Aviation Fuel Prices
-
ఏటీఎఫ్ ధర 5 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 4.6 శాతం తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 5,189 తగ్గి రూ. 1,06,156కి దిగి వచ్చింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ (19 కేజీల) ధర రూ. 21 తగ్గి రూ. 1,749కి పరిమితమైంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర యధాప్రకారం రూ. 903 (14.2 కేజీల సిలిండర్)గానే కొనసాగనుంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఈ మేరకు సవరించిన ధరలను శుక్రవారం ప్రకటించాయి. ఏటీఎఫ్‌ను తగ్గించడం నెలరోజుల్లో ఇది రెండోసారి. నవంబర్ 1న దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ. 6,854) తగ్గింది. అంతకు ముందు జులై 1 నుంచి నాలుగు నెలల వ్యవధిలో రేటు రూ. 29,391 మేర పెరిగింది. తాజాగా రెండు విడతల తగ్గింపుతో అందులో సుమారు మూడో వంతు భారం తగ్గినట్లయింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. దీన్ని తగ్గించడంతో ఎయిర్‌లైన్స్‌పై భారమూ తగ్గుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. ఇందుకోసం క్రితం నెల అంతర్జాతీయంగా ఉన్న సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించాల్సి ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్ 6 నుంచి రికార్డు స్థాయిలో 21 నెలలుగా మార్చడం లేదు. మే 22న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇందుకు మినహాయింపు. -
నష్టాల బాటలోనే ఎయిర్‌లైన్స్
ముంబై: కరోనా సంక్షోభం నుంచి బయటపడినా ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు. కరోనా వైరస్ నియంత్రణ ఆంక్షల నడుమ పరిమిత సర్వీసులతో, విమానయాన సంస్థలు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయాయి. దీనికితోడు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కూడా గరిష్ట స్థాయలో చలిస్తున్నాయి. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.15,000–17,000 కోట్ల నష్టాలను నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్స్ రంగం నష్టాలు రూ.23,000 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. పరిశ్రమ మొత్తం రుణ భారం 2023 మార్చి నాటికి రూ.లక్ష కోట స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువలో అస్థిరతలు, ఏటీఎఫ్ ధరల్లో హెచ్చు తగ్గుల ప్రభావం ఎయిర్‌లైన్స్ వ్యయాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ కోసం ఖర్చు చేసేది 45 శాతంగా ఉంటుందని తెలిసిందే. ఇది కాకుండా ఎయిర్‌లైన్స్ మొత్తం ఖర్చుల్లో 35–50 శాతం మేర డాలర్ మారకంలోనే ఉంటాయని ఇక్రా గుర్తు చేసింది. ప్రయాణికుల్లో వృద్ధి.. లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు అయిన ఇండిగో ప్రస్తుత ఆర్థిక సంవ్సరం మొదటి మూడు నెలల కాలానికి (జూన్ క్వార్టర్) రూ.1,064 కోట్లు, స్పైస్‌జెట్ రూ.789 కోట్ల చొప్పున నష్టాలను ప్రకటించాయి. రూపాయి బలహీనత, ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. దేశీ విమాన ప్రయాణికుల రద్దీలో గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్టు ఇక్రా తెలిపింది. ప్రయాణికుల సంఖ్య 57.7 శాతం పెరిగి 8.42 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రయాణికుల్లో మెరుగైన వృద్ధి ఉన్నప్పటికీ 2022–23లో రూ.17,000 కోట్ల వరకు నష్టాలు తప్పుకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ అన్నారు. జూన్ త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య, వార్షికంగా అంతకుముందు ఇదే ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగి 3.25 కోట్లుగా ఉన్నట్టు ఇక్రా తెలిపింది. కాకపోతే కరోనా ముందు 2019 ఏప్రిల్–జూన్‌లోని ప్రయాణికుల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తక్కువని వివరించింది. కరోనా వైరస్ సమసిపోవడంతో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 52–54 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది. లీజర్, వ్యాపార పర్యటనలకు డిమాండ్ ఉండడం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఆగస్ట్ 31 నుంచి విమాన టారిఫ్‌లపై నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ధరలు 25–30 శాతం పెరిగినట్టు ఇక్రా తెలిపింది. దీంతో తీవ్ర పోటీ తగ్గొచ్చని అంచనా వేసింది. -
దేశీ ఎయిర్‌లైన్స్ రికవరీకి ఏటీఎఫ్ సెగ
ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్‌గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్‌తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది. -
విమాన చార్జీలను 15% పెంచాలి
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు. ‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. ఏటీఎఫ్ రేటు 16 % పెంపు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది. ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది. -
బాబోయ్ ఫ్యూయల్ రేట్లు మండిపోతున్నాయ్! విమానాల్లో మగవాళ్లు వద్దు?
కరోనా దెబ్బతో అతలాకుతలమైన ఏవియేషన్ సెక్టార్‌పై రష్యా - ఉక్రెయిన్ వార్ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఏవియేషన్ ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. చివరి సారిగా ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో విమానాలు నడిపించడం కత్తిమీద సాములా మారింది. పెరిగిన ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు సర్వీసు ప్రొవైడర్లకు ఇబ్బందికరంగా మారాయి. విమాన సర్వీసుల నిర్వాహాణలో 40 శాతం వ్యయం కేవలం ఫ్యూయల్‌కే వెళ్తుంది. దీంతో పెరుగుతున్న ధరలు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధన పొదుపుకు సంబంధించి ఏం చేయాలనేది వారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్‌కి ఆసక్తికరమైన సూచన చేశాడు విశాల్ శ్రీవాత్సవ అనే నెటిజన్. విమానం నడిపే క్యాబిన్ క్రూలో మీరు ఎందుకు ఎక్కువ మంది మగవాళ్లనే నియమిస్తున్నారు? పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ బరువు ఉంటారు. దీంతో తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు లేడీ కేబిన్ క్రూను తీసుకోవడం ద్వారా ప్రతీ ఫ్లైట్‌కి కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతాయి అనుకున్నా.. రోజుకు వంద ఫ్లైట్లు నడిపిస్తారనుకున్నా.. ఏడాదికి కనీసం రూ. 3.5 కోట్ల వ్యయం తగ్గుతుంది కదా ? అంటూ ప్రశ్నించాడు. విశాల్ శ్రీవాత్సవ సంధించిన ప్రశ్నలకు జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. మంచి ఐడియా ఇచ్చారు విశాల్. కేవలం కేబిన్ క్రూ విషయంలోనే ఈ నియమం ఎందుకు అమలు చేయాలి ? ప్రయాణికుల్లో కూడా మొత్తం మహిళలే ఉండేలా చూసుకోవడం లేదా కనీసం మగ ప్యాసింజర్లను తగ్గించినా కూడా ఫ్యూయల్ బాగానే ఆదా అవుతుంది కదా అంటూ బదులిచ్చారు. Extending that logic, imagine the savings if one were to carry only female passengers! Or charge male passengers more! 😉 https://t.co/3GP2YETBnV — Sanjiv Kapoor (@TheSanjivKapoor) March 22, 2022 మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉన్నా అది దీర్ఘకాలంలో లింగ వివక్షకు దారి తీస్తుంది. అంతే కాదు చట్టపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకునేందుకు మహిళా క్రూ అనేది అంత సబబైన విధానం కాదంటూ వివరణ ఇచ్చారు సంజీవ్ కపూర్. మొత్తంగా పెరుగుతున్న ఫ్యూయల్ ఛార్జీలతో ఏవియేషన్ సెక్టార్ ఎంతగా ఇబ్బంది పడుతుంతో తెలిపేందుకు విశాల్, సంజీవ్ కపూర్ల మధ్య జరిగిన సంభాషణ ఉదాహారణగా నిలుస్తోందంటున్నారు నెటిజన్లు. చదవండి: నష్టాల ఊబిలో ఏవియేషన్ -
రికార్డు గరిష్టానికి విమాన ఇంధనం ధర.. కొత్తగా ఎంత పెరిగిందంటే?
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా ఏటీఎఫ్ ధరను 5.2 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం నిర్ణయించాయి. రెండు నెలల్లో ధరల పెంపు (ఈ ఏడాది) ఇది నాలుగో విడత కావడం గమనార్హం. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కిలోలీటర్ ఏటీఎఫ్‌కు రూ.4,482 మేర పెరిగింది. దీంతో ఒక కిలోలీటర్ ఏటీఎఫ్ విక్రయ ధర రూ.90,520కు చేరింది. 2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్ గరిష్ట ధర రూ.71,028గా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి చూస్తే కిలోలీటర్‌కు 16,497 మేర పెరిగినట్టయింది. గత డిసెంబర్లో రెండు విడతల్లో ఏటీఎఫ్ ధర తగ్గించడం గమనార్హం. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత తగ్గడం కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటు ధరల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు ఐటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి. -
బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ ! మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
చమురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్ లేకుండా పెట్రోలు ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ.113కి చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని బన్స్వారాలో అయితే లీటరు పెట్రోలు ఏకంగా రూ.117.21కి చేరుకుంది. పెట్రోలు ధరలు వరుసగా మూడూరోజు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకి 37 పైసల వంతున ధర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113 కి చేరుకోగా డీజిల్ ధర రూ.106.22గా ఉంది. విమానమే నయం పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు సైతం ఈ వ్యంగాస్త్రాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. వాటికి పెట్రోల్ చీప్ బైకులు, కార్లు ఇలా సామాన్యులు ఉపయోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ (ఏటీఎఫ్)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. ముంబై విషయానికి వస్తే రెగ్యులర్ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇదే వత్యాసం నెలకొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. పన్నుల వల్లే మన పెట్రోలు అవసరాలన్నీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన పెట్రోలుకి రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్ కలుపుతారు. తర్వాత వచ్చిన ధరపై కేంద్రం 11 శాతం పన్ను విధిస్తోంది. అనంతరం రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తున్నాయి. అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం 30 శాతం వ్యాట్ని విధిస్తోంది. ఆ తర్వాత తమిళనాడు 29 శాతం వ్యాట్ విధిస్తోంది. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఏటీఎఫ్ పెట్రోలు ధర ఒక్కో రకంగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కేంద్రం విధిస్తున్న పన్ను 11 శాతమే ఉండటం. అందువల్ల ఏటీఎఫ్ పెట్రోలు తక్కువ ధరకే లభిస్తోంది. పెరిగిన పన్నులు ఇక రెగ్యులర్ పెట్రోలుకి సంబంధించి ముడి చమురు ధర, రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్లను మినహాయిస్తే లీటరు పెట్రోలు ధరలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 34 శాతంగా ఉంటోంది. ఈ మొత్తం కలపగా వచ్చిన ధరపై రాష్ట్రాలు వేర్వేరుగా వ్యాట్‌ను అమలు చేస్తున్నాయి. గరిష్టంగా రాజస్థాన్, మహారాష్ట్రలు దాదాపు 29 శాతం వ్యాట్‌ను విధిస్తున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు దాదాపు రూ. 115 దగ్గరకు చేరుకుంది. రెగ్యులర్ పెట్రోలుకి రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ కనిష్టంగా 17 శాతం నుంచి 29 శాతం ఉండగా కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ పన్ను ఏకంగా 34 శాతం ఉంటోంది. అంతర్జాతీయ ధరలంటూ పన్నుల విధానం కారణంగా సామాన్యులపై పడుతున్న భారాన్ని ప్రభుత్వాలు నేర్పుగా అంతర్జాతీయ చమురు ధర మీదకు తోసేస్తున్నాయి. ముడి చమురు ధరల వల్లే ఈ సమస్య అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోవడం లేదు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే! -
ఎల్ పీజీ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా?
న్యూఢిల్లీ : రాయితీ లేని కుకింగ్ గ్యాస్(ఎల్ పీజీ) సిలిండర్ ధర తగ్గిందట. అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కో సిడిండర్ పై రూ.11 కోత పడిందని తెలిసింది. రూ.548.50 లభ్యమయ్యే సిలిండర్, ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.537.50 లకే అందుబాటులో ఉంటుందట. ఇంధన రిటైలర్లు జరిపిన జెట్ ఇంధన, రాయితీ లేని ఎల్ పీజీ ధరల సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. రాయితీకి లభించే ఎల్ పీజీ ధర ఢిల్లీలో రూ. 421.16గా ఉంది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు మాత్రం 5.5శాతం పెరిగాయని ఆయిల్ కంపెనీ శుక్రవారం వెల్లడించాయి. జెట్ ఫ్యూయల్ ధర ఢిల్లీలో కిలో లీటర్ కు రూ.2,557.7 పెరిగి, రూ.49,287.18గా నమోదైందని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. వరుసగా ఐదో నెల ఈ ధరలు పెరిగినట్టు వెల్లడించాయి. ఈ ఐదు సార్ల పెరుగుదలతో ఏటీఎఫ్ రేట్లు 25 శాతం లేదా రూ.9,985.87 ఎగబాకాయని తెలిపాయి. కానీ విమానాల్లో వాడే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ కంటే తక్కువగానే లభ్యమవుతుందని పేర్కొన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.64.76గా, లీటర్ ఢీజిల్ ధర రూ.54.70గా ఉన్నట్టు... అయితే ఈ ధరలు లీటర్ ఏటీఎఫ్ ధర(రూ.49.28) తక్కువేనని వెల్లడించాయి. ఆటో ఇంధనాలపై కేంద్రప్రభుత్వం పెంచుతూ వస్తున్న ఎక్సేంజ్ డ్యూటీల ప్రభావంతో ఈ ధరలు ఎగబాకినట్టు తెలిపాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పడిపోయినా... భారత్ లో ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటీఎఫ్ ధరల్లో పెరుగుదల, ప్యాసెంజర్ టిక్కెట్ ధరలపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో అనేదానిపై మాత్రం విమాన కంపెనీలు వెంటనే స్పందించలేదు. మూడు ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతి నెలా మొదటిరోజు జెట్ ఇంధనం, రాయితీ లేని ఎల్ పీజీ ధరలపై సమీక్ష నిర్వహిస్తాయి. ఈ సమీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.