Boeing
-
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్‌లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
17,000 మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే చాలా మందికి పింక్ స్లిప్పులు పంపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి పొందిన వారు రెండు నెలలపాటు అంటే జనవరి వరకు నోటీస్ పీడియడ్లో ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది.కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉండడమే ఈ లేఆఫ్‌లకు కారణమని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటామని చెప్పారు. ఇటీవల సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులకుపైగా సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని గతంలో కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. సంస్థ తొలగించే ఉద్యోగుల్లో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తున్నారనే స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఇటీవల బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వివిధ విమానయాన సంస్థలకు అందించే 777 జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ 2026లో డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని అంచనా. దీనివల్ల సంస్థ షేర్స్ భారీగా క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరమని అధికారులు తెలిపారు. -
సమ్మె ఎఫెక్ట్.. 17వేల ఉద్యోగాల కోత
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి సన్నద్ధమైంది. సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ ప్రకారం.. ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది.ప్రస్తుతం బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. బోయింగ్ తొలగించనున్న ఉద్యోగులలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగించనున్నారు అనే వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.ఇదీ చదవండి: గూగుల్‌లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 777ఎక్స్ జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ డెలివరీలు 2026లో జరగాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి. దీనివల్ల సంస్థ షేర్స్ కూడా 1.1 శాతం క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరం. -
32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు
వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ ఉద్యోగులతో యాజమాన్యం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27న ఈమేరకు కార్మికుల యూనియన్‌తో చర్చించనుంది. ఉద్యోగుల సమ్మె కారణంగా తయారీ కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితం చెందనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంపెనీకి భారీ ఆర్డర్లున్న 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు చెప్పారు.బోయింగ్ ఉద్యోగులు 2008 తర్వాత చేస్తున్న ఈ సమ్మెలో పలు డిమాండ్లను లేవనెత్తారు. యూనియన్‌లోని దాదాపు 32,000 మంది సభ్యులు 40 శాతం వేతనం పెంచాలంటున్నారు. దాంతోపాటు ఉద్యోగుల పెన్షన్ స్లాబ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం 30 శాతం వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. కానీ సంస్థ ఆఫర్‌కు యూనియన్ సిద్ధంగా లేదని ఉద్యోగులు లేచ్చి చెప్పారు. తప్పకుండా 40 శాతం వేతన పెంపు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల బోయింగ్ యాజమాన్యం యూనియన్‌తో చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. వచ్చే నాలుగేళ్లలో 25 శాతం వేతన పెంపు చేస్తామని కంపెనీ ఇప్పటికే హామీ ఇచ్చింది. అయితే ఆ ప్రతిపాదనను ఉద్యోగులు తోసిపుచ్చారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా వేతనాల పెరుగుదలపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాగైనా తమ డిమాండ్‌ను భర్తీ చేయాలని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై 27న మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..ఉద్యోగుల నిరసనలో భాగంగా సీటెల్, పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌లో విమానాల తయారీ నిలిచిపోయింది. సెప్టెంబర్ 13 నుంచి కొనసాగుతున్న ఈ సమ్మె వల్ల ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. బోయింగ్ అత్యధికంగా అమ్ముతున్న 737 మ్యాక్స్ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిని సైతం నిలిపేసినట్లు చెప్పారు. -
అంబానీ కొత్త విమానం.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ.. 'బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం' కొనుగోలు చేశారు. ఈ అల్ట్రా-లాంగ్-రేంజ్ బిజినెస్ ఫ్లైట్ విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఇప్పటి వరకు మనదేశంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇంత ఖరీదైన ఫ్లైట్ కొనుగోలు చేయలేదని సమాచారం.ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధీనంలో తొమ్మిది ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అయితే అంబానీ కొనుగోలు చేసిన ఈ బోయింగ్ 737 మ్యాక్స్ 9 ఫ్లైట్ అనేక మార్పులను పొందినట్లు సమాచారం. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విమానం ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి చేరనుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు.. వీటికే ఎక్కువ డిమాండ్బోయింగ్ 737 మ్యాక్స్ 9 స్పెసిఫికేషన్స్బోయింగ్ 737 మ్యాక్స్ 9 రెండు CFMI LEAP-1B ఇంజిన్లను పొందుతుంది. ఈ విమానం ఒకసారికి 11,770 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. దీనిని పూర్తిగా స్విట్జర్లాండ్‌లో అనుకూలీకరించి ఇండియాకు తీసుకురావడం జరిగింది. ఇది విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. -
Butch Wilmore and Sunita Williams: ఐఎస్ఎస్లో ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్టీ–100 స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్‌లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుంచి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్‌లైనర్‌లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు. అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్మోర్ వెల్లడించారు. -
అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతావిలియమ్స్,బుచ్విల్మోర్తెలిపారు. అంతరిక్షంనుంచిసునీత,విల్మోర్ శుక్రవారం(సెప్టెంబర్13)మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నా. ఐఎస్ఎస్లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.నాకే కాదు ఇది నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు’అని సునీత అన్నారు.మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు చెప్పారు.జూన్5న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత, విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం భూమికి తిరిగి రాలేకపోయారు.వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ మాత్రం సెప్టెంబర్ 6న భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువస్తుందని నాసా వర్గాలు చెబుతున్నాయి.ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం ఆబ్సెంటీ ఓటింగ్‌తో పాటు ఓట్ బై మెయిల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో అర్హత కలిగిన ఓటర్లు బ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ బై మెయిల్ విధానం అందుబాటులో ఉంది. ఈ విధానంలో రిజిస్టర్ ఓటర్లందరికీ ఎన్నికల మందే మెయిల్ పంపుతారు. దీని ద్వారా పౌరులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోలింగ్ తేదీ కంటే ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇదీ చదవండి.. అంతరిక్షం నుంచి ఐక్య గీతం -
విమానంలో భారీ కుదుపులు.. ఏడుగురికి గాయాలు
బీజింగ్: సింగపూర్ నుంచి చైనాలోని గంగ్జూ పట్టణానికి వెళుతున్న స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం భారీ కుదుపులకు గురైంది. కదుపుల కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒక వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించాల్సి వచ్చింది.గంగ్జూ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం భారీ కుదుపులకు గురైనట్లు సిబ్బంది తెలిపారు. ఫ్లైట్ రాడార్ వివరాల ప్రకారం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 25వేల అడుగులకు వచ్చేసింది. వేగం కూడా ఒక్కసారిగా 500 నాట్స్ నుంచి 262 నాట్స్‌కు తగ్గింది. తర్వాత మళ్లీ 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి 500 నాట్స్ వేగంతో ప్రయాణించింది. -
నింగిలోనే వ్యోమగాములు.. భూమిపైకి ‘స్టార్‌లైనర్’
అంతరిక్షానికి వ్యోమగాములను మోసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అర్ధంతరంగా భూమికి తిరిగివచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్‌ను తీసుకు రాకుండానే భూమికి వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన ఆరు గంటల తర్వాత శుక్రవారం(సెప్టెంబర్ 6) రాత్రి స్టార్‌లైనర్ వ్యోమనౌక న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో భూమిపై దిగింది.అసలు స్టార్‌లైనర్‌కు ఏమైంది..?బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఒక దశలో స్టార్‌లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న ప్రచారం జరిగింది. నాసా ఎందుకు ఒప్పుకోలేదు..?హీలియం లీకేజీ సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాములు భూమికి తిరిగిరావడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరిగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ సంస్థ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని ప్రకటించింది. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాసా అందుకు అంగీకరించలేదు.వ్యోమగాముల తిరిగి రాక ఎలా..వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి నాసా ఒప్పుకోకపోవడంతో స్టార్‌లైనర్ ఖాళీగా భూమికి రావాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఇలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు వ్యోమగాములు సునీతా, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత వచ్చేది అప్పుడేనా..స్పేక్స్ ఎక్స్‌కు చెందిన క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్ఎస్కు పంపే ఛాన్సుంది. సెప్టెంబరులోనే ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రూ డ్రాగన్‌లో సునీత, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా యోచిస్తోంది. -
నేడు ఖాళీగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం
కేప్‌కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్‌లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్‌లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్‌సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్‌లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్‌ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్‌లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్‌కు వీలుగా శుక్రవారం స్టార్‌లైనర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
ఐఎస్ఎస్ నుంచి త్వరలో సునీత రాక!
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపయనంపై ఆశలు ఇంకాస్త చిగురించాయి. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేర్చాక స్టార్‌లైనర్‌లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం విదితమే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్ల తిరుగుప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టడం తెల్సిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచి్చతత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్ఎస్ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు. -
స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
కేప్కనవెరాల్: బోయింగ్ అంతరిక్ష నౌక ‘స్టార్ లైనర్’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తెలిపారు. స్టార్ లైనర్ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్ 5న సునీత, విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్లో సమస్యల వల్ల ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్ఎస్ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్‌ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్ఎస్లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్ విలేకరులతో అన్నారు. -
నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ‘737 మ్యాక్స్’ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కుప్పకూలిన విషయంలో నేరాన్ని అంగీకరించింది. దాంతోపాటు బాధితులకు జరిమానా కింద రూ.243.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2 వేలకోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. ఈమేరకు అమెరికా న్యాయ సంస్థతో కేసు పరిష్కార షరతులపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా బోయింగ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..‘2018-19 మధ్యకాలంలో ఇండోనేషియా, ఇథియోపియాలో 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రెండు నేలకూలాయి. ఈ ఘటనల్లో 346 మంది మరణించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లోని కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయి. అందుకు పరిహారంగా బాధిత కుటుంబాలకు రూ.2 వేలకోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అమెరికా న్యాయ సంస్థతో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాం. దీనిపై న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది’ అని చెప్పారు.ప్రమాదాలు జరిగిన వెంటనే బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. బోయింగ్‌ను చట్టపరంగా శిక్షించడంతోపాటు ఆ సంస్థపై ఆర్థికపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో 2021లో కేసు పరిష్కార ఒప్పందంలో భాగంగా సుమారు రూ.2,000 కోట్లు జరిమానా చెల్లించేందుకు బోయింగ్ అంగీకరించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు న్యాయ స్థానం గుర్తించింది. దాంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల బోయింగ్ నేరాన్ని అంగీకరించడంతోపాటు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 వేలకోట్లు జరిమానా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా జరిమానాతోపాటు రక్షణ చర్యల నిమిత్తం వచ్చే మూడేళ్లలో కనీసం రూ.3,700 కోట్లు బోయింగ్ వెచ్చించాల్సి ఉంటుంది. ఆయా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబీకులను బోయింగ్ బోర్డు కలవాలి. ఒప్పంద షరతులను బోయింగ్ పాటిస్తుందా? లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిని కూడా నియమించాలి.ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?ఇదిలాఉండగా, నేర అంగీకారం వల్ల అమెరికా రక్షణ విభాగం, నాసా లాంటి ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులు పొందే విషయంలో బోయింగ్ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
బోయింగ్ భారీ డీల్.. స్పిరిట్ ఏరోసిస్టమ్స్ కొనుగోలుకు సిద్ధం
స్పిరిట్ ఏరోసిస్టమ్స్‌ను.. బోయింగ్ సంస్థ సుమారు రూ.39 వేలకోట్లకు కొనుగోలు చేయనుంది. దీనికోసం సంస్థ నెల రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ముగిసిన తరువాత.. రెండు కంపెనీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో బోయింగ్ సంస్థ స్పిరిట్ ఏరోసిస్టమ్స్ కొనుగోలును ధ్రువీకరించింది.బోయింగ్ సంస్థ కొనుగోలు చేసిన ఈక్విటీ వాల్యూ 4.7 బిలియన్ డాలర్లు కాగా.. ఒక్కో షేరుకు 37.25 డాలర్లు. డీల్ మొత్తం విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇందులో ఇందులో స్పిరిట్ చివరిగా నివేదించిన నికర రుణం కూడా ఉందని ఏరోస్పేస్ పేర్కొంది. షేర్ వాల్యూ అనేది డీల్ ముగిసే ముందు షేర్ ధర సగటుపై ఆధారపడి ఉంటుంది.కొనసాగుతున్న భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బోయింగ్ స్పిరిట్ ఏరోసిస్టమ్స్‌ను కొనుగోలు చేయడానికి సన్నద్దమైందని తెలుస్తోంది. కాన్సాస్‌లోని విచితాలో ఉన్న స్పిరిట్, బోయింగ్ విమానాలకు సంబంధించిన కీలక భాగాలను తయారు చేస్తుంది. రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం మా ఎయిర్‌లైన్ కస్టమర్లకు, స్పిరిట్, బోయింగ్ ఉద్యోగులకు, మా షేర్హోల్డర్లకు, దేశానికి ఉపయోగకరంగా ఉంటుందని బోయింగ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేవ్ కాల్హౌన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
సునీతా విలియమ్స్ రాక ఎప్పుడు..? ‘మస్క్’ వైపు ‘నాసా’ చూపు
కాలిఫోర్నియా: ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిందా.. ఏవియేషన్, స్పేస్‌టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్య ఎదుర్కొంటోందా..? స్పేస్ టెక్నాలజీ రంగంలో ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్‌ను ఛాలెంజ్ చేస్తోందా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.ఇటీవలే భారత సంతతికి చెందినవ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో మరో వ్యోమగామని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమెతో వెళ్లిన మరో వ్యోమగామి భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్‌తో పాటు నాసా గుర్తించాయి. ఈ కారణంగా స్టార్‌లైనర్‌లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.దీంతో ఈలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్‌లో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది.దీనిలో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమ్మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. స్టార్‌లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్‌లోనే సునీత తిరిగి రావొచ్చు. ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్‌పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లేనని చెబుతున్నారు. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
సముద్రం అంచున విమానం ఇల్లు.. అదిరిపోయే ఫొటోలు
-
పాతబడేకొద్దీ మరింత ప్రమాదం
బోయింగ్ విమానాలు పాతపడే కొద్దీ అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయని ఆ కంపెనీలో 10 ఏళ్లకుపైగా ఇంజినీర్‌గా పనిచేసిన సామ్ సలేహ్పార్ తెలిపారు. ఇటీవల కాలంలో బోయింగ్ మోడళ్లలో లోపాలు తలెత్తడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్‌స్ట్రేషన్ (ఎఫ్ఏఏ) రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. తాజాగా బోయింగ్ సంస్థపై సామ్ చేసిన ఆరోపణలను సైతం పరిశీలిస్తున్నట్లు ఎఫ్ఏఏ విచారణ అధికారులు తెలిపారు. సామ్ ఎఫ్ఏఏకు చేసిన ఫిర్యాదులో ‘బోయింగ్ 777, 787 డ్రీమ్లైనర్లలో లోపాలున్నాయి. బోయింగ్ విమానాల తయారీ సమయంలో సంస్థ షార్ట్‌కట్‌లను వాడుతోంది. దాంతో అవి పాతబడేకొద్దీ ఈ లోపాలు ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో తయారైన విడిభాగాలను అనుసంధానం చేసే క్రమంలో సరైన విధానాలను పాటించడం లేదు. 2019లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్లోని ప్లాంట్‌లో బోయింగ్ 787 తయారు చేస్తున్న సమయంలో పని త్వరగా పూర్తి చేయాలని కార్మికులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఈ విషయాలు పబ్లిక్‌డొమైన్‌లో పెట్టడంతో కంపెనీ ప్రతీకారచర్యలకు సైతం దిగుతుంది’ అంటూ వివరించాడు. సామ్ తరపు న్యాయవాది డెబ్రా ఎస్కాట్జ్ మాట్లాడుతూ ‘సామ్ చేసిన ఆరోపణల ఫలితంగా కంపెనీ తనను 787 ప్రాజెక్టు నుంచి తప్పించి 777 ప్రాజెక్ట్‌కు బదిలీ చేసింది. చివరికి అక్కడ కూడా సామ్ లోపాలు గుర్తించాడు’ అని అన్నారు. ఇటీవల సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. గతంలోనూ అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు ఇటీవల జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
విమానంలో 135 మంది ప్రయాణికులు.. గాల్లోనే ఊడిన ఇంజిన్ కవర్
విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ఇంజిన్ కవర్ ఊడిపోయిన సంఘటన ఇటీవల అమెరికాలోని డెన్వర్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. అలా ఊడిన కవర్ విమానం కుడివైపు రెక్కలపై ఉన్న ఫ్లాప్స్‌లో చిక్కుకుంది. విమాన సిబ్బంది, పైలట్లు సమస్యను వెంటనే గుర్తించి అప్పటికే గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి, కిందకు దించారు. డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో హోస్టన్కు తరలించారు. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! గతంలోనూ అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్‌లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్‌ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
విమాన ప్రయాణికులకు ఆధునిక వినోద వ్యవస్థ
రోడ్లపై ప్రయాణాల్లో అలసటగా అనిపించినా, బోర్ కొట్టినా కాసేపు వాహనాన్ని ఆపి సేదతీరుతారు. కానీ విమాన ప్రయాణాల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఒకసారి గాల్లోకి ఎగిరాక తిరిగి దిగేవరకు ప్రయాణం ఎలా ఉన్నా భరించాల్సిందే. పైగా విమాన ప్రయాణాలంటేనే గంటల తరబడి ఉంటాయి. గాల్లో ప్రయాణించేవారికి కాసింత వినోదాన్ని పంచేందుకు థేల్స్ సంస్థ సిద్ధమయింది. ఇప్పటికే ఫ్లైట్ సీట్ ముందు డివైజ్‌ను అమర్చి ప్రయాణికులను కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తున్న సంస్థ ఆ వ్యవస్థను ఆధునికీకరించనుంది. ఎయిరిండియా తమ వద్ద ఉన్న 40 బోయింగ్ 777, 787 విమానాలను, థేల్స్‌కు చెందిన ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. థేల్స్ ‘అవాంట్ అప్’ వ్యవస్థను ఎయిరిండియా విమానాల లోపల అమర్చే పనులు వచ్చే ఏడాది వరకు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది. 2025లో ఎయిరిండియాకు కొత్తగా డెలివరీ అయ్యే 11 కొత్త ఎయిర్‌బస్, బోయింగ్ విమానాల్లోనూ థేల్స్ తన కొత్త వ్యవస్థలను పొందుపరచనుంది. ఇదీ చదవండి: యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. థేల్స్ 3డీ మ్యాప్, ఇమ్మర్సివ్ రూట్-బేస్డ్ ప్రోగ్రామింగ్, 4K QLED HDR డిస్ప్లేలను ఇన్స్టాల్ చేయనుంది. ఇందులో హై-స్పీడ్ ఛార్జింగ్ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏరోనాటిక్స్-స్పేస్, డిజిటల్ ఐడెంటిటీ-సెక్యూరిటీ, డిఫెన్స్-సెక్యూరిటీ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న కంపెనీగా థేల్స్ పేరొందింది.