న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లింపులను (రిఫండ్) సగటున 16 రోజుల్లో పూర్తి చేస్తోంది. 2022–23 సంవత్సరాలో సగటు రిఫండ్ సమయం 16 రోజులకు తగ్గినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. 80 శాతం రిఫండ్‌లను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోనే విడుదల చేసినట్టు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు.
పన్ను చెల్లింపుదారులు సులభంగా, వేగంగా రిటర్నులు దాఖలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఐటీఆర్ దాఖలు చేసిన ఒక్కరోజులోనే వాటిని ప్రాసెస్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా ఒక్క రోజులో ప్రాసెస్ చేసినవి 2021–22లో 21 శాతం ఉంటే, 2022–23లో 42 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. 2022 జూన్ 28న ఒకే రోజు 22.94 లక్షల రిటర్నుల ప్రాసెసింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు.
స్వచ్ఛంద నిబంధనల అమలును సులభతరం చేసేందుకు వీలుగా.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన రెండేళ్ల వరకు ఎప్పుడైనా అప్‌డేట్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు చెప్పారు. 2023 మార్చి 31 నాటికి 24.50 లక్షల అప్‌డేటెడ్ రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment