ముంబై: కరోనా సంక్షోభం నుంచి బయటపడినా ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు. కరోనా వైరస్ నియంత్రణ ఆంక్షల నడుమ పరిమిత సర్వీసులతో, విమానయాన సంస్థలు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయాయి. దీనికితోడు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కూడా గరిష్ట స్థాయలో చలిస్తున్నాయి. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.15,000–17,000 కోట్ల నష్టాలను నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.
ఈ మేరకు మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్స్ రంగం నష్టాలు రూ.23,000 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. పరిశ్రమ మొత్తం రుణ భారం 2023 మార్చి నాటికి రూ.లక్ష కోట స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువలో అస్థిరతలు, ఏటీఎఫ్ ధరల్లో హెచ్చు తగ్గుల ప్రభావం ఎయిర్‌లైన్స్ వ్యయాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ కోసం ఖర్చు చేసేది 45 శాతంగా ఉంటుందని తెలిసిందే. ఇది కాకుండా ఎయిర్‌లైన్స్ మొత్తం ఖర్చుల్లో 35–50 శాతం మేర డాలర్ మారకంలోనే ఉంటాయని ఇక్రా గుర్తు చేసింది.
ప్రయాణికుల్లో వృద్ధి..
లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు అయిన ఇండిగో ప్రస్తుత ఆర్థిక సంవ్సరం మొదటి మూడు నెలల కాలానికి (జూన్ క్వార్టర్) రూ.1,064 కోట్లు, స్పైస్‌జెట్ రూ.789 కోట్ల చొప్పున నష్టాలను ప్రకటించాయి. రూపాయి బలహీనత, ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్టు ఇక్రా తెలిపింది. ప్రయాణికుల సంఖ్య 57.7 శాతం పెరిగి 8.42 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రయాణికుల్లో మెరుగైన వృద్ధి ఉన్నప్పటికీ 2022–23లో రూ.17,000 కోట్ల వరకు నష్టాలు తప్పుకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ అన్నారు.
జూన్ త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య, వార్షికంగా అంతకుముందు ఇదే ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగి 3.25 కోట్లుగా ఉన్నట్టు ఇక్రా తెలిపింది. కాకపోతే కరోనా ముందు 2019 ఏప్రిల్–జూన్‌లోని ప్రయాణికుల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తక్కువని వివరించింది. కరోనా వైరస్ సమసిపోవడంతో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 52–54 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది. లీజర్, వ్యాపార పర్యటనలకు డిమాండ్ ఉండడం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఆగస్ట్ 31 నుంచి విమాన టారిఫ్‌లపై నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ధరలు 25–30 శాతం పెరిగినట్టు ఇక్రా తెలిపింది. దీంతో తీవ్ర పోటీ తగ్గొచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment