షేర్లు విడిపిస్తే కెయిర్న్ విలీనానికి ఓకే!
♦ సంకేతాలిచ్చిన కేంద్ర రెవెన్యూ కార్యదర్శి
♦ కెయిర్న్ ఎనర్జీ చెల్లించాల్సిన పన్ను రూ.10,247 కోట్లు
♦ దానికి బదులుగా రూ.2,790 కోట్ల విలువైన షేర్ల జప్తు
♦ వాటిని విడిపించి విలీనం జరిగితే; కెయిర్న్ ఎనర్జీ వాటా సున్నా
న్యూఢిల్లీ: పన్ను వివాదంలో చిక్కుకున్న కెయిర్న్ ఇండియా వ్యవహారంలో కేంద్రం దిగివస్తున్నట్లే కనిపిస్తోంది. రూ.10,247 కోట్లు చెల్లించాల్సిన కెయిర్న్... అందులో మూడోవంతు చెల్లించినా చాలునని పరోక్షంగా ప్రభుత్వం సంకేతాలిచ్చింది. దీనికి కారణమేంటి? తెరవెనక ఏం జరిగి ఉంటుంది? అనే విషయాలు బయటపడనప్పటికీ ప్రభుత్వ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని చెప్పటానికి సోమవారం రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వివరాలివీ...
క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించి రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాల్సిందేనంటూ కెయిర్న్ మాతృసంస్థ కెయిర్న్ ఎనర్జీకి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి కెయిర్స్ ఎనర్జీ వాటాగా ఉన్న 9.8% షేర్లను ఐటీశాఖ జప్తు చేసింది కూడా. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.2,790 కోట్లు మాత్రమే ఉంది. మొత్తం పన్ను చెల్లించాల్సిందేనని మొదటి నుంచీ చెబుతున్న ప్రభుత్వం... ఇటీవల వేదాంతాలో కెయిర్న్ ఇండియా విలీనానికి వచ్చిన ప్రతిపాదనలకు కూడా ఇదే లింకు పెట్టింది. పన్ను చెల్లిస్తే తప్ప విలీనానికి అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పింది. సోమవారంనాడు కూడా ఆర్థిక శాఖ అధికారులు ఇదే విషయం చెప్పినా... ఆ తరవాత రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వ వైఖరి మారిందనే సంకేతాలిచ్చాయి. ‘‘9.8% కెయిర్న్ ఇండియా షేర్లను ఐటీ శాఖ జప్తు నుంచి విడిపించుకున్నాకే ఆ కంపెనీ వేదాంతాలో విలీనమయ్యేందుకు అనుమతిస్తాం. 9.8% షేర్ల విలువ మొత్తాన్ని చెల్లించడమో లేదా దానికి తగ్గ బ్యాంకు గ్యారంటీనివ్వటమో చేస్తేనే విలీనానికి సంబంధించి తాజా షేర్ల జారీకి అనుమతిస్తాం’’ అని అదియా చెప్పారు. ఐటీ చట్టం ప్రకారం ఐటీ శాఖ అనుమతి లేకుండా ఆ వాటాను విక్రయించడం కుదరదని కూడా ఆయన స్పష్టంచేశారు.
ఇదీ విలీనం కథ...
బ్రిటన్‌కు చెందిన చమురు దిగ్గజ సంస్థ కెయిర్న్ ఎనర్జీ నుంచి వేదాంత 2011లో కెయిర్న్ ఇండియాను టేకోవర్ చేసింది. 2006-07లో కెయిర్న్ ఇండియాలో బ్రిటన్ కంపెనీ తనకున్న వాటాల్ని విక్రయించటంతో దానికి భారీ లాభం వచ్చింది. దానిపై పన్ను చెల్లించడానికి సంబంధించి వివాదం నడుస్తోంది. రూ.10,247 కోట్ల పన్ను, మరో రూ.18,853 వడ్డీ కలుపుకుని రూ.29,000 కోట్లు కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీకి 2014 జనవరిలో నోటీసులిచ్చింది. కెయిర్న్ ఇండియాలో మాతృ సంస్థకు ఇంకా 9.8 శాతం వాటా వుండగా, పన్ను కట్టలేదు కనక వాటిని ఐటీ శాఖ జప్తుచేసింది. రెట్రోస్పెక్టివ్ పన్నులకు సంబంధించి ఒన్‌టైమ్ ఆఫర్‌గా పన్ను చెల్లిస్తే, వడ్డీని, ఆపరాధ రుసుంను రద్దుచేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కె యిర్న్ ఎనర్జీ కనీసం రూ.10,247 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా తాము అదియాతో మాట్లాడామని, ప్రభుత్వానికి విలీనాన్ని ఆపే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఆయన చెప్పారని వేదాంతా ప్రతినిధి పేర్కొనటం గమనార్హం.