ఆబాలగోపాలాన్ని విమానం ఎక్కించాడు!
ఊరికిచ్చిన మాట
హర్యానా రాష్ట్రం కైతాల్ జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు కైసాల్. అప్పుడప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపించే విమానాన్ని చూడడం తప్ప... ఆ ఊరి వాళ్లకు విమానం గురించి ఏమీ తెలియదు. విమానం ఎక్కడం అనేది ఇక కలలో మాట. ఇదే గ్రామానికి చెందిన బహదూర్ గుప్తా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఉండేవాడు.
గుప్తా ఊరికి వస్తే చాలు చిన్నాపెద్దా అతడిని అడిగే ప్రశ్నలన్నీ ఒకేలా ఉండేవి.
‘‘విమానం ఎంత పెద్దగా ఉంటుంది. మన ఊరంత ఉంటుందట కదా!?’’
‘‘విమానం నుంచి కిందికి చూస్తే మనం చీమల్లా కనిపిస్తామా?’’
ఇక పిల్లలు అయితే ‘మమ్మల్ని విమానం ఎక్కించండి అంకుల్!’ అంటూ ఎప్పుడూ అడుగుతుంటారు.
‘‘తప్పకుండా’’ అని వాగ్దానం చేశాడు గుప్తా. వాగ్దానం అయితే చేశాడుగానీ, ‘ఇది విమానం’ ‘ఇందులో ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి’ ‘పైలట్ ఇక్కడ కూర్చుంటాడు’ ఇలాంటి విషయాలను పూసగుచ్చినట్లు చెప్పడం ఎలా?
ఆలోచించే క్రమంలో బహదూర్‌కు ఒక ఐడియా తట్టింది. అదే ఫాంటసీ ఫ్లైట్! బహదూర్ వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ‘ఫాంటసీ ఫ్లైట్’ అచ్చం విమానంలా ఉండడం మాత్రమే కాదు...లోపల కూడా విమానంలో ఉండే సౌకర్యాలు, వస్తువులు ఉంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా కైసాల్ గ్రామ ప్రజలందరూ ఈ విమానంలోకి ఎక్కి ఆనందించారు. పిల్లలకు ఈ విమానం చూపుతూ దాని గురించిన సమాచారాన్ని అరటిపండు వలిచి పెట్టినట్లు వివరిస్తుంటాడు బహదూర్. దేశవ్యాప్తంగా ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు ఈ విమానాన్ని చూడడానికి వస్తుంటారు. ఇక్కడికి రావడం అనేది పిల్లలకు వినోద, విజ్ఞానయాత్రగా మారింది.
ఒకేసారి 200 నుంచి 300 వరకు పిల్లలు ఈ విమానాన్ని చూడవచ్చు. పిల్లలు ‘కెప్టెన్ క్యాప్’ పెట్టుకొని, ఎయిర్ హోస్టెస్ డ్రెస్ వేసుకొని ఆనందిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ‘ఫ్లైయిట్ ట్రైనింగ్ స్కూల్’గా కూడా ఉపకరిస్తుంది.