Profits
-
రూపాయి బలహీనపడినా.. ఎగుమతిదారులకు లాభాలు అంతంతే..!
న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక సిద్దాంతం. అయితే భారత్ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం. దీనికితోడు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది. అన్ని రకాలుగా ఇబ్బందే... రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్ వంటి ఖర్చులు కూడా డాలర్–డినామినేట్ అవుతాయి. ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్ మారకంలో చైనీస్ యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే. చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్పుట్ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు. – సంజయ్ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్) నేషనల్ కమిటీ చైర్మన్అనిశ్చితిని భరించలేం.. రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. – ఎస్ సి రాల్హాన్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా) -
బ్యాంకుల లాభాలకు గండి!
మొండిబకాయిల ప్రభావం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బ్యాంకింగ్ (Banks)లాభదాయకతపై ప్రభావం చూపుతుందని దేశీయ రేటింగ్ సంస్థ– ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ లాభదాయకత 2024–25లో ‘‘పీక్’’ స్థాయిలో ఉండగా, 2025–26లో ఇది దిగివచ్చే అవకాశాలు అధికమని వివరించింది. రిటైల్ రంగం నుంచి ప్రధానంగా మొండి బకాయిల సవాళ్లు తలెత్తే వీలుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ అండ్ డైరెక్టర్ కరణ్ గుప్తా నివేదికలో వెల్లడించారు. నివేదికలోని ముఖ్యాంశాలు... » మొండి బకాయిలు నియంత్రణ స్థాయిలోనే ఉంటాయి. రూ.50,000 కంటే తక్కువ రిటైల్ సురక్షిత రుణాలు బ్యాంకుల రుణాల మొత్తంలో 0.4 శాతంగా ఉన్నాయి. 11 శాతానికి పైగా వడ్డీ రేటు కలిగిన రుణాలు మొత్తం రుణాల్లో 3.6 శాతంగా ఉన్నాయి. » 2024–25లో రుణ వృద్ధి మందగించింది. 2023–24తో పోల్చితే ఈ రేటు 15 శాతం నుండి 13–13.5 శాతానికి తగ్గే వీలుంది. » బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2025–26లో 0.10 శాతం తగ్గిపోతుంది. డిపాజిట్ వడ్డీ రేటు పెంపు, కొత్త అకౌంటింగ్ విధానాలు దీనికి కారణంగా ఉంటాయి. » 2025–25లో రుణ–డిపాజిట్ వృద్ధి మధ్య వ్యత్యాసం తగ్గుముఖం పడుతుంది. అయితే ప్రాజెక్ట్ ఫైనాన్స్ కొత్త నిబంధనలు, లిక్విడిటీ కవరేజ్ రేషియో, క్రెడిట్ నష్టాల అంచనా విధానం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను సృష్టిస్తాయి. » 2024–25లో మైక్రోఫైనాన్స్ ఆస్తుల వృద్ధి 5 శాతంగా ఉంటుంది. 2024–25లో ఇది 12 శాతానికి పెరుగుతుంది. గ్రామీణ ఎకానమీ బలోపేతం మైక్రోఫైనాన్స్ రంగానికి లాభదాయకంగా ఉండొచ్చు. శక్తికాంతదాస్ విధానాలు భేష్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్బీఐ తీసుకున్న సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలంగా మార్చాయని నివేదిక పేర్కొనడం గమనార్హం. అయితే కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ నిబంధనల్లో పూర్తిగా కాకున్నా, కొంతమేర సరళతరం అయ్యే అవకాశం ఉందని అంచనావేసింది.వ్యక్తిగత రుణాలు, సురక్షిత వ్యాపార రుణాలు, మైక్రోఫైనాన్స్ రంగంపై అవుట్‌లుక్ ‘స్థిరత్వం’ నుండి ‘దుర్వినియోగ పరిస్థితి‘ గా మారుతోందని నివేదిక పేర్కొంది. బ్యాంకులు, నాన్–బ్యాంకు ఫైనాన్స్ కంపెనీలు అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఇండ్రా రేటింగ్ తన అవుట్‌లుక్‌ను కొనసాగించింది. అయితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని అసెట్ సెగ్మెంట్లపై అవుట్‌లుక్‌ను సవరించింది. -
నిరాశ మిగిల్చిన హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్మార్కెట్లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్‌తో రూ.1931కు స్టాక్ మార్కెట్లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్‌పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..
పెరుగుతున్న పామాయిల్, ముడిసరుకు ధరల వల్ల ఎఫ్ఎంసీజీ సంస్థల మార్జిన్లు, లాభాలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభావం పడనుంది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థలు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్), డాబర్, మారికో ఇప్పటికే ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో మార్జిన్లలో వృద్ధి గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా ఉండొచ్చని పేర్కొన్నాయి. కోప్రా, వెజిటబుల్ ఆయిల్ ధరలు పెరిగినట్టు చెప్పాయి. ‘పామాయిల్ ధరలు, తయారీ వ్యయాలు మార్చి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండంకెల స్థాయిలో వీటి పెరుగుదల నమోదైంది. పెరిగిన వ్యయ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త ఉత్పత్తులు సహా దీర్ఘకాల వృద్ధికి పెట్టుబడులు కొనసాగించాలని తెలిపింది’ అని జీసీపీఎల్ పేర్కొంది. పామాయిల్, ముడి సరుకుల ధరల కారణంగా సెప్టెంబర్ క్వార్టర్ స్టాండలోన్ ఎబిటా వృద్ధి ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. ఆదాయం మాత్రం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.ఇదీ చదవండి: ఒకే ఆర్డర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతంముడి సరుకుల ధరల పెరుగుదల..ఇటీవలే ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన ఫలితంగా వెజిటబుల్ నూనెల ధరలు, కోప్రా ధరలు పెరిగాయని మారికో తెలిపింది. స్థూల మార్జిన్లు మోస్తరుగానే ఉండొచ్చని పేర్కొంది. ఆదాయ వృద్ధితో పోలిస్తే.. నిర్వహణ లాభం వృద్ధి మోస్తరుగానే ఉండొచ్చని అంచనా వేసింది. మరో ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ పంపిణీదారుల స్థాయిలో నిల్వలను సరిదిద్దే పనిలో ఉన్నట్టు తెలిపింది. ‘తక్కువ అమ్మకాలతో లాభాలపై ప్రభావం పడింది. ఆపరేటింగ్ మార్జిన్ రెండంకెల స్థాయిలో క్షీణించొచ్చు’అని పేర్కొంది. మరోవైపు ప్రకటనలపై డాబర్ తన వ్యయాలను పెంచింది. పంపిణీ ఛానల్ బలోపేతానికి వీలుగా ఈ తాత్కాలిక దిద్దుబాట్లు అవసరమని, రానున్న రోజుల్లో మెరుగైన నిర్వహణ, వృద్ధికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయని చెప్పింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఎఫ్ఎంసీజీ అమ్మకాలు మెరుగుపడినట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఆదాయం రెండంకెల స్థాయిలో పెరిగినట్టు అదానీ విల్మార్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ–కామర్స్ ఛానళ్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో ఆదాయం నాలుగు రెట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. -
‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్‌టెన్ వీరే
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాల వాటా సాధించిన టాప్‌టెన్ ఉద్యోగుల పేర్లను ప్రకటించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఈ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ–1కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు అత్యధికంగా సాధించారు. మందమర్రి కేకే–5కు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీ రాజు రూ.3.10 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రూ.3 లక్షలు, ఎస్ఆర్పీ–1కు చెందిన మేడం తిరుపతి రూ.3 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఫోర్‌మెన్ కర్నె వెంకటేశం రూ.2.96 లక్షలు, ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ బండారి శ్రీనివాస్ రూ.2.92లు, ఆర్కే–7కు చెందిన కోల్‌కట్టర్ దుర్గం తిరుపతి రూ.2.91 లక్షలు, ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనికి చెందిన ఓవర్‌మెన్ వి.వంశీకృష్ణ రూ.2.89 లక్షలు, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–6కు చెందిన సర్వేయర్ బర్ల మహేందర్ రూ.2.88 లక్షలు సాధించారు. వీరిని సింగరేణి యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రత్యేకంగా అభినందించాయి. వీరికి సోమవారం సీఅండ్ఎండీ కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. -
లాభాలు కొనసాగే వీలు
దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనా వార్తలు ఈక్విటీ మార్కెట్లను ముందుకు నడిపించవచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.‘‘అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉంది’’ అని మెహ్తా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.యూఎస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడంతో పాలసీ సర్దుబాట్లకు సమయం ఆసన్నమైందంటూ ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో గతవారం సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సైతం సెంటిమెంట్‌ను బలపరిచాయి. ముఖ్యంగా విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 1,280 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాల వెల్లడి కారణంగా ఆటో రంగ షేర్లలో కదలికలు గమనించవచ్చు. ఇవాళ(సోమవారం) భారత్ పాటు చైనా, యూరోజోన్లు ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల చేయనున్నాయి. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటాను మంగళవారం ప్రకటించనుంది.దేశీయ సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం(సెప్టెంబర్ 4న) విడుదల అవుతాయి. ఆగస్టు 31తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(సెప్టెంబర్ 6న) విడుదల చేస్తుంది. ఇదే వారాంతాపు రోజున యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ అంచనా డేటా, అమెరికా నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. ఆగస్టులో రూ.7,320 కోట్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో రూ.7,320 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అధిక వాల్యుయేషన్ ఆందోళనలతో పాటు జపాన్ వడ్డీరేట్ల పెంపుతో యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆగస్టులో అమెరికా ఆర్థిక మాంద్య భయాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కూడా విదేశీ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అయితే జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం విశేషం. ఇదే నెలలో డెట్ మార్కెట్లో రూ.17,960 కోట్ల పెట్టుడులు పెట్టారు.‘‘ఎఫ్ఐలు సెప్టెంబర్‌లో కొనుగోళ్లు చేపట్టే వీలుంది. దేశీయ రాజకీయ స్థిరత్వం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు, మార్కెట్ వాల్యుయేషన్లు, రంగాల ప్రాధాన్యత, డెట్ మార్కెట్ ఆకర్షణ అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
లాభాలు ఓకే.. డివిడెండ్లు ప్చ్!
దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో సగటున రికార్డ్ స్థాయిలో లాభాలు ఆర్జించాయి. అయితే లాభాలను వాటాదారులకు పంచే(డివిడెండ్ పేఔట్) విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. వార్షికంగా పేఔట్ దాదాపు 5 శాతం నీరసించింది. ఇందుకు పలు అంశాలు ప్రభావాన్ని చూపుతున్నాయి. డివిడెండ్ ప్రకటించిన 999 లిస్టెడ్ కంపెనీలను పరిగణించిన ఒక నివేదిక రూపొందించిన వివరాలు చూద్దాం.. ముంబై: దేశీ లిస్టెడ్ కార్పొరేట్లు గతేడాది(2023–24)కి డివిడెండ్లను ప్రకటించడంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. దీంతో సగటున అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే డివిడెండ్ చెల్లింపు 4.7 శాతం తగ్గింది. రూ. 4.03 లక్షల కోట్లను పంచిపెట్టాయి. అయితే 2022–23లో సరికొత్త రికార్డును లిఖిస్తూ చెల్లించిన రూ. 4.23 ట్రిలియన్లతో పోలిస్తే తక్కువే. ఇక నికర లాభాల విషయానికివస్తే(అనుకోని లాభాలు లేదా నష్టాల సర్దుబాటు తదుపరి) గతేడాది వార్షికంగా 30 శాతం వృద్ధితో రూ. 14.75 లక్షల కోట్లను ఆర్జించాయి. ఇవి చరిత్రాత్మక గరిష్టంకాగా.. 2022–23లో రూ. 11.36 ట్రిలియన్ నికర లాభాన్ని సాధించాయి. కరోనా మహమ్మారి తదుపరి గత మూడేళ్లుగా దేశీ కార్పొరేట్ లాభాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతూ వస్తున్నాయి. దీంతో డివిడెండ్ చెల్లింపులు సైతం 2020–23 కాలంలో వార్షిక పద్ధతిన 29.5 శాతం చొప్పున ఎగశాయి. వార్షిక చెల్లింపులు 2023కల్లా 4.23 లక్షల కోట్లకు జంప్‌చేసింది. 2020లో ఇవి రూ. 1.95 ట్రిలియన్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం దాదాపు 34 శాతం దూసుకెళ్లాయి. అయినప్పటికీ గతేడాది లాభాల పంపకం డీలా పడటం గమనార్హం! కోవిడ్–19 ముందు.. గత మూడేళ్లతో పోలిస్తే ఈక్విటీ డివిడెండ్ల చెల్లింపులు కోవిడ్–19కు ముందు తక్కువగానే నమోదయ్యాయి. 2017–20 కాలంలో లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ డివిడెండ్ల పంపకం వార్షికంగా కేవలం 3 శా తం వృద్ధిని అందుకుంది. దీంతో 2017లో నమోదైన రూ. 1.78 ట్రిలియన్ డివిడెండ్లు 2020కల్లా రూ. 1.95 లక్షల కోట్లకు మాత్రమే బలపడ్డాయి. ఇందుకు నికర లాభాలు నీరసించడం కారణమైంది. 2017లో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం రూ. 4.81 లక్షల కోట్లుకాగా.. 2020కల్లా రూ. 4.75 ట్రిలియన్లకు పరిమితమైంది. కాగా.. ప్రస్తుతానికి వస్తే గత ఐదేళ్లలో తొలిసారి వార్షికంగా డివిడెండ్ పేఔట్ రేషియో గతేడాది తగ్గింది. ఇలా ఇంతక్రితం 2019 లోనూ పేఔట్లో క్షీణత నమోదైంది. 2018లో రూ. 1.87 లక్షల కోట్లుకాస్తా 2019లో రూ.1.85 ట్రిలియ న్లకు బలహీనపడింది. ఇక గతేడాది లాభాలు, డివిడెండ్లు వ్యతిరేక దిశలో నమోదయ్యాయి. గత 9 ఏళ్లలోనే కనిష్టంగా డివిడెండ్ పేఔట్ నిష్పత్తి 27 శాతానికి పరిమితమైంది. 2023లో ఇది 37 శాతంకాగా.. 2020లో ఆల్‌టైమ్ గరిష్టం 41 శాతాన్ని తాకింది. కారణాలు.. సగటున పేఔట్ రేషియో నీరసించడానికి మార్కెట్ విశ్లేషకులు కొన్ని కారణాలను ప్రస్తావిస్తున్నారు. గతేడాది కొన్ని కీలక రంగాలలో కార్పొరేట్ ఆర్జన మందగించింది. దీంతో కొన్ని కంపెనీలు నగదును అంతర్గత వనరుల కోసం పక్కన పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. పీఎస్‌యూ బ్యాంకులు, చమురు కంపెనీలు అధిక లాభాలను ఆర్జించగా.. అధిక డివిడెండ్లు పంచే ఐటీ, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలలో డిమాండ్ మందగించడం, వినియోగ వ్యయాలు తగ్గడం ప్రభావం చూపినట్లు వివరించారు. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఒక్క కఠిన నిర్ణయం.. నెట్‌ఫ్లిక్స్‌కు రికార్డ్ లాభాలు!
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఒక్క కఠిన నిర్ణయంతో దాని లాభాలు అమాంతం పెరగనున్నాయి. ‘వన్ డే’ పాపులర్ షో విడుదల, పాస్వర్డ్ షేరింగ్ కట్టడి చర్యల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లాభాలు కొత్త రికార్డును తాకనున్నాయి. వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం.. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో 4.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. 2020 కోవిడ్ లాక్డౌన్ల తర్వాత సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుదల ఇదే అత్యధికం. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి పాస్వర్డ్ షేరింగ్‌ను కట్టడి చేయడమే కారణంగా తెలుస్తోంది. అయితే 2022లో ప్రకటనలతో కూడిన చౌకైన నెలవారీ చెల్లింపు ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల సంఖ్య పెరిగింది. రీఫినిటివ్ (Refinitiv) డేటా ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ లాభాలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ. 16 వేల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీకి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొదటి త్రైమాసికంలో ఇవే అత్యధిక లాభాలు కానున్నాయి. ఇది డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజాలతో స్ట్రీమింగ్ వార్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను దృఢంగా నెలబెట్టనుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్‌కు 20 కోట్ల మంది, డిస్నీ+కి 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది. ► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్‌లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్‌లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్‌లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్‌తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ రెండో క్వార్టర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులను గమనించవచ్చు. నవంబర్ 8న(బుధవారం), 10న(శుక్రవారం) ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఇటీవల మార్కెట్ల ట్రేడింగ్‌పై పరిమిత ప్రభావాన్ని చూపుతోంది. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారితే మార్కెట్ మూమెంటం మరింత ఊపందుకుంటుంది. నిఫ్టీకి ఎగువన 19,330 – 19,440 శ్రేణిలో కీలక నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 19,060 వద్ద కీలక మద్దతు లభించవచ్చు’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. రెండో క్వార్టర్ ఫలితాలపై కన్ను గత వారాంతంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, డెల్హవరీ, వేదాంతలు వెల్లడించిన ఆర్థిక ఫలితాలకు స్టాక్ మార్కెట్ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. నిఫ్టీ 50 సూచీలోని భాగమైన దివీస్ ల్యాక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఓఎన్‌జీసీలతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 2400 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల పీఎంఐ డేటా సోమవారం విడుదల అవుతుంది. చైనా అక్టోబర్ వాణిజ్య లోటు మంగళవారం, యూరోజోన్ సెపె్టంబర్ రిటైల్ విక్రయాలు బుధవారం వెల్లడి కానున్నాయి. అమెరికా వారంతాపు నిరుద్యోగ డేటా గురువారం ప్రకటించనుంది. బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు డేటా శుక్రవారం, అదేరోజున భారత సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి, చైనా ద్రవ్యోల్బణం, వాహన విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. రెండు లిస్టింగులు, 3 ఐపీఓలు సెల్లో వరల్డ్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. అదే రోజున ఐటీ ఆధారిత సొల్యూషన్ కంపెనీ ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ ఐపీఓ ప్రారంభం కానుంది. హొనాసా కన్జూమర్ షేర్ల లిస్టింగ్ మంగళవారం(నవంబర్ 7న) ఉంది. ఈ రోజే అస్క్ ఆటోమోటివ్ ఐపీఓ, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు నవంబర్‌లో 3 సెషన్లలో రూ. 3,400 కోట్లు ఉపసంహరణ వడ్డీ రేట్ల పెరుగుదల, మధ్యప్రాచ్యంలో రాజకీయ..¿ౌగోళిక పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. నవంబర్‌లో తొలి మూడు ట్రేడింగ్ సెషన్లలోనే రూ. 3,412 కోట్ల మేర పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, అంతకు ముందు సెపె్టంబర్లో రూ. 14,767 కోట్ల మేర విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు. దానికన్నా ముందు మార్చ్ నుంచి ఆగస్టు వరకు వరుసగా ఆరు నెలల్లో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 1.74 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం. బాండ్ ఈల్డ్‌ల (రాబడులు) పెరుగుదలే అమ్మకాలకు ప్రధాన కారణమని, అయితే వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడ్ ఉదార వైఖరి తీసుకోవడంతో ఈల్డ్‌లు తిరుగుముఖం పట్టి, ఎఫ్‌పీఐల విక్రయాలకు కాస్త అడ్డుకట్ట పడొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. మరోవైపు, డెట్ మార్కెట్లోకి అక్టోబర్‌లో రూ. 6,381 కోట్లు, నవంబర్ తొలి నాళ్లలో రూ. 1,984 కోట్లు వచ్చాయి. ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు సానుకూల పరిస్థితులు వచ్చే వరకు నిధులను స్వల్పకాలికంగా భారతీయ డెట్ సాధనాలకు మళ్లించాలని ఇన్వెస్టర్లు భావిస్తుండటం ఇందుకు కారణం కావచ్చని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు నికరంగా ఈక్విటీల్లోకి రూ. 92,560 కోట్లు, డెట్‌లోకి రూ. 37,485 కోట్ల మేర వచ్చాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు అత్యధికంగా పెట్టుబడులు దక్కించుకున్నాయి. -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలకు బ్రేక్! లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు
today stock market opening: వరుస నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రధాన సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 65,589 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,535 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, నెస్లే, హెచ్‌యూఎల్, ఐచర్ మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మ్యూచుఫల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా ఉండాలి?
ఈ వారం ఆరంభంలో నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిసాయి. నిఫ్టీ 19600 స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో హెక్సాగాన్ కాపిటల్కు చెందిన శ్రీకాంత్ భగవత్ తో కారుణ్యరావు సంభాషణ విందాం. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి ఎలా ఉండబోతోంది. నిఫ్టీతో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు బాగా పెరిగాయి. క్విక్ రాలీతోపాటు వాల్యూయేషన్లను పరిశీలించాలి. కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచింది. అలాగే బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తూ డెట్ ఫండ్స్, బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? రిటర్న్న్ ఎలా ఉంటాయి అంటే మిగతా అన్ని పరిస్థితులు బావుంటే.. మీడియం టర్మ్ డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి ఫలితాలుండే అవకాశాలన్నాయి. క్రెడిట్ గ్రోత్ రికవరీ అవుతున్న తరుణంలో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల వైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ. హైబ్రిడ్ ఫండ్స్‌లో టాక్స్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ పండ్స్తో పోలిస్తే డెట్స్ ఫండ్స్‌తో రిస్క్ ఎలా ఉంటుంది? అనేది పరిశీలిస్తే మ్యూచుఫల్ డెట్ ఫండ్స్ ఈల్డ్స్ బావున్నాయి. ఇంట్రరెస్ట్, క్రెడిట్, లిక్విడిటీ అనే మూడు రిస్క్‌లు ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగితే పాత బాండ్ల ధరలు పడతాయి. లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది. కరెంట్ మార్కెట్లో లార్జ్ క్యాప్‌లో మీడియం టెర్మ ఫండ్ బావుంటుంది. పీఎస్‌యూ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ కంపెనీల బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈక్విటీ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడులు మంచిది. (Disclaimer: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మహిళా మార్ట్.. లాభాల్లో బెస్ట్
సాక్షి, అమరావతి : పట్టణాల్లోని పేద, మధ్య తరగతి మహిళలు సంఘటితమై విజయం సాధించారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అందించిన సాయంతో జగనన్న మహిళా మార్ట్లను నెలకొల్పి లాభాల బాటలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 పట్టణాల్లో ఏర్పాటు చేసిన మార్ట్లు నెలకు సగటున రూ.79.40 లక్షల వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. పొదుపు సంఘాల్లోని మహిళలు కేవలం రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టి.. తమ ఇంటికి అవసరమైన సరుకులను డిస్కౌంట్ ధరకు పొందుతూనే రోజువారీ అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.19 లక్షల నికర లాభాలను ఆర్జిస్తున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన స్వయం సహాయక సంఘాల్లోని 37,308 మంది మహిళలు మెప్మా ఎండీ విజయలక్ష్మి ప్రోత్సాహంతో మార్ట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఒక్కో సభ్యురాలు కేవలం రూ.150 చొప్పున రూ.55,96,200 పెట్టుబడిగా పెట్టి గత ఏడాది మే నెలలో జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ ఏడాదిన్నరలో రూ.4.89 కోట్ల అమ్మకాలు చేసి, రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటాదారులకు రూ.20 లక్షల మొత్తాన్ని డివిడెంట్‌గా పంచి.. మిగిలిన రూ.10 లక్షలను సభ్యుల అంగీకారంతో మరో వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించారు. ఆర్థిక స్వావలంబన దిశగా.. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా మహిళా సమాఖ్యలు ఉన్నా వీరు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకునేవారు. వారికి మెరుగైన ఆర్థిక స్వావలంబన ఉండాలని, సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలన్న లక్ష్యంతో ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి సమాఖ్య సభ్యులను సూపర్ మార్కెట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహించారు. ఆసక్తి గల సభ్యులతో రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టించి ‘జగనన్న మహిళా మార్ట్’లను ఏర్పాటు చేశారు. 2021 జనవరిలో పులివెందులలో తొలి మార్ట్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ స్టోర్ రూ.2.50 కోట్ల వ్యాపారం చేయడంతో పాటు సుమారు రూ.18 లక్షల లాభాన్ని ఆర్జించింది. దాంతో వాటాదారులకు డివిడెండ్ చెల్లించారు. ఇప్పుడు తిరుపతి పట్టణంలోని మహిళా మార్ట్ వాటాదారులు డివిడెంట్ అందుకోనున్నారు. కాగా.. ఈ రెండేళ్ల కాలంలో పులివెందుల, రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, మారా>్కపురం, ఒంగోలు పట్టణాల్లో 10 జగనన్న మహిళా మార్ట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇది సమైక్య విజయం పెట్టుబడిదారులు, అమ్మకందారులు, కొనుగోలుదారులు మహిళలే. మార్ట్ల నిర్వహణ కోసం మెప్మా ఆధ్వర్యంలోశిక్షణ ఇచ్చాం. మార్ట్ ఏర్పాటు, నిర్వహణ ప్రతి దశను ఎస్‌హెచ్‌జీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏడాదిన్నలో రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఇందులోని సభ్యులకు రూ.20 లక్షల డివిడెండ్ చెల్లించి.. మిగతా మొత్తంతో సభ్యుల అంగీకారంతో కొత్త వ్యాపారంలో ప్రారంభిస్తాం. ఇందులోనూ మహిళలే సభ్యులుగా ఉండి వచ్చిన లాభాలను పంచుకుంటారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేలా చేయడమే మెప్మా లక్ష్యం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
నాటుకోళ్ల పెంపకం.. నెలకు రూ.80వేలకు పైగా లాభాలు
పెరట్లో నాటు కోళ్ల పెంపకం ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా రైతులకు, ఏడాది పొడవునా స్థిరంగా ఆదాయంతో పాటు కుటుంబ స్థాయిలో పౌష్టికాహార లభ్యతను సైతం పెంపొందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి వాసన్ తదితర స్వచ్ఛంద సంస్థలు గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా నిర్థారణైంది. పెరటి కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70% కుటుంబాలు అన్నో ఇన్నో పెరటి కోళ్లు పెంచుకుంటూనే ఉంటాయి. అయితే, కోళ్లు పరిసర ప్రాంతాల్లో తిరిగి రావటంతో పాటు రాత్రుళ్లు చెట్ల మీదో, పందిళ్ల మీదో నిద్రించటం వల్ల కుక్కలు, పిల్లుల బారిన పడి మరణిస్తూ ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించడానికి వాసన్ సంస్థ దేశవాళీ పెరటి కోళ్లను అరెకరం విస్తీర్ణంలో చుట్టూ ప్రత్యేకంగా కంచె వేసి అందులో స్థానికంగా లభించే జాతుల నాటు కోళ్లు పెంచటంపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో అమలు చేస్తోంది. కోళ్లు రాత్రి పూట భద్రంగా విశ్రమించడానికి షెడ్డు నిర్మించటం.. చిరుధాన్యాలు, అజొల్లా, చెద పురుగులను మేపటం.. వ్యాక్సిన్లు వేయటం ద్వారా నాటు కోడి పిల్లల మరణాలను తగ్గించి, ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం కల్పించటం.. ప్రతి 25 కుటుంబాలకు ఒకటి చొప్పున స్థానిక మహిళా రైతు ద్వారానే బ్రీడింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయించటం.. వంటి చర్యల ద్వారా చక్కటి ఫలితాలు వస్తున్నాయని వాసన్ చెబుతోంది. అరెకరం పెరటి కోళ్ల నుంచి రూ. 70–80 వేలు, ఆ అరెకరంలో పండ్లు, కూరగాయలు, దుంప పంటల ద్వారా మరో రూ. 20 వేల వరకు రైతు కుటుంబానికి ఆదాయం వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వాసన్ తెలిపింది. ఏపీ గిరిజన ప్రాంతాల్లో మహిళా రైతుల అనుభవాలు దేశవ్యాప్తంగా అమలు చేయదగినవిగా ఉన్నాయని వాసన్ చెబుతోంది. ఈ అనుభవాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన విశాఖలో వాసన్, ఏపీ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చర్చాగోష్టి జరగనుంది. ఈ సందర్భంగా అరెకరంలో నాటు కోళ్లను పెంచుతూ ఏడాదికి దాదాపు రూ. లక్ష ఆదాయం గడిస్తున్న చిన్నమ్మి, చంద్రయ్య గిరిజన దంపతుల అనుభవాలను ఇక్కడ పరిశీలిద్దాం. చిన్నమ్మి నాటు కోళ్ల బ్రీడింగ్ ఫామ్ కుండంగి చిన్నమ్మి(58), చంద్రయ్య గిరిజన దంపతులది మన్యం పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం చినరామ గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు రవికుమార్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులతో కలసి గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. వారికి 70 సెంట్ల మాగాణి, ఎకరంన్నర మెట్ట పొలంతో పాటు 2 ఎకరాల కొండ పోడు భూములు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వాసన్ సంస్థ తోడ్పాటుతో అరెకరం పెరట్లో నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. భర్త, కుమారుడు ఇతర పొలాల్లో పనులు చూసుకుంటూ ఉంటే చిన్నమ్మి పెరటి కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. మరో 25 కుటుంబాలకు కూడా కోడి పిల్లలను అందించే బ్రీడింగ్ ఫామ్‌ను చిన్నమ్మి నిర్వహిస్తుండటం విశేషం. అరెకరం స్థలంలో చుట్టూ 4 అడుగుల ఎత్తు గ్రీన్ మెష్‌తో పాటు కొండ చీపురు గడ్డి, వెదరు బొంగులతో గట్టి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. 50 కోళ్లతో ప్రారంభించారు. ఇప్పుడు 80 కోళ్లు ఉన్నాయి. కొన్ని పందెం కోళ్లు కూడా పెంచుతున్నారు. 18“24 అడుగుల స్థలంలో 200 కోళ్లు రాత్రిళ్లు నిద్రించడానికి సరిపోయే రేకుల షెడ్‌ను 3 సెంట్లలో నిర్మించారు. వాసన్ అందించిన రేకులు తదితర సామగ్రిని ఉపయోగించారు. కోళ్లు ఆరుబయట తిరిగి మేస్తూ ఉంటాయి. అదనంగా తమ పొలాల్లో పండించిన చోళ్లు తదితర చిరుధాన్యాలు కోళ్లకు వేస్తున్నారు. చిన్న కుంటలో పెంచిన అజొల్లాను కోళ్లకు, మట్టి కుండల్లో పెంచిన చెద పురుగులను కోడి పిల్లలకు మేతగా వేస్తుండటంతో అవి బలంగా పెరుగుతున్నాయి. వారం కోడి పిల్లలకు విధిగా లసోట వాక్సిన్‌తో పాటు రెండు నెలలకోసారి ఇతర వాక్సిన్లు వేస్తున్నారు. ఈ అరెకరంలో కోళ్ల పెంపకంతో పాటు అదనపు ఆదాయం కోసం 43 రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలను 5 దొంతర్లలో పండిస్తుండటం విశేషం. పసుపు, అల్లం, సీతాఫలాలు, బొప్పాయి, చింతపండుతో పాటు ఆగాకర తదితర తీగ జాతి కూరగాయలను సైతం పండిస్తున్నారు. కోడి మాంసం, గుడ్లు, కూరగాయలు, పండ్లను తాము తినటంతో పాటు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి రూ. 70–80 వేల వరకు నాటుకోళ్లు, గుడ్ల ద్వారా, మరో రూ. 20 వేలు పంటల ద్వారా ఈ అరెకరం నుంచి ఆదాయం పొందుతున్నామని రవి(94915 42102) తెలిపారు. చిన్నమ్మి శ్రద్ధగా పనిచేస్తూ ఆదర్శ నాటుకోళ్ల బ్రీడింగ్ ఫామ్ రైతుగా గుర్తింపు పొందటం విశేషం. -
గణేషుడు నేర్పే పెట్టుబడి పాఠాల గురించి మీకు తెలుసా?
విఘ్నాలను తొలగించే వినాయకుడు ఆధ్యాత్మికంగానే కాకుండా మనం ఆర్థికంగా, పెట్టుబడులపరంగా కూడా ఎలా మసలుకోవాలో పాఠాలు నేర్పుతాడు. ఆయన గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఏనుగు తల జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. పెద్ద చెవులు దేన్నైనా ఏకాగ్రచిత్తంతో వినాల్సిన ఆవశ్యకతను సూచిస్తాయి. ఆయన శరీరం బలాన్ని, శక్తిని అలాగే ఆయన వాహనమైన ఎలుక.. నమ్రతను ప్రతిబింబిస్తాయి. వినాయకుడి విగ్రహం చూస్తే ఒక దంతం విరిగి ఉంటుంది. పురాణాల ప్రకారం వేద వ్యాస మహర్షి, మహాభారతాన్ని రచించాలని సంకల్పించినప్పుడు .. తనకు వచ్చే ఆలోచనలను అంతే వేగంగా అక్షరబద్ధం చేయగలిగే వారు ఎవరు ఉన్నారని అన్వేషించాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని మహాగణపతిని కోరాడు. వినాయకుడు ఒక సాధారణ పక్షి ఈకతో రాయడానికి ఉపక్రమించగా, అది మధ్యలో విరిగిపోయింది. కానీ, మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపడానికి ఇష్టపడక, ఆయన తన దంతాన్ని విరిచి, దానితో రాయడాన్ని కొనసాగించాడని ప్రతీతి. ఆయన నిబద్ధత, అంకితభావం కారణంగానే మనకు అమూల్యమైన మహాభారతం లభించింది. నిలకడతత్వం, అంకితభావంతో ఎలాంటి అవాంతరాలనైనా అధిగమించవచ్చని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా పెట్టుబడుల విషయంలోనూ, జీవితంలోనూ మనం ఎన్నింటినో చాలా ఆసక్తిగా ప్రారంభిస్తాం. కానీ ఏదైనా చిన్న అవాంతరం ఎదురుకాగానే వెంటనే విరమించుకుంటాం. ఉదాహరణకు, ఈ ఏడాది కచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తీర్మానించుకుని, ప్రతి ఏడాది జనవరి 1న జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాం. కానీ మళ్లీ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోతాం. ఫిట్నెస్ లక్ష్యాన్ని అటకెక్కిస్తాం. పెట్టుబడుల విషయంలోనూ అలాగే చేస్తుంటాం. ఏదో ఆర్థిక లక్ష్యం పెట్టుకుని పెట్టుబడుల ప్రస్థానం మొదలెడతాం. కానీ మార్కెట్లు ఏకాస్త ఒడిదుడుకులకు లోనైనా, పడిపోయినా వెంటనే మన సిప్‌లను ఆపేస్తాం. అంతేగాకుండా ముందుగానే మన పెట్టుబడులను వెనక్కి కూడా తీసేసుకుంటాం. సిప్‌లను మధ్యలోనే ఆపేయడం వల్ల మనకు రావాల్సిన ప్రయోజనాలు దక్కవు. అలా కాకుండా మిగతా సమస్యలు ఎన్ని ఎదురైనా మనం జిమ్‌కు మానకుండా వెళ్లడం కొనసాగించినా లేదా మార్కెట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా పెట్టుబడులను కొనసాగించినా ఎలాంటి ఫలితాలు వచ్చి ఉండేవి? దీనిపై స్పష్టత కోసం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మార్కెట్లు పడిన వెంటనే ఎవరైనా తమ పెట్టుబడులను మధ్యలోనే ఆపేస్తే ఏం జరుగుతుంది, ఆపకుండా కొనసాగించి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. 2018 సెప్టెంబర్ 1 నుంచి రాము ప్రతి నెలా రూ. 2,000 చొప్పున సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించాడు. అయితే, 2020 మార్చిలో ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి. అలాంటప్పుడు అతను తన పెట్టుబడులను మధ్యలోనే వెనక్కి తీసుకుని ఫిక్సిడ్ డిపాజిట్లలో పెట్టి ఉంటే ఏమై ఉండేది? అలా చేయకుండా పెట్టుబడులను కొనసాగించి ఉంటే ఎలా ఉండేది? ఒకసారి పరిశీలిద్దాం. (ఇందుకోసం నిఫ్టీ 50 టీఆర్ ఇండెక్స్‌ను ప్రామాణికంగా తీసుకుందాం.) 2023 ఆగస్టు 31 నాటి డేటా ప్రకారం మూలం:ఎన్ఎస్ఈ సూచీలు, ఎస్బీఐ వెబ్సైట్, అంతర్గత రీసెర్చ్ ఏ తుది మొత్తాన్ని 28–03–2020 నుంచి 3 ఏళ్లకు లెక్కించేందుకు ఎస్బీఐ ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు (5.7 శాతం) పరిగణనలోకి తీసుకున్నాం. చూశారుగా, 2020లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ రాము తన సిప్‌ను కొనసాగించి ఉంటే ఇప్పుడది సుమారు రూ. 1.76 లక్షలు అయి ఉండేది. సంపద సృష్టిలో నిలకడగా వ్యవహరించడం ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాబట్టి మిగతా పనులెన్ని వచ్చి పడినా జిమ్‌కు వెళ్లడం కొనసాగించి ఉన్నా, లేక మార్కెట్ హెచ్చుతగ్గులకు వెరవకుండా పెట్టుబడులను కొనసాగించి ఉన్నా ఏం జరిగి ఉండేది? మనం మరింత ఫిట్‌గా, మరింత ఆరోగ్యంగా ఉండేవాళ్లం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన పెట్టుబడుల విషయంలో జై గణేశా అంటూ ముందుకు సాగుదాం! -
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?
ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్.. ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?– వెంకటరమణ మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య పెట్టుబడులను వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం పథకాలను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులు సొంతం చేసుకోవచ్చు. పెట్టుబడికి రియల్ ఎస్టేట్ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి? – శివమ్ రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. ఇల్లును ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకునే విషయం కాదు. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టుబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. మరో కోణం నుంచి చూస్తే.. ప్రాపర్టీని అద్దెకు ఇస్తే క్రమం తప్పకుండా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ సక్రమంగా ఉండొచ్చు. అలా చూస్తే ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్ ఎస్టేట్ విలువ పెరిగినా కానీ, దానికి అనుగుణంగా అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి. -
సాక్షి మనీ మంత్రా: వారెవ్వా..నిఫ్టీ! ఆల్‌టైం రికార్డ్
Today StockMarket Nifty above 20k దేశీయస్టాక్‌మార్కెట్లు జోరుమీద ఉన్నాయి. కీలక సూచీలు రెండూ దలాల్‌స్ట్రీట్‌లో మెరుపులు మెరిపించాయి. ఆరంభంలో స్తబ్దుగా ఉన్నప్పటికీ ఆ తరువాత నుంచి పుంజు కున్నాయి. చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో 67,467 వద్ద ముగియగా, నిఫ్టీ 77 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 20,070 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ చరిత్రలో తొలిసిర 20వేలకు ఎగువన ముగియడం విశేషం. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభపడ్డాయి.ముఖ్యంగా ఆగస్టులో దేశీయ CPI ద్రవ్యోల్బణం 6.83 శాతానికి చల్లబడడం, పారిశ్రామిక ఉత్పత్తి డేటా భారత ఆర్థికవ్యవస్థ పటిష్టతపై ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి. దాదాపు అన్ని రంగాల షేర్లులాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. గ్రాసిం, కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్, ఎయిర్టెల్, టైటన్ టాప్ గెయినర్స్‌గానూ, జియో ఫైనాన్షియల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ఎం లార్సెన్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రూపాయి: గత ముగింపు 82.92తో పోలిస్తే డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టంతో 82.98 వద్ద ముగిసింది. -
జీవితకాల గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: అధిక వాల్యూయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాల్ని కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 412 పాయింట్లు పెరిగి 67,539 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 94 పాయింట్ల లాభంతో 67,221 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు ఎగసి 20,110 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 3 పాయింట్లు నష్టపోయి 19,993 వద్ద నిలిచింది. యుటిలిటీ, పవర్, టెలికం, రియల్టి, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, మౌలిక రంగ షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 3% చొప్పున నష్టపోయాయి. ఇరు సూచీలకు ఈ ఏడాది అతిపెద్ద పతనం కావడం గమనార్హం. చివరి రోజు నాటికి ఈఎంఎస్ లిమిటెడ్ ఐపీఓ 75.28 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 1.07 కోట్ల షేర్లను జారీ చేయగా, 81.21 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 29.79 రెట్లు సబ్ర్స్కిప్షన్ సాధించాయి. -
ఆర్టీసీలో అనగనగా ఓ రోజు.. సెప్టెంబర్ 11
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అనగానే.. నష్టాలు, అప్పులు, ఆలస్యంగా తిరిగే ట్రిప్పులు, డొక్కు బస్సులు.. ఇలాంటివి చాలామందికి మదిలో మెదులుతాయి. కానీ, కొంతకాలంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న సంస్థ తనను తాను మార్చుకుంటూ వస్తూ ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో కేవలం నాలుగు డిపోలు మాత్రమే ఖర్చులను మించి ఆదాయాన్ని సాధించాయన్న విషయం అధికారులు ఆయన ముందుంచారు. తాజాగా ఆర్టీసీ చేసిన ఫీట్ ఏంటంటే.. ఆర్టీసీలో 96 డిపోలు ఉండగా, గత సోమవారం (సెప్టెంబరు 11) రికార్డు స్థాయిలో 90 డిపోలు నిర్వహణ ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందాయి. ఇక ఈనెల సెప్టెంబర్ 11వ తేదీ వరకు వరసగా 71 డిపోలు లాభాల(నిర్వహణ ఖర్చులను మించి)ను ఆర్జించాయి. టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ రెండు ఫీట్లు నమోదయ్యాయి. ప్రభుత్వంలో విలీనం అవుతున్న నేపథ్యంలో మంచి ఊపుమీద ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కలిసికట్టుగా, పక్కా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ రికార్డులను సాధించటం విశేషం. ఫలితాన్నిస్తోన్న ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’ ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’పేరుతో కొద్ది రోజులుగా ఆర్టీసీ అమలు చేస్తున్న ప్రత్యేక ప్రణాళిక ఇప్పుడు ఈ రూపంలో సరికొత్త ఫలితాలని అందించింది. సాధారణంగా సోమవారం రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణ సోమవారాల్లో రూ.16–రూ.17 కోట్ల మేర ఆదాయం వస్తుండగా, ఈనెల 11న (చివరి ‘శుభముహూర్త’సోమవారం) ఏకంగా రూ.20.22 కోట్ల ఆదాయం నమోదైంది. ♦ సోమవారం రోజున ముషీరాబాద్–2, ఉట్నూరు, కోస్గి, భైంసా, మిధాని, నారాయణ్‌ఖేడ్ డిపోలు మినహా మిగతా 90 డిపోలు నిర్వహణ ఖర్చులను మించి ఆదాయాన్ని పొందాయి. నారాయణఖేడ్ డిపో ఖర్చు కంటే కేవలం రూ.వేయి మాత్రమే తక్కువ ఆదాయాన్ని పొందింది. నష్టాలు పొందిన మిగతా ఐదు డిపోలు కూడా రూ.22 వేల నుంచి రూ.1.45 లక్షల నష్టాన్ని మాత్రమే పొందటం గమనార్హం. ♦ ఆర్టీసీలో సాధారణంగా కొన్ని బస్సులను స్పేర్‌లో ఉంచుతారు. మరికొన్ని మరమ్మతు కోసం పక్కన పెడతారు. శ్రావణ శుభముహూర్తాల నేపథ్యంలో అస్సలు నడవలేని డొక్కు బస్సులు తప్ప అన్నింటినీ బాగుచేసి రోడ్డెక్కించారు. 11న ఆక్యుపెన్సీ రేషియో 85.19 శాతంగా నమో దైంది. సాధారణ రోజులతో పోలిస్తే గత పది రోజుల్లో కనీసం 5 శాతం వరకు పెరిగిందని ఆర్టీసీ పేర్కొంటోంది. ♦ కొన్ని మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కొన్ని రూట్లలో తక్కువగా ఉంటుంది. డెడికేటెడ్ సరీ్వ సుల పేరుతో, ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండే మార్గాల్లోనూ బస్సులు తిప్పే అలవాటు ఉండేది. ఇప్పుడు, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఎటు ఉందో ఆయా మార్గాల్లోనే ఎక్కువ బస్సులు తిప్పుతున్నారు. గత పక్షం రోజులుగా రోజువారీ ఆదాయం దాదాపు రూ.కోటిన్నర మేర పెరిగింది. ♦ ఇటీవలే దాదాపు 650 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు, 200 డీలక్స్ బస్సులు చేతికందాయి. వాటిని పూర్తి సామర్ధ్యంతో తిప్పుతున్నారు. సాధారణ రోజుల్లో 28 లక్షల కి.మీ. మేర బస్సులను తిప్పుతుండగా 11న 34 లక్షల కి.మీ. తిప్పారు. ♦ ఇతర సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రధాన పాయింట్ల వద్ద వినియోగించారు. దీనివల్ల సమయానుకూలంగా బస్సులు, రావటం, వచ్చిన బస్సుల్లో ఎక్కువ మంది ఎక్కేలా చూడటం, ప్రైవేటు వాహనాల వైపు వెళ్లేవారిని మళ్లించటం లాంటివి జరిగాయి. ♦ సెలవులను నియంత్రించి వీలైనంతమంది సిబ్బంది విధుల్లో ఉండేలా చూశారు. -
Papaya Farming: బొప్పాయి.. ఇలా పండిస్తే లక్షల్లో లాభాలు, ఫుల్ డిమాండ్
సంప్రదాయ పంటలతో విసిగిన రైతన్న ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో గిరాకీ ఉన్న బొప్పాయి పంటను సాగు చేసేందుకు బాపట్ల జిల్లాలో రైతులు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి బొప్పాయి పంటను జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు బొప్పాయి రైతులు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి బొప్పాయిని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని తద్వారా రైతులకు లాభాలు వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి దీప్తి పేర్కొన్నారు. 324 ఎకరాల్లో బొప్పాయి సాగు జిల్లాలోని కొల్లూరు మండలంలో 9.02, భట్టిప్రోలులో 18.23, సంతమాగులూరులో 155.74, బల్లికురవ 45.54, మార్టూరు 12.85, యద్దనపూడి 11.79, జే.పంగులూరు 21.93, అద్దంకి 32.18, కొ రిశపాడు 16.74 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. రెండు సంవత్సరాల పంటకాలంలో ఎకరాకు 90 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చుపోను నికరంగా రూ.2లక్షల వరకు ఆదాయం రావడంతో జిల్లా రైతులు బొప్పాయి సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నామమాత్రంగా సాగు చేపట్టిన బొప్పాయి ఈ ఏడాది అత్యధికంగా 324 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. బొప్పాయి సాగులో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన పండిన పంట ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రైతులు చెప్తున్నారు. అనుకూలమైన రకాలతో మంచి దిగుబడి జిల్లాలో సాగు చేపట్టాలనుకునే రైతులు రెడ్ లేడీ, వాషింగ్టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కలు నాటే సమయంలో గుంతల్లో ప్రతి గుంతకూ 20 కిలోల పశువుల ఎరువు, 20 గ్రాముల అజోప్పైరిల్లమ్, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 40 గ్రా ముల మైకోరైజాను బాగా కలుపుకొని వేసుకోవాలి. నాటే సమయం జూన్, జులై, అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల వయస్సున్న 15 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యం ప్రతి మొక్కకూ రెండు కిలోల నాడెప్ కంపోస్టు, ఒక కిలో వేపపిండి, అర కిలో ఘనజీవామృతం వేసుకొని మొక్కలను నాటుకోవాలి. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పారించుకోవాలి. మొక్కలపై ప్రతి 15 రోజుల కొకసారి పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. ప్రతి 25 రోజులకు ఒకసారి శొంఠి పాల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. ప్రకృతి సాగు చేయడం వలన కాయలు బరువుగా నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. అలాగే పండుగ సమయాల్లో టన్ను రూ.22 వేల వరకు పలుకుతుంది. మార్కెట్లో కిలో బొప్పాయి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో కూడా టన్ను రూ.10 నుంచి 15 వేలు ధర పలుకుతుంది. – దీప్తి, ఉద్యానశాఖ అధికారిణి -
‘కొబ్బరి’లో ‘సుగంధా’ల గుబాళింపు!.. అంతర పంటలతో లాభాలు
ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా.. అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. కొబ్బరి రైతుల ΄ాలిట అంతరపంటల సేద్యం కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం సుగంధ ద్రవ్య పంటల (స్పైసెస్)కు ఎంతో అనువైనది. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటున్న రైతుల విజయగాథలెన్నో. విశేష ప్రగతి సాధిస్తున్న అటువంటి ఇద్దరు ప్రకృతి వ్యవసాయదారులు ఉప్పలపాటి చక్రపాణి, సుసంపన్న అనుభవాలను తెలుసుకుందాం.. గత ఐదారేళ్లుగా కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని రైతు శాస్త్రవేత్త ఉప్పలపాటి చక్రపాణి రుజువు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్క్ష్మీపురం గ్రామానికి చెందిన చక్రపాణి గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. కొబ్బరి తోటలో ఆరేళ్ల క్రితం నాటిన 2,500 వక్క చెట్లు చక్కని ఫలసాయాన్నిస్తున్నాయి. ఈ ఏడాది 700 వక్క చెట్లకు కాపు వచ్చింది. 2 టన్నుల ఎండు వక్కకాయల దిగుబడి ద్వారా రూ. 3 లక్షల 80 వేలు ఆదాయం వచ్చిందని చక్రపాణి వివరించారు. 300 కొబ్బరి చెట్లకు ఐదారేళ్ల క్రితం మిరియాల తీగలను పాకించారు. వీటిద్వారా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి వచ్చింది. కేజీ రూ.600 చొప్పున రిటైల్‌గా అమ్ముతున్నారు. గానుగ నూనెతో ఆరోగ్యం కొబ్బరి చెట్ల మధ్య వక్క చెట్లు పెంచి.. కొబ్బరి చెట్లకు అనేక ఏళ్ల క్రితమే మిరియం మొక్కల్ని పాకించడంతో చక్రపాణి కొబ్బరి తోట వర్టికల్ గ్రీన్ హెవెన్‌గా మారిపోయింది. కొబ్బరి చెట్లకు మిరియం మొక్కలు చుట్టుకొని ఉంటాయి కాబట్టి, మనుషులను ఎక్కించి కొబ్బరి కాయలు దింపే పద్ధతికి స్వస్తి చెప్పారు. కాయల్లో నీరు ఇంకిన తర్వాత వాటికవే రాలుతున్నాయి. రాలిన కాయలను అమ్మకుండా.. సోలార్ డ్రయ్యర్లో పూర్తిగా ఎండబెట్టి కురిడీలు తీస్తున్నారు. కురిడీలతో గానుగల ద్వారా సేంద్రియ కొబ్బరి నూనె తీసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా తాము ఇంట్లో వంటలకు తమ సేంద్రియ కొబ్బరి నూనెనే వాడుతున్నామని, చాలా ఆరోగ్య సమస్యలు తీరటం గమనించామని చక్రపాణి సంతోషంగా చెప్పారు. పసుపు ఫ్లేక్స్ కొబ్బరి తోటలో వక్క, మిరియాలతో పాటు రెండేళ్లుగా అటవీ రకం పసుపును కూడా సాగు చేస్తున్నారు చక్రపాణి. ఈ రకం పసుపు వాసన, రంగు చాలా బాగుంది. పచ్చి పసుపు కొమ్ములను పల్చటి ముక్కలు చేసి, సోలార్ డ్రయ్యర్ లో ఎండబెట్టి, ఆ ఫ్లేక్స్‌ను అమ్ముతున్నారు. వాటి వాసన, రంగు, రుచి అద్భుతంగా ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారన్నారు. సిలోన్ దాల్చిన చెక్క బెటర్ కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించినా నేలపైన అక్కడక్కడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్మగ్లను సాగు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. సాధారణంగా మనం ఇళ్లలో వాడే దాల్చిన చెక్క విదేశాల నుంచి దిగుమతయ్యే సాధారణ రకం. సిలోన్ దాల్చిన చక్క రకం దీనికన్నా మెరుగైనది. ఇది పల్చగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతోందని చక్రపాణి వివ రించారు. కొబ్బరి, ΄ామాయిల్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అధికాదాయం పొందేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పెదవేగి మండల ఉద్యాన అధికారి ఎం. రత్నమాల తెలి΄ారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. – కొత్తపల్లి వినోద్‌కుమార్, సాక్షి, పెదవేగి, ఏలూరు జిల్లా కేరళ మాదిరిగా ఇక్కడా పండిస్తున్నా! రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించటం నేర్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్లాండ్ ఏరియాలో ఉద్యాన తోటలకు అనువైన వాతావరణం ఉంది. ఇవి సారవంతమైన భూములు. ఇక్కడి నీరు కూడా మంచిది. నాలుగైదేళ్లుగా భూగర్భజలాలు పెరగడంతో నీటి సమస్య లేదు. కొబ్బరిలో అంతర పంటలకు అనుకూలంగా ఉండేలా ముందే తగినంత దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. అంతర పంటలద్వారా సూక్ష్మ వాతావరణం సృష్టించుకొని కేరళలో మాదిరిగా సుగంధ ద్రవ్య పంటలు సాగు చేసుకోవచ్చు. కేరళలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మన దగ్గర 45 డిగ్రీల వరకు వస్తుంది. కొబ్బరిలో అంతర పంటల వల్ల బయటతో పోల్చితే పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎండ, గాలిలో తేమ సమపాళ్లలో చెట్లకు అందుతున్నందున కేరళలో మాదిరిగా మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ మా తోటలోనూ పండుతున్నాయి. – ఉప్పలపాటి చక్రపాణి (94401 88336), లక్ష్మీపురం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా -
పొగాకు రైతు ఇంట సిరుల పంట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో వర్జీనీయా పొగాకు డిమాండ్ పెరగడంతో పొగాకు పంట ఈ ఏడాది రైతు ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది పొగాకు వేలంలో కేజీ పొగాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. బ్రైట్ గ్రేడ్, లోగ్రేడ్ అన్న తేడా లేకుండా అన్ని గ్రేడ్లకు రికార్డు ధరలు రావడంతో కేజీ పొగాకు సరాసరి ధర రూ.214గా నమోదైంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డుపై ప్రత్యేక ఒత్తిడి తెచ్చి పొగాకు ముక్క (స్క్రాప్)ను వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కలి్పంచడం, అదనపు పొగాకు పంట అమ్మకాలపై జరిమానాలు రద్దు చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అయింది. భారీగా పెరిగిన ఉత్పత్తి .. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. వీటిలో కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డిసి పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉండగా, ఒంగోలు–1, ఒంగోలు–2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిని ఎస్బిఎస్ (సదరన్ బ్లాక్ సాయిల్), ఎస్ఎల్ఎస్ (సదరన్ లైట్ సాయిల్)గా విభజించారు. వీటిలో ఎస్బిఎస్ పరిధిలో 5 వేలం కేంద్రాలుంటే, ఎస్ఎల్ఎస్ పరిధిలో 6 వేలం కేంద్రాలున్నాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో 2022–23 పంట సీజన్‌కు సంబంధించి 89.35మిలియన్ కేజీల పొగాకును అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. కాని ఇప్పటికే 122.34మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. పలు వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరు వరకు వేలం జరిగే అవకాశం ఉండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినట్లు అర్ధమవుతుంది. రికార్డు ధరలు ఈ ఏడాదే.. గత రెండేళ్ల నుంచి రికార్డు «పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా.. ఈ ఏడాదిలోనే మార్కెట్లో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఒంగోలు రీజియన్ పరిధిలో ఈ సీజన్లో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు అత్యధిక రూ. 288 పలికినా ప్రస్తుతం స్థిరంగా రూ. 280 ధర వస్తుంది. అయితే ఈ ఏడాది గ్రేడ్లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని గ్రేడ్లకు రేట్లు పెరగడంతో సరాసరి రేట్లు మొదటిసారి డబుల్ సెంచరీ దాటాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో ప్రస్తుతం కేజీ పొగాకు సరాసరి ధర రూ 214.47గా నమోదైంది. అంటే క్వింటా పొగాకు సరాసరిన రూ 21,300 వరకు ధర రావడం గమనార్హం. రెండింతలైన బ్యారన్ కౌలు.. ఈ ఏడాది పొగాకు సాగులో వచి్చన లాభాలతో మరోసారి రైతులు పొగాకు పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పొలాలు, బ్యారన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతేడాది రూ.15వేలు ఉన్న పొలం కౌలు ప్రస్తుతం రూ.30వేల వరకు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. అదే సందర్బంలో గతేడాది రూ.1లక్ష ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2లక్షలు పలుకుతుంది. ఈ ఫొటోలోని పొగాకు రైతు పేరు రావూరు వెంగళరెడ్డి. ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ళకు చెందిన ఆయన గత 13 సంవత్సరాలుగా పొగాకు పండిస్తున్నాడు. రెండు బ్యారెన్లు పంట సాగు చేస్తే గతేడాది పెద్దగా మిగిలిందేమీ లేదు. ఈ క్రమంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకు సొంతంగా ఉన్న బ్యారెన్‌తో పాటు మర్రిపాడు మండలం డీసీపల్లిలో మరో ఆరు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇందుకోసం రూ.70 లక్షలు బ్యాంకుల వద్ద, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. అంతకు ముందే అతనికి రూ. 70 లక్షల అప్పు ఉంది. అయితే ముందెన్నడూలేని విధంగా పొగాకు ధరలు పెరగడంతో గతంలో తనకున్న అప్పులన్నీ తీరి మరో పాతిక లక్షల రూపాయల ఆదాయం మిగిలిందని రైతు వెంగళరెడ్డి ఆనందంతో చెప్పాడు. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన ఈ రైతు పేరు గోపిరెడ్డి రమణారెడ్డి. 30 ఏళ్లకుపైగా పొగాకు సాగు చేస్తున్నాడు. మూడు దశాబ్దాలకుపైగా పొగాకు సాగు చేస్తున్నా కుటుంబ అవసరాలు తీర్చడానికే తప్ప ఆరి్థకంగా పెద్దగా ఆదాయం మిగలలేదు. ఈనేపథ్యంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకున్న ఒక్క బ్యారెన్‌తో పాటు మరో మూడు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు పంట సాగు చేశారు. ఈ ఏడాది వేలంలో ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని ఖర్చులు పోను రూ.60 లక్షలకుపైగా ఆదాయం మిగిలిందని సంతోషంగా చెప్పాడు. పొగాకు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ రైతులకు మేలు చేసింది. మార్కెట్లో డిమాండ్ లేని సమయంలో రైతులను ఆదుకునేందుకు 2020–21 సీజన్లో నేరుగా మార్క్‌ఫెడ్‌ని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించింది. ఈ ప్రభావంతో 2021–22 సీజన్ నుంచి పొగాకు మార్కెట్లో ఊహించని ధరలు రైతులకు లభిస్తున్నాయి. ప్రస్తుతం 2022–23 సీజన్ అయితే రికార్డు ధరలతో అదరగొట్టింది. ఇదిలా ఉంటే బోర్డుపై ఒత్తిడి తేవడంతో అదనపు అమ్మకాలపై విధించే 5శాతం ఫెనాల్టీ ని రద్దు చేశారు. ఇప్పటి వరకు అదనపు పొగాకును అమ్ముకోవాలంటే 5శాతం ఫెనాల్టీ చొప్పున అంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు బోర్డుకు చెల్లించాల్సి వచ్చేది. దీని వల్ల ఒక్కొక్క రైతుకు సరాసరిన రూ 40వేల నుంచి 60వేల వరకు లబ్ధి జరిగింది. ఇక స్క్రాప్(పొగాకు ముక్క)ను ఈ ఏడాది నేరుగా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా పొగాకు ముక్కను కూడా వ్యాపారులు కేజీ రూ 150 వరకు వెచి్చంచి కొనుగోలు చేశారు.