Indian airlines
-
గాడిన పడుతున్న ఎయిర్‌లైన్స్..
ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. కరోనా కారణంగా ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నెమ్మదించడం తెలిసిందే. దీని కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇవి రూ.17,500 కోట్ల వరకు నష్టాలను చవి చూశాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.3,000–3,500 కోట్లకు పరిమితం అవుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వైరస్ సమసిపోయి, ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత దేశ, విదేశీ ప్రయాణాలు ఊపందుకోవడం తెలిసిందే. గతంలో నిలిచిన ప్రయాణాలు కూడా తోడు కావడంతో విమానయాన సర్వీసులకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ విమాన ప్రయాణికుల రద్దీ 8–13 శాతం మధ్య పెరుగుతుందని ఇక్రా పేర్కొంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 15–15.5 కోట్లకు చేరుకుంటుందని.. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో ఉన్న 14.1 కోట్లను అధిగమిస్తుందని అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీలో చక్కని వృద్ధికితోడు, రాబడులు మెరుగుపడడం, వ్యయాలు స్థిరంగా ఉన్నందున ఈ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్‌ను ఇస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. వచ్చే సంవత్సరంలోనూ.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నష్టాలు ఎదురవుతాయని ఇక్రా తెలిపింది. ‘‘ప్రస్తుత స్థాయి నుంచి రాబడులు మరింత పెరిగే అవకాశాలు పరిమితమే. కనుక ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరే 2024–25లోనూ 3,000–5,000 కోట్ల మధ్య నష్టాలను నమోదు చేయవచ్చు’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ వివరించారు. విమానాశ్రయాల సదుపాయాల విస్తరణతో విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుతం మాదిరే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రయాణికుల వృద్ధి ఉంటుందని ఇక్రా తెలిపింది. ఎనిమిది నెలల్లో 10 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) విమాన ప్రయాణికుల సంఖ్య 10.07 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 17 శాతం వృద్ధి కనిపిస్తోంది. కరోనా ముందు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 8 నెలల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం వృద్ధి నమోదైంది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2022–23లో 2.39 కోట్లుగా ఉంది. కరోనా ముందు నాటి గణాంకాల కంటే ఇది ఎక్కువ. 2018–19లో 2.59 కోట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నమోదు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. విమానయాన సంస్థలకు ధరలు నిర్ణయించే బలం చేకూరిందని, ఫలితమే రాబడులు మెరుగుపడడమని వివరించింది. విమానయాన సంస్థలకు 1500 విమానాలు డెలివరీ కావాల్సి ఉందని, సరఫరా వ్యవస్థలో సమస్యల వల్ల నిదానంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మధ్య కాలానికి డిమాండ్–సరఫరా మధ్య సమతుల్యత ఏర్పడుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల మార్కెట్లో భారత ఎయిర్‌లైన్స్ సంస్థల వాటా 42 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రయాణికుల రికవరీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి క్షీణతను పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
నష్టాలు తగ్గుతాయి! దేశీయ ఎయిర్‌లైన్స్‌కు ఊరట
ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు మరింత తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నష్టాలు రూ.5,000–7,000 కోట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదల సానుకూలంగా ఉండడం ఎయిర్‌లైన్స్ ఆదాయ వృద్ధికి సాయపడుతుందని తెలిపింది. ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతోపాటు, డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఎయిర్‌లైన్స్ నష్టాలు రూ.11,000–13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఏటీఎఫ్ ధరలు త్రైమాసికం వారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం అనే సవాళ్లను దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఎదుర్కొన్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై నెలలో ప్రయాణికుల సంఖ్య 1.22 కోట్లుగా నమోదైందని, క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఏవియేషన్ రంగానికి స్టెబుల్ రేటింగ్ (స్థిరత్వం) ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వేగంగా రికవరీ కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాతో స్థిరత్వం రేటింగ్‌ను ఇచ్చింది. గణనీయంగా తగ్గిన నష్టాలు ఎయిర్‌లైన్స్ పరిశ్రమ 2021–22లో రూ.23,500 కోట్లు నష్టపోవడం గమనార్హం. దీంతో పోలిస్తే 2022–23లో నష్టాలు గణనీయంగా తగ్గాయి. తొలుత రూ.17,000 కోట్ల వరకు రావచ్చని ఇక్రా అంచనా వేయగా, వాస్తవ నష్టాలు రూ.11,000–13,000 కోట్లకు పరిమితం అయ్యాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు కాస్ట్ ఆఫ్ అవైలబుల్ సీట్ కిలోమీటర్ను మెరుగుపరుచుకున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే సగానికి తగ్గుతాయని అంచనా. పరిశ్రమలో టారిఫ్‌ల పరంగా క్రమశిక్షణ నెలకొనడంతో ఈ ధోరణి కొనసాగుతుందని ఇక్రా తెలిపింది. ఏటీఎఫ్ ధరలు కొంత తగ్గడం కలిసొస్తుందని పేర్కొంది. జూలైలో విమానయానం 25 శాతం అప్.. దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య జూలైలో 25 శాతం ఎగిసింది. 1.21 కోట్లుగా నమోదైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం గతేడాది జూలైలో విమాన ప్రయాణికుల సంఖ్య 97.05 లక్షలుగా నమోదైంది. తాజాగా గత నెల విమానయాన సంస్థ ఇండిగో 76.75 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 63.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా 11.98 లక్షల మంది ప్రయాణికులు 9.9 శాతం మార్కెట్ వాటాతో తర్వాత స్థానంలో ఉంది. ఇక టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార 10.20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి 8.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిర్ఏషియా ఇండియా (ఏఐఎక్స్ కనెక్ట్) 9.01 లక్షల ప్రయాణికులు (7.5 శాతం వాటా), ఆకాశ ఎయిర్ 6.24 లక్షల మంది ప్యాసింజర్లను (5.2 శాతం వాటా) గమ్యస్థానాలకు చేర్చాయి. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ 5.04 లక్షల మంది ప్రయాణికులు, 4.2 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది. సమయ పాలన విషయంలో ఇండిగో 86.8 శాతంతో అగ్ర స్థానంలో నిల్చింది. -
1.25 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 జనవరిలో 1.25 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 96 శాతం అధికమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘కోవిడ్ ముందస్తు 2020 జనవరితో పోలిస్తే దేశీయ ప్రయాణికుల సంఖ్య గత నెలలో 2 శాతం తగ్గింది. దేశీయ ప్రయాణికుల రద్దీలో రికవరీ మెరుగ్గా ఉన్నప్పటికీ.. భారతీయ విమానయాన సంస్థల ఆర్థిక పనితీరు సమీప కాలంలో ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. 2022–23లో ప్రయాణికుల రద్దీలో అర్థవంతమైన మెరుగుదల ఆశించినప్పటికీ పరిశ్రమ ఆదాయాల్లో రికవరీ వేగం క్రమంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.23,500 కోట్ల నికర నష్టంతో పోలిస్తే 2022–23లో నికర నష్టం తక్కువగా ఉంటుందని అంచనా. ప్రధానంగా ప్రయాణికుల రద్దీ, ఛార్జీల పెంపుదల, తక్కువ వడ్డీ భారం ఇందుకు కారణం. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో సామర్థ్య విస్తరణ 42 శాతం ఎక్కువ. కోవిడ్ ముందస్తుతో పోలిస్తే 6 శాతం తక్కువ’ అని ఇక్రా తెలిపింది. త్వరగా రికవరీ.. ‘కార్యకలాపాలలో సాధారణ స్థితి, మహమ్మారి ప్రభావం తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీలో త్వరిత పునరుద్ధరణ ఉంటుందని అంచనా. పెరిగిన పోటీ వాతావరణం మధ్య యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణతకుతోడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగడం వల్ల దేశీయ విమానయాన సంస్థలకు ఆదాయాల రికవరీ క్రమంగా ఉంటుంది. ప్రస్తుత ఏటీఎఫ్ ధరలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం అధికం. పెరిగిన ఏటీఎఫ్ ధరలు సమీప, మధ్య కాలానికి విమానయాన సంస్థల ఆదాయాలు, నగదు నిల్వలకు పెద్ద ముప్పుగా కొనసాగుతాయి. అలాగే లీజు అద్దెలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను ప్రతికూలంగా ప్రభావితం చేసే యూఎస్ డాలర్‌తో భారత రూపాయి విలువ క్షీణించడం విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అధికం అయిన వ్యయాలకు అనుగుణంగా ఛార్జీల పెంపుదల ఉండేలా ఎయిర్‌లైన్స్ చేసే ప్రయత్నాలు వారి లాభదాయకతలో కీలకం కానున్నాయి’ అని ఇక్రా వివరించింది. -
దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి
న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థలు అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సెప్టెంబర్‌లో నమోదైన 1.04 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 27 శాతం ఎగిసి 89.85 లక్షల నుండి 1.14 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కాలంలో దాదాపుగా నిల్చిపోయిన విమాన ప్రయాణాలు కొంతకాలంగా తిరిగి ప్రారంభమవుతుండటంతో .. విమానయాన పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. డేటాలోని మరిన్ని కీలకాంశాలు.. ► దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో మార్కెట్ వాటా సెప్టెంబర్‌లో 58 శాతంగా ఉండగా అక్టోబర్‌లో 56.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 0.9 శాతం నుండి 1.4 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ వాటా 7.3 శాతంగా, గో ఫస్ట్ వాటా 7 శాతంగా ఉంది. ► ఎయిరిండియా మార్కెట్ వాటా 9.1 శాతంగా ఉండగా, ఎయిర్‌ఏషియాది 7.6 శాతానికి చేరింది. విస్తార వాటా 9.6 శాతం నుండి 9.2 శాతానికి దిగి తగ్గింది. ► సమయ పాలనలో (ఓటీపీ) ఎయిరిండియా (90.8 శాతం) అగ్రస్థానంలో ఉండగా విస్తారా (89.1 శాతం), ఎయిర్ఏషియా ఇండియా (89.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడూ టాటా గ్రూప్ కంపెనీలే కావడం గమనార్హం. ► ఇండిగో ఓటీపీ 87.5 శాతంగా ఉండగా, అలయన్స్ ఎయిర్ (74.5%), స్పైస్‌జెట్ (68.9%), గో ఫస్ట్ (60.7%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ఓటీపీని లెక్కించారు. ► 2022 జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 9.88 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 6.21 కోట్లతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ 59 శాతం పెరిగింది. -
నష్టాల బాటలోనే ఎయిర్‌లైన్స్
ముంబై: కరోనా సంక్షోభం నుంచి బయటపడినా ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు. కరోనా వైరస్ నియంత్రణ ఆంక్షల నడుమ పరిమిత సర్వీసులతో, విమానయాన సంస్థలు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయాయి. దీనికితోడు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కూడా గరిష్ట స్థాయలో చలిస్తున్నాయి. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.15,000–17,000 కోట్ల నష్టాలను నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్స్ రంగం నష్టాలు రూ.23,000 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. పరిశ్రమ మొత్తం రుణ భారం 2023 మార్చి నాటికి రూ.లక్ష కోట స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువలో అస్థిరతలు, ఏటీఎఫ్ ధరల్లో హెచ్చు తగ్గుల ప్రభావం ఎయిర్‌లైన్స్ వ్యయాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ కోసం ఖర్చు చేసేది 45 శాతంగా ఉంటుందని తెలిసిందే. ఇది కాకుండా ఎయిర్‌లైన్స్ మొత్తం ఖర్చుల్లో 35–50 శాతం మేర డాలర్ మారకంలోనే ఉంటాయని ఇక్రా గుర్తు చేసింది. ప్రయాణికుల్లో వృద్ధి.. లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు అయిన ఇండిగో ప్రస్తుత ఆర్థిక సంవ్సరం మొదటి మూడు నెలల కాలానికి (జూన్ క్వార్టర్) రూ.1,064 కోట్లు, స్పైస్‌జెట్ రూ.789 కోట్ల చొప్పున నష్టాలను ప్రకటించాయి. రూపాయి బలహీనత, ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్టు ఇక్రా తెలిపింది. ప్రయాణికుల సంఖ్య 57.7 శాతం పెరిగి 8.42 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రయాణికుల్లో మెరుగైన వృద్ధి ఉన్నప్పటికీ 2022–23లో రూ.17,000 కోట్ల వరకు నష్టాలు తప్పుకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ అన్నారు. జూన్ త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య, వార్షికంగా అంతకుముందు ఇదే ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగి 3.25 కోట్లుగా ఉన్నట్టు ఇక్రా తెలిపింది. కాకపోతే కరోనా ముందు 2019 ఏప్రిల్–జూన్‌లోని ప్రయాణికుల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తక్కువని వివరించింది. కరోనా వైరస్ సమసిపోవడంతో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 52–54 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది. లీజర్, వ్యాపార పర్యటనలకు డిమాండ్ ఉండడం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఆగస్ట్ 31 నుంచి విమాన టారిఫ్‌లపై నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ధరలు 25–30 శాతం పెరిగినట్టు ఇక్రా తెలిపింది. దీంతో తీవ్ర పోటీ తగ్గొచ్చని అంచనా వేసింది. -
కరోనా 'వేలకోట్ల'లో దెబ్బకొట్టింది, గాల్లో ఎగిరేదెలా!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలను (ఎయిర్‌లైన్స్) కరోనా గట్టిగానే దెబ్బకొట్టింది. వైరస్ నేపథ్యంలో కార్యకలాపాలు సజావుగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడడం వల్ల.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ రంగం ఏకంగా రూ.22,400 కోట్ల నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో 75 శాతం గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలను ఎదుర్కొన్నాయి. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ వివరాలను లోక్‌సభకు తెలియజేశారు. కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా పౌర విమానయాన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టు మంత్రి చెప్పారు. ఫలితంగా దేశీయంగా ఎయిర్‌లైన్స్‌తోపాటు, విమానాశ్రయాలు, అనుబంధ సేవల్లోనూ నష్టాలు ఎదురైనట్టు వివరించారు. ‘‘భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు 2020–21లో నష్టాలు సుమారుగా రూ.19,000 కోట్ల వరకు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్‌లకు ఈ నష్టాలు రూ.3,400 కోట్లుగా ఉన్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రయాణించే వారు 61.7 శాతం తగ్గినట్టు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో దేశీయ ప్రయాణికుల మార్కెట్ రెట్టింపు అవుతుందన్న అంచనాను వ్యక్తం చేశారు. విమానయాన సేవల్లో ఎక్కువగా ఇంధనానికే (ఏటీఎఫ్) ఖర్చవుతున్నట్టు చెప్పారు. -
కష్టాల కడలి, రూ.70,820 కోట్లకు ఎయిరిండియా నష్టాలు
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం చేసినప్పట్నుంచీ సంస్థ నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఎయిరిండియా విక్రయా నికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 15లోగా ఆసక్తి గల బిడ్డర్ల నుంచి ఆర్థిక బిడ్లు రాగలవని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సంస్థను విక్రయించేందుకు గతేడాది జనవరి 27న కేంద్రం బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తికరణ పత్రాలను ఆహ్వానించింది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో బిడ్ల దాఖలుకు డెడ్‌లైన్‌ను పొడిగిస్తూ వచ్చింది. విమానాశ్రయాల చట్ట సవరణల బిల్లుకు ఆమోదం ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై విపక్షాల నిరసనల మధ్య స్వల్ప చర్చ అనంతరం రాజ్యసభ దీనికి ఆమోదముద్ర వేసింది. మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. షిప్పింగ్ పోర్టులపై పార్లమెంటరీ కమిటీ నివేదిక.. దేశీయంగా కొత్త పోర్టుల ఏర్పాటు అవకాశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు తగు ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని సంప్రదించే స్వేచ్ఛ షిప్పింగ్ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు ఉండాలని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. కంటైనర్లను వేగవంతంగా ఖాళీ చేసేందుకు జవహర్లాల్ నెహ్రూ పోర్టు (జేఎన్పీటీ)లో రైల్ యార్డును అభివృద్ధి చేసే అంశం పరిశీలించాలని ఒక నివేదికలో సూచించింది. -
చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్..!
న్యూఢిల్లీ : చైనా పౌరులను భారత్ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కాగా గతంలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో భారత్ చైనాతో విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ 2ఎయిర్ బబూల్స్’ తెరచడంతో ఆ దేశాల్లో నివసించే చైనా పౌరులు వ్యాపార, ఉద్యోగ పనుల కోసం భారత్ రావడానికి అవకాశం ఏర్పడింది. దీంతో చైనా పౌరులు భారతదేశంతో ఎయిర్ బబుల్ ఉన్న దేశాల ద్వారా పర్యాటక వీసాలను మినహాయించి నిర్దిష్ట రకాల వీసాలపై ఇండియకు రాకపోకలను కొనసాగిస్తున్నారు. నవంబర్ నుంచి భారత పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా చైనా కూడా నిషేధం విధించింది. కరోనా కారణంగా భారత్ సహా విదేశీ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ అప్పటికే మంజూరు చేసిన వాటిని రద్దుచేసింది. ‘చైనా రాయబార కార్యాలయం / కాన్సులేట్లలో పైన పేర్కొన్న వర్గాలకు వీసా లేదా నివాస అనుమతులకు సంబంధించి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయబోం’ అని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం నవంబర్ 5న తన వెబ్సైట్లో పేర్కొంది. చదవండి: 2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి మరో వైపు చైనా పౌరులు తమ విమానాల్లో భారత్‌లోకి ప్రయాణించవద్దని గతవారం రోజులుగా స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలు చెబుతున్నాయి. టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేయగా.. వ్యాపార, ఇతర విభాగాలకు చెందిన విదేశీ వ్యక్తులను నాన్-టూరిస్ట్ వీసాలపై అనుమతిస్తోంది. ఐరోపాలోని ఎయిర్ బబూల్స్ దేశాల నుంచి చాలా మంది చైనీయులు భారత్‌కు వస్తున్నట్టు విమానయా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు బోర్డింగ్ నిరాకరించడానికి కారణం చెప్పడానికి తమకు లిఖితపూర్వకంగా ఏదో ఒక ఉత్తర్వులు ఇవ్వాలని కొన్ని విమానయాన సంస్థలు అధికారులను కోరుతున్నాయి. అయితే ఇటీవల చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చైనా పాల్పడుతున్న చర్యలకు ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తోన్న భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా -
వైరల్: విస్టారా, ఇండిగోలపై కామెడియన్ కామెంట్
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై విస్టారా, ఇండిగో, గోఎయిర్, స్పెస్‌జెట్ భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు సోషల్ మీడియాలో సరదాగా చర్చించిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్టాండ్ అప్ ఇండియన్ కమెడియన్ కునాల్ కమ్రా విస్టారా ఎయిర్‌లైన్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ట్విటర్లో ట్రేండింగ్‌గా మారింది. ‘‘హే @airvistara నేను విన్నాను లాక్డౌన్ కారణంగా నిన్ను ఎత్తుకు ఎగరకుండా నిలిపివేశారంట కదా. ఎక్కడికి ఎగరకుండా పార్కింగ్‌లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే ఇండిగో, స్పెస్‌జెట్, గోఎయిర్‌లు కూడా.. స్టేపార్కింగ్.. స్టేసేఫ్. ఇప్పటు మీకు అర్థం అవుతుంది నా బాధ’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఆయన సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెజన్లు తెగ ఆకట్టుకుంటోంది. (ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం) Now you know how I feel... https://t.co/oZcXqUIEeh — Kunal Kamra (@kunalkamra88) April 10, 2020 కాగా మార్చిలో విస్టారాతో పాటు ఇండిగో ఎయిర్ లైన్ అధికారుల లాక్డౌన్ అమలును అనుసరిస్తూ.. ఆయన ప్రయాణాన్ని నిషేధించినట్లు గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఏప్రిల్ 27వరకూ ఎయిర్ విస్టారాతో పాటు మరో నాలుగు విమానా ఎయిర్‌లైన్ సంస్థలు నా ప్రయాణాన్ని నిషేధించాయి. అంతేగాక అధికారుల ఆదేశాల మేరకు ఎవరూ కూడా ప్రయాణించడాకి వీలు లేదని చెప్పారు’’ అంటూ కునాల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపార రంగాలు మూతపడ్డాయి. అంతేగాక జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో విమానా సేవలు కూడా నిలిచిపోయాయి. (కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్) -
ఆ దేశాల మీదుగా వెళ్లేటప్పుడు జాగ్రత్త!!
న్యూఢిల్లీ: ఇరాన్‌లోని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానం కూలిపోయిన నేపథ్యంలో..ఇరాన్, ఇరాక్, ఒమన్, పర్షియన్ గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ఎయిర్‌లైన్స్‌లు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ డీజీసీఏ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్షియన్ గల్ఫ్ మీదుగా అమెరికన్ విమానాలను నిలిపివేయాలని ఆదేశించింది. -
ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లనివ్వద్దు
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న పరిస్థితుల దృష్యా ఆ దేశ గగనతలం మీదుగా ఎలాంటి విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇరాన్ జనరల్ కమాండర్ ఖాసీం సులేమానిని అమెరికా మిలటరి దళాలు మట్టుబెట్టడంతో ఇరాన్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ దేశం అమెరికాకు చెందిన విమానాలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా ఇరాన్ గగనతలం మీదుగా ఇండిగో, ఎయిర్ లైన్స్ విమానాలను దారి మళ్లించే ఏరాట్లు చేస్తున్నట్లు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.(ఇరాన్ వెన్ను విరిగింది!) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు నిర్వహించారు. ఈ ప్రమాదంతో ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు ఇప్పటికే బాగ్దాద్ మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. మా నాయకుడు సులేమానీ చంపినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.(ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి) -
భోజనం కూడా పెట్టలేదు
- హజ్ యాత్రికులపై ఇండియన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం - ఉన్నతాధికారులకు హజ్ కమిటీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.30 గంటలకు సౌదీ అరేబియా మదీనా నుంచి బయలుదేరిన విమానం మధ్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మధ్యాహ్నం కనీసం భోజనం కూడా ఇవ్వలేదని, షుగర్ పేషెంట్లు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాత్రికులు తెలిపారు. ఈ విషయమై వారు ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండీ లియాఖత్ అలీ ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుకూ హజ్ కమిటీ ఫిర్యాదు చేసింది. పది విమానాల్లో హైదరాబాద్ చేరిన హజ్ యాత్రికుల్లో ఏపీకి చెందిన వారు 1,027 మంది ఉన్నారని లియాఖత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. -
పాకిస్థాన్ లో విమానాలు దించొద్దు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో అత్యవసరంగా విమానాలు కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని పైలట్లకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. దాయాది దేశంలో విమానం దించితే అదే మనకు తుది గమ్యం అవుతుందని హెచ్చరించింది. భారత సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో తమ భూభాగంలోని గగనతలంపై పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగించే విమానాల పైలట్లకు ఎయిర్ ఇండియా పలు జాగ్రత్తలు సూచించింది. 'పాకిస్థాన్ విమానాశ్రయాల్లో అత్యవసరంగా విమానం కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోండి. విమానంలో మంటలు వ్యాపించడం లాంటి తీవ్ర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. పాక్ లో విమానాన్ని దింపితే అదే మనకు చివరి గమ్యం కావొచ్చ'ని ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్కొందని సీనియర్ పైలట్ ఒకరు వెల్లడించారు. అయితే మౌఖికంగా మాత్రమే ఈ సూచనలు చేసిందని చెప్పారు. గతంలోనూ ఇలాంటి సూచనలు చేసిందని సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. కాందహార్ హైజాకింగ్, 9/11, 26/11 దాడులు జరినప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరమధ్య, తూర్పు ఇండియా నుంచి వెళ్లే విమానాలన్నీ పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలు కూడా పాక్ మీదుగా మన దేశానికి వస్తుంటాయి. -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్: ఇండియన్ ఎయిర్‌లైన్స్-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా సోమవారం రాత్రి శంషాబాద్ విమానశ్రయంలో దింపేశారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు విజయవాడ చేరాల్సిన విమానంలో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికులు గురువారం ఆందోళనకు దిగారు. గురువారం తెల్లవారుజామున 3.35 నిముషాలకు మస్కట్ విమానం బయలుదేరవలసి ఉంది. ఆ విమానం ఆలస్యంపై 8.30 ని. వరకు ప్రయాణికులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించిన వారి నుంచి సరైన సమాధానం అందలేదు. ఆగ్రహించిన ప్రయాణికులు వారి బంధువులు ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళన చేపట్టారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నతాధికారులు దిగి వచ్చారు. మరి కొద్దిసేపట్లో విమానం ఏర్పాటు చేస్తామంటూ ఆందోళన చేస్తున్న ప్రయాణికులకు తెలిపారు. దీంతో ప్రయాణికులు వారి బంధువులు ఆందోళనలు విరమించారు. -
రూ. 100కే ఎయిర్ ఇండియా విమానయానం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ రూ.100కే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఇండియా ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ ఇండియా డే సందర్భంగా ఈ పరిమితి కాల ఆఫర్‌ను ఇస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 2007, ఆగస్టు 27న ఎయిర్ ఇండియా విలీనమైంది. దీంతో ఆగస్టు 27ను ఎయిర్ ఇండియా దినోత్సవంగా వ్యవహరిస్తారు. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని ఎయిర్ ఇండియా జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులిస్తామని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎయిర్ ఇండియా ఆఫర్లో భాగంగా రూ.100కే (ఇంధన సర్‌చార్జీ, సంబంధిత పన్నులు. ఫీజులు) విమాన టికెట్లను ఆఫర్ చేస్తారు. వీటిని ఈ నెల 27(నేటి) నుంచి 31 వరకూ మాత్రమే బుక్ చేయాలని, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే ఎయిర్ ఇండియా వెబ్సైట్ ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
