ప్రశ్న: నేను రిటైర్ అయ్యాను.పెన్షన్ లేదు. కానీ ఇతర ఆదాయాలు నికరంగా రూ. 5,50,000. మా ఆవిడకు ఎటువంటి ఆదాయంలేదు. ఇద్దరికి చెరొక ప్లాటు .. అంటే జాగా ఉంది. ఇద్దరం ఒకేసారి ఒకే ధరకి అమ్ముతున్నాం. మిత్రులు లెక్కలు వేసి ఇద్దరికి మూలధన లాభాలు చెరొక రూ. 3,00,000 వస్తాయని తేల్చారు. మా ఆవిడ విషయంలో పన్ను భారం ఉండదు, కానీ నేను మాత్రం పన్ను కట్టాలి అంటున్నారు. దీనిలో అంతరార్థం ఏమిటి?
మీ శ్రీమతి వయస్సు 60 సంవత్సరాలు దాటి ఉంటుంది అనుకుంటున్నాం. మీ మిత్రులు వేసిన లెక్కలు .. చెప్పిన మాటలు కరెక్టే. నిజానికి మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ముందుగా మీ విషయం తీసుకుందాం. మూలధన లాభాలతో నిమిత్తంలేకుండా మీ నికర ఆదాయం రూ. 5,50,000 అంటున్నారు. సేవింగ్స్, డిడక్షన్లు పోనూ రూ.5,50,000 ఉంటే మీరు పన్ను పరిధిలో ఉన్నట్లే. పన్ను చెల్లించాలి. టీడీఎస్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోండి .. లేదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి లేదా సెల్ఫ్ అసెస్‌మెంట్ చలాన్ ద్వారా చెల్లించి రిటర్న్ వేయండి. మీకు కూడా 60 సంవత్సరాలు దాటిందనే అనుకుంటున్నాం.
60 సంవత్సరాలు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 3,00,000. మీ నికర ఆదాయం లెక్కింపులో బేసిక్ లిమిట్ దాటిన మొత్తానికి పన్ను లెక్కిస్తారు. మీరు ఇప్పటికి బేసిక్ లిమిట్‌ని వినియోగించుకున్నట్లే. ఒక వ్యక్తికి ప్రతి శీర్షిక కింద బేసిక్ లిమిట్ ఉండదు. జీతం, ఇంటద్దె, వ్యాపారం మీద ఆదాయం, మూలధన లాభాలు.. ఇతర ఆదాయం ఈ ఐదింటిని కలిపిన తర్వాత ఒకసారే బేసిక్ లిమిట్‌ని వినియోగించుకోవాలి. మీ విషయంలో బేసిక్ లిమిట్ వినియోగించుకున్నారు కాబట్టి ఇక మూలధన లాభాల మీద ఇవ్వరు. ఇక మీ శ్రీమతి గారి విషయం. ఆవిడకు ఎటువంటి ఆదాయం లేదు. అంటే జీరో ఇన్‌కం. కాబట్టి ఆవిడకు బేసిక్ లిమిట్ దాకా పన్ను భారం లేకుండా అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మూలధన లాభాలు రూ. 3,00,000 దాటకపోతే బేసిక్ లిమిట్ కంపల్సరీగా అమలుపర్చాలి కాబట్టిఆ సదుపాయం లేదా బేసిక్ లిమిట్ ఇస్తారు. మూలధన లాభాలు ఇద్దరివి ఒకే మొత్తం, సమానం అయినప్పటికీ ఇతర విషయాల్లో ఎంతో తేడా ఉంది.
► మీకు ఇదివరకే ఇతర ఆదాయాల మీద పన్ను భారం ఉంది.
► మీ శ్రీమతి గారికి పన్నుకి గురయ్యే ఆదాయం జీరో.
► బేసిక్ లిమిట్ మీకు మూలధన లాభాల మీద వర్తించదు.
► మేడంగారికి మూలధన ఆదాయం ఒక్కటే ఉన్నా ఇతరత్రా ఏ ఆదాయం లేదు కాబట్టి బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను భారం లేదు.ఇదే దీనిలోని అంతరార్థం.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment