గాడిన పడుతున్న ఎయిర్‌లైన్స్‌.. | Indian airlines likely to prune losses to Rs 3,000-5,000 crore this fiscal: ICRA | Sakshi
Sakshi News home page

గాడిన పడుతున్న ఎయిర్‌లైన్స్‌..

Published Wed, Dec 20 2023 10:21 AM | Last Updated on Wed, Dec 20 2023 10:39 AM

Indian airlines likely to prune losses to Rs 3,000-5,000 cr this fiscal ICRA - Sakshi

ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. కరోనా కారణంగా ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు నెమ్మదించడం తెలిసిందే. దీని కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇవి రూ.17,500 కోట్ల వరకు నష్టాలను చవి చూశాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.3,000–3,500 కోట్లకు పరిమితం అవుతాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 

వైరస్‌ సమసిపోయి, ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత దేశ, విదేశీ ప్రయాణాలు ఊపందుకోవడం తెలిసిందే. గతంలో నిలిచిన ప్రయాణాలు కూడా తోడు కావడంతో విమానయాన సర్వీసులకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ విమాన ప్రయాణికుల రద్దీ 8–13 శాతం మధ్య పెరుగుతుందని ఇక్రా పేర్కొంది. 

ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 15–15.5 కోట్లకు చేరుకుంటుందని.. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో ఉన్న 14.1 కోట్లను అధిగమిస్తుందని అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీలో చక్కని వృద్ధికితోడు, రాబడులు మెరుగుపడడం, వ్యయాలు స్థిరంగా ఉన్నందున ఈ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్‌ను ఇస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది.  

వచ్చే సంవత్సరంలోనూ.. 
ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నష్టాలు ఎదురవుతాయని ఇక్రా తెలిపింది. ‘‘ప్రస్తుత స్థాయి నుంచి రాబడులు మరింత పెరిగే అవకాశాలు పరిమితమే. కనుక ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరే 2024–25లోనూ 3,000–5,000 కోట్ల మధ్య నష్టాలను నమోదు చేయవచ్చు’’అని ఇక్రా కార్పొరేట్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుప్రియో బెనర్జీ వివరించారు. విమానాశ్రయాల సదుపాయాల విస్తరణతో విమాన ప్రయాణాలకు డిమాండ్‌ పెరుగుతోందని, ప్రస్తుతం మాదిరే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రయాణికుల వృద్ధి ఉంటుందని ఇక్రా తెలిపింది.  

ఎనిమిది నెలల్లో 10 కోట్లు.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (2023 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు) విమాన ప్రయాణికుల సంఖ్య 10.07 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 17 శాతం వృద్ధి కనిపిస్తోంది. కరోనా ముందు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 8 నెలల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం వృద్ధి నమోదైంది. భారత ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2022–23లో 2.39 కోట్లుగా ఉంది. కరోనా ముందు నాటి గణాంకాల కంటే ఇది ఎక్కువ.

2018–19లో 2.59 కోట్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి నమోదు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. విమానయాన సంస్థలకు ధరలు నిర్ణయించే బలం చేకూరిందని, ఫలితమే రాబడులు మెరుగుపడడమని వివరించింది.

విమానయాన సంస్థలకు 1500 విమానాలు డెలివరీ కావాల్సి ఉందని, సరఫరా వ్యవస్థలో సమస్యల వల్ల నిదానంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మధ్య కాలానికి డిమాండ్‌–సరఫరా మధ్య సమతుల్యత ఏర్పడుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల మార్కెట్లో భారత ఎయిర్‌లైన్స్‌ సంస్థల వాటా 42 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రయాణికుల రికవరీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఏటీఎఫ్‌ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి క్షీణతను పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement