
పది నెలలుగా రోజు రోజుకూ దిగజారిన ధర
తాజాగా అమెరికాలో దిగుమతి సుంకం పెంపు సాకుతో మరింత పతనం
20–50 కౌంట్ కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గింపు
అమెరికాకు ఎగుమతి కాని 50–100 కౌంట్ ధర కూడా ఢమాల్
ఇష్టానుసారం రేట్లు తగ్గించేస్తున్న కొనుగోలు కంపెనీలు
2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తుల ఎగుమతి
35 శాతం అమెరికా.. 19 శాతం చైనాకు..
ఒక్క అమెరికాకే రూ.20 వేల కోట్ల ఉత్పత్తులు
ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే సంక్షోభంలో ఆక్వా రంగం
కూటమి సర్కారు చోద్యం.. ఆక్వా రైతుల్లో ఆగ్రహం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పది నెలలుగా రొయ్యల ధరలు తగ్గడమే గానీ పెరిగిన దాఖలాలే లేవు. అంతకు ముందు అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఎలా ఉన్నా సరే కనీసం 15 రోజులు పాటు ఒకే ధర కొనసాగేది. ఒకసారి నిర్దేశించిన ధర 15 రోజుల్లో పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండేది కాదు. అయితే గత పది నెలల్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్లు అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై సుంకాల పెంపు వ్యవహారం రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని కుదిపేస్తోంది.
అమెరికా టాక్స్ సాకుతో రొయ్యలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి.. కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడం పట్ల ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
అమెరికాకు 35 శాతం ఎగుమతులు
జాతీయ స్థాయిలో 2023–24లో కోటి 84 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదు కాగా, 51.58 లక్షల టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్... దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15 శాతం ఆక్వా రంగం నుంచే వస్తోంది.
దేశం నుంచి 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నులు ఎగుమతి అయితే, దాంట్లో దాదాపు 35 శాతం (రూ.20 వేల కోట్లు) ఉత్పత్తులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు జాతీయ స్థాయిలో ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తుల్లో మూడో వంతు ఏపీ నుంచే జరుగుతున్నాయి. ఏపీలో రొయ్యల దిగుబడులు 10 లక్షల టన్నులు ఉంటే.. అందులో 3.27 లక్షల టన్నులు (2023–24) అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.
20–50 కౌంట్ రొయ్యల కొనుగోళ్లు నిలిపివేత
అమెరికా సుంకాల పెంపు సాకుతో కొన్ని కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే కౌంట్‌కు రూ.20 నుంచి రూ.40 చొప్పున తగ్గించేశాయి. మరొక పక్క అమెరికాకు ఎగుమతి అయ్యే 20–50 కౌంట్ (కిలోకు వచ్చే రొయ్యల సంఖ్య) రొయ్యల కొనుగోలును నిలిపి వేశాయి.
కొన్ని కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి తెరతీయగా, మరికొన్ని కంపెనీలు విభేదిస్తున్నాయి.. ఇప్పటికిప్పుడు ధరలు తగ్గించడం సరికాదని, రానున్న వారం పది రోజుల వరకు ఈ నెల 1వ తేదీన నిర్ణయించిన ధరలనే కొనసాగించాలని సూచిస్తునాయి. పైగా ఈ దిగుమతి సుంకం భారాన్ని అమెరికాలోని బయ్యర్లు భరించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నాయి. దేశీయంగా ధరలు తగ్గిస్తే ఆక్వా రైతులు మరింత సంక్షోభంలో కూరుకు పోతారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీల తీరుపై రైతుల మండిపాటు
అమెరికా ట్యాక్స్ విధానంలో మార్పు రాగానే ఆగమేఘాల మీద రొయ్యల ధరలు తగ్గించేస్తున్న కంపెనీలు.. తొమ్మిది నెలల క్రితం హరిత విప్లవం పేరిట రొయ్య మేతలో కలిపే ఉత్పత్తులపై ట్యాక్స్‌లు భారీగా తగ్గించినప్పటికీ దేశీయంగా ఒక్క రూపాయి కూడా మేత ధర తగ్గించలేదు. ఈ విషయమై ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల క్రితం సోయా రేటు కిలో రూ.85 ఉన్నప్పుడు టన్ను మేత ధర రూ.15 వేలకు పెంచారు.
కానీ అదే సోయా రేటు ధర నేడు కిలో రూ.23కే అందుబాటులో ఉన్నప్పటికీ మేత «ధర పైసా కూడా తగ్గించిన పాపాన పోలేదు. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అలాంటప్పుడు 50–100 కౌంట్ ధరలు తగ్గించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
నాడు వైఎస్ జగన్ సర్కారు భరోసా
అమెరికాలో దిగుమతి సుంకాల పెంపు ప్రభావంతో మన దేశంలో ఎగుమతులు ఏమాత్రం మందగించినా రాష్ట్రంలోని ఆక్వా రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తునారు. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని అండగా నిలిచింది. మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసి అప్సడా ద్వారా ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తూ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు రైతులకు దక్కేలా కృషి చేసింది.
కరోనా సమయంలో కూడా ఇదే రీతిలో కంపెనీలు సిండికేట్‌గా మారి ధర లేకుండా చేసిన సందర్భంలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మద్దతు ధర దక్కేలా కృషి చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ నేడు ఈ సంక్షోభ సమయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
క్రాప్ హాలిడే ఒక్కటే దిక్కు
అమెరికా ట్యాక్స్ విధానం వల్ల కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి గురిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత పది నెలల్లో రైతులతో పాటు ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్‌తో ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాంతాల వారీగా పంట విరామం ప్రకటించడం తప్ప మాకు వేరే మార్గం కనిపించడం లేదు. – నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారు