ఎల్ పీజీ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా?
న్యూఢిల్లీ : రాయితీ లేని కుకింగ్ గ్యాస్(ఎల్ పీజీ) సిలిండర్ ధర తగ్గిందట. అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కో సిడిండర్ పై రూ.11 కోత పడిందని తెలిసింది. రూ.548.50 లభ్యమయ్యే సిలిండర్, ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.537.50 లకే అందుబాటులో ఉంటుందట. ఇంధన రిటైలర్లు జరిపిన జెట్ ఇంధన, రాయితీ లేని ఎల్ పీజీ ధరల సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. రాయితీకి లభించే ఎల్ పీజీ ధర ఢిల్లీలో రూ. 421.16గా ఉంది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు మాత్రం 5.5శాతం పెరిగాయని ఆయిల్ కంపెనీ శుక్రవారం వెల్లడించాయి. జెట్ ఫ్యూయల్ ధర ఢిల్లీలో కిలో లీటర్ కు రూ.2,557.7 పెరిగి, రూ.49,287.18గా నమోదైందని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. వరుసగా ఐదో నెల ఈ ధరలు పెరిగినట్టు వెల్లడించాయి. ఈ ఐదు సార్ల పెరుగుదలతో ఏటీఎఫ్ రేట్లు 25 శాతం లేదా రూ.9,985.87 ఎగబాకాయని తెలిపాయి. కానీ విమానాల్లో వాడే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ కంటే తక్కువగానే లభ్యమవుతుందని పేర్కొన్నాయి.
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.64.76గా, లీటర్ ఢీజిల్ ధర రూ.54.70గా ఉన్నట్టు... అయితే ఈ ధరలు లీటర్ ఏటీఎఫ్ ధర(రూ.49.28) తక్కువేనని వెల్లడించాయి. ఆటో ఇంధనాలపై కేంద్రప్రభుత్వం పెంచుతూ వస్తున్న ఎక్సేంజ్ డ్యూటీల ప్రభావంతో ఈ ధరలు ఎగబాకినట్టు తెలిపాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పడిపోయినా... భారత్ లో ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటీఎఫ్ ధరల్లో పెరుగుదల, ప్యాసెంజర్ టిక్కెట్ ధరలపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో అనేదానిపై మాత్రం విమాన కంపెనీలు వెంటనే స్పందించలేదు. మూడు ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతి నెలా మొదటిరోజు జెట్ ఇంధనం, రాయితీ లేని ఎల్ పీజీ ధరలపై సమీక్ష నిర్వహిస్తాయి. ఈ సమీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.