ధీమా వెలిబుచ్చిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్
కేప్‌కనవెరాల్: బోయింగ్ అంతరిక్ష నౌక ‘స్టార్ లైనర్’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు బుధవారం తెలిపారు. స్టార్ లైనర్ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్ 5న సునీత, విల్మోర్‌లు అంతరిక్షంలోకి వెళ్లారు.
హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్‌లో సమస్యల వల్ల ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్‌ఎస్ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్‌ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్‌ఎస్‌లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్ విలేకరులతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment