిర్ అంతరిక్ష కేంద్రంలో ఏకబిగిన 437 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. నాసా ఆస్ట్రోనాట్ 371 రోజులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. మూడు అంతరిక్ష యాత్రల్లో కలిపి సునీత 583 రోజులు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. క్రమశిక్షణ విషయంలో సునీత చాలా పట్టుదలగా ఉంటారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదట!
టైమ్‌లైన్
2024 జూన్ 5: సునీత, విల్మోర్‌లతో ఐఎస్‌ఎస్‌కు బయల్దేరిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక
జూన్ 6: ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైన స్టార్‌లైనర్. కానీ ఆ క్రమంలో స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు పని చేయకపోవడం, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తెరపైకొచ్చాయి. దాంతో వ్యోమగాములు క్షేమంగా తిరిగిరావడంపై ఉత్కంఠ నెలకొంది.
జూన్ 12: స్టార్‌లైనర్ ప్రయాణానికి సిద్ధంగా లేనందున సునీత, విల్మోర్ తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడ్డట్టు నాసా ప్రకటన.
జూలై–ఆగస్టు: తిరుగు ప్రయాణంపై మరింత పెరిగిన అనిశ్చితి. దాంతో సునీత, విల్మోర్ ఐఎస్‌ఎస్ సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు, పరిశోధనలు తదితరాను పూర్తిగా తలకెత్తుకున్నారు. ఆ క్రమంలో సునీత ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు తలెత్తాయి.
సెపె్టంబర్: ఐఎస్‌ఎస్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీత
నవంబర్: సహోద్యోగులతో కలిసి ఐఎస్‌ఎస్‌లోనే దీపావళి, థాంక్స్ గివింగ్ వేడుకలు జరుపుకున్న సునీత. ఈ సందర్భంగా వారికోసం ప్రత్యేకంగా స్మోక్డ్ చికెన్ తదితర వంటకాలను పంపిన నాసా.
డిసెంబర్: విద్యార్థులతో చిట్‌చాట్ చేసి తన అనుభవాలు పంచుకున్న సునీత. అంతరిక్షంలో జీవితం చాలా ఫన్నీగా ఉందని వ్యాఖ్య.
2025 జనవరి 30: తొలి స్పేస్ వాక్ చేపట్టిన సునీత. అందులో భాగంగా ఐఎస్‌ఎస్ బయట కీలక మరమ్మతుల్లో భాగస్వామ్యం.
ఫిబ్రవరి: తిరుగు ప్రయాణంపై సర్వత్రా అనిశ్చితి పెరుగుతుండటంతో, తాము బాగున్నామని సందేశం పంపిన సునీత, విల్మోర్.
మార్చి 12: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎక్స్.
మార్చి 16: విజయవంతంగా ఐఎస్‌ఎస్‌ను చేరిన డ్రాగన్ క్రూ–10 వ్యోమనౌక
మార్చి 17: సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ మార్చి 18న భూమికి తిరిగొస్తుందంటూ నాసా ప్రకటన
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment