న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది.
ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది.
ఆదాయం డౌన్
ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్‌ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్‌ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి.
ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment