అద్దెలు.. ప్రకటనలు..
న్యూఢిల్లీ: నిధుల కొరతనెదుర్కొంటున్న ఎయిరిండియా ఆదాయాలు పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాపర్టీల్లో కొన్నింటిని అద్దెకు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే విమానాల లోపల (ఇన్‌ఫ్లయిట్) ప్రకటనలను అనుమతించే అంశాన్నీ పరిశీలిస్తోంది. ‘కొత్త ప్రణాళిక ప్రకారం ప్రధాన నగరాల్లో మా భవంతులను బ్యాంకులు, ఇతర కంపెనీలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఎయిరిండియా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇప్పటికే 22 ప్రాపర్టీలను గుర్తించామని, 19 ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లు కూడా వచ్చాయని ఆయన వివరించారు. అలాగే, ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ఉన్న 22 అంతస్తుల ఎయిరిండియా భవంతిలో మరిన్ని ఫ్లోర్లను కూడా అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ భవంతిలో చదరపు అడుగుకు కనీసం రూ. 300-350 దాకా అద్దె లభించగలదని అంచనా. ఈ భవంతిని అద్దెకు ఇస్తే ఏటా కనీసం రూ. 100 కోట్లయినా ఆదాయం వస్తుందని ఎయిరిండియా అంచనా వేస్తోంది. ప్రాపర్టీలను అద్దెకు ఇవ్వడంతో పాటు తమ విమానాల వెలుపల, లోపల కూడా ప్రకటనలను అనుమతించాలని కంపెనీ భావిస్తున్నట్లు సంస్థ అధికారి తెలిపారు.