capital gains
-
లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా లెక్కించాలో తెలుసా?
ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌ని ఎలా లెక్కించాలో ఉదాహరణతో తెలుసుకుందాం. స్థిరాస్తులను రెండు రకాలుగా విభజించవచ్చు. 1) 2001 ఏప్రిల్ 1కి ముందు కొన్నవి 2) 2001 ఏప్రిల్ 1 తర్వాత కొన్నవి మొదటిగా 2001 ఏప్రిల్ 1కి ముందు కొన్నవాటికి 01–04–2001ని కటాఫ్ తేదీగా నిర్ధారించారు. ఈ తేదీకి ముందు కొన్న ఆస్తి విషయంలో మీరు కొన్న ధరని పరిగణించరు. ఆ స్థిరాస్తి విలువ 2001 ఏప్రిల్ 1న ఎంతో నిర్ధారించాలి. అయితే, ఇక్కడ ‘‘ఫెయిర్ మార్కెట్ విలువ’’ అన్న పదం వాడారు. దీని అర్ధం మీరు అమ్ముకునే విలువ కాదు. 2001 ఏప్రిల్ 1న డిపార్టుమెంటు వారు.. అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు .. ఎంత విలువ మీద ‘‘స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు’’ వసూలు చేస్తారో అంత మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పాయింట్లో నిర్ధారించే విలువ.. కొన్న ధర. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అదే తీసుకుంటారు. ఉదాహరణకు, 11–01–1980న మీరొక ఇల్లు కొన్నారనుకుందాం. ఆ రోజున ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారు. ధర రూ. 30,00,000. ఈ మొత్తం మీద స్టాంపు డ్యూటీ చెల్లించారు. ఆ ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) రెండు కోట్ల రూపాయలకు అమ్ముతున్నారనుకుందాం. 2001 ఏప్రిల్ 1న మీ ఇంటి మార్కెట్ విలువ .. అంటే మీరు అమ్ముకోగల విలువ రూ. 80,00,000 అనుకుందాం. కానీ, రాష్ట్ర ప్రభుత్వపు సబ్ రిజిస్ట్రార్ వారు రూ. 50,00,000కు ధృవీకరణ పత్రం ఇచ్చారు. కచ్చితంగా సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వేల్యుయేషన్నే పరిగణిస్తారు కాబట్టి రూ. 50,00,000 విలువనే తీసుకుంటారు. దీన్ని 2001 ఏప్రిల్ 1న 100గా పరిగణించి, ఇన్‌కం ట్యాక్స్ వారు జారీ చేసిన పట్టిక .. కాస్ట్ ఆఫ్ ఇండెక్స్. ఇఐఐ అంటారు. ఇది పెద్ద పట్టిక. స్థలాభావం వల్ల ఇక్కడ పొందుపర్చడంలేదు. వెబ్సైట్లోనూ,పుస్తకాల్లోనూ, గూగుల్లోనూ దొరుకుతుంది. 2023–24వ ఆర్థిక సంవత్సరానికి దీని విలువ 348. అంటే 2001 ఏప్రిల్ 1న వంద రూపాయలుగా ఉంటే ఇప్పుడు 348గా పరిగణిస్తారు. 2001 ఏప్రిల్ 1 నాటి ధృవీకరణ విలువను ఈ మేరకు పెంచుతారు. ఇలా చేయడాన్ని కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ అని అంటారు. దీని ప్రకారం మీరు కేవలం రూ. 30,00,000కు కొన్నప్పటికీ ఆనాటి రూ. 50,00,000ను పరిగణనలోకి తీసుకుంటే 50,00,000/100 x 348 = రూ. 1,74,00,000గా .. అంటే కోటి డెబ్భై నాలుగు లక్షలుగా పరిగణిస్తారు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్‌ని లెక్కించండి. అమ్మిన ధర 2 రూ. కోట్లలో ఇండెక్స్డ్ కాస్ట్ 1.7 రూ. కోట్లలో లాభం 0.26 రూ. కోట్లలో ఏతావాతా లాభం .. క్యాపిటల్ గెయిన్స్ కేవలం రూ. 26 లక్షలే. ఈ మొత్తమే పన్ను భారానికి గురి అవుతుంది. దీన్ని ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా లేకుండా చేసుకోవచ్చు. లేదా పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని మీ ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ-మెయిల్ పంపించగలరు. -
Capital Gains : ఇళ్లను కొనుగోలు చేసి.. వాటిని లాభాలకు అమ్ముతున్నారా?
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్‌కి సంబంధించి మార్పులు వచ్చాయి. ఇవన్నీ 2023 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మీకు అవసరం అనిపిస్తే లేదా ఉపయోగం అనిపిస్తే 2023 మార్చి 31లోగా ఏదైనా ప్లానింగ్ చేసుకోవచ్చు. మిగతా అన్ని పెట్టుబడుల కన్నా ఇంటి మీద పెట్టుబడి సురక్షితమనే భావన ఉంది. భద్రత, లాభం ఎక్కువ. స్టాక్ మార్కెట్‌లాగా ఒక రోజులో కుదేలవడం.. ఆవిరి అయిపోవడంలాంటివి వంటి ప్రమాదాలు ఉండవనే ఆలోచనతో ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇల్లు కొని, కొన్నేళ్ల తర్వాత అమ్మేసి ఆ మొత్తంతో మరొక ఇల్లు కొని మినహాయింపులూ పొందుతుంటారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట ప్రకారం ఒక ఇల్లు కొని అమ్మితే ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాల్ని మినహాయింపు పొందాలంటే నిర్దేశిత వ్యవధిలో మరో ఇల్లు కొనాలి .. లేదా నిర్దేశిత బాండ్లలో వ్యవధిలోగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ మినహాయింపు మన దేశంలో ఆస్తి కొంటేనే వర్తిస్తుంది. ఇలా చేసే వరకు క్యాపిటల్ గెయిన్ స్కీమ్ ద్వారా బ్యాంకుల్లో అకౌంటు తెరవాలి. ఈ అంశాలకు సంబంధించి ఎన్నో ఉదాహరణలు గతంలో మనం ప్రస్తావించాం. పెద్ద మార్పు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఈ మినహాయింపు మీద ఆంక్షలు వర్తించబోతున్నాయి. సాధారణంగా ఏదో విధి లేక ఇల్లు అమ్మి.. మళ్లీ కొనుక్కునే వారికి మినహాయింపు ఉంటుంది. ఇది సమంజసమే అయినా క్రమేణా ఇదొక అలవాటుగా మారిపోయింది. ప్రజలు వ్యాపార ధోరణిలో పడ్డారు. కొత్త పుంతలు తొక్కుతున్నారు. విల్లాలు, విలాసవంతమైన భవనాలు, అద్దాల మేడలు, పెద్ద భవంతులవైపు మళ్లుతున్నారు. ఇది ‘‘అవసరం’’ నుండి ‘‘అసమంజసం’’ లేదా ‘‘ఆధునికం’’, ‘‘ఆనందం’’ దాటేసి పరుగెడుతోంది. మినహాయింపు ఉందని విలాసవంతమైన ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, 2023 ఏప్రిల్ 1 నుండి ఈ మినహాయింపు మీద మార్పులు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఇక నుంచి ఈ మినహాయింపు రూ.10 కోటి దాటి ఇవ్వరు. మీరు ఇంటి మీద అంతకు మించి ఇన్వెస్ట్ చేసినా .. నిర్దేశిత పరిమితి దాటిన మొత్తానికి ఎటువంటి మినహాయింపు ఇవ్వరు. సెక్షన్ 54, 54ఎఫ్‌లకు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు మీకు దీర్ఘకాలిక మూలధన లాభం రూ.11 కోట్లు అనుకోండి. మీరు రూ. 11 కోట్లు పెట్టి భవంతి కొన్నా కేవలం రూ. 10 కోట్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి .. అదనపు రూ. 1 కోటిపై పన్ను విధిస్తారు. తస్మాత్ జాగ్రత్త! -
‘ఇంటి’పై ఎల్టీసీజీ పరిమితి రూ.10 కోట్లే
ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ అసెట్స్ కొనుగోలు చేసి విక్రయించగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపునకు ఆర్థిక మంత్రి సీతారామన్ పరిమితి తీసుకొచ్చారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద గరిష్టంగా 10 కోట్ల మొత్తానికే పన్ను మినహాయింపు పరిమితం చేశారు. అంటే ఒక ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని, మరో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా పన్ను లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఈ మూలధన లాభం రూ.10కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంపై ఇక మీదట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఖరీదైన ఆస్తుల కొనుగోలుపై పన్ను మినహాయింపులు తగ్గించేందుకే ఇలా చేశారు. పన్నుల్లో రాయితీలు, మినహాయింపులను మరింత మెరుగ్గా మార్చే లక్ష్యంతో రూ.10 కోట్లకు పరిమితం చేసినట్టు మంత్రి చెప్పారు. ఇందులో సెక్షన్ 54 అన్నది ఒక ఇంటిని అమ్మగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని తీసుకెళ్లి మరో ఇంటి కొనుగోలు చేయడం ద్వారా మినహాయింపునకు సంబంధించినది. చదవండి: డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్! -
మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. నాస్డాక్ 100 ఈటీఎఫ్ (పన్ను పరంగా డెట్ ఫండ్) పెట్టుబడులపై నష్టాలు వచ్చాయి. ఈ నష్టాన్ని లాభంలో సర్దుబాటు చేసి, మిగిలిన లాభంపైనే ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుందా? – సంజయ్ కుమార్ లాభాల్లో నష్టాలను సర్దుబాటు చేసుకోవడాన్ని ‘సెట్టింగ్ ఆఫ్ లాసెస్’గా పేర్కొంటారు. ఒక సాధనంలో మూలధన నష్టాన్ని, మరో సాధనంలో మూలధన లాభంతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 70 అనుమతిస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను తెలుసుకోవాలి. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్ప కాల మూలధన లాభాలతోనూ, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. కేవలం దీర్ఘకాల మూలధన లాభాలతోనే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా లాభాలు స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కిందకు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది వరకు (ఏడాది నిండకుండా) లాభాలు స్వల్పకాలంగా, ఏడాదికి మించితే దీర్ఘకాలంగా చట్టం పరిగణిస్తోంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల వరకు లాభాలు స్వల్పకాలంగాను, మూడేళ్లు, అంతకు మించిన కాలానికి వచ్చేవి దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఈ ఏడాది రెండు రకాల దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించారని అనుకుందాం. ఒకటి ఈక్విటీ, రెండోది ఈక్వీటీయేతర ఫండ్. ఈక్విటీ ఫండ్‌లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన నష్టం చ్చింది. నాన్ ఈక్విటీ ఫండ్‌లో రూ.4 లక్షల దీర్ఘకాల లాభం వచ్చింది. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.4 లక్షల నుంచి దీర్ఘకాల మూలధన నష్టం రూ.లక్ష మినహాయించి, మిగిలిన రూ.3 లక్షలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ దీర్ఘకాలిక సాధనాలే. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేనప్పుడు వాటిని ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (కొనసాగించుకోవడం) చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది వచ్చిన నష్టాన్ని.. భవిష్యత్ 8 సంవత్సరాల లాభాల్లో అయినా చూపించుకోవచ్చు. దీర్ఘకాల పెట్టుబడులకు స్మాల్ క్యాప్ఫండ్స్ మంచివేనా? – వర్షిల్ గుప్తా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు కేవలం దీర్ఘకాలం ఒక్కటీ చాలదు. ఫండ్‌లో నష్టాలు వచ్చినా, పెట్టుబడుల విలువ క్షీణించినా తట్టుకుని పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను సంపద సృష్టి మార్గంగా చూడొచ్చు. కానీ, స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. మార్కెట్ పతనాల్లో ఇవి అదే పనిగా క్షీణిస్తూ, నష్టాలను చూపిస్తుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి రాబడులు ఇస్తున్నప్పుడు.. అదే సమయంలో రాబడులు చూపించని స్మాల్‌క్యాప్ మాదిరి సాధనాల్లో పెట్టుబడులు పెడితే ఆందోళన చెందడం సహజం. అందుకనే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు, మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం మించి కేటాయింపులు చేసుకోరాదు. ఓ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో సంపదను తుడిచి పెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. చిన్న కంపెనీలు ఆటుపోట్లకు ఎక్కువగా గురవుతుంటాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఉన్న అనుకూలతలను చూస్తే.. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడులపై రాబడులు కురిపిస్తాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్ పెరగని సందర్భాల్లోనూ ఇవి వృద్ధిని చూపించగలవు. చిన్న కంపెనీలను ఇనిస్టిట్యూషన్స్ పెద్దగా పట్టించుకోవు. కనుక తెలివైన ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగం చాలా పెద్దది. ప్రతీ స్మాల్‌క్యాప్ పథకం కూడా భిన్నమైనది. భిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటాయి. కనుక వీటి మధ్య సారూప్యత ఉండదు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ తగ్గించుకోవచ్చు. అయితే, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి వస్తే విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొనేవారు కరువై లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. పైగా, స్మాల్‌క్యాప్ పథకాలు పెద్ద సైజుతో ఉంటే ప్రతికూలతే. అంటే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.2,000 కోట్లు, అంతకంటే తక్కువే ఉండడం అనుకూలం. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే వీటిల్లో అస్థిరతలు ఎక్కువ. మార్కెట్లలో సెంటిమెంట్ మారిపోతే ఇవి ఎక్కువ నష్టపోతుంటాయి. ఏ సమయంలో స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేశారన్నది (ఏకమొత్తంలో) రాబడులను నిర్ణయిస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మూలధన లాభాలు బేసిక్ లిమిట్ దాటకుంటే
ప్రశ్న: నేను రిటైర్ అయ్యాను.పెన్షన్ లేదు. కానీ ఇతర ఆదాయాలు నికరంగా రూ. 5,50,000. మా ఆవిడకు ఎటువంటి ఆదాయంలేదు. ఇద్దరికి చెరొక ప్లాటు .. అంటే జాగా ఉంది. ఇద్దరం ఒకేసారి ఒకే ధరకి అమ్ముతున్నాం. మిత్రులు లెక్కలు వేసి ఇద్దరికి మూలధన లాభాలు చెరొక రూ. 3,00,000 వస్తాయని తేల్చారు. మా ఆవిడ విషయంలో పన్ను భారం ఉండదు, కానీ నేను మాత్రం పన్ను కట్టాలి అంటున్నారు. దీనిలో అంతరార్థం ఏమిటి? మీ శ్రీమతి వయస్సు 60 సంవత్సరాలు దాటి ఉంటుంది అనుకుంటున్నాం. మీ మిత్రులు వేసిన లెక్కలు .. చెప్పిన మాటలు కరెక్టే. నిజానికి మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ముందుగా మీ విషయం తీసుకుందాం. మూలధన లాభాలతో నిమిత్తంలేకుండా మీ నికర ఆదాయం రూ. 5,50,000 అంటున్నారు. సేవింగ్స్, డిడక్షన్లు పోనూ రూ.5,50,000 ఉంటే మీరు పన్ను పరిధిలో ఉన్నట్లే. పన్ను చెల్లించాలి. టీడీఎస్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోండి .. లేదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి లేదా సెల్ఫ్ అసెస్మెంట్ చలాన్ ద్వారా చెల్లించి రిటర్న్ వేయండి. మీకు కూడా 60 సంవత్సరాలు దాటిందనే అనుకుంటున్నాం. 60 సంవత్సరాలు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 3,00,000. మీ నికర ఆదాయం లెక్కింపులో బేసిక్ లిమిట్ దాటిన మొత్తానికి పన్ను లెక్కిస్తారు. మీరు ఇప్పటికి బేసిక్ లిమిట్‌ని వినియోగించుకున్నట్లే. ఒక వ్యక్తికి ప్రతి శీర్షిక కింద బేసిక్ లిమిట్ ఉండదు. జీతం, ఇంటద్దె, వ్యాపారం మీద ఆదాయం, మూలధన లాభాలు.. ఇతర ఆదాయం ఈ ఐదింటిని కలిపిన తర్వాత ఒకసారే బేసిక్ లిమిట్‌ని వినియోగించుకోవాలి. మీ విషయంలో బేసిక్ లిమిట్ వినియోగించుకున్నారు కాబట్టి ఇక మూలధన లాభాల మీద ఇవ్వరు. ఇక మీ శ్రీమతి గారి విషయం. ఆవిడకు ఎటువంటి ఆదాయం లేదు. అంటే జీరో ఇన్‌కం. కాబట్టి ఆవిడకు బేసిక్ లిమిట్ దాకా పన్ను భారం లేకుండా అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మూలధన లాభాలు రూ. 3,00,000 దాటకపోతే బేసిక్ లిమిట్ కంపల్సరీగా అమలుపర్చాలి కాబట్టిఆ సదుపాయం లేదా బేసిక్ లిమిట్ ఇస్తారు. మూలధన లాభాలు ఇద్దరివి ఒకే మొత్తం, సమానం అయినప్పటికీ ఇతర విషయాల్లో ఎంతో తేడా ఉంది. ► మీకు ఇదివరకే ఇతర ఆదాయాల మీద పన్ను భారం ఉంది. ► మీ శ్రీమతి గారికి పన్నుకి గురయ్యే ఆదాయం జీరో. ► బేసిక్ లిమిట్ మీకు మూలధన లాభాల మీద వర్తించదు. ► మేడంగారికి మూలధన ఆదాయం ఒక్కటే ఉన్నా ఇతరత్రా ఏ ఆదాయం లేదు కాబట్టి బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను భారం లేదు.ఇదే దీనిలోని అంతరార్థం. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..
స్థిరాస్తులు విక్రయించినప్పుడు దఖలుపడే క్యాపిటల్ గెయిన్స్‌కి సంబంధించి గత వారం చెప్పుకొన్న దానికి కొనసాగింపుగా మరిన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక్కొక్కపుడు రోడ్డు వైడనింగ్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం.. స్థిరాస్తులను కంపల్సరీగా స్వాధీనపర్చుకుంటుంది. అలా స్వాధీ నపర్చుకున్నందుకు గాను నష్టపరిహారం ఇస్తుంటుంది. అది పూర్తిగా చేతికి ముట్టిన తేదీని బదిలీ తేదిగా పరిగణిస్తారు. మీరు కొనబోయే కొత్త ఆస్తి గడువు తేదీని లెక్కించడానికి, నష్టపరిహారం పూర్తిగా ముట్టిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. స్వయంగా అమ్ముకున్నా, కంపల్సరీగా వదులుకున్నా.. మిగతా ఏ విషయాల్లోనూ ఎటువంటి మార్పు ఉండదు. ఉదాహరణకు .. ఒక ఉద్యోగి 2014 ఏప్రిల్‌లో ఇల్లు కొని 25–04–2021న రూ. 25,20,000కు విక్రయించారనుకుందాం. క్యాపిటల్ గెయిన్ రూ. 5,00,000 అనుకుందాం. 31–3– 2021తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయడానికి ఆఖరు తేదీ 31–07–2022. అతను ఇల్లు కొనలేదు.. కట్టుకోలేదు. గడువు తేదీ లోపల రూ. 5,00,000 మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ అకౌంటులో జమ చేశారు (ఇలా చేయడం వల్ల మినహాయింపు పొందవచ్చు). ఆ తర్వాత 2023 జనవరిలో ఈ ఖాతాలో నుంచి రూ. 4,00,000 విత్‌డ్రా చేసి ఇల్లు కొన్నారు. 25–04–2021 నుంచి రెండు సంవత్సరాల లోపల ఇల్లు కొనాలి లేదా మూడు సంవత్సరాల లోపల ఇల్లు కట్టాలి. సదరు ఉద్యోగి 2023 జనవరిలో ఇల్లు కొన్నారు ..కాబట్టి మినహాయింపు లభిస్తుంది. కానీ, రూ. 4,00,000 మాత్రమే వెచ్చించి కొన్నారు కాబట్టి.. అంతవరకే మినహాయింపు ఇస్తారు. ఖర్చు పెట్టని రూ. 1,00,000కి గతంలో ఇచ్చిన మినహాయింపును రద్దు చేసి ఆ మొత్తాన్ని 2024–25 సంవత్సరం దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి పన్ను భారాన్ని లెక్కిస్తారు. ఇక మరో ఉదాహరణలో క్యాపిటల్ గెయిన్ రూ. 5,00,000 అయితే.. స్కీమ్‌లో డిపాజిట్ చేసింది రూ. 8,00,000 అనుకుందాం. అంటే మూడు లక్షల రూపాయలు అదనంగా డిపాజిట్ చేశారనుకుందాం. ఇలా చేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ గడువు తేదీలోగా ఇల్లు కొనలేదు, కట్టనూ లేదు అనుకుంటే .. అలాంటప్పుడు స్కీమ్‌లో డిపాజిట్ చేసినప్పుడు రూ. 5,00,000కు ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తారు. అదనంగా డిపాజిట్ చేసినంత మాత్రాన అదనంగా మినహాయింపునివ్వరు. ఒకాయన క్యాపిటల్ గెయిన్స్ మొత్తాన్ని స్కీములో పెట్టి .. మినహాయింపు పొంది.. తర్వాత స్కీములో నుంచి మొత్తం విత్‌డ్రా చేసి ఎంచక్కా కారు కొనుక్కున్నారు. దీంతో మినహాయింపుని రద్దు చేసి ఆ మొత్తాన్ని ఆదాయంగా లెక్కేశారు. ఇలాగే స్కీములో నుంచి విత్‌డ్రా చేసి ఇల్లు కొనుక్కోకుండా, కట్టుకోకుండా.. ఆడపిల్ల పెళ్లి చేసిన కల్యాణ రావుకి, పిల్లాడి చదువు చెప్పించిన విద్యాధర రావుకి మినహాయింపు రద్దయి .. పన్ను భారం తప్పలేదు. ఇన్‌కం ట్యాక్స్ ప్లానింగ్ అంటే .. పన్ను ఎగవేత కాదు. సాధ్యమైనంత వరకూ పన్ను భారం లేకుండా చూసుకునేందుకు రాచమార్గాన్ని ఎంచుకోండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు అనువైన మార్గాన్ని ఎంచుకోండి. మీ కుటుంబ పరిస్థితులు, అవసరాలు, బాధ్యతలు, ప్రాధాన్యతాంశాలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని అడుగేయండి. చట్టప్రకారం వెళ్లండి. శాంతి .. ప్రశాంతత ముఖ్యం. సక్రమంగా వెళ్లాలి. సజావుగా జరగాలి. మోసపోకూడదు. బ్లాక్ జోలికి పోవద్దు. ఇతర చట్టాలు .. అంటే.. రిజిస్ట్రేషన్ చట్టం, స్టాంపు డ్యూటీ, టీడీఎస్, ఎన్నారైలతో డీల్ చేసేటప్పుడు ఫెమా చట్టం , బ్యాంకులు, రుణాలు ఇలా ఎన్నో వలయాలను క్రమంగా ఛేదించుకుంటూ వ్యవహారాన్ని నిర్వహించండి. గజం పది రూపాయలకు కొని .. లక్షల రూపాయలకు అమ్మినప్పుడు నేను ఇంత భారీ మొత్తం పన్ను కట్టాలా అని ఆలోచించకండి. మా తాత కష్టపడి సంపాదిం చిన ఆస్తి అని తప్పటడుగులు వేయకండి. అంత మొత్తం రావడం అదృష్టంగా భావించి ఆ అదృష్టంలో 20 శాతం ప్రభుత్వం ద్వారా ప్రజల అభివృద్ధికి జమ చేయండి. పన్నులు ఎగ్గొట్టే జల్సా జనాలతో పోల్చుకోకుండి. మీరు నిజాయితీ మనుషులుగా వ్యవహరించండి. -
ఇండెక్స్ రేట్లు మారాయి...పన్నూ తగ్గుతుంది!
కేంద్రం ఇటీవల క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్‌ను (సీఐఐ) అమల్లోకి తెచ్చింది. దీని వల్ల గతంలో ఉన్న ఇండెక్స్ రేట్లు రద్దయ్యాయి. గతంలో 1981–82 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా తీసుకుని ఇండెక్స్ రేట్లు నిర్ణయించారు. ప్రస్తుతం 2001–02 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా తీసుకున్నారు. కొత్త ఇండెక్స్ రేట్లు 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2017 నుంచి జరిగే క్రయవిక్రయాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. రెండు రేట్లనూ పరిశీలిస్తే... అంకెలు మారాయి కానీ విలువలు, ద్రవ్యోల్బ ణం, ప్రభావంలో మార్పు లేదు. కొత్త రేట్ల వల్ల పన్ను భారంలో పెద్దగా మార్పుండదు. 2001–02 సంవత్సరం బేస్‌గా తీసుకోవడం వల్ల మార్కెట్ విలువల్లో మార్పు వస్తుంది. పన్ను భారం కొంచెం మారుతుంది. అది ఎలాగో ఈ కింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం... ఒక స్థిరాస్తిని 1980 సంవత్సరంలో రూ.1,00,000 పెట్టి కొన్నాం. 01.04.1981 నాడు దీని మార్కెట్ విలువ రూ.2 లక్షలు అనుకోండి. ఈ ఆస్తిని 2017–18లో అమ్మేశారు. అమ్మిన విలువ రూ.80,00,000. ఇందులోంచి 1981నాటి మార్కెట్ విలువను పాత ఇండెక్స్ ప్రకారం లెక్కించాలి. అలా వచ్చిన విలువ రూ.2,00,000/100్ఠ1160= రూ. 23,20,000. దీన్ని కొన్న ధరగా భావించాలి. ఈ లెక్కల ప్రకారం ఈ వ్యవహారంలో దీర్ఘకాలిక లాభం.. రూ.80,00,000–రూ.23,20,000= రూ.56,80,000. పన్ను భారం 20 శాతం చొప్పున రూ.11,36,000. దీనికి విద్యా సుంకం అదనం. ఈ వ్యవహారంలో 1981 నాటి మార్కెట్ విలువ రూ.2,00,000 అని ఊహించాం. ఈ మేరకు మనం కాగితాల ద్వారా సమర్థించుకోవాలి. రుజువులు సమకూర్చుకోవాలి. ఇలాంటి ఎన్నో సాధకబాధకాలున్నాయి. అందుకే 2001–02ను బేస్‌గా తీసుకున్నారు. మనం 1980లో రూ.1,00,000కి కొన్న ఆస్తి మార్కెట్ విలువ 2001–02 లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలు, వేల్యూయేషన్ సర్టిఫికెట్లు, లావాదేవీల పత్రాలు సమకూర్చుకోవచ్చు. ఆవిధంగా మార్కెట్ విలువ రూ.10,00,000 అనుకోండి. దీనిని కొత్త ఇండెక్సింగ్ ప్రకారం లెక్కిస్తే.. రూ.10,00,000/100 272= రూ.27,20,000. అవకాశం ఉంటే, రుజువులుంటే ఎంతైనా విలువ తీసుకోవచ్చు. విలువ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ఉపశమనం. ఈ లావాదేవీలో లాభం =రూ.80,00,000–రూ.27,20,000= రూ.52,80,000. 20 శాతం చొప్పున పన్ను భారం రూ.10,56,000. దీనికి విద్యా సుంకం అదనం. ఏదిఏమైనా కొత్త ఇండెక్సింగ్ ప్రకారం మూలధన లాభాలు తక్కువగా ఉంటాయి. పన్ను భారం కాస్త తక్కువవుతుంది. దీనికి ప్రధాన కారణం 2001–02ను బేస్ ఇయర్‌గా తీసుకోవడం. అన్ని కాగితాలు సమకూర్చుకుని, వృత్తి నిపుణుల సలహాలతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ట్యాక్స్ప్లానింగ్ ద్వారా పన్ను భారం నుంచి బయట పడవచ్చు కూడా. -
కెయిర్న్ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందే...
క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై ట్యాక్స్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ: క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ స్పష్టం చేసింది. అయితే, గతకాల లావాదేవీలకు కూడా వర్తించేలా సవరించిన చట్టం కింద డిమాండ్ నోటీసు ఇచ్చినందున.. వడ్డీ విధించడానికి లేదని పేర్కొంది. కెయిర్న్ ఇండియాను లిస్ట్ చేయడానికి ముందు అంతర్గత వ్యాపార పునర్వ్యవస్థీకరణ కింద 2006లో షేర్ల బదలాయింపు అంశానికి సంబంధించి ఐటీఏటీ ఈ ఆదేశాలు ఇచ్చింది. మాతృసంస్థకు దక్కిన క్యాపిటల్ గెయిన్స్‌పై కెయిర్న్ ఇండియా పన్నును మినహాయించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది. 2014 జనవరిలో జారీ అయిన రూ. 10,247 కోట్ల ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డరును సవాల్ చేస్తూ కెయిర్న్ ఎనర్జీ ఐటీఏటీని ఆశ్రయించింది. అటు అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. -
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి ఏపీ రాజధాని రైతులకు మినహాయింపు
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు పరిహారం కింద సీఆర్డీఏ ఇచ్చే స్థలాలను (ప్లాట్లను) విక్రయించగా వచ్చే సొమ్ముకు క్యాపిటల్ గెయిన్స్ (మూలధన) పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. 2014 జూన్ 2నాటికి భూములు కలిగి ఉన్నవారికే ఈ ప్రయోజనం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే దీనితో రైతులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆదాయ పన్ను నిపుణులంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి భారీ ప్రయోజనమంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సాగు భూముల అమ్మకపు మొత్తానికి క్యాపిటల్ గెయిన్స్ పన్నుండదు. వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించడం వల్ల ఇప్పుడు పన్ను పడుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం భూమి ఇచ్చినందున కేంద్రం మినహాయింపు ఇచ్చినా, దీనివల్ల రైతులకు లాభముండదు. ఎందుకంటే వారు ఎకరా భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే సీఆర్డీఏ 800–1,450 గజాల చొప్పున ప్లాట్లిచ్చింది. ఇప్పుడు ఎకరా భూమిని అమ్మితే వచ్చే ఆదాయం కంటే సీఆర్డీఏ ఇచ్చిన ప్లాట్లు విక్రయిస్తే ఎక్కువేమీ రాదు. -
ఒకవైపు పన్నులు.. మరోవైపు రాయితీలు
కేంద్ర బడ్జెట్‌పై భిన్న అంచనాలు • సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం • క్యాపిటల్ గెయిన్స్లోనూ మార్పులు! • కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు • లేదంటే పలు రంగాలకు ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ: కొంత బాదుడు... కొంత ప్రోత్సాహకం... ఫిబ్రవరి 1న మోదీ సర్కారు తీసుకురానున్న బడ్జెట్ రూపం ఇలా ఉండనుంది. కానీ, వ్యాపారులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే మోదీ సర్కారు నగదు కొరతతో ఆర్థికంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆకస్మిక చర్యలకు దిగకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపులను సవరించొచ్చన్న అంచనాలున్నాయి. మార్కెట్ పార్టిసిపెంట్లు తగినంత మొత్తాన్ని జాతి నిర్మాణం కోసం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబర్లో చేసిన ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏడాది లోపు షేర్లను కొని విక్రయిస్తే స్వల్ప కాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాలనే నిబంధన ఉంది. ఏడాదికి మించి అట్టిపెట్టుకున్న షేర్లపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేదు. అయితే, ప్రధాని ప్రకటన తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించొచ్చన్న అనుమానాలు తలెత్తాయి. ప్రభుత్వం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధింపునకు బదులు ప్రస్తుతమున్న ఏడాది కాలాన్ని మూడేళ్లకు మార్చే అవకావం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి చర్యలకు సంబంధించి ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైనా... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు లేదా నోట్ల రద్దు వల్ల నష్టపోయిన రంగాలకు ఇచ్చే ప్రోత్సాహక చర్యలతో దాన్ని ప్రభుత్వం అధిగమిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రభుత్వం వ్యాపార నిర్వహణ వ్యయం, సంక్లిష్టతలను తగ్గించాలనుకుంటోంది. భారత్ పోటీతత్వాన్ని పెంచడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలని భావిస్తోంది. కానీ, అదే సమయంలో ద్రవ్య పరమైన లక్ష్యాలను చేరుకునేందుకు ఆదాయపరమైన ఒత్తిడులను ఎదుర్కొంటోంది’’ అని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ట్యాక్స్ పార్ట్నర్ రాజేష్ హెచ్గాంధీ పేర్కొన్నారు. మరోవైపు పరోక్ష నిధుల బదిలీ పన్ను విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియే ఇన్వెస్టర్లు మరింత స్పష్టతను కోరుకుంటున్నారు. విదేశీ కంపెనీలు తమ ఆస్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మొత్తం భారత్‌లో కలిగి ఉంటే, తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో పరోక్ష బదిలీ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ గత డిసెంబర్లో ప్రకటన చేసింది. తమ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని భారత్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఫండ్స్‌కు ఈ ప్రకటన శరాఘాతమే. ఈ విషయంలో అవి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అన్ లిస్టెడ్ షేర్లకు ఇక క్యాపిటల్ గెయిన్స్ పన్నే..
ఇన్వెస్టరకు ఊరట న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ‘క్యాపిటల్ గెయిన్’గా (ఆస్తి లేదా ఒక పెట్టుబడి నుంచి పొందే ఆదాయం) పరిగణించి దానిపై పన్ను విధించడం జరుగుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) వివరణ ఇచ్చింది. హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా పన్ను అమలవుతుందని వివరించింది. ఇప్పటి వరకూ బిజినెస్ ఆదాయంగా దీనిని పన్ను చెల్లించాల్సి రావడంతో ఇందుకు సంబంధించి 30% పన్నును అసెస్సీలు భరాయించాల్సి వస్తోంది. అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయం క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుందా లేదా బిజినెస్ ఆదాయంగా పరిగణించాలా అన్న అంశంపై ఇప్పటివరకూ నెలకొన్న సందిగ్దత తాజా సీబీడీటీ నిర్ణయంతో తొలగిపోయింది. తాజా నిర్ణయంతో ఈ పన్ను లాంగ్‌టర్మ్-షార్ట్టర్మ్లలో 20-15%గా ఉండనుంది. ఈ విషయంలో నెలకొన్న వివాదాలకు తెరదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తాజా వివరణ ఇచ్చింది.ఆదాయపు పన్ను శాఖ తాజా నిర్ణయం భారత్ పన్ను వ్యవస్థ సంస్కరణల బాటలో ఇన్వెస్టర్ విశ్వాసాన్ని మరింత పెంచుతుందని రాకేష్ నాగియా మేనేజింగ్ పార్ట్నర్ రాకేష్ పేర్కొన్నారు.12 నెలలు దాటి లిస్టెడ్ షేర్ల బదలాయింపులకు ప్రస్తుతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. కాగా ఎల్‌టీఏ లేదా ఎల్టీసీపై (లీవ్ ట్రావెల్ అలెవెన్స్/కన్సెషన్) పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోడానికి సంబంధిత ప్రయాణానికి సంబంధించి ఆధారాలను ఉద్యోగులు తప్పనిసరిగా సమర్పించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ఫామ్‌ను కూడా విడుదల చేసింది. తాజా నిబంధనలు జూన్ నుంచీ అమల్లోకి వస్తాయి. -
29 వేల కోట్లు కట్టాల్సిందే..!
♦ కెయిర్న్ ఎనర్జీకి ఐటీ శాఖ తుది నోటీసులు ♦ దీన్లో అసలు 10.247 కోట్లు; మిగిలిందంతా వడ్డీయే ♦ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిందేనంటున్న ఐటీ శాఖ ♦ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ బాటలో కెయిర్న్ ఎనర్జీ న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి కేంద్రం రెట్రోస్పెక్టివ్(పాత లావాదేవీలకు పన్ను వర్తింపు) పన్ను షాకిచ్చింది. 2006లో కంపెనీ భారత్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చిన మూలధన లాభాలకుగాను రూ.29,000 కోట్లకుపైగా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తుది డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఇందులో అసలు పన్ను మొత్తం రూ.10,247 కోట్లు. ఇక 2007 నుంచి ఈ పన్నుపై వడ్డీ రూపంలో 18,800 కోట్లు కట్టాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఐటీ శాఖ తొలిసారిగా 2014, జనవరి 22న ముసాయిదా అసెస్మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. తాజాగా గత నెలలో వడ్డీతో కలిపి తుది అసెస్మెంట్ ఆర్డర్‌ను ఇచ్చింది. 2015 ఏడాదికిగాను ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ ఈ వివరాలను వెల్లడించింది. కాగా, వొడాఫోన్ తర్వాత ఈ ఏడాది రెట్రోస్పెక్టివ్ పన్ను నోటీసును అందుకున్న రెండో కంపెనీ కెయిర్న్ ఎనర్జీ. అందులోనూ ఈ రెండూ బ్రిటన్‌కు చెందినవే కావడం గమనార్హం. బడ్జెట్లో ప్రకటనకు ముందే... రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా 2016-17 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వన్‌టైమ్ వడ్డీ, జరిమానా మాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పన్ను అసలును చెల్లించిన వారికి ఈ మాఫీ వర్తిస్తుంది. అయితే, ఈ బడ్జెట్ ప్రకటనకు ముందే ఐటీ శాఖ తుది అసెస్మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. 2012లో రెట్రోస్పెక్టివ్ పన్నును ఐటీ చట్ట సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కెయిర్న్ ఎనర్జీకి విధించిన పన్నుపై 2007 నుంచి వడ్డీని లెక్కించడం గమనార్హం. కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణపై రెట్రోస్పెక్టివ్ పన్ను విధింపును కెయిర్న్ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా ఈ పన్ను వివాదంపై తాము అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఈ పన్ను నోటీసు కారణంగా తమ వాటాదారులకు వచ్చిన నష్టానికి, కెయిర్న్ ఇండియాలో తమకున్న 9.8 శాతం వాటా షేర్లను విక్రయించకుండా నిలుపుదల(ఫ్రీజ్) చేసినందుకుగాను బిలియన్ డాలర్లను(దాదాపు రూ.6,700 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కూడా కెయిర్న్ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. తమ నుంచి ఐటీ శాఖ ఏదైనా రికవరీ చేసుకోగలిగితే ఈ దాదాపు 10 శాతం వాటా(విలువ దాదాపు 47.7 కోట్ల డాలర్లు)కు మాత్రమే పరిమితవుతుందని కెయిర్న్ పేర్కొంది. కెయిర్న్‌కు రూ.24,503 కోట్ల మూలధన లాభం: ఐటీ శాఖ 2006లో భారత్ కార్యకలాపాలకు చెందిన షేర్లను(అసెట్స్) అప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సబ్సిడరీ కెయిర్న్ ఇండియాకు బదలాయించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ రూ.24,503 కోట్ల మూలధన లాభాన్ని ఆర్జించిందని ఐటీ శాఖ వాదిస్తోంది. ఈ ఆస్తుల బదలాయింపు తర్వాత కెయిర్న్ ఇండియా పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కి వచ్చింది. దీనిద్వారా రూ.8,616 కోట్లను కంపెనీ సమీకరించింది. 2011లో కెయిర్న్ ఇండియాలోని మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూప్‌నకు కెయిర్న్ ఎనర్జీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ 8.67 బిలియన్ డాలర్లు. కెయిర్న్ ఇండియా పాత యాజమాన్యం కెయిర్న్ ఎనర్జీకి లభించిన మూలధన లాభాలపై విత్‌హోల్డింగ్ పన్నును ముందే తీసుకోవడంలో విఫలమైనందుకుగాను కెయిర్న్ ఇండియాకు కూడా ఐటీ శాఖ రూ.20,495 కోట్ల డిమాండ్ నోటీసును ఇదివరకే జారీ చేసింది. ఇందులో అసలు పన్ను రూ.10,248 కోట్లు కాగా, వడ్డీ రూ.10,247 కోట్లుగా ఉంది. అయితే, ఈ పన్ను డిమాండ్ ఆదేశాలను కెయిర్న్ ఇండియా ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కాగా, రూ.14,200 కోట్ల పన్ను బకాయిలు(హచిసన్ ఎస్సార్‌లో వాటా కొనుగోలుపై లభించిన మూలధన లాభాలకు గాను) చెల్లించాలంటూ వొడాఫోన్‌కు గత నెలలోనే ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీచేయడం తెలిసిందే. భారత్‌లో పన్నులకు సంబంధించిన సరళమైన, స్థిరమైన వ్యవస్థను తీసుకొస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఐటీ శాఖ చర్యలు ఉన్నాయంటూ వొడాఫోన్ దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వివాదం కూడా ఇప్పుడు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉంది.