కెయిర్న్ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందే...
క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై ట్యాక్స్ ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ స్పష్టం చేసింది. అయితే, గతకాల లావాదేవీలకు కూడా వర్తించేలా సవరించిన చట్టం కింద డిమాండ్ నోటీసు ఇచ్చినందున.. వడ్డీ విధించడానికి లేదని పేర్కొంది. కెయిర్న్ ఇండియాను లిస్ట్ చేయడానికి ముందు అంతర్గత వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ కింద 2006లో షేర్ల బదలాయింపు అంశానికి సంబంధించి ఐటీఏటీ ఈ ఆదేశాలు ఇచ్చింది.
మాతృసంస్థకు దక్కిన క్యాపిటల్ గెయిన్స్‌పై కెయిర్న్ ఇండియా పన్నును మినహాయించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది. 2014 జనవరిలో జారీ అయిన రూ. 10,247 కోట్ల ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డరును సవాల్ చేస్తూ కెయిర్న్ ఎనర్జీ ఐటీఏటీని ఆశ్రయించింది. అటు అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది.