చాందీ ప్రసాద్‌కు 2013 గాంధీ శాంతిబహుమతి
వార్తల్లో వ్యక్తులు
సిరియా అధ్యక్షుడు అసాద్
సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసాద్ జూలై 16న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మరో ఏడేళ్లపాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. జూన్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 88.7శాతం ఓట్లతో అసాద్ విజయం సాధించారు.
ఐఓసీ చైర్మన్‌గా బి.అశోక్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్‌గా బి. అశోక్ జూలై 16న బాధ్యతలు చేపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కమిటీ ఉత్తర్వులు జారీచేసింది.
చాందీ ప్రసాద్‌కు
2013 గాంధీ శాంతిబహుమతి
2013 సంవత్సరానికిగాను గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ప్రముఖ గాంధేయవాది, పర్యావరణవేత్త చాందీ ప్రసాద్‌కు జూలై 15న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. చాందీ ప్రసాద్ చిప్కో ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. కొండ ప్రాంతాల ప్రజలకు కొయ్య, గడ్డి సేకరణ, అడవులు అంతరించడం వల్ల తలెత్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే చట్టబద్ధమైన హక్కుల కోసం 1973లో చిప్కో ఉద్యమం చేపట్టారు. ఇందుకు ఆయనకు 1982లో రామన్ మెగసెసె అవార్డు లభించింది. 2005లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతిని 1995లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డును గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మార్పు కోసం కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు బహుకరిస్తారు. ఈ పురస్కారం కింద ప్రశంసాపత్రంతోపాటు కోటి రూపాయల నగదు అందజేస్తారు.
రె హ్మాన్‌కు
బర్క్‌లీ గౌరవ డాక్టరేట్
సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్‌కు అమెరికాకు చెందిన బర్క్‌లీ సంగీత కళాశాల గౌరవ డాక్టరేట్‌తో సత్కరిం చింది. ఈ గౌరవాన్ని రెహ్మాన్ అక్టోబర్ 24న అందుకోనున్నారు.
ఫిక్కీ సెక్రటరీ జనరల్‌కు బ్రిటన్ గౌరవ డాక్టరేట్
ఫిక్కీ సెక్రటరీ జనరల్ అల్విన్ దిదార్ సింగ్ బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి జూలై 16న గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. భారత్‌లో ఈ-కామర్స్‌కు సంబంధించి ఇది తొలి డాక్టరేట్.
2014 ప్రేమ్ భాటియా అవార్డు
ప్రముఖ జర్నలిస్టు ప్రేమ్ భాటియా పేరుతో నెలకొల్పిన అవార్డుకు స్మితా గుప్తా (హిందూ), నితిన్ సేథ్ (బిజినెస్ స్టాండర్డ్) ఎంపికయ్యారు. రాజకీయ అంశాల రిపోర్టింగ్ విభాగం నుంచి స్మితాగుప్తా, పర్యావరణం అంశాల రిపోర్టింగ్‌లో నితిన్‌సేథ్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
జాతీయం
జూన్‌లో 5.4 శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణం
వార్షిక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 5.4 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 6.01గా ఉండేదని జూలై 14న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. వినియోగధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 8.23 శాతం నుంచి 7.31 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం గత 30 నెలలో కనిష్ట స్థాయికి చేరింది. కూరగాయలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదలే దీనికి కారణం.
జాతీయ ఆకృతి సంస్థ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
జాతీయ ఆకృతి సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 17న ఆమోదముద్ర వేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంట్ చేసిన తొలి చట్టం ఇదే . ఈ చట్టంతో జాతీయ ప్రాధాన్యమున్న సంస్థగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే జాతీయ ఆకృతి సంస్థకు గాంధీనగర్‌లో శాఖ, బెంగళూర్‌లో శాటిలైట్ కేంద్రం ఉంది. దీంతోపాటు పోలవరం బిల్లుకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలకు చెందిన 200కుపై గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
న్యూఢిల్లీ వేదికగా ఐబీఎస్‌ఏ సదస్సు
2015లో నిర్వహించే ఏడో ఐబీఎస్‌ఏ (ఇండియా,బ్రెజిల్, దక్షిణాఫ్రికా) సదస్సుకు న్యూఢిల్లీ వేదిక కానుంది. వివిధ ఖండాలకు చెందిన ఈ మూడు దేశాల కూటమి ఏర్పాటుపై 2003 జూన్‌లో బ్రెజిల్ రాజధాని బ్రెసీలియాలో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు. అభివృద్ధి చెందుతున్న ఈ మూడు దేశాలు పరస్పర సహకారం, రాజకీయ, ఆర్థికాంశాలలో చేయూత, ఐబీఎస్‌ఏ ఫండ్ ద్వారా ప్రాజెక్టులు చేపట్టి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు తోడ్పాటు వంటి కీలకాంశాలపై సహరించుకుంటాయి.
ఖనిజాన్వేషణకు సాంకేతిక పరిజ్ఞానం
భూగర్భంలోని ఖనిజాల అన్వేషణకు జాతీయ భూభౌతిక పరిశోధనా కేంద్రం (ఎన్‌జీఆర్‌ఐ) ఆధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భూమిలోపల ఉన్న సహజ వనరులను గుర్తించాలంటే ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ విధానం డ్రిల్లింగే. ఈ విధానం వ్యయప్రయాసలతో కూడింది. దీనికి పరిష్కారంగా 3-డీ హై రిజల్యూషన్ సిస్మిక్ సర్వే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఖర్చు తగ్గటంతోపాటు వనరులను సమర్థంగా గుర్తించవచ్చు. ఈ తరహా పరిజ్ఞానం ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌లలో మాత్రమే ఉంది. ఈ పరిజ్ఞానానికి అవసరమైన పరికరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా వినియోగించే ఈ విధానంతో పదిరెట్లకు పైగా ఖర్చు తగ్గటంతోపాటు అనేక ప్రయోజనాలున్నాయి.
అంతర్జాతీయం
ప్రపంచంలోని 1/3 వ వంతు పేదలు భారత్‌లోనే
ప్రపంచంలో 1.2 బిలియన్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడోవంతు భారత్‌లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల-2014 నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా జూలై 16న న్యూఢిల్లీలో విడుదల చేశారు. రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఆదాయంతో నివసిస్తున్న వారిని అత్యంత పేదవారిగా నివేదిక పేర్కొంది. భారత్‌లో 1994లో 49.4 శాతంగా ఉన్న పేదరికం 2010 నాటికి 32.7 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. భారత్‌లో 1.4 మిలియన్ల మంది పిల్లలు ఐదేళ్ల వయసు దాటకుండానే మరణిస్తున్నారని నివేదిక తెలిపింది.
బ్రిక్స్ ఆరో సదస్సు
భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి (బిక్స్)్ర ఆరో సదస్సు బ్రెజిల్‌లోని ఫోర్టలెజాలో జూలై 15-16 తేదీల్లో జరిగింది. సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. సదస్సు అనంతరం 72 అంశాలతో ఫోర్టలెజా నివేదికను వెల్లడించారు. ఇందులో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ పేరుతో బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటును ప్రకటించారు. 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసే ఈ బ్యాంక్ షాంఘై (చైనా) ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది. ఈ బ్యాంక్‌కు తొలుత భారత్ అధ్యక్షత వహిస్తుంది. కరెన్సీ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ) ఒప్పందంపై కూడా సభ్యదేశాలు అవగాహనకు వచ్చాయి. 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయనున్న ఈ నిధి సభ్యదేశాల స్వల్పకాల లిక్విడిటీ ఒత్తిడులను తట్టుకోవడానికి తోడ్పడుతుంది. సదస్సులో భారత్ ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. 2015లో జరిగే ఏడో సదస్సుకు రష్యాలోని ఊఫా నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్, బ్రెజిల్ ఒప్పందాలు
పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారం, దౌత్య వ్యవహారాల్లో సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మూడు ఒప్పందాలపై జూలై 16న భారత్, బ్రెజిల్‌లు సంతకాలు చేశాయి. బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఆ మేరకు అవగాహనకు వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, రక్షణ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి.
గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 500మంది మృతి
హమాస్ ఆధీనంలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో 500 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఘర్షణ తలెత్తడంతో జూలై 8 నుంచి ఇజ్రాయెల్ ఈ
దాడులు చేస్తోంది.
బాల కార్మిక వ్యవస్థపై బొలీవియా సంచలన నిర్ణయం
బొలీవియా ప్రభుత్వం పదేళ్లు దాటిన పిల్లలను పనిలో పెట్టుకోవచ్చంటూ చట్టం తీసుకువచ్చింది. దీంతో బాలకార్మిక వ్యవస్థను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా బొలీవియా నిలిచింది. జూన్‌లో చట్టసభ కాంగ్రెస్‌లో జరిగిన సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. ఇది జూలై 17 నుంచి అమల్లోకి వచ్చింది. పనిచేసే వయసును 14 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గించడం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందని, దేశంలోని పేద కుటుంబాలకు పిల్లలను పనిలో పెట్టడం తప్ప మరో అవకాశం లేనందున ఆమోదించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం పదేళ్లు దాటిన పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పని చేస్తూ పాఠశాలకు వెళ్లవచ్చు. కాంట్రాక్టు కింద పనిచేయించే వారి వయసు కనీసం 12 సంవత్సరాలు నిండాలి. అయితే పిల్లలను పనిలో చేర్పించే క్రమంలో తగు రక్షణ చర్యలు పాటించాలని, లేని పక్షంలో 30ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తారని హెచ్చరించింది.
నకిలీ కరెన్సీలో రూపాయికి మూడో స్థానం
స్విట్జర్లాండ్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్న నకిలీ విదేశీ కరెన్సీ నోట్లలో యూరో, అమెరికన్ డాలర్ తర్వాత భారత రూపాయి మూడో స్థానంలో ఉంది. స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ (ఫెడ్ పోల్) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 2013లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో యూరో నోట్లు 2,394, అమెరికా డాలర్ నోట్లు 1,101 ఉన్నాయి. భారత రూపాయి నోట్లు 403. కాగా వీటిలో రూ.500 విలువైనవి 380, రూ. 1000 నోట్లు 23 ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2012లో నకిలీ కరెన్సీ జాబితాలో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.
మలేిషియా విమానం కూల్చివేత
మలేిషియా విమానం బోయింగ్-777ను ఉక్రెయిన్- రష్యా సరిహద్దులో ఉగ్రవాదులు జూలై 17న కూల్చివేయడంతో 295 మంది మరణించారు. ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రష్యా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని గ్రాబోవో ప్రాంతంలో 33వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని ఉగ్రవాదులు క్షిపణి ప్రయోగించి కూల్చివేశారని ఉక్రెయిన్ హోంశాఖ తెలిపింది.
క్రీడలు
లార్డ్స్ టెస్టులో భారత్ విజయం
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో లార్డ్స్ వేదికగా సాగిన రెండో టెస్టులో ధోనీసేన చారిత్రక విజయాన్ని సాధించింది. లార్డ్స్‌లో టీమిండియా ఆడిన 16 టెస్టుల్లో ఇది రెండో విజయం. 28 ఏళ్ల క్రితం 1986లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలి విజయం నమోదయింది. ఏడు వికెట్లు తీసిన ఇషాంత్‌శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియామీర్జా
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసింది. తెలంగాణ వికాసానికి విశిష్ట వ్యక్తులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెన్నిస్‌లో మరింతగా ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ నిమిత్తం కోటిరూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది.
జర్మన్ గ్రాండ్‌ప్రి విజేత రోస్‌బర్‌గ
జర్మన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజయం సాధించాడు. జూలై 20న జరిగిన పోటీలో బొటాస్(విలియమ్స్ జట్టు) రెండో స్థానంలో నిలిచాడు.