లంకలో రామాయణ దర్శనం
పాఠక ప్రయాణం శాంకరీదేవి శక్తి పీఠ సందర్శనం.. బుద్ధుని బోధనల ఆధ్యాత్మిక సౌరభం... రామాయణంలోని చివరి అంకానికి సాక్షీభూతమైన ప్రదేశాల ప్రాభవం... సుందర జలపాతాల సౌందర్యం... అడుగడుగునా చారిత్రక వైభవం... కళ్లకు కట్టే శ్రీలంక పర్యటన ఆజన్మాంతం ఓ మధురజ్ఞాపకమని వర్ణిస్తున్నారు ఒంగోలు వాసి అయిన విశ్రాంత ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎస్వీఎస్ భగవానులు. ద్వాదశ జ్యోతిర్లింగాలను గతంలోనే సందర్శించిన నేను ప్రథమ శక్తి పీఠమైన శ్రీ శాంకరీదేవిని దర్శించాలనుకున్నాను. అందులో భాగంగానే శ్రీలంక ప్రయాణానికి మా బంధువులతో కలిసి బయల్దేరాను. శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీతో ముందుగానే ఒప్పందం చేసుకున్నాం. ఒంగోలు నుంచి చెన్నైకి రైలులో అటు నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ వారి విమానంలో బయల్దేరి, గంటన్నర వ్యవధిలో శ్రీలంక రాజధాని కొలంబో విమానాశ్రయంలో దిగాం. అక్కడ శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీ వారు తమ వాహనంలో మమ్మల్ని తీసుకెళ్లారు. కొలంబో నుంచి ట్రిన్కోమలీకి... ముందుగా మున్నేశ్వరం చేరుకొని అక్కడ మున్నేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించాం. రావణవధ అనంత రం రాముడు ప్రతిష్ఠించిన శివ దేవాలయాన్ని, తిరుకోనేశ్వర దేవస్థానం పక్కన సముద్రపు ఒడ్డున గల రావణబ్రహ్మ ఏకైక విగ్రహాన్ని చూసి.. అక్కణ్ణుంచి బయల్దేరి 268 కి.మీ దూరంలోని ట్రిన్కోమలీ పట్టణం చేరాం. ట్రిన్‌కోమలీలో శక్తి పీఠం ట్రిన్కోమలీ పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టున్న కొండపై శాంకరీదేవి ఆలయం ఉంది. ఇక్కడ శాంకరీదేవి దర్శనం మాటల్లో వర్ణించలేం. ఇక్కడే శివుడి గుడి ఉన్న ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. ఎటు చూసినా హిందూ, బౌద్ధమతాల సమ్మేళనం కళ్లకు కడుతుంది. డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుడు మరుసటి రోజు ట్రిన్కోమలీ నుంచి కాండీ పట్టణానికి బయల్దేరి, మధ్యలో డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుని ఆలయం, శ్రీ రాములవారు పాశుపతాస్త్రం సంధించిన ధన్వేలి, రామబాణం పడిన లగ్గాల గ్రామాలను సందర్శించాం. రామ-రావణ సంగ్రామం జరిగిన ప్రదేశాన్ని పరికిస్తూ, టీ తోటల సోయగాలను వీక్షిస్తూ, ఆయుర్వేద మూలికల మందుల తయారీ కేంద్రాలను చూస్తూ, రాత్రి కాండీ పట్టణంలోనే బస చేశాం. మరుసటి రోజు బుద్ధుని అవశేషాలను భద్రపరిచి, దాని పైన నిర్మించిన సుందరమైన బుద్ధ దేవాలయాన్ని సందర్శించాం. లంకలో రామాయణం చివరి అంకం కాండీ నుంచి బయల్దేరి రాంబోడా పర్వతాలపై చిన్మయ మిషన్ వారు నిర్మించిన 18 అడుగుల నిలువెత్తు ఆంజనేయ విగ్రహాన్ని దర్శించి, సముద్రమట్టానికి 6135 అడుగుల ఎత్తు గల నువారా ఎలియా అనే పట్టణం చేరాం. అక్కడ నుండి రావణాసురుడి గుహ కలిగిన ఇస్తిపురం బండారువేల చూశాం. ఈ గుహలు ఆసియా ఖండ ప్రాచీనతకు ప్రత్యక్ష నిదర్శనాలు. హనుమ పాదముద్రలు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చిన గుర్తుగా ఆయన పాదముద్రలు రుమస్సాలలో చూశాం. మటారాలో నిలువెత్తు బౌద్ధ విగ్రహాన్ని సందర్శించి, హిక్కాదువ అనే సముద్ర ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ సుమద్రం గంభీరంగా, రామాయణంలోని సంగ్రామ ఘట్టానికి గుర్తుగా నేటికీ కళ్లెదుట నిలిచింది. రామాయణం జరిగింది అనడానికి పూర్తి ఆధారాలు ఆనవాళ్లతో సహా ఇక్కడ కనిపించాయి. కొలంబోలో సుప్రసిద్ధ రథ పంచముఖ హనుమాన్ మందిరం దర్శించుకొని కొలంబో నుంచి చెన్నై మీదుగా ఒంగోలు చేరాం. మన దేశంలో అయోధ్యలో మొదలైన రామాయణం చివరి అంకాన్ని శ్రీలంకలో వీక్షించి, జన్మ ధన్యైమైందని అందరం భావించాం. సింహళానికి చలో చలో... ఒంగోలు నుంచి చెన్నై మీదుగా కొలొంబో కొలంబో నుంచి ట్రిన్‌కోమలి 268 కి.మీ. ట్రిన్‌కోమలిలో అష్టాదశ శక్తిపీఠాలలో తొలిదైన శ్రీశాంకరీదేవి శక్తి పీఠం ఉంది. ట్రిన్‌కోమలి నుంచి కాండీ పట్టణం 181 కి.మీ -
ఆబాలగోపాలాన్ని విమానం ఎక్కించాడు!
ఊరికిచ్చిన మాట హర్యానా రాష్ట్రం కైతాల్ జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు కైసాల్. అప్పుడప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపించే విమానాన్ని చూడడం తప్ప... ఆ ఊరి వాళ్లకు విమానం గురించి ఏమీ తెలియదు. విమానం ఎక్కడం అనేది ఇక కలలో మాట. ఇదే గ్రామానికి చెందిన బహదూర్ గుప్తా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఉండేవాడు. గుప్తా ఊరికి వస్తే చాలు చిన్నాపెద్దా అతడిని అడిగే ప్రశ్నలన్నీ ఒకేలా ఉండేవి. ‘‘విమానం ఎంత పెద్దగా ఉంటుంది. మన ఊరంత ఉంటుందట కదా!?’’ ‘‘విమానం నుంచి కిందికి చూస్తే మనం చీమల్లా కనిపిస్తామా?’’ ఇక పిల్లలు అయితే ‘మమ్మల్ని విమానం ఎక్కించండి అంకుల్!’ అంటూ ఎప్పుడూ అడుగుతుంటారు. ‘‘తప్పకుండా’’ అని వాగ్దానం చేశాడు గుప్తా. వాగ్దానం అయితే చేశాడుగానీ, ‘ఇది విమానం’ ‘ఇందులో ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి’ ‘పైలట్ ఇక్కడ కూర్చుంటాడు’ ఇలాంటి విషయాలను పూసగుచ్చినట్లు చెప్పడం ఎలా? ఆలోచించే క్రమంలో బహదూర్‌కు ఒక ఐడియా తట్టింది. అదే ఫాంటసీ ఫ్లైట్! బహదూర్ వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ‘ఫాంటసీ ఫ్లైట్’ అచ్చం విమానంలా ఉండడం మాత్రమే కాదు...లోపల కూడా విమానంలో ఉండే సౌకర్యాలు, వస్తువులు ఉంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా కైసాల్ గ్రామ ప్రజలందరూ ఈ విమానంలోకి ఎక్కి ఆనందించారు. పిల్లలకు ఈ విమానం చూపుతూ దాని గురించిన సమాచారాన్ని అరటిపండు వలిచి పెట్టినట్లు వివరిస్తుంటాడు బహదూర్. దేశవ్యాప్తంగా ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు ఈ విమానాన్ని చూడడానికి వస్తుంటారు. ఇక్కడికి రావడం అనేది పిల్లలకు వినోద, విజ్ఞానయాత్రగా మారింది. ఒకేసారి 200 నుంచి 300 వరకు పిల్లలు ఈ విమానాన్ని చూడవచ్చు. పిల్లలు ‘కెప్టెన్ క్యాప్’ పెట్టుకొని, ఎయిర్ హోస్టెస్ డ్రెస్ వేసుకొని ఆనందిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ‘ఫ్లైయిట్ ట్రైనింగ్ స్కూల్’గా కూడా ఉపకరిస్తుంది. -
అద్దెలు.. ప్రకటనలు..
న్యూఢిల్లీ: నిధుల కొరతనెదుర్కొంటున్న ఎయిరిండియా ఆదాయాలు పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాపర్టీల్లో కొన్నింటిని అద్దెకు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే విమానాల లోపల (ఇన్‌ఫ్లయిట్) ప్రకటనలను అనుమతించే అంశాన్నీ పరిశీలిస్తోంది. ‘కొత్త ప్రణాళిక ప్రకారం ప్రధాన నగరాల్లో మా భవంతులను బ్యాంకులు, ఇతర కంపెనీలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఎయిరిండియా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే 22 ప్రాపర్టీలను గుర్తించామని, 19 ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లు కూడా వచ్చాయని ఆయన వివరించారు. అలాగే, ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న 22 అంతస్తుల ఎయిరిండియా భవంతిలో మరిన్ని ఫ్లోర్లను కూడా అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ భవంతిలో చదరపు అడుగుకు కనీసం రూ. 300-350 దాకా అద్దె లభించగలదని అంచనా. ఈ భవంతిని అద్దెకు ఇస్తే ఏటా కనీసం రూ. 100 కోట్లయినా ఆదాయం వస్తుందని ఎయిరిండియా అంచనా వేస్తోంది. ప్రాపర్టీలను అద్దెకు ఇవ్వడంతో పాటు తమ విమానాల వెలుపల, లోపల కూడా ప్రకటనలను అనుమతించాలని కంపెనీ భావిస్తున్నట్లు సంస్థ అధికారి తెలిపారు.