అన్ లిస్టెడ్ షేర్లకు ఇక క్యాపిటల్ గెయిన్స్ పన్నే..
ఇన్వెస్టరకు ఊరట
న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ‘క్యాపిటల్ గెయిన్’గా (ఆస్తి లేదా ఒక పెట్టుబడి నుంచి పొందే ఆదాయం) పరిగణించి దానిపై పన్ను విధించడం జరుగుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) వివరణ ఇచ్చింది. హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా పన్ను అమలవుతుందని వివరించింది. ఇప్పటి వరకూ బిజినెస్ ఆదాయంగా దీనిని పన్ను చెల్లించాల్సి రావడంతో ఇందుకు సంబంధించి 30% పన్నును అసెస్సీలు భరాయించాల్సి వస్తోంది.
అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయం క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుందా లేదా బిజినెస్ ఆదాయంగా పరిగణించాలా అన్న అంశంపై ఇప్పటివరకూ నెలకొన్న సందిగ్దత తాజా సీబీడీటీ నిర్ణయంతో తొలగిపోయింది. తాజా నిర్ణయంతో ఈ పన్ను లాంగ్‌టర్మ్-షార్ట్‌టర్మ్‌లలో 20-15%గా ఉండనుంది. ఈ విషయంలో నెలకొన్న వివాదాలకు తెరదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తాజా వివరణ ఇచ్చింది.ఆదాయపు పన్ను శాఖ తాజా నిర్ణయం భారత్ పన్ను వ్యవస్థ సంస్కరణల బాటలో ఇన్వెస్టర్ విశ్వాసాన్ని మరింత పెంచుతుందని రాకేష్ నాగియా మేనేజింగ్ పార్ట్‌నర్ రాకేష్ పేర్కొన్నారు.12 నెలలు దాటి లిస్టెడ్ షేర్ల బదలాయింపులకు ప్రస్తుతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి.
కాగా ఎల్‌టీఏ లేదా ఎల్‌టీసీపై (లీవ్ ట్రావెల్ అలెవెన్స్/కన్సెషన్) పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోడానికి సంబంధిత ప్రయాణానికి సంబంధించి ఆధారాలను ఉద్యోగులు తప్పనిసరిగా సమర్పించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ఫామ్‌ను కూడా విడుదల చేసింది. తాజా నిబంధనలు జూన్ నుంచీ అమల్లోకి వస్తాయి.