Indian Oil Corporation
-
ఇండియన్ ఆయిల్ చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 54 సంవత్సరాల సాహ్నీ ప్రస్తుతం ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్– పెట్రోకెమికల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.ఆగస్టులోనే ఈ బాధ్యతలకు ఎంపికైన ఆయన, అటు తర్వాత కొద్ది నెలల్లోనే సంస్థ చైర్మన్‌గా నియమితులు కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా పదవీ విరమణ పొందే వరకూ లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ (ఏది ముందైతే అది) సాహ్నీ ఐఓసీ చైర్మన్‌గా ఉంటారు. శ్రీకాంత్ మాధవ్ వైద్య తన పొడిగించిన పదవీకాలాన్ని ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తి చేసుకున్న నాటి నుంచి ఈ ఫారŠూచ్యన్ 500 కంపెనీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2014 జూలైలో బీ అశోక్ తర్వాత బోర్డు అనుభవం లేకుండానే కంపెనీ ఉన్నత ఉద్యోగానికి పదోన్నది పొందిన రెండవ వ్యక్తి సాహ్ని. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్‌గా 'సతీష్ కుమార్'
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇండియన్ ఆయిల్) చైర్మన్‌గా 'సతీష్ కుమార్ వడుగిరి' ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థకు అధిపతిగా నేడు బాధ్యతలు చేపట్టారు. శనివారం పదవికి రాజీనామా చేసిన ఎస్ఎం వైద్య స్థానంలో సతీష్ కుమార్‌ను నియామకమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.2021 అక్టోబరు నుంచి డైరెక్టర్ (మార్కెటింగ్)గా పనిచేస్తున్న సతీష్ కుమార్.. తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తూనే ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈయన 2022 అక్టోబర్ నుంచి ఒక సంవత్సరం పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేశారు.35 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభివృద్ధికి సతీష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయనకు ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ అయిన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, బహుళజాతి చమురు కంపెనీలతో పనిచేసిన విస్తృత అనుభవం ఉంది.సతీష్ కుమార్ నాయకత్వంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గత మూడు సంవత్సరాలలో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. సంస్థ తన రిటైల్ అవుట్లెట్లను ఆధునీకరించింది, కొత్త బాట్లింగ్ ప్లాంట్లు, టెర్మినల్‌లను ప్రారంభించింది. హైవే రిటైల్ ప్రదేశాలలో సౌకర్యాలను ప్రవేశపెట్టింది.మార్కెటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సతీష్ కుమార్.. మధ్యప్రదేశ్ & ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మార్కెటింగ్ నెట్‌వర్క్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్‌గా పనిచేశారు. తన కెరీర్లో LPG వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY), బీఎస్-6 ఫ్యూయల్ ఇంప్లిమెంటేషన్ మొదలైన కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. -
ఎల్ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు
కేంద్రానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డివిడెండ్లను అందించాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండీ సిద్ధార్థ మొహంతి రూ.3,662.17 కోట్ల డివిడెండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఎల్ఐసీ రూ.2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను అందించింది. తాజాగా అందజేసిన డివిడెండ్‌తో కలిసి 2023–24లో సంస్థ మొత్తం రూ.6,103.62 కోట్ల డివిడెండ్‌ను అందించినట్లైంది. ఇక ఐవోసీ రూ.5,091 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి సమరి్పంచింది. 2024–25లో ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.10,604.74 కోట్ల డివిడెండ్ అందింది. 2023–24లో డివిడెండ్లు రూ.50,000 కోట్లుకాగా, 2024–25లో ఈ విలువ అంచనాలు రూ.56,260 కోట్లు. -
ఐవోసీ లాభం సగానికి డౌన్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నికర లాభం సగానికి పైగా క్షీణించింది. రూ. 4,838 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.21 లక్షల కోట్లకు తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 7 తుది డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం. పూర్తి సంవత్సరానికి రికార్డు లాభాలు.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ చరిత్రలోనే అత్యధిక లాభాలను ఐవోసీ ప్రకటించింది. రూ. 39,619 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇక ఆదాయం రూ. 9.41 లక్షల కోట్ల నుంచి రూ. 8.71 లక్షల కోట్లకు తగ్గింది. ముడి చమురు శుద్ధికి సంబంధించి ప్రతి బ్యారెల్‌పై వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్ల నుంచి 12.05 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశీయంగా ఇంధనాల ధరలను తగ్గించకుండా దాదాపు రెండేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగించడమనేది ఐవోసీ వంటి కంపెనీలకు లాభించింది. -
లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: లక్ష ద్వీప్‌లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది. లక్షద్వీప్ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్ దీవుల్లో డీజిల్ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది. -
మెడ్‌టెక్ జోన్లో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్
సాక్షి, విశాఖపట్నం: సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్‌లైన్ (ఎస్ఈఆర్పీఎల్) పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొట్టమొదటి లిక్విఫైడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌సీఎన్‌జీ) స్టేషన్‌ను విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్లో ఏర్పాటు చేసింది. ఈ గ్యాస్ స్టేషన్‌ను ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) బృందం శుక్రవారం ప్రారంభించింది. ఏపీ మెడ్‌టెక్ జోన్‌లోని ఎల్‌సీఎన్‌జీ హబ్ ద్వారా ఏపీ రీజియన్‌కు సంబంధించిన సీఎన్జీ అవసరాలను తక్షణమే తీర్చడంతోపాటు నేచురల్ గ్యాస్ లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!
ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్ ఫ్యూయల్) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ రెఫరెన్స్ ఫ్యూయల్? రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి. చాలా డబ్బు ఆదా రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టర్న్అరౌండ్.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్‌పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్‌చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది. -
భారత్‌తో రాస్‌నెఫ్ట్ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మాజీ డైరెక్టర్ జీకే సతీష్ (62)ను బోర్డులో నియమించింది. రాస్‌నెఫ్ట్ బోర్డులో ఒక భారతీయుని నియా మకం ఇదే తొలిసారి. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని సంస్థ భావిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఓసీలో బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా 2021లో జీకే సతీష్ పదవీ విరమణ చేశారు. 11 మంది డైరెక్టర్ల బోర్డులో నియమితులైన ముగ్గురు కొత్తవారిలో జీకే సతీష్ ఒకరని రష్యన్ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. రష్యాలోని చమురు, గ్యాస్ క్షేత్రాలకు సంబంధించి రాస్‌నెఫ్ట్‌కు సతీష్ గతంలో పనిచేసిన ఐఓసీతో భాగస్వామ్యం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇతర సంస్థలకు రాస్‌నెఫ్ట్ క్రూడ్ ఆయిల్‌నూ విక్రయించింది. ఇటీవలి కాలంలో సంస్థ గుజరాత్ రిఫైనరీలకు నాఫ్తా విక్రయాలనూ ప్రారంభించింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అమ్మకంసహా భారత్ సంస్థలతో భాగస్వామ్యం విస్తృతం చేసుకోడానికి రాస్‌నెఫ్ట్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. -
ఐవోసీ రైట్స్‌కు బోర్డు ఓకే
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రైట్స్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇటీవల రైట్స్ ఇష్యూకి వెళ్లేందుకు మరో చమురు పీఎస్‌యూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) బోర్డు సైతం అనుమతినివ్వగా.. నంబర్ వన్ కంపెనీ ఐవోసీ తాజాగా జత కలిసింది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా భారీగా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్ర్‌స్కయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల (జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపా దించిన సంగతి తెలిసిందే. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్.. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. కాగా.. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. జేవీ బాటలో దేశీయంగా బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ పేర్కొంది. ఇందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు వెల్లడించింది. సన్ మొబిలిటీ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌తో సమాన భాగస్వామ్యాన(50:50 శాతం వాటా) ప్రయివేట్ రంగ జేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంవరకూ రూ. 1,800 కోట్ల ఈక్విటీ పెట్టుబడులతో జేవీని ఏరా>్పటు చేయనున్నట్లు తెలియజేసింది. సొంత అనుబంధ సంస్థ ఐవోసీఎల్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌లో ఫ్రిఫరెన్స్ షేర్లు, వారంట్ల ద్వారా 78.31 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సైతం బోర్డు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 99.40 వద్ద ముగిసింది. 13న ఎన్ఎస్ఈలో త్రిధ్య లిస్టింగ్ ఐపీవోతో రూ. 26 కోట్లు సమీకరణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ త్రిధ్య టెక్ ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 13న లిస్ట్‌కానుంది. కంపెనీ షేరుకి రూ. 35–42 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 26.41 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా 62.88 లక్షల షేర్లను విక్రయించింది. జూన్ 30– జూలై 5 మధ్య చేపట్టిన ఇష్యూకి 72 రెట్లు అధిక స్పందన లభించింది. ప్రధానంగా సంస్థాగతేతర, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు కంపెనీ వెల్లడించింది. నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 183 రెట్లు, రిటైలర్ల నుంచి 68 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు కంపెనీ వెల్లడించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 16 రెట్లు అధిక స్పందన నమోదైంది. కాకా ఇండస్ట్రీస్ ఐపీవో 10న షేరుకి రూ. 55–58 ధరల శ్రేణి న్యూఢిల్లీ: పాలిమర్ ఆధారిత ప్రొఫైల్స్ తయారీ కంపెనీ కాకా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 10న(సోమవారం) ప్రారంభంకానుంది. 12న (బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రే ణి రూ. 55–58కాగా.. చిన్న, మధ్యతరహా సంస్థ ల కోసం ఏర్పాటైన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫా మ్ ద్వారా లిస్ట్‌కానుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 36.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ.21.23 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్ గ్యాస్ (ఏవీ గ్యాస్) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్మెంట్ను (ఒక్కో బ్యారెల్ 16 కిలోలీటర్లు) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్ .. ఇలా ఏవీ గ్యాస్‌ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది. మానవరహిత ఏరియల్ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్ స్కూల్స్ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్ స్కూల్స్‌లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్‌లోని వడోదరలో గత సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
నష్టాల్లోనే ఐవోసీ క్యూ2లో రూ. 272 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లోనూ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 272 కోట్లకుపైగా నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,360 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉత్పత్తి వ్యయాలకంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్–జూన్(క్యూ1)లోనూ కంపెనీ దాదాపు రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి వరుసగా రెండో క్వార్టర్లలో నష్టాలు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకుంది. కాగా.. ప్రస్తుత క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.69 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు ఎగసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 12న వన్‌టైమ్ గ్రాంట్‌కింద మూడు పీఎస్‌యూ ఇంధన దిగ్గజాలకు ఉమ్మడిగా రూ. 22,000 కోట్లు కేటాయించింది. వీటిలో ఐవోసీకి రూ. 10,081 కోట్లు లభించాయి. ఈ సబ్సిడీని తాజా త్రైమాసికంలో పరిగణించినప్పటికీ నష్టాలు ప్రకటించడం గమనార్హం! మార్జిన్లు అప్ క్యూ2లో బ్యారల్‌కు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 6.57 డాలర్ల నుంచి 25.49 డాలర్లకు ఎగశాయి. ఇన్వెంటరీ ప్రభావాన్ని మినహాయిస్తే 22.19 డాలర్లుగా నమోదయ్యాయి.పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాలు 18.93 మిలియన్ టన్నుల నుంచి 21.56 ఎంటీకి పుంజుకున్నాయి. అయితే ఎగుమతులు 1.24 ఎంటీ నుంచి 0.86 ఎంటీకి తగ్గాయి. ఈ కాలంలో 16.09 ఎంటీ ముడిచమురును శుద్ధి చేసింది. గత క్యూ2లో ఇవి 15.27 ఎంటీ మాత్రమే. -
కేంద్రం కీలక నిర్ణయం, దేశీ విమానయాన సంస్థలకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది. వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్‌తోపాటు ఏటీఎఫ్‌పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్‌పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి. -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్‌కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్‌పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్‌ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్‌కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా..?
న్యూఢిల్లీ: రష్యా ఆఫర్‌కు భారత్ వేగంగా స్పందించడమే కాదు, చౌక చమురుకు ఆర్డర్ కూడా చేసేసింది. అంతర్జాతీయ ధర కంటే చాలా చౌకగా 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఆర్డర్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒక ట్రేడర్ ద్వారా ఈ డీల్ జరిగినట్టు చెప్పాయి. మే నెలకు సంబంధించి ఉరల్స్ క్రూడ్‌ను.. బ్రెంట్ క్రూడ్ ధర కంటే 20–25 డాలర్లు తక్కువకు ఐవోసీ కొనుగోలు చేసింది. ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో మిత్రదేశమైన భారత్‌కు మార్కెట్ ధర కంటే తక్కువకు ముడి చమురు సరఫరా చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం రష్యా స్వయంగా ఆఫర్ చేయడం గమనార్హం. దీంతో ఐవోసీ మొదటి ఆర్డర్ ఇచ్చింది. దీని కింద విక్రయదారు భారత తీరం వరకు రవాణా చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. దీంతో రవాణా పరంగా సమస్యలు ఏర్పడినా ఆ బాధ్యత ఐవోసీపై పడకుండా చూసుకుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరంభించగా..పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినా, ఆయిల్, ఇతర ఇంధనాలను మినహాయించారు. కనుక ఇంధన కొనుగోలు డీల్స్ ఆంక్షల పరిధిలోకి రావు. -
పట్టణాల్లో గ్యాస్ పంపిణీ, కేంద్ర ప్రభుత్వ సంస్థతో పోటీ పడుతున్న అదానీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), దేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ టోటల్ గ్యాస్.. పట్టణ గ్యాస్ పంపిణీ లైసెన్స్‌ల్లో అత్యధిక ప్రాంతాలకు బిడ్లు దాఖలు చేశాయి. 11వ విడత గ్యాస్ లైసెన్సింగ్‌లో భాగంగా 61 భౌగోళిక ప్రాంతాలకు (జీఏ) లైసెన్స్‌ల కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల వివరాలను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) గురువారం విడుదల చేసింది. అదానీ టోటల్ గ్యాస్‌లో అదానీ, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌కు సమాన వాటా ఉంది. 61జీఏలకు గాను ఐవోసీ 53 ప్రాంతాలకు బిడ్లు దాఖలు చేసింది. అదానీ టోటల్ గ్యాస్ 52 జీఏలకు బిడ్ వేసింది. పట్టణ గ్యాస్ పంపిణీలో ఐవోసీతో కలసి అదానీ టోటల్ గ్యాస్‌కు జాయింట్ వెంచర్ కూడా ఉంది. కానీ, ఈ విడతలో అదానీ–ఐవోసీ సంయుక్తంగా బిడ్లు వేయలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జీఏలకు ఒక్క బిడ్ కూడా రాలేదు. ఐస్క్వేర్డ్ క్యాపిటల్‌కు చెందిన థింక్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ 44జీఏలకు బిడ్లు వేసింది. భారత్ పెట్రోలియం 43 జీఏలకు, గెయిల్‌కు చెందిన గెయిల్గ్యాస్ 30 ప్రాంతాలకు, హెచ్‌పీసీఎల్ 37జీఏలకు బిడ్లు సమర్పించింది. ఐవోసీ రూ. 9,028 కోట్ల పెట్టుబడులు ఐవోసీ తాజాగా గుజరాత్‌లోని ముంద్రా నుంచి హర్యానాలోని పానిపట్ వరకూ క్రూడాయిల్ పైప్‌లైన్ నిర్మించనుంది. ఇందుకోసం రూ.9,028 కోట్లు వెచ్చిం చనుంది. దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌ను గుజరాత్ తీరం నుంచి హర్యానాలో ఉన్న తమ రిఫైనరీకి తరలించడానికి ఈ పైప్‌లైన్ ఉపయోగపడుతుందని ఐవోసీ తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద ముంద్రాలో ఒక్కోటి 60,000 కిలోలీటర్ల సామర్థ్యం ఉండే 9 క్రూడాయిల్ ట్యాంకులను కూడా ఐవోసీ నిర్మించనున్నట్లు ఐవోసీ వివరించింది. నిర్వహణ అవసరాలతో పాటు దేశీయంగా ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ -
‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లపై ఆయిల్ కంపెనీల దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మూడు కలసి రానున్న 3–5 ఏళ్లలో 22,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి.. 2070 నాటికి నెట్ జీరో (కాలుష్యం విడుదల పరంగా తటస్థ స్థితికి)కు చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ప్రణాళికలతో ఉన్నాయి. ఇందులో ఒక్క ఐవోసీనే 10,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ సదుపాయాలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 7,000 స్టేషన్లలో ఈవీ చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీపీసీఎల్ ప్రకటించింది. హెచ్‌పీసీఎల్ 5,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది కాలంలోనే ఐవోసీ 2,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ చెరో 1,000 స్టేషన్లను ప్రారంభిస్తాయని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి మంగళవారం ప్రకటించారు. ఇటీవలే జరిగిన కాప్26 సదస్సులో భాగంగా నెట్‌జీరో లక్ష్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం తెలిసిందే. -
ఇండియన్ ఆయిల్ మెగా ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ స్థాయిలో మలీక్ అన్హైడ్రైడ్ ప్లాంట్‌ను రూ.3,681 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. పాలిస్టర్ రెసిన్స్, సర్ఫేస్ కోటింగ్స్ ప్లాస్టిసైజర్స్, అగ్రోకెమికల్స్, లూబ్రికెంట్ అడిటివ్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై హర్యానాలోని పానిపట్ వద్ద ఉన్న సంస్థకు చెందిన రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్ వద్ద ఈ కేంద్రాన్ని స్థాపించనుంది. 54 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా 1,20,000 టన్నుల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది. -
ఇండేన్ గ్యాస్ ఫైబర్ సిలిండర్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ బరువుతో తేలికగా, దృఢంగా ఉండే ఫైబర్ గ్యాస్ సిలిండర్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్‌తో తయారయ్యే ఈ సిలిండర్లు 10, 5 కిలోల గ్యాస్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. సాధారణ సిలిండర్లు ఇనుముతో తయారై, చాలా బరువుగా ఉంటాయి. వాటిలో 14.5 కిలోల గ్యాస్ ఉంటుంది. బరువు ఎక్కువకావడంతో వాటిని తరలించడం ఇబ్బందికరం. పైగా చిలుము పట్టడం, వంట గదిలో నేలపై మరకలు పడటం వంటి సమస్యలు ఉంటాయి. అదే ఫైబర్ సిలిండర్లు తేలికగా ఉంటాయి. మోసుకెళ్లడం సులభం. చిలుము, మరకలు వంటివి ఉండవు. మహిళలు కూడా సులువుగా మార్చుకోవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫైబర్ సిలిండర్‌ను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ అక్షిత చెన్నంకుట్టి శనివారం హైదరాబాద్‌లో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందచేశారు. -
టెక్నాలజీ సాయంతో చమురు చోరీ, నిఘాకు ఐవోసీ డ్రోన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న చమురు పైప్లైన్ల భద్రతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డ్రోన్లను రంగంలోకి దింపింది. ఢిల్లీ– పానిపట్ మార్గంలో 120 కిలోమీటర్ల పైప్‌లైన్‌పై నిఘా కోసం డ్రోన్ సేవలను ప్రారంభించింది. చమురు దొంగతనాలను నిరోధించడమే కాకుండా, ప్రమాదాలను అరికట్టడం కోసం టెక్నాలజీ వినియోగం అవసరమని సంస్థ భావిస్తోంది. 15,000 కిలోమీటర్ల పరిధిలో సంస్థకు పైపులైన్లు విస్తరించి ఉండగా.. వీటిల్లో లీకేజీలను గుర్తించేందుకు ఇప్పటికే ఎంతో అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది. ఇప్పుడు పైపులైన్ల పర్యవేక్షణకు డ్రోన్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఐవోసీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ సాయంతో చమురు చోరీకి సంబంధించి 2020–21లో 34 ప్రయత్నాలను అడ్డుకున్నట్టు, 53 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆప్టికల్ఫైబర్ ఆధారిత పైపులైన్ ఇంట్రూజర్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ (పీఐడీడబ్ల్యూఎస్)ను ఐవోసీ 5,474 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తోంది. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
ఇంటి వద్దకు డీజిల్ బల్క్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తాజాగా ముంబై, పరిసర ప్రాంతాల్లో ఇంటి వద్దకే బల్క్‌గా డీజిల్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇందుకోసం యాప్ ఆధారిత డీజిల్ డోర్ డెలివరీ సేవల సంస్థ హమ్‌సఫర్ ఇండియా, ఒకారా ఫ్యూయెలాజిక్స్తో చేతులు కలిపింది. త్వరలో మహారాష్ట్రలోని పుణె, నాగ్‌పూర్, నాసిక్ తదితర నగరాలకు ఈ సర్వీసులు విస్తరించనున్నట్లు ఐవోసీ చీఫ్ జనరల్ మేనేజర్ (మహారాష్ట్ర ఆఫీస్) రాజేశ్ సింగ్ తెలిపారు. డీజిల్ పంపిణీలో ఇదొక వినూత్న విధానమని ఆయన వివరించారు. వ్యవసాయ రంగం, ఆస్పత్రులు, హౌసింగ్ సొసైటీలు, భారీ యంత్రాల కేంద్రాలు, మొబైల్ టవర్లు మొదలైన వాటికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటిదాకా భారీ మొత్తంలో డీజిల్ కొనుక్కునే (బల్క్) వినియోగదారులు బ్యారెళ్లలో రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేదని సింగ్ తెలిపారు. దీని వల్ల గమ్యస్థానానికి చేరేలోగా డీజిల్‌లో కొంత భాగం కారిపోవడం తదితర సమస్యల వల్ల నష్టపోవాల్సి వచ్చేదని ఆయన వివరించారు. డీజిల్ డోర్ డెలివరీతో ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని, బల్క్ కస్టమర్లకు చట్టబద్ధంగా డీజిల్ సరఫరా సాధ్యపడుతుందని సింగ్ పేర్కొన్నారు. -
Indian Oil Corporation: టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 8,781 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అధిక రిఫైనింగ్ మార్జిన్లు దోహదం చేశాయి. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 5,185 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1.39 లక్షల కోట్ల నుంచి రూ. 1.63 లక్షల కోట్లకు ఎగసింది. క్యూ4లో 21.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించింది. గతంలో 20.69 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 1.5 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. జీఆర్ఎం ప్లస్: క్యూ4లో ఐవోసీ ఒక్కో బ్యారల్‌పై 10.6 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) సాధించింది. అంతక్రితం ఏడాది బ్యారల్‌కు 9.64 డాలర్ల నష్టం నమోదైంది. ఇందుకు ప్రధానంగా చమురు నిల్వల ధరలు ప్రభావం చూపింది. నిల్వల లాభాలను పక్కనపెడితే నికరంగా 2.51 డాలర్ల జీఆర్ఎం సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 21,386 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 5,14,890 కోట్లను తాకింది. 2019–20లో రూ. 5,66,354 కోట్ల అమ్మకాలు సాధించింది. రుణ భారం రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ. 1.02 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 28,847 కోట్ల పెట్టుబడి వ్యయాలకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం ఎగసి రూ. 107 వద్ద ముగిసింది. క్యూ4లో అధిక నిల్వలకుతోడు, మెరుగైన రిఫైనింగ్ మార్జిన్లు సాధించడంతో భారీ లాభాలు ఆర్జించాం. గతేడాది క్యూ4లో నిల్వల కారణంగానే నష్టాలు నమోదయ్యాయి. ముడిచమురును ఇంధనంగా మార్చేకాలంలో ధరలు పెరిగితే మార్జి న్లు బలపడతాయి. ఇదేవిధంగా ధరలు క్షీణిస్తే నష్టాలకు ఆస్కారం ఉంటుంది. ఈ క్యూ4లో బ్రెంట్ చమురు ధరలు 23% బలపడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో 50–67 శాతానికి మందగించిన రిఫైనరీల ఉత్పత్తి జూన్ నుంచి 90 శాతానికి ఎగసింది. –ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చదవండి: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ -
ఐవోసీ పైప్‌లైన్ ఆస్తుల విక్రయం!
న్యూఢిల్లీ: ముడిచమురు, పెట్రోలియం ప్రొడక్టుల పైప్లైన్లలో ఒకటి లేదా రెండింటిలో మైనారిటీ వాటాను విక్రయించే వీలున్నట్లు పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఫైనాన్స్ డైరెక్టర్ సందీప్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అయితే నియంత్రిత వాటాను విక్రయించబోమని స్పష్టం చేశారు. ఆస్తుల విక్రయానికి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ను ఒక మార్గంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. పైప్‌లైన్ మానిటైజేషన్ చేపట్టినప్పటికీ నిర్వాహక కంపెనీగా కొనసాగనున్నట్లు వివరించారు. ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు ఐవోసీ, గెయిల్ ఇండియా, హెచ్‌పీసీఎల్‌కు చెందిన పైప్‌లైన్ ప్రాజెక్టులలో వాటాల విక్రయానికి తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం విదితమే. తమకుగల భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు గుప్తా చెప్పారు. వెరసి కంపెనీ ఆస్తులకు తగిన విలువ లభించగలదని అభిప్రాయపడ్డారు. ఐవోసీ 14,600 కిలోమీటర్లకుపైగా పైప్లైన్లను కలిగి ఉంది. తద్వారా ముడిచమురును రిఫైనరీలు, ఇంధనంగా వినియోగించే కంపెనీలకు రవాణా చేస్తుంటుంది. కంపెనీ నిర్వహణలో ఇవి కీలకంకావడంతో మైనారిటీ వాటాలు మాత్రమే విక్రయించనున్నట్లు గుప్తా తెలియజేశారు. -
ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్జీ: ప్రధాన్
న్యూఢిల్లీ: డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